‘మేడే’ నాడు తెలుసుకోవల్సింది ‘పని దినం’లో వున్న ‘రహస్యాన్ని’!

0
79

(రంగనాయకమ్మ)
మనం చూడబోయేది, ‘పని దినం’లో వున్న రహస్యం గురించి! అంటే, మానవ సమాజం కోసం పనులు చేస్తూ, సరుకుల్ని ఉత్పత్తి చేసే కార్మిక మానవుల వర్గానికీ, ఏ పనీ చెయ్యకుండానే కోట్ల కోట్ల ధనంతో ‘లాభాలు’ పోగేసుకునే పెట్టుబడిదారీ యజమాని మానవుల వర్గానికీ మధ్య జరిగే కధ ఇది!
పరిశ్రమల యజ మానులు, తమ దగ్గిర పనిచేసే కార్మికుల చేత, రోజుకి 8 గంటలకంటే, ఎక్కువ టైము పని చేయించ కూడదని, 1886 మే 1న, అమెరికాలో కార్మికులు పెద్ద ‘సమ్మె’ చేశారు. ఆ తర్వాత, దేశ దేశాల కార్మిక సంఘాల వారూ కలిసి, మే1ని ‘అంతర్జాతీయ కార్మిక దినం’గా పాటించాలని తీర్మానించారు! దానికి, ప్రపంచంలో, అనేక దేశాల ప్రభుత్వాలు, కార్మికుల్ని బుజ్జగించడానికే, మే 1ని ‘శెలవు రోజు’గా ప్రకటించాయి. ఆ రోజున, కార్మిక సంఘాల వారు మీటింగులూ, ఊరేగింపులూ, ప్రదర్శనలూ, చేస్తారు. కార్మికులకోసం ప్రభుత్వాలు ఏమేమి చెయ్యాలో, ఆ కార్మిక సంఘాలు ప్రకటిస్తాయి! అవన్నీ జరగవలిసిందే!
కార్మిక నాయకులు చెయ్యవలిసిన పనులలో అతి ముఖ్యమైన విషయం: పనిదినంలో పైకి కనిపించని ‘శ్రమ దోపిడీ’ అనే రహస్యం ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవడం! అది కార్మిక వర్గ సంఘంలో వున్న కార్మికులందరికీ, అర్ధం అయ్యేలా తరుచుగా వివరించడం! అయితే, ఆ పని దినంలో వుండే రహస్యాన్ని విప్పిచెప్పేది, మార్క్సు రాసిన ‘పెట్టుబడి’ (‘కాపిటల్’) అనే పరిశోధనా గ్రంధం మాత్రమే! ‘పెట్టుబడి’ పుస్తకంలో మార్క్సు చెప్పినదాని ఆధారంగా, పని దినంలోని రహస్యానికి సంబంధించి, నేను కొన్ని విషయాలు ఇక్కడ వివరించదల్చుకున్నాను.


‘కార్మికులు’ అంటే, (వీరిని ‘శ్రామికులు’ అని కూడా అనవచ్చు. అయినా, ‘కార్మికులు’ అనే అందాం. ఇది కొంచెం అలవాటైన పేరు కాబట్టి) కేవలం ఫ్యాక్టరీలలో పనిచేసేవారు మాత్రమే కార్మికులు అవుతారని కాదు. పొలాల్లో, గనుల్లో, రవాణాలో, ఇళ్ళల్లో, ఇంకా అనేక చోట్ల, పెట్టుబడిదారీ యజమానుల ఆధిపత్యం కింద జీతాల కోసం పనిచేసే వారందరూ కార్మికులే! కార్మికుల్లో, మేధా శ్రమలు చేసే వారూ, శారీరక శ్రమలు చేసే వారూ, వేరు వేరు స్తాయిల్లో వుంటారు. వారు చేసే శ్రమల్ని బట్టి, ఆ ‘శ్రమల విలువలు’ కూడా తేడాలుగా వుంటాయి. కానీ, కార్మికులు అందరూ, ఒకే పని దినంలో కొన్ని గంటల పాటు శ్రమ చేసేవారే.

‘పని దినం’ అంటే, కార్మికులు, పని ప్రారంభించ డానికీ, చేసే పనిని ఆపివెయ్య డానికీ మధ్య వుండే గంటల కాలం. కార్మికులు, ఒక పనిదినంలో పనిచేస్తే, యజమాని ఇచ్చే జీతం, ఆ వారంలోగానీ, ఆ నెలలోగానీ వస్తుంది. ‘జీతం’ అనేది, కొంత డబ్బు. ఆ జీతం విలువా, కార్మికులు చేసే శ్రమ విలువా, సమానంగా వుండవు! ఈ తేడాని సరిగా తెలుసుకోవాలి.
పని దినం అనేది, 2 భాగాలుగా వుంటుంది. (1) పని చేసే కార్మికుల కోసం, అవసర శ్రమ జరిగే కాలం. (2) కార్మికులకు విలువ అందని అదనపు శ్రమ జరిగే కాలం.

‘అవసర శ్రమ కాలం’ అంటే, కార్మికులు పనయ్యాక పొందే జీతాలకు ఎంత విలువ వుంటుందో, అంత విలువ గల శ్రమ వరకూ జరిగిన కాలం. ఉదాహరణకి: 8 గంటలుగా వుండే పని దినంలో, కార్మికులు 4 గంటలు పనిచేస్తే, ఆ పని విలువకి, తర్వాత అందుకునే జీతం విలువ సమానంగా వుంటుంది. జీతాల విలువతో సమానమైన విలువగల శ్రమ కాలమే, ‘అవసర శ్రమ కాలం’.

కార్మికులు, తర్వాత తీసు కోబోయే ‘జీతాల’ విలువకి తగినంత శ్రమ చేసితీరాలి. అంతవరకూ జీతాల విలువకి తగిన శ్రమ చేసినట్టే అవుతుంది. అసలు, పని దినం ‘అవసర శ్రమ’తోనే ప్రారంభమవుతుంది. జీతాల విలువకి సరిపోయేటంత పని జరిగాక, కార్మికులు ఇక పనిచెయ్యడం మానెయ్య వచ్చు. ఎందుకంటే, అందే జీతం చాలు వాళ్ళ పోషణకి! వాళ్ళు బతకడానికి! అంటే, 8 గంటల పని దినంలో జరిగే శ్రమ అంతా, కార్మికుల పోషణకు, బతకడానికి, అవసరం లేదు. అంటే, 4 గంటల ‘అవసర శ్రమ’ వరకే పని చెయ్యడం చాలు!
(ఇక్కడ ఒక ప్రశ్న! కార్మికులు పనిచేస్తోంటే, యజమాని ఏం చేస్తాడు? లెక్కలవీ చూసుకుంటూ వుంటాడేమో! అది, సరుకుల్ని ఉత్పత్తి చేసే పని కాదు. అయితే, యజమానికి కూడా పోషణ కోసం కూడా జీతం రావొద్దా? అలా జరగదు.)

కార్మికులకూ యజమాను లకూ వుండే పని సంబంధం లో, పని దినం మొదలయ్యాక, కార్మికుల అవసర శ్రమ జరగగానే కార్మికులు పని మానెయ్యడం సాధ్యం కాదు! ఏ పనీ చెయ్యకుండా కూర్చునే యజమాని కుటుంబానికి కూడా పోషణ కోసం, అన్ని సరుకులూ కావాలి కదా? కాబట్టి, దాని కోసం కార్మికులు ఇంకా పని చెయ్యాలి. అది, ఇంకా ఎంతసేపు చెయ్యాలి? అదే మరి, కార్మిక వర్గానికీ, యజమాని వర్గానికీ ఏనాటి నించో జరుగుతూ వున్న సుదీర్ఘ గాధ!

అదనపు శ్రమ కాలం: కార్మికులు, అవసర శ్రమ కాలం తర్వాత కూడా పని చెయ్యాలి కాబట్టి అలాగే చేస్తారు. ఇంకా చేసే శ్రమ విలువ, అవసర శ్రమ విలువకన్నా ఎక్కువ కదా? అది, కార్మికులు చెయ్యవలిసిన ‘అదనపు శ్రమ’. ‘మేము చెయ్యం’ అని కార్మికులు అంటే? అసలు, ఈ అవసర శ్రమా, అదనపు శ్రమా విషయాలూ, ఆ విలువ లెక్కలూ, మార్క్సు రాసేవరకూ ఎవరికి తెలుసు? నిజం చెప్పుకోవాలంటే, ఇప్పటికీ తెలీదు. తెలిసిన కార్మికులు, ‘మేము చెయ్యం’ అంటే, ఆ క్షణం నించీ, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. తర్వాత కూడా కొత్త ఉద్యోగాలు దొరకవు. అక్కడ కూడా అదనపు శ్రమ చెయ్యాలి కదా? (అదనపు శ్రమ అంటే, ఓవర్ టైం అంటారే, అది కాదు! పని దినంలోనే వున్న రెండో భాగమే అదనపు శ్రమ!) ‘చెయ్యం’ అంటే, ఎక్కడైనా ఒకటే కదా? కాబట్టి, ఉద్యోగాలు చేస్తేనే కార్మికుల పోషణకి జీతాలు వస్తే బతకగలుగుతారు. కాబట్టి, ‘మేము చెయ్యం’ అని వెనకటి కాలంలో అనడం జరగలేదు.

అదనపు శ్రమతో కూడా తయారైన సరుకులు మొత్తం విలువ అంతటి ధరలతో అమ్ముడవుతాయి. ఆ అదనపు విలువని యజమానులు కార్మికులకు ఇవ్వరు. మళ్ళీ చూడండి! తీసుకునే జీతాల విలువ కన్నా అదనంగా వున్న విలువే ‘అదనపు విలువ’! అంటే, ఒక పని దినంలో, కార్మికులు, తమకు అందే జీతాల విలువా, దాన్ని దాటిన అదనపు విలువా, ఆ మొత్తం విలువగల శ్రమ చేసినట్టు! ఆ మొత్తం శ్రమ జరగడం ద్వారా తయారైన సరుకుకి ఆ మొత్తం విలువతోనే ధరలు ఏర్పడి, అమ్మకాలు జరిగి, ఆ విలువకి అంతా డబ్బు వస్తుంది. అప్పుడు అవసర శ్రమకి జీతాలు ఇచ్చేస్తే, అదనపు విలువ డబ్బు ఏమవుతుంది? యజమాని చేతిలోకి పోతుంది. ఈ సంగతి ఇప్పుడు కొంచెం తెలుస్తోందిగానీ, వెనకటి కాలంలో ఏమీ తెలీదు. మార్క్సు, ఎంత ఆలోచించి, మానవ సమాజాన్ని ఎంత ఉన్నతంగా మార్చాలనీ, మార్చవచ్చనీ, అనుకున్నాడు కదా?

అందుకే, అవసర శ్రమ కాలమూ + అదనపు శ్రమ కాలమూ = ఒక ‘పని దినం’.
ఉదాహరణకి, 3 రకాల పొడవులు గల పని దినాల్ని చూడండి. (1) అవసర కాలం 6 గంటలు+అదనపు కాలం 2 గంటలు=పని దినం 8 గంటలు. (2) అవసర కాలం 6 గంటలు + అదనపు కాలం 3 గంటలు=పని దినం 9 గంటలు. (3) అవసర కాలం 6 గంటలు+అదనపు కాలం 6 గంటలు=పని దినం 12 గంటలు.
పని దినం పెరగడం అంటే, కార్మికులు చేసే శ్రమ పెరిగినట్టే! 8 గంటల పనిదినం 10 గంటలు అయితే, కార్మికులు చెయ్యవలిసిన శ్రమ కాలం పెరగడమే. (దాన్ని బట్టి, జీతం పెరగడం అయినా కాదు.) శ్రమ పెరిగితే, దాని విలువ పెరగడమే! ఆ పెరిగిన విలువతోనే, కార్మికులు చేసే పాత సరుకు విలువ ఎప్పటి ధరతోనే వుంటుంది గానీ, పని దినంలో ఎక్కువ విలువ వుంటుంది కాబట్టి, దానితో సరుకుల తయారీ పెరిగి, వాటి వల్ల యజమానికి రాబడి పెరుగుతుంది. పని దినం పెరిగి, శ్రమ విలువ పెరిగినా, కార్మికులకు ఇచ్చేది ఎప్పటి జీతమే!

మనం ఉదాహరణగా తీసుకున్న 3 పని దినాలూ, వేరు వేరు పొడవులున్న పని దినాలు. అయినా, మూడిటిలోనూ జీతం కోసం చెయ్యవలిసిన ‘అవసర కాలం’ ఒకటే. జీతం కార్మికుల బతుకు తెరువుకి. పని దినం పెరగడం వల్ల, శ్రమ కాలం పెరిగి ‘అదనపు కాలమే’(లాభమే) పెరుగు తుంది! అంటే, ఏ పొడవు గల పని దినాన్ని తీసుకున్నా, అవసర కాలాన్ని తీసివెయ్యగా మిగిలేదే ‘అదనపు కాలం’ కదా? ‘అవసర శ్రమ’ కాలానికి ఒక హద్దు వుంటుంది. ‘జీతాలు’గా తీసుకోబోయే విలువ’ని కార్మికులు తిరిగి ఇవ్వడం (ఆ విలువకు సరిపోయే శ్రమ చెయ్యడం) అనే హద్దు వుంటుంది. ఆ విలువే, ‘కార్మికుల శ్రమ శక్తికి విలువ’. అంటే, రోజూ వచ్చి పని చెయ్యడానికి అవసరమైన శక్తిని ఇచ్చే పోషణ వస్తువుల విలువే ఆ జీతాలు. కాబట్టి, ఆ జీతాల భాగానికి (అది ఒక పైసా పెరిగినా) ఒక ఖచ్చితమైన హద్దు వుంటుంది. ఆ తర్వాత మిగిలే ‘అదనపు శ్రమ కాలానికి’ అలాంటి హద్దు వుండదు. అసలు అదనపు శ్రమే తప్పు! అయినా, యజమానికోసం అదనపు శ్రమ కాలం జరిగి తీరాలి. దాని హద్దు పెరిగిపోతూ వుంటుంది.

అదనపు శ్రమ కాలం ఎంత వుండాలి?-అనే ప్రశ్నే అనవసరం. 1 గంటా, 2 గంటలా, 5 గంటలా? ఎంత? ఈ రెండో భాగం ఎంతైనా వుండాలంటాడు యజమాని. అవసర శ్రమ కాలాన్ని 6 గంటలు అనుకుంటే, దాని తర్వాత అదనపు శ్రమ ఎన్ని గంటలసేపు జరిగితే, దాన్ని బట్టి పని దినం పెరిగినట్టే. అంటే, అదనపు శ్రమ కాలాన్ని బట్టే ‘పని దినం’ పొడవు వుంటుంది. లేదా, వేరే మాటలతో చూస్తే, ‘పనిదినం పెరిగితే’, అదనపు శ్రమ కాలం పెరుగుతుంది! ఇదీ, పని దినం నించీ కార్మిక వర్గం తెలుసుకోవలిసిన ముఖ్య విషయం!

పని దినాన్నే మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. ‘పని దినం’లో వుండే రెండో భాగం స్తిరమైనది కాదు! కాబట్టి, పని దినం కూడా స్తిర మైనదిగా వుండదు.!
రెండో భాగం అయిన ‘అదనపు శ్రమ కాలం’ చాలా ఎక్కువగా వుంటే, యజ మానిగా పెట్టుబడిదారుడికి లాభం పెరుగుతుంది కాబట్టి, చాలా ఇష్టం! కానీ, అది అతడికి ఎంత ఇష్టం అయినా, అదనపు శ్రమ భాగానికి కూడా ఒక హద్దు తప్పనిసరే అవుతుంది! ఎందుకంటే, పెట్టుబడిదారుడి ‘దురదృష్టం’ కొద్దీ, రోజుకి 24 గంటలే! ‘పని దినం’ అనేది, ఆ 24 గంటల హద్దులోనే వుండి తీరాలి కదా? కానీ పని దినం 24 గంటలు కాకుండా, 34 గంటలో, 44 గంటలో అవడం సాధ్యమా? ప్రకృతి సహజత్వం ప్రకారం, అది సాధ్యం అవదు. ఏమిటా ప్రకృతి సహజత్వం? ఒక రోజుగా, ఒక రాత్రీ, ఒక పగలూ కలిసి జరగడానికి, 24 గంటలే సరిపోతాయి మరి! అంతకన్నా ఒక రోజుకి ఎక్కువ గంటలు తిరగడానికి, పని దినాన్ని 24 గంటల సమయం కన్నా ఒక్క క్షణం అయినా ఎక్కువగా ఇవ్వడానికి భూమికే, ప్రకృతికే, ఇష్టం వుండదు కదా?

యజమానికి లాభ దృష్టి! ధనం దృష్టి! ఆస్తుల పెంపకం దృష్టి! అది ఎలా వుంటుందంటే, రోజుకి 24 గంటలే కాబట్టి, కార్మికులకు 2 గంటలకో, 3 గంటలకో మాత్రమే జీతాలిచ్చి, 20 గంటలైనా పని చేయించాలనే వుంటుంది. ధనం దృష్టి అది! ఆ దృష్టి మానవుల్ని 2 రకాలుగా మార్చేస్తుంది. యజమానులుగా, సేవకులుగా! దానికి సేవకుడి దేహం ఒప్పదు. ఎందుకంటే, అది ‘సజీవమైనది’ గా బతికి వుండాలనుకుంటుంది. తిండి మానేసి చచ్చిపోవాలను కోదు. కాబట్టి, తిండి తినడానికీ, బట్ట కట్టడానికీ, మందూ-మాకూ, చదువూ- సంధ్యా, నిద్రా, విశ్రాంతీ వంటి అవసరాల కోసం ఎంతెంత తక్కువ సమయాలతో సర్దుకున్నా అన్నిటికీ కలిసి, ఎంతో కొంత మొత్తం కాలం, ‘ఫలానా ఇన్ని గంటలు’ కావాలి. కాబట్టి, కార్మికులతో 24 గంటలూ, పోనీ, 20 గంటలైనా పని చేయించడం యజమానికి సాధ్యం అవుతుందా? అవదు పాపం! కార్మిక ‘శ్రమ శక్తి’ ఏర్పడడానికి అత్యవసరంగా వుండే ఆ ‘భౌతిక పరిస్తితుల్ని’ బట్టి, పని దినానికి తప్పనిసరిగా ఒక హద్దు ఏర్పడి తీరాలి! తప్పదు!

‘శ్రమ చరిత్ర’ ఇప్పటికి అనేక రకాల పని దినాల్ని చూసింది. ఒకప్పుడు 18 గంటల పని దినం కూడా వుండేది. 14వ శతాబ్దం మధ్య నించి 17వ శతాబ్దం చివరి వరకూ, ఐరోపాలో, ‘పని దినాన్ని’ మరింత మరింత పెంచుతూ అనేక ప్రభుత్వ శ్రమ దోపిడీ చట్టాలు వచ్చాయి. అవన్నీ మళ్ళీ మారుతూ, 18 గంటల పని దినం క్రమంగా తగ్గుతూ ఇప్పటికి 8 గంటల పని దినం కోసం కార్మికుల డిమాండుగా అయింది. ఆ పాత 18 గంటల పని దినానికీ, ఇప్పటి 8 గంటల పని దిన డిమాండుకీ మధ్య కాలంలో, 16, 14, 12, 10 గంటల పని దినాల నన్నిటినీ వేరు వేరు దేశాలు చూశాయి!
పని దినం పొడుగు, దానికదే పెరిగేదీ కాదు, దానికదే తగ్గేదీ కాదు. పని దినాన్ని పెంచాలని, ఏ పనిలోనూ వేలుపెట్టని పెట్టుబడిదారులు చూస్తే, పని దినాన్ని ఎంతో కొంత తగ్గించాలని కార్మికులు చూస్తారు. రక రకాల పరిస్తితుల వల్ల వచ్చే అనుభవాల్ని బట్టి, ముఖ్యంగా పెట్టుబడిదారీ యజమాని వర్గానికీ, కార్మిక వర్గానికీ జరిగే పోరాటాల బలాబలాల్ని బట్టి, పని దినం పొడవు ఏర్పడుతూ వుంటుంది.

8 గంటల పని దినం కోసం డిమాండ్ అనేది, కార్మిక వర్గం కొన్ని శతాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితమే. ఒకప్పటి 18 గంటల పని దినం, ఇప్పటికి 8 గంటల పని దినంగా మారడం అయితే గతిలేక జరిగింది గానీ, ఆ కాలం ఇప్పటికీ ఇంకా అనేక చోట్ల 8 గంటల కన్నా ఎక్కువ పొడవు గల పని దినాలే! 12 గంటల పని దినాలు కూడా, నడుస్తున్నాయి. ప్రభుత్వ చట్టాల్లో వున్న నిబంధనల్ని ఏ దేశ ప్రభుత్వమూ పాటించదు.
ప్రభుత్వం అంటే: ప్రభుత్వమే స్వయంగా పెట్టుబడిదారీ పద్ధతుల్లో పరిశ్రమల్ని నడుపుతుంది కాబట్టీ, ప్రభుత్వం అంటేనే, పెట్టుబడిదారీ వర్గ ఉమ్మడి వ్యవహారాలను చక్కదిద్దే కమిటీ కాబట్టీ, అది పై పై నాటకం కోసం చట్టాలలో మార్పులతో కొత్త చట్టాలు తయారు చేస్తుందేగానీ, ఆ కొత్త చట్టాల్ని పెట్టుబడి దారులందరూ పాటించాలని అది ఒత్తిడి చెయ్యదు. కార్మికుల పోరాట శక్తి తగ్గినప్పుడల్లా పని దినం మళ్ళీ పెరుగుతుంది.
నోయిడా కార్మికుల సమ్మె: ఇప్పుడు, ఢిల్లీ పక్కన ‘నోయిడా’ అనే పారిశ్రామిక వాడలో, వేలాది మంది కార్మికులు, ఇటీవల చేసిన సమ్మె పోరాటంలో, ‘పని దినం పొడుగుని తగ్గించాలన్నది’ ఒక ప్రధానమైన డిమాండు! ‘మేము 12 గంటలు పని చెయ్యలేము, చెయ్యము! పనిదినం 8 గంటలకు మించకూడదు’ అని వారు సమ్మెలు చేశారు. ఆ 8 గంటల పని దినం లోనే అదనపు విలువ వుంటుందని నోయిడా కార్మికులకు తెలీదు!
కార్మికుల చిట్టి పోరాటం, పని దినాన్ని 8 గంటలుగానే నిలుపుకోగలిగితే, కార్మికులు ఆ అల్ప సంతోషం దగ్గిరే ఆగి పోవచ్చా? అదా పోరాటానికి ముగింపు? పని దినం 8 గంటలే అయినా, అది తగ్గి 6 గంటలదే అయినా, అది కూడా ‘2 భాగాలుగా’నే వుంటుందనీ, ఆ పని దినమే అదనపు విలువని దోపిడీ దారులకు ఇస్తుందనీ, గ్రహించవద్దూ?

అసలు, ఎంతకాలం, ఎన్ని వందల సంవత్సరాలు ‘లాభాల’ మీద కోపాలు ప్రదర్శిస్తాం? ఆ లాభాలనే, ఆ దోపిడీనే నిర్మూలించడం ఎలాగో ఇప్పుడైనా కార్మికులు ఆలోచించాలి.
కార్మిక జనం అంతా, వాళ్ళ పోషణ కోసం వాళ్ళు శ్రమ చేసుకుంటారు. అంతేగానీ, ఇతరుల ‘అదనపు విలువ’తో, వాళ్ళ పోషణ జరగడం లేదు. అయితే, పరిశ్రమల యజమానులకు అలా ఎందుకు జరగాలి? వాళ్ళు మానవులు గారా? వాళ్ళ పోషణ కోసం వాళ్ళ పని దినంలోకి ఎందుకు దిగరు?
కార్మిక వర్గ సంపూర్ణ చైతన్యం! చివరికి తేలేది ఏమిటి? యజమాని వర్గం కూడా వాళ్ళ పోషణ కోసం వాళ్ళే శ్రమ చెయ్యాలి. అంటే, వాళ్ళు ‘పని దినం’ లోకి దిగి, సుత్తులు పట్టుకోవాలి! కార్మికుల పక్కనే నిలబడి పనిచెయ్యాలి! అందరూ శ్రమ చేసేవాళ్ళయితే, ఆ మానవుల్లో యజమానులూ కార్మికులూ అనే తేడాలు వుండవు.

అదే, కార్మిక వర్గ సంపూర్ణ చైతన్యం! దీనిని గ్రహించ వలిసింది, ఏ ఒక్క దేశపు కార్మికులో మాత్రమే కాదు. సమస్త దేశాల కార్మికులూ కూడా! అన్ని దేశాల కార్మికులూ, పనిదినం లో వున్న ఈ రహస్యాన్ని గ్రహించినప్పుడే, ‘మే’డేని అంతర్జాతీయ కార్మిక దినం గా, అనడానికి అర్ధం వుంటుంది. అందుకే మార్క్సూ ఎంగెల్సులు అన్నారు: ‘సకల దేశాల కార్మికులారా ఏకంకండి! పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప!’ ఎంత గొప్ప గ్రహింపు!

చివరి ప్రశ్న! పని దినాన్ని ఎంత తగ్గించినా అందులోనే అదనపు శ్రమ జరగడమే వుంటుంది కాబట్టి, అది ‘కార్మిక విముక్తి’ ఎలా అవుతుంది? శ్రమ దోపిడీయే జరగరాదంటే? యజమాని తనమే మాయం కావాలి! అంటే, మానవ సమాజం కోసం శ్రమ చెయ్యడం అంటే, మానవులంతా ఐకమత్యంగా అందరూ శ్రమలు చెయ్యడమే! యజమాని కూడా పనిలోకి దిగడమే! కార్మిక చైతన్యం ఆ దశకి చేరడమే!

(Author is renowned writer)

(Courtesy Andhra Prabha news daily)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here