గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై ఫిలిప్పీన్స్‌ విధానాల అధ్యయనం

0
65

(సౌదీ అరేబియా ప్రతినిధి, మచ్చ శ్రీనివాస్)

17 నుంచి 21 వరకు ఫిలిప్పీన్స్‌ పర్యటన

ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 11 మంది సభ్యుల బృందం

రియాద్, ఆగష్టు 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీకి చెందిన 11 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఈ నెల 17 నుంచి 21 వరకు ఫిలిప్పీన్స్‌లో అధ్యయన పర్యటన చేపట్టనుంది. ఈ విషయాన్ని కమిటీ చైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి లతో పాటు కమిటీ సభ్యులు పాల్గొంటారు.

గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం, రక్షణ కోసం ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవస్థలు, ఉత్తమ పద్ధతులను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా లోని ఇండియన్ ఎంబసీ, వివిధ వలస కార్మిక సంఘాలు, ప్రభుత్వ సంస్థలను సందర్శిస్తారు.

తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన, ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పర్యటన చేపట్టినట్లు వారు తెలిపారు.
ఆగస్టు 17 న హైదరాబాద్‌ నుంచి మనీలాకు బయలుదేరే ప్రతినిధి బృందం మరుసటి రోజున ఓరియంటేషన్‌, అధ్యయన సమావేశాలు నిర్వహిస్తుంది. ఫిలిప్పీన్స్‌ వలస విధానం, విదేశీ ఉపాధి వ్యవస్థ, వలస కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై నిపుణులతో చర్చిస్తుంది.

వలస కార్మికుల కోసం పనిచేస్తున్న రెండు అంతర్జాతీయ సంస్థలు మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ), బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యూఐ) కు చెందిన నిపుణులు వలసల గురించి ప్రతినిధి బృందానికి వివరిస్తుంది. వలస కార్మికుల రక్షణ, సంక్షేమం, హక్కులు, పునరావాసం – పునరేకీకరణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తుంది. 19 వ తేదీన మనీలా లోని ఇండియన్ ఎంబసీ సహకారంతో ప్రభుత్వ సంస్థల సందర్శిస్తుంది.
ఆగష్టు 21 న హైద్రాబాదుకు తిరిగి పయనమవుతుంది. డా. బి.ఎం. వినోద్ కుమార్, చైర్మన్, మంద భీంరెడ్డి, వైస్ చైర్మన్, ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ & వేములవాడ ఎమ్మెల్యే, డా. ఆర్. భూపతి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, డా. విజయ్ కొర్ర, డా. శ్రీనివాస్ జునుగురు, రవి ప్రతాప్ చావ్లా, ఆది కార్తీక్ ఈ బృందంలో సభ్యులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here