స్పోర్ట్స్ ఉన్నతికి సీఎం కిక్ స్టార్ట్

0
103

క్రీడారంగానికి రేవంత్ జవజీవాలు!
సాకర్ దిగ్గజం రాకతో అద్వితీయ స్థాయికి తెలంగాణ
క్రీడలలో పాల్గొని ఉత్సాహపరుస్తున్న సీఎం

(కృష్ణారావు చొప్పరపు )

తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలోనూ దూసుకుపోతోంది. క్రీడాప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచారు. ఆధునిక ఫుట్ బాల్ మాంత్రికుడు లయనల్ మెస్సీ.. హైదరాబాద్ రాకతో తెలంగాణ క్రీడాప్రతిష్ట ఎవరెస్టు ఎత్తుకు ఎగిసింది. తెలంగాణ క్రీడాదీప్తి విశ్వవ్యాపితమయ్యింది…..

దశాబ్దకాలం విరామం తరువాత తెలంగాణ క్రీడారంగం పురివిప్పిన మయూరంలా నాట్యం చేస్తోంది. పలు రకాల క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో మెరిసిమురిసిపోతున్నారు. గత రెండుసంవత్సరాల ప్రజాప్రభుత్వపాలనలో తెలంగాణ అంతర్జాతీయ క్రీడాకారులకు నెలవుగా మారింది.

భారత ఆధునిక క్రీడాకేంద్రాలలో ఒకటిగా తెలంగాణ తన ప్రత్యేకతను నిలుపుకోగలిగింది. ఇతర రంగాల సర్వతోముఖాభివృద్ధితో పాటు క్రీడారంగం ఉన్నతికోసం స్వతహాగా క్రీడలంటే ఎనలేని మక్కువ ప్రదర్శించే యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బహుముఖ వ్యూహాలతో కూడిన వినూత్న క్రీడావిధానంతో చర్యలు చేపట్టింది…

క్రికెట్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, చదరంగ క్రీడలకు చిరునామా…
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత వికాసంలో తెలంగాణ పలు విధాలుగా కీలకపాత్ర పోషిస్తోంది. ఆర్థిక, సాంకేతిక, ఐటీ, వైజ్ఞానిక రంగాలలో మాత్రమే కాదు..క్రీడారంగంలో సైతం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంటూ వస్తోంది. పటిష్టమైన క్రీడావ్యవస్థతో భారత క్రీడారంగానికే ఆయువుపట్టుగా నిలవాలని తహతహలాడుతోంది. ఖేలో ఇండియా గేమ్స్ తో పాటు అంతర్జాతీయ క్రీడలకూ ఆతిథ్యమివ్వటానికి సై అంటోంది.

ఘనమైన క్రీడావారసత్వం…..
తెలంగాణకు క్రీడలకూ విడదీయరాని అనుబంధమే ఉంది. తెలంగాణలేని భారత క్రీడారంగాన్ని వూహించడం అసాధ్యం. ఫుట్ బాల్, క్రికెట్, వాలీబాల్, హాకీ, షూటింగ్ , టెన్నిస్,బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం, క్యారమ్, అథ్లెటిక్స్ , జలక్రీడలు, అశ్వక్రీడలు, పర్వతారోహణ లాంటి సాహసక్రీడలు ..ఇలా ఏ క్రీడను చూసినా అందులో తెలంగాణ గడ్డ నుంచి వచ్చిన దిగ్గజ, ప్రముఖ క్రీడాకారుల కీలక పాత్ర ఉండి తీరుతుంది.

1950 దశకం నుంచి భారత క్రీడాభివృద్ధిలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి ఆధునిక తెలంగాణ గత ఏడున్నర దశాబ్దాలుగా ఘనవారసత్వం, చాంపియన్ క్రీడాకారుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ ఫుట్ బాల్ లో నాలుగో స్థానంలో నిలిచిన భారతజట్టు సభ్యుల్లో తొమ్మిదిమంది నాటి తెలంగాణ గడ్డ నుంచి వచ్చినవారే.

ఇక..ప్రస్తుతం మన దేశంలో అత్యధిక జనాదరణ పొందుతున్న క్రికెట్ తో మన హైదరాబాద్ కు గొప్పఅనుబంధమే ఉంది. భారత క్రికెట్ కు ఆయువుపట్టులాంటి కేంద్రాలలో తెలంగాణ కూడా ఒకటి. నాటి మన్సూర్ అలీఖాన్ పటౌడీ నుంచి నేటి మహ్మద్ సిరాజ్ వరకూ ఎందరో దిగ్గజ క్రికెటర్లు తెలంగాణ గడ్డ నుంచి వచ్చినవారే.

వాలీబాల్ లో అబ్దుల్ బాసిత్, బ్యాడ్మింటన్లో పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, షూటింగ్ లో గగన్ నారంగ్, టెన్నిస్ లో సానియా మీర్జా, హాకీలో ముకేశ్ కుమార్, చదరంగంలో గాలీబ్ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రీడాకారులు తెలంగాణకు వన్నె తెచ్చినవారే.

నేటితరంలోనూ….
ప్రస్తుత 20వ దశాబ్దకాలంలోనూ సుసంపన్నమైన తెలంగాణ క్రీడావారసత్వం కొనసాగుతూనే ఉంది. మేధో క్రీడ చదరంగంలో గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసీ, మహిళల, పురుషుల బాక్సింగ్ లో నిఖత్ జరీన్, హుసాముద్దీన్, క్రికెట్లో మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, త్రిష, అరుంధతీ రెడ్డి, టేబుల్ టెన్నిస్ లో శ్రీజ ఆకుల, షూటింగ్ లో ఈషా సింగ్, పారా ఒలింపిక్స్ మహిళల పరుగులో దీప్తి జివాంజీ, బ్యాడ్మింటన్లో పుల్లెల గాయత్రీ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయంగా ఇనుమడింప చేస్తున్నారు.

క్రీడల నిర్వహణలోనూ మేటి…
పలు రకాల జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమివ్వడంతో పాటు వేదికగా నిలిచిన ఘనత తెలంగాణకు ఉంది. 2002 జాతీయ క్రీడలు, ఆఫ్రో- ఆసియా క్రీడలు, ప్రపంచ మిలిటరీ క్రీడలు, ప్రపంచకప్, టెస్టు క్రికెట్, ఐపీఎల్, ప్రీమియర్ కబడ్డీ లీగ్, బ్యాడ్మింటన్ లీగ్, అంతర్జాతీయ తెరచాప పడవల పోటీలు, మ్యాచ్ ల ప్రధాన కేంద్రాలలో మన హైదరాబాద్ నగరం సైతం ఓ ప్రధాన వేదికగా ఉండటం తెలంగాణకే గర్వకారణం.

అత్యాధునిక క్రీడావేదికలు, గొప్పగొప్ప క్రీడాకారులు, ప్రతిభావంతులైన వందలాదిమంది గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు నెలవుగా ఉన్న తెలంగాణను తిరుగులేని క్రీడాశక్తిగా, ఒలింపిక్స్ పతకవిజేతల కేంద్రంగా తీర్చిదిద్దటానికి రేవంత్ నాయకత్వలోని రాష్ట్ర ప్రభుత్వం పంచముఖ క్రీడావిధానానికి రూపకల్పన చేసి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థికవ్యవస్థ విజన్ డాక్యుమెంట్ లో క్రీడారంగానికి సైతం అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. అందులో భాగంగానే తెలంగాణను భారత ప్రధాన క్రీడాకేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.

సాకర్ మాంత్రికుడు మెస్సీ రాకతో….
ప్రపంచ ఆధునిక ఫుట్ బాల్ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న అర్జంటీనా మాంత్రికుడు లయనెల్ మెస్సీ తన మూడురోజుల భారత పర్యటనలో భాగంగా
మన హైదరాబాద్ నగరంలో కొద్దిగంటలపాటు గడపడం, సాకర్ ప్రియుడు, ఫుట్ బాల్ క్రీడను విపరీతంగా అభిమానించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాకర్ విన్యాసాలు చేయటం తెలంగాణ క్రీడాచరిత్రలోనే ఓ అరుదైన, అపురూప ఘట్టంగా మిగిలిపోతుంది.
మెస్సీ హైదరాబాద్ లో గడిపిన ప్రతిక్షణమూ ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలలో ప్రత్యక్షప్రసారం కావడంతో హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి ఎవరెస్టు ఎత్తుకి చేరింది. మెస్సీ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా, పటిష్టభద్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన నిర్వహణ సత్తాను మరోసారి చాటుకోగలిగింది.

క్రీడాకారులకు కనీవిని ఎరుగని ప్రోత్సాహకాలు..
తమ అసమాన క్రీడాప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చిన మేటి క్రీడాకారులను ప్రోత్సాహక నగదు బహుమతులతో సత్కరించడంలో తెలంగాణ తరువాతే ఏదైనా. మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ లకు డీఎస్పీ ఉద్యోగాలతో పాటు ఇంటిస్థలం, భారీనగదు బహుమతితో ప్రోత్సహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకొంది. జూనియర్ మహిళా క్రికెటర్ త్రిష, పారా అథ్లెట్ జ్యోతీ జివాంజీలకు సైతం భారీమొత్తంలో నగదు బహుమతి, స్థాయికి తగిన ఉద్యోగాలతో చేయూత నిచ్చింది. అత్యాధునిక క్రీడాసౌకర్యాలు, శిక్షణ సదుపాయాల కల్పనతో పాటు పతకాలు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సాహక నగదు బహుమతులతో వెన్నుతట్టి ప్రోత్సహించడం ప్రభుత్వ తాజాక్రీడావిధానంలో ఓ ప్రధాన భాగంగా ఉంది.

తెలంగాణ ఆవిర్భావం మొదటి దశాబ్దకాలంలో దారితప్పిన తెలంగాణ క్రీడాప్రగతిని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం గత రెండేళ్లకాలంలో గాడిలో పెట్టడంలో సఫలం కాగలిగింది.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా పరిపూర్ణ వికాసం సాధించాలంటే మిగిలిన రంగాలతో పాటు క్రీడారంగానికి సైతం ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం క్రీడారంగాన్ని విస్మరించి మిగిలిన రంగాలలో సాధించిన అభివృద్ధి ఏమాత్రం సంపూర్ణ అభివృద్ధి కానేరదు.

(వ్యాస రచయిత ప్రముఖ క్రీడా విశ్లేషకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here