కేంద్రంపై విమర్శలతో రేవంత్ దూకుడు?

0
90

మిగిలిన ముఖ్యమంత్రులతో ఇదీ పోలిక
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
విమర్శకైనా… పోరాటానికైనా సమ ఉజ్జీ కావాలి. లేదా సరైన అంశం ఉండాలి. దీనిని అందుకుంటే చాలు ఎంతటివారినైనా ఢీకొనే సత్తా దానంతట అదే సంప్రాప్తిస్తుంది.

ఇందుకు సరైన ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంపై ఆయన విరుచుకుపడడానికి చేతికి దొరికిన ఆయుధం పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశం. దీని కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో రేవంత్ తన మేధకు పదును పెట్టారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని ఎలుగెత్తి చెప్పారు. డీలిమిటేషన్ ముసుగులో దక్షిణ భారతావనికి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. దీనివల్ల ఉత్తర భారతంలో పార్లమెంటు సీట్లు పెరుగుతాయని, సౌత్ ఇండియాలో మార్పు ఉండదనీ వివరించారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

దక్షిణ భారత దేశంలో జనాభా పెరగకపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలో కుటుంబ నియంత్రణ పాటించడమన్నారు రేవంత్. ఉత్తర భారతంలో దీనిని అనుసరించకపోవడం వల్ల అక్కడ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిందన్నారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అది ఉత్తర భారతానికి మేలు చేకూరుస్తుందని చెప్పారు. అంటే దక్షిణ భారతానికి అన్యాయం చేసినట్టే అనేది రేవంత్ వాదన.

ఇవన్నీ పక్కన పెడితే, ఇలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎందరున్నారు? ఈ పోకడ ఎన్టీఆర్ సీఎం అయిన దగ్గర్నుంచి ప్రారంభమైంది. దీనికంటే ముందు తమిళనాట ఈ సంప్రదాయం ఉంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కేంద్రంపై విమర్శలకు తెగబడుతుంటారు. పర్యవసానాలు ఆలోచించకుండా నోరు పారేసుకుంటారు. అందులో మమతా బెనర్జీ, స్టాలిన్ ముందుంటారు.

వీరితో పోలిస్తే, రేవంత్ స్టైల్ వేరు. పద్ధతిగా విమర్శలు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న సందర్భంలో నోరు విప్పుతారు. అలాగని, అది శత్రుత్వంలా మార్చుకోరు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తారు. విమర్శలు విధానాల వరకే పరిమితం… రాష్ట్ర ప్రయోజనానికి వస్తే… అందరితో సామరస్యంగా ఉంటా అంటూ గతంలో ఒకసారి న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. ఇది చాలదా ఆయన విజన్ తెలియడానికి. రాష్ట్రానికి కావాల్సినవి సాధించడంలో ఆయన కేంద్రంతో రాజీ లేని ధోరణి అవలంబిస్తారు. నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తే విమర్శించడానికి వెనకడుగు వేయరు ఆయన.

రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి, పార్లమెంటు నియోజక వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అంశాలపై నిష్కర్షగా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో తన వైఖరిని మొహమాటం లేకుండా చెప్పిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కె.సి.ఆర్. అప్పుడప్పుడు కేంద్రానికి లొంగి ఉన్నట్టూ, సమర్ధిస్తున్నట్టూ కనిపించారు. కానీ ఆ తరవాత కేంద్రంతోనూ, మోడీతోనూ ఘర్షణాత్మక వైఖరిని అవలంబించారు. ఇక్కడ రేవంత్ రెడ్డికీ, కె.సి.ఆర్.కి ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. బి.ఆర్.ఎస్. కె.సి.ఆర్ సొంత పార్టీ. అందునా ప్రాంతీయ పార్టీనుంచి జాతీయ పార్టీగా రూపుదిద్దుకుంది. కానీ, వ్యక్తి ఆరాధన నుంచి బయటపడలేదు.

రేవంత్ ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, రాష్ట్ర ప్రయోజనం తో పాటు జాతీయ ప్రయోజనం ఆశించి మాట్లాడారని అనుకోవచ్చు. స్టాలిన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. కర్ణాటకలో ఎటూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇటీవలే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారమూ చేసి వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాధినేతతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించుకుంటే… రేవంత్ నిన్నటి ప్రెస్ మీట్ వ్యూహాత్మకమే అని చెప్పాలి.

సోనియా గాంధీ నాయ‌క‌త్వంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు తీసుకువ‌చ్చారు.. అప్పుడు రాజ్య‌స‌భ లో ఆమోదించారు..

బీజేపీ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే లోక్ స‌భ‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఆమోదం పొంద‌లేదు..

ఇంత కాలం మోదీ ఈ బిల్లును ప‌ట్టించుకోలేదు.

నియోజ‌క‌వ‌ర్గాల పునర్వ‌భ‌జ‌నను ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ పావుగా ప్ర‌మాద‌క‌రంగా వాడుకుంటున్నాడు..

ఇవీ రేవంత్ ప్రధాని మోడీపై చేసిన కొన్ని పదునైన విమర్శలు. ప్రస్తుత పరిస్థితులలో ఇలా విమర్శించగలగడం రేవంత్ రెడ్డికి మాత్రమే చెల్లింది. కాదంటారా?

ముగింపు: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత రేవంత్ రెడ్డి ఇలా అన్నారు… నాకు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోడీని పెద్దన్నగా భావిస్తా…. ఈ మాటలు అన్న రేవంత్ విమర్శల విషయంలో తగ్గకపోవడం ఆయన చిత్తశుద్ధిని తెలియచెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here