మిర్ ఆలం చెరువుకు స‌ర్కారు కొత్త హంగులు

0
63

ఫ్యామిలీ టూరిస్టు హ‌బ్ గా అభివృద్ధి
సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ
గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
సస్పెన్షన్ బ్రిడ్జి, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ధికి ప్రణాళికలు
హైదరాబాద్, ఆగస్టు 27:
చారిత్రక ప్రాధాన్యం కలిగిన మిర్ ఆలం చెరువుకు కొత్త రూపునిచ్చి, సరి కొత్త హంగులను సమకూర్చాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా దీనిని ప్రముఖ పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మిర్ ఆలం చెరువును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అకస్మికంగా పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, మిర్ ఆలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పనుల పురోగతిని సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మిర్ ఆలం ట్యాంక్ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. చెరువు పునరుజ్జీవనం, చెరువు పరిసర ప్రాంతాలు, అందులోని ఐలాండ్ల అభివృద్ధి, చెరువుపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.. ఈ మూడు ప్రధాన అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మిర్ ఆలం చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆదేశించారు. చెరువు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవనంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

వాటర్ స్పోర్ట్స్‌కు డిజైన్

మిర్ ఆలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. అవసరమైన సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలించాల‌న్నారు. దీంతో యువతతో పాటు కుటుంబాలకు కూడా ఆకర్షణీయమైన వినోద కేంద్రంగా మిర్ ఆలం మారుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చెరువు చుట్టూరా ఫుడ్‌కోర్టులు, పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, కుటుంబ వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద, కార్యకలాపాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాల‌న్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్‌లను తీర్చిదిద్దడంతో పాటు రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరచనున్నార‌న్నారు.

ఐలాండ్లకూ కొత్త రూపు

మిర్ ఆలం చెరువులో ఉన్న ఐలాండ్లను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్(టెంట్లు వేయ‌డం), ఇతర పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశాలను అధికారుల‌ను ప‌రిశీలించాల‌ని చెప్పారు. వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసే అంశంపై దృష్టి సారించాల‌న్నారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధిలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వెల్ల‌డించారు.

జూ పార్కుతో సమగ్ర పర్యాటక అనుసంధానం

సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో మిర్ ఆలం ట్యాంక్ అభివృద్ధిని అనుసంధానించాల‌ని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంగా ఉండాల‌ని చెప్పారు. ట్యాంక్ పునరుజ్జీవనం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటుంద‌న్నారు.

సస్పెన్షన్ బ్రిడ్జి పనుల్లో 50 శాతం పురోగతి

మిర్ ఆలం ట్యాంక్‌పై నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జి పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆగస్టు 27, 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 544 పైల్స్‌లో 273 పూర్తయ్యాయి. అంటే 50.18 శాతం పనులు పూర్తయ్యాయి. 62 పైల్ క్యాప్స్‌లో 28 పూర్తికాగా, 45.16 శాతం పురోగతి నమోదైంది. 62 పియర్-కమ్-పియర్ క్యాప్స్‌లో ఇప్పటివరకు ఆరు పూర్తయ్యాయి. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మిర్ ఆలం చెరువును పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంద‌ర్భంగా సూచించారు. చారిత్రక చెరువు, పచ్చని పరిసరాలు, నెహ్రూ జూ పార్కు సమీపం, ఐలాండ్లు, వాటర్ స్పోర్ట్స్, కుటుంబ వినోదం, ఫుడ్‌కోర్టులు, ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జితో మిర్ ఆలం ట్యాంక్‌కు సరికొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సమగ్ర అభివృద్ధి పూర్తయితే హైదరాబాద్ నగరవాసులతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మిర్ ఆలం ట్యాంక్ మారనుంది. కుటుంబం మొత్తం ఒకే చోట రోజంతా ప్రకృతి, వినోదం, జలక్రీడలు, విశ్రాంతిని ఆస్వాదించేలా మిర్ ఆలం చెరువును తీర్చిదిద్దనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here