డెస్కుకు అవగాహన ముఖ్యం
ఈనాడు-నేను: 23
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
సజీవంగా వెళ్ళి నిర్జీవంగా…
మధ్యాహ్నం బయలుదేరిన ఏడుగురు మిత్రులూ పట్టిసం వెళ్ళగానే ఒకసారి గోదావరి స్నానం చేశారు. అక్కడ ఇక్కడా తిరుగుతూ ఆనందంగా గడిపారు.. రాత్రి భోజనాలూ చేశారు.. పడుకునే ముందు ఒకరికి బుర్ర తొలిచింది. ఇప్పుడెళ్ళి స్నానం చేద్దామని. కొందరు వద్దన్నారు. కొందరు వెళ్దామన్నారు. రెండోవారి సంఖ్య ఎక్కువకావడంతో అంతా బయలుదేరారు. నదిలోకి దిగిన విషయం మాత్రమే వారిలో ఇద్దరికి తెలుసు… ఆ తరవాత ఏం జరిగిందో వారికి తెలీదు… మరోపక్క స్నానం చేస్తున్న వారికి తమ పక్కనే ఉన్న వారి అలికిడి వినపడకపోయేసరికి కంగారు పడ్డారు.. పెద్దపెద్దగా కేకలు వేస్తూ వెతకడం ప్రారంభించారు. చిమ్మచీకటి.. ఏమీ కనిపించదు.. వారి శ్రమ ఫలించలేదు. ఈలోగా వారి కేకలు విన్న కొందరు జాలరులు అక్కడికి చేరారు. వారు కూడా వెతకనారంభించారు. ఫలితం లేదు.. తెల్లారింది. వచ్చిన పోలీసులు స్నానానికి దిగిన ప్రాంతమిదా? బతుకుదామనే ఇక్కడకు వచ్చారా? అని ప్రశ్నించారు వారిని. చూడండంటు అంటూ ఓ బోర్డు చూపించారు…
‘ఊబి ఉండే ప్రాంతం.. అత్యంత ప్రమాదకరం’ అనే ఎర్రక్షరాలు కనిపించాయి.
ఈలోగా పోలీసులు శ్రమపడనక్కరలేకుండానే… ఊపిరాగిపోయిన ఇద్దరి మృతదేహాలను గోదావరి పైకి నెట్టేసింది. ఒక్కసారి గొల్లుమన్నారంతా.. ఈ విషయం వారి తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి.. అందుకే నాకు చెప్పారు.. చనిపోయిన వారిలో మా పక్కింటివారి అబ్బాయి కూడా ఉన్నాడు.. దానవాయిపేటలో లీలా మెడికల్స్ అనే మెడికల్ షాపు ఉంది.. దానికి ఎదురుగా ఉండే ఇంట్లో ఉన్న యువకుడు (పేరు గుర్తుకు రావడం లేదు), ఇతనూ ఇద్దరూ స్వర్గస్తులయ్యారు.. సాయంత్రానికి దేహాలను ఇళ్ళకు చేర్చారు. తట్టుకోలేకపోయాను.. ఆరుగురు వెళ్ళి నలుగురే వెనక్కి వచ్చారు.. మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకి అందలేదు. చలాకీగా.. ఉంటూ… పాఠ్యాంశాలలో సందేహాలను తీర్చే అతను విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయాను.
అనంతరం మూడో రోజున చోటుచేసుకుందీ ఘటన..
పరీక్షలకు చదువుకోవడం మొదలు పెట్టాను.. తోడుగా మా క్లాస్‌మేట్ రవిరామకుమార్‌ని రమ్మన్నాను. ఇద్దరం కలిసి చదువుకోవడంతో దృష్టి చదువుమీదకు మళ్ళింది. ఒక రోజు రవి రాలేదు. యధాప్రకారం చదువుకుని పడుకోవడానికి లేచాను. అప్పుడు సమయం రాత్రి 12.30 దాటింది. ఇంట్లో ఉన్న పడక కుర్చీలో కూర్చుని చదువుకునేవాడిని. దానిని మడత పెట్టడానికి ప్రయత్నించాను. అడ్డ బద్దను పైకి పెట్టి… నేలమీదకు ఉండే బద్దను మడిచాను… అంతే… ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది.. ఏమైందో తెలియలేదు.. కళ్ళు బైర్లు కమ్మాయి. కుడి చేతి చిటికెన వేలు చల్లగా అనిపించింది. చూసేసరికి రక్తం.. మడత పెట్టడంలో వేలు నలిగింది. నిశ్శబ్దంగా వేలికి తడి గుడ్డ కట్టుకుని పడుకున్నాను.. అప్పుడు మొదలైంది.. కాలివేళ్ళనుంచి తిమ్మిరి… అలా పైకి పాకింది. గుండెల మీద ఎవరో కూర్చున్న అనుభూతి… ఇంకేం తెలీదు.. ఎవరో గట్టిగా తడుతూ అరుస్తున్నారు… ముఖం మీద నీళ్ళను చిలకరిస్తున్నారు… కాసేపటికి కళ్ళు తెరిచాను. మా అమ్మగారు.. నాన్నగారు ఇద్దరూ ఆదుర్దాగా నాకేసి చూస్తున్నారు.. ఏమైందన్నాను.. ఏదో గట్టిగా అరిచావు.. గుండెలు పట్టుకుని విలవిలలాడుతున్నావు.. అని చెప్పారు. అప్పుడు చూశారు వేలికున్న కట్టుని.. జరిగింది చెప్పాను… వారి మనసు తేలికపడింది.. ఆ నొప్పికి స్పృహ తప్పిఉంటుందిలే అన్నారు. నాన్నగారు అప్పటికప్పుడు మూడు సినిమాల థియేటర్ల వరకూ సైకిలుపై వెళ్ళి ఫ్లాస్కులో కాఫీ తెచ్చి తాగించారు. అప్పట్లో ఫ్రిజ్ లు లేవు.. ఉన్నా కొనే తాహతు లేదు.. పాలు అసలే ఉండవు.. కాఫీ తాగిన తరువాత.. కొద్దిగా సత్తువ వచ్చింది..
ఇలా స్పృహ తప్పడం ఇదే మొదటి సారి… ఆఖరుసారి మాత్రం కాదు…
రెండేళ్ళకోసారి వచ్చేది..
ఈనాడులో ఉండగా.. 1996లో జూన్ నెలలోనే వరుసగా మూడుసార్లు స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే మా వదినగారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ గాయత్రిగారికి నా శ్రీమతి వైజయంతి ఈ విషయం చెప్పింది.. చెన్నైలో ఉండేవారప్పుడువారు. అక్కడున్న డాక్టర్ కె. తిరువేంగడం గారికి చూపిద్దామన్నారు. బయలుదేరి వెళ్ళాం.. అక్కడ ప్రాథమికంగా పరీక్షించిన ఆయన నాకు మెదడులో ట్యూమర్ ఏదైనా ఉండి ఉండవచ్చనే సందేహాన్ని వ్యక్తంచేశారు. అయినా పరీక్షలు చేయించి నిర్థారించుకుందామన్నారు. భగవంతుడి దయవల్ల ఆయన సందేహం నిజం కాలేదు. వచ్చిన నివేదికలను బట్టి… సబ్ కార్టికల్ సీజర్ డిజార్డర్ గా నిర్థారించారు. ఎపిలెప్సీకి ఇది తొలి దశ అన్నమాట. షాకింగ్ న్యూస్ విన్నా… దెబ్బ తగిలినా… నొప్పి వచ్చినా… తట్టుకోలేని సమయంలో ఇలా జరుగుతుందని చెప్పారు.. మందులు కనీసం నాలుగేళ్లు వాడాలని సూచించారు. ఆరేళ్ళు వాడాను. పూర్తిగా తగ్గిందని నిర్థారించుకున్న తరవాత మెల్లిగా మందులను తగ్గించి, వాడటం ఆపేశాను. ఇదెందుకు చెప్పాల్సి వచ్చిందంటే… దానికి కారణం కూడా సహచరులే. ఎప్పుడైనా నాకు ఇలా అన్‌కాన్షియస్ అయితే దాని ప్రభావం కనీసం నాలుగు రోజులుండేది. అది చెబితే ఎవరూ నమ్మేవారు.. కాదు.. ఒకేసారి మూడు సార్లు వచ్చిన నెలలలో ఇంచుమించు పదిహేను రోజులు సెలవు పెట్టాను.. ఇది నిజమా కాదా అని నిర్థారించుకోవడానికి ఇంటికొచ్చేవారు… ఆఫీస్ వాళ్ళు… మా యింటికి నాలుగువైపులా నలుగురు ఈనాడు సహచరులు ఉండేవారు.
రాంషా గారి మరణం నేర్పిన పాఠం…
మళ్ళీ టాపిక్‌లోకి వచ్చేస్తున్నా..
కొంచెం వెనక్కి అంటే విజయవాడకి వెడతాను. 1990 ఫిబ్రవరి 12 సరిగ్గా నా వివాహమైన ఎనిమిది రోజులకు.. తిరిగి ఆఫీసుకు వెళ్ళిన రోజున జరిగిందీ ఘటన.. ఓ వార్త రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి… రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
(Darbha Ramasastri- Ramsha, Editor Abhisarika magazine)
రాంషా, గోదావరి శర్మ సహా కారు డ్రైవర్ సత్యనారాయణ ప్రమాద స్థలంలోనే కన్నుమూశారు. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ వార్తను అతి సాధారణంగా ఇచ్చేశాము. అలాగే ప్రచురితమైపోయింది. మరో పత్రికలో ఆంధ్రప్రభలో అనుకుంటా… అభిసారిక ఎడిటర్ రాంషా దుర్మరణం శీర్షికతో వచ్చింది. అప్పటికి గానీ డెస్కుకు అర్థంకాలేదు.. చనిపోయిన వ్యక్తి గొప్పదనం. అందులో గోదావరి శర్మ గారు రచయిత. సెక్స్ విజ్ఞానం మీద అభిసారిక అనే పత్రికను రాంషా గారు నడిపేవారు. ఆ రోజులో అలాంటి పత్రిక నడపడం సాహసమే. అప్పట్లో అదో సంచలనం. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే… డాక్టర్ సమరం గారి కాన్సెప్ట్.
వృత్తి ఏదైనా ఆయన సంఘంలో ప్రముఖుడు. ఆ విషయం డెస్కులో ఎవరికీ తెలీదు. ఆఖరికి వార్త రిపోర్టు చేసిన వ్యక్తికి కూడా. చనిపోయిన వారెవరనేది కొంచెం దృష్టిపెడితే తేలిగ్గా తెలిసిపోతుంది. తెలుసుంటే అది మొదటి పేజీ వార్తయ్యేది.. మా నిర్ణయం సరికాదనే విమర్శా తప్పేది. తదుపరి ఈ విషయం తెలిసి నాలుక్కరుచుకున్నారు డెస్కులో ఉన్నవారంతా. అయినా జరగాల్సిన నష్టం వాటిల్లిపోయింది. వార్తల విభాగంలో పనిచేసేవారికి లోకజ్ఞానం ఉండాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం చెబుతోంది.
(Ushasri with Chirravuri Subrahmanyam)
(Ushasri with Ramsha)
రాంషా గారితోనూ ఉషశ్రీగారికీ గాఢానుబంధముంది. వీరిద్దరూ సహపాఠులు. అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లా ఆలమూరుకు చెందిన చామర్తి కనకయ్య గారు, ఆవంత్స సోమసుందర్ (పిఠాపురం)గారు, చిర్రావూరి సుబ్రహ్మణ్యం(దక్షిణ భారత హిందీ ప్రచార సభ)గారు, రాంషాగారు మిత్రులు.
వచ్చే భాగంలో కుదిపేసిన కోనసీమ తుపాను… అప్పటి అనుభవాలూ..పనితీరు గురించి రాస్తా. శవాల కుప్పలు… బడబాగ్నిని చూసిన వ్యక్తి…ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలుకూడా ఉంటాయి.
మీ అనుభవాలు జ్ఞాపకాలు బాగున్నాయి సుబ్రహ్మణ్యం గారూ. ఎప్పటికప్పుడు సస్పెన్సు లో ఉంచి తదుపరి ఎపిసోడ్ కు ఎదురు చూసేలా డిజైన్ చేస్తున్నారు. బాగున్నది.
పూర్తయిన తరువాత పుస్తక రూపంలో ఒకే పిడిఎఫ్ ఈ బుక్కుగా తీసుకువస్తే ఔత్సాహిక జర్నలిష్టులకు ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.