దూసుకుపోతున్న రాహుల్ జీ…

0
61

చూసుకోవాల్సిన అంశాలివీ…

(సూరావజ్ఝల రాము)

విపక్ష నేత సరిగ్గా, చురుగ్గా ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా LoP రాహుల్ గాంధీ గారు రాటుదేలడం చూస్తున్నాం. వరస అపజయాలతో డంగై పోతున్న కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవడం కోసం, ఎన్నికల విజయాల్లో తిరుగులేని నరేంద్ర మోదీ గారిని నిలువరించడం కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండు నెలలుగా అవకాశాలు సృష్టించుకుని దూసుకుపోతున్నారు. ఇందులో కొన్ని బ్లాస్ట్స్ ఉన్నాయి, బ్లన్డర్స్ ఉన్నాయి.
ఆయన ప్రస్థానంలో కొన్ని సవాళ్లు:

  1. No opposition unity:
    చార్ సౌ పార్ అన్న బీజేపీ పెద్ద లక్ష్యాన్ని దెబ్బతీసి… మోదీ జీ అనూహ్యంగా మిత్రుల మీద ఆధారపడేలా చెయ్యడంలో రాహుల్ జీ ఘన విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ ను ప్రబల శక్తిగా నిలపడంలో మాత్రం విఫలం అయ్యారు. సొంత బలం పెరగకుండా
    INDI Alliance కోసం తపన పడ్డం అంటేనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ లోపాన్ని అంగీకరించడం. ఇప్పుడు కాంగ్రెస్ కు నమ్మదగ్గ మిత్రులు ఒక్కరూ లేరు. AAP దూరమయ్యింది. DMK నమ్మదు. ఓడిపోయింది కాబట్టి TMC సయోధ్య కు వచ్చింది. కేరళం ఎన్నికల తర్వాత కామ్రేడ్స్ దూరమయ్యారు. యూపీ లో సీట్ల పంపిణీ విషయంలో SP మీద ఆధారపడాల్సిన దుస్థితి. మిగిలిన చిన్నా చితకా పార్టీలతో వచ్చేది పెద్దగా లేదు.
    రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని జూన్ లో జరిగిన INDI Alliance మీటింగ్ లో అనుకున్నారు కానీ ఆ దిశగా ప్రయత్నాలు లేవు. మిత్రపక్షాలను కలుపుకుపోయే ధోరణి ఆయనలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో శత్రువులు ఢిల్లీలో మిత్రులు… అన్న కాన్సెప్ట్ కాంగ్రెస్ కు నష్టం.
  2. Taking baton from Students:
    దేశంలో విద్యార్థులు వీధుల్లోకి వచ్చేదాకా రాహుల్ జీకి ఊపురాలేదు. భారత్ జోడో యాత్ర తప్ప ఆయన చేసిన రాజకీయ సాహసం ఏమీ లేదు.
    మోదీ కళ్ళల్లో భయం అంటూ బుల్లి రాజ్యాంగం పట్టుకుని తిరిగారు తప్ప కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం పెద్దగా సొంత ఆలోచనలు చేసినట్లు కనబడలేదు. బెంగాల్ లో బీజేపీ ప్రభంజనం తర్వాత ఆయనలో నిస్పృహ పెరిగింది. కేరళ, తమిళనాడు లలో నిర్ణయాలలో జాప్యం ఆయన అపరిపక్వతను చాటింది.
    నీట్ పరీక్ష విషయంలో CJP అనేది పుట్టుకొచ్చి హంగామా చేసినా ఆయన మాట్లాడకుండా ఉన్నారు. జంతర్ మంతర్ లో పిల్లల ఉద్యమాన్ని చివర్లో (జులై 20 నుంచి) తమకు అనుకూలంగా మార్చుకుని క్రెడిట్ చోరీ అన్న అపవాదు తెచ్చుకున్నారు.
  3. One man shows:
    కాంగ్రెస్ లో నే కాకుండా INDI A లోనూ అన్నీ తానై రాహుల్ జీ ప్రవర్తిస్తున్నారు తప్ప ఒక టీం వర్క్ తో, పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు కనిపించడం లేదు. బీజేపీ లో టూ మెన్ షో అయితే కాంగ్రెస్ లో అది మరీ వన్ మ్యాన్ షో అయ్యింది. కొద్దిలో గొప్ప ఏమిటంటే… ఈ మధ్యన ఆయన పిల్లలకు మైక్ ఇచ్చి మాట్లాడమంటున్నారు.
  1. Political confusion:
    ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో రాహుల్ జీ తికమక పడుతున్నారు. ఉదా: ప్రధాన మంత్రి ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగినప్పుడు చేసిన డిమాండ్లకు, ఇప్పుడు చేస్తున్న డిమాండ్లకు మధ్య తేడా ఉంది. ఆ రోజు పిల్లలు గట్టిగా పట్టుబట్టారు కాబట్టి విద్యా మంత్రి రాజీనామా అని రాహుల్ గళం కలిపారు. ప్రధాని క్షమాపణ చెప్పాలన్నది ఆయన సొంతగా చేసిన డిమాండ్. ఆ డిమాండ్ పిల్లలు చేయలేదు కాబట్టి దాన్ని ఈయన క్రమంగా వదిలేశారు.
  2. Dignity & maturity:
    తానే యూత్ కు ప్రతినిధి అన్న కలర్ ఇవ్వడానికి తపనపడుతున్న రాహుల్ డ్రస్ సెన్స్ మీద చర్చ జరుగుతోంది. పార్లమెంట్ మెట్ల మీద పోయే వాళ్ళను ఆటపట్టించడం, సిల్లీ కామెంట్స్ చేయడం ఆయన నాన్ సీరియస్ ధోరణిని సూచిస్తోంది. ఆయన పట్టుపట్టినట్లు నీట్ మీద పార్లమెంట్ లో చర్చ జరిగితే అక్కడ మూడు రకాల మనుషులు (విద్యార్థులు, ఇడియట్లు, అంధ్ భక్తులు) గురించి ఎక్కువ సేపు నడిపారు తప్ప సరైన సూచనలు చేయలేదు. రాహుల్ గారికి కు తెలియని విషయం ఏమిటంటే… మోదీ గారిని లేదా బీజేపీ ని గుడ్డిగా భక్తితో కొలవడం ఒక గొప్ప దేశభక్తియుత కార్యక్రమంగా, గర్వంగా బీజేపీ క్యాడర్ భావిస్తుంది. పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయం పోగొట్టుకోవడం మాకే నష్టం అని…కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బాహాటంగా చెప్పి గాలితీశారు. ఫ్లోర్ ప్లానింగ్ సరిగా చేసుకుని ఉంటే బాగుండేది.
  3. Inconsistency:
    రాహుల్ జీ ఈ వారం చేసే డిమాండ్స్ వచ్చే వారం చెయ్యరు. బెంగాల్ ఫలితాలు రాకముందే అడవుల్లోకి వెళ్ళి, వాటి మీద మాట్లాడారు. అంతకు ముందు మణిపూర్ అన్నారు. ఇపుడు రాజ్యాంగ ప్రతి పట్టుకోవడం లేదు. తాజాగా ప్రధాన మంత్రి రాజీనామా అంటున్నారు. వాళ్లకు పిచ్చెక్కిస్తామని, నిద్రపోనివ్వనని అంటున్నారు. ఇలాంటి మాటలు ఆయన పరిపక్వత మీద ప్రజలు ఒక అంచనాకు రావడానికి ఉపయోగపడతాయి తప్ప ఆయనకు, కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం కలిగించవు. ధరల పెరుగుదల వంటి అంశాల గురించి తరచూ గణాంకాలతో సహా మాట్లాడే నికడతనం ఆయనకు లేనట్లుంది.
  4. Unintentional issues:
    చుట్టూ ఉన్న వారితో కూడా రాహుల్ జీ కి చిక్కు వచ్చి పడింది. నిర్మాణాత్మక కాంగ్రెస్ సదస్సులో షీలా దీక్షిత్ కొడుకు వల్ల చెడ్డపేరు వచ్చింది. మోదీ గారి కౌగిలింత ను వెక్కిరించబోయి దెబ్బతిన్నారు. ఇది సెల్ఫ్ గోల్. ఈ హగ్గింగ్ నేపథ్యంలో ఇందిర – కాస్ట్రో ప్రేమపూర్వక కౌగిలింత మాత్రమే కాకుండా నెహ్రూ – లేడీ మౌంట్ బాటెన్ ఫోటోలు బీజేపీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు
    ఇంకో పిచ్చి లెక్క ఉంది. మోదీ వల్ల పాకిస్థాన్ కు ఫాయిదా అయిందని అనడం గొప్ప పాయింట్ కాదు. చపలచిత్తుడు ప్రెసిడెంట్ గా ఉన్న అమెరికా ప్రమేయం ఉన్న ఏ అంతర్జాతీయ మీడియేషన్ లో అయినా భారత్ దూరంగా ఉండడం ఉత్తమం. విదేశాంగ విధానం పెద్ద పాయింట్ గా మోదీ ప్రభుత్వాన్ని కొట్టడం కొద్దిగా కష్టం.
    ఛాత్రోమ్ కీ గూంజ్ మాట్లాడుతూ, 1000 మందికి 12 ప్రభుత్వోద్యోగాలు మాత్రమే ఉన్నాయని రాహుల్ అనడం కూడా వ్యూహాత్మక తప్పిదం. ఇప్పటికే తెలంగాణలో అశోక్ నగర్ లో పిల్లలకు ఇచ్చిన వాగ్దానం అమలుచేయలేని ఆయన ఒకవేళ తన ప్రభుత్వం వచ్చినా అంతకన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు. ఈ విద్యా వ్యవస్థ బీజేపీ వల్ల దోపిడీకి గురవుతున్నదని కూడా అనడానికి సాక్ష్యాలు ఆయన చూపకుండా బండలు వేస్తున్నారు. విద్య, నిరుద్యోగం వంటి అంశాల్లో కాంగ్రెస్ వైఖరి ఆయన స్పష్టంగా చెప్పకుండా విద్యార్థులను ఆకట్టుకోలేరు.
    తాజాగా, వందేమాతరం వివాదం కూడా కాంగ్రెస్ కు నష్టం కలిగించేదే. భారతీయులు మతం, దేశం విషయంలో అన్ని కోణాలను సీరియస్ గా తీసుకుంటారు. సోనియా గాంధీ గారు చేసిన సైగలు, వందేమాతరం మధ్యలో రాహుల్ జీ, ఖర్గే జీ విన్యాసాలు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రచారాస్త్రాలు అవుతాయి. ఖర్గే కు కుర్చీ కోసం చేసిన సైగలవి అన్న కాంగ్రెస్ బుకాయింపు ఇంకా డ్యామేజ్ చేస్తుంది.

ఏతావాతా, రాహుల్ జీ నాయకత్వానికి ఇపుడు రెండు గట్టి పరీక్షలు ఉన్నాయి.
ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ గారి చేతుల్లో ఉన్న బొద్దింకలను దువ్వుతూ వారికి అనుగుణమైన డిమాండ్లు చేస్తూ… యువతకు తానే నేత అన్నట్లు కలర్ ఇచ్చుకోవడం. అది చాలా క్లిష్టమైన అంశం. పంజాబ్ లో అధికారం నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్న ఏకే గారు రాహుల్ కు క్రెడిట్ రాకుండా, తన శిష్యులకే కీర్తి దక్కేలా పావులు కదుపుతారు.
ఈ విచిత్ర విన్యాసం బదులు సొంత ఆలోచనలు చేసి, పకడ్బందీ వ్యూహాలు రూపొందించి ముందుకు వెళ్తే తప్ప రాహుల్ జీ నిజమైన నేతగా నిరూపించుకోలేరు.

రెండోది, మూడేళ్ల పాటు ప్రభుత్వం మీద ఇదే స్థాయిలో ఒత్తిడి తెచ్చేలా మెలగడం. విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండి ఇంతే ఉత్సాహంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలంటే చాలా కసరత్తు జరగాలి.
ఈ క్రమంలో ఏ మాత్రం తప్పటడుగులు వేసినా ఖేల్ ఖతం!

(Author is a political strategist and senior journalist)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here