నష్టం అపారం … కావాలి కేంద్ర ఆపన్న హస్తం : రేవంత్

Date:

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి
కేంద్రం తక్షణ సాయం అందించాలి
ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం
కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​​తో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 06 :
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తున్నాయని, సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందని వివరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్ లతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్​ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


నష్ట తీవ్రతను వివరించిన సీఎం
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలతో వాటిల్లిన వరద నష్టపు తీవ్రతను ముఖ్యమంత్రి వివరించారు. ఖమ్మం, మహబూబ్​నగర్​, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు.
ఒకే రోజులో అంచనాకు మించిన వర్షం పడటంతో ప్రధాన రహదారులతో పాటు రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు చాలాచోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.


గ్రామాలకు కోలుకులేని నష్టం
వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయారని, ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని సీఎం చెప్పారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులు వివరించారు.
తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు.


నిబంధనలను సడలించాలి
విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 50 శాతం ఉపయోగిస్తే.. ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకునేలా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేది. 2021 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఇప్పుడు వంద శాతం ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మతు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారు. గతంలో ఉన్నట్లుగా ఈ నిబంధనను సడలించాలని ముఖ్యమంత్రి కోరారు.


వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లను కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని అన్నారు.
విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...

మన మౌనం ధర్మ వినాశనానికి దారివ్వకూడదు: పవన్ కళ్యాణ్

విజయవాడ, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన...

తిరుపతి లడ్డు వివాదం ..సమాధానం చెప్పవలసింది ఎవరు?

అపరిమిత అధికారాలిచ్చిన ఫలితం ఇది…(శివ రాచర్ల)సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు....