“హరహర మహాదేవ్’ అని మోడీ ఎందుకు అనరు”
(బాలినేని నాగభూషణరావు, సీనియర్ జర్నలిస్ట్)
మరో రెండు నెల్లలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం చూపిస్తున్న దూకుడుకి ప్రతిపక్ష పార్టీల్లో కలవరం మొదలయింది. అటు బిఆర్ఎస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటున్నారు.
ప్రత్యర్థుల ఇలాకాలోకి వెళ్లి మరీ సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి. దళితులను కించపర్చడంపైనా, తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఏ విధంగా బిఆర్ఎస్ నేతలు ఫామ్ హౌసులు, వందల ఎకరాలు సంపాదించింది ఆధారాలతో సహా ముఖ్యమంత్రి బయటపెడుతుండడంతో కెసిఆర్, కేటీర్, హరీష్ లతో సహా ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, “హరహర మహాదేవ్’ అని మోడీ ఎందుకు అనరు” అంటూ వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీని ఎంతగా కలవర పరిచాయి అంటే అప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హరహర మహాదేవ్ .. అన్న వీడియోలు సోషల్ మీడియాలోకి పోస్ట్ చేసి తమను తాము రక్షించుకునే పనిలో బీజేపీ నాయకత్వం జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రకటనలమీద ప్రకటనలు గుప్పించింది.
వాస్తవంగా మొన్నటి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకూ అధికార కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, కార్యకలాపాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అయిపోయిందని అధికారపార్టీకి చెందిన కొన్ని పెద్ద తలకాయలు ఎంతో సంతోషపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ కూడా ఇక తమకు తిరుగులేదని, తాము అధికారంలోకి రావడం ఖాయమన్న కలలో వూరేగింది. ఆ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో దాడి చేయడం ప్రారంభించింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడులు పెంచింది. వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిలో ఇక రోజులు మాత్రమే రేవంత్ రెడ్డి లెక్క పెట్టుకోవాల్సి వున్నదని అందరూ భావించారు. ప్రధాన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రేవంత్ పదవికి ముప్పు ఏర్పడిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికూడా ఇవన్నీ బాగా చిరాకు తెప్పించి ఉండవచ్చును. తాను నమ్మిన వారే తనను ముంచడానికి ప్రయత్నిస్తే తన పుట్టి మునిగి ప్రతిపక్షాలకు తాను ఒక ఆయుధంగా మారవచ్చునన్న ఆందోళన ఆయనలోనే ఏర్పడిన నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెట్టాలంటే తన పద్ధతిలో దూకుడ్ని ప్రదర్శించక తప్పదని ఒక స్థిర నిర్ణయానికి వచ్చి, ఆ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేయడం ప్రారంభించారు. అందుకు ఆయనకు కొన్ని అంశాలు కలిసిరావడంతో ప్రతిపక్షాలును ఆత్మ రక్షణలో పడేసేలా చేశాయి.
తన దూకుడులో భాగంగా తన సొంత పార్టీలో వారిని అదుపులో పెట్టడం. అందులో భాగంగానే తనపైనే విమర్శల దాడి చేసిన మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా వున్న జి చిన్నారెడ్డిని ఆ పదవులనుంచి తప్పించడం, ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అదుపు చేయడం ధ్వారా పార్టీలో తన పూర్తి స్థాయి పట్టును నిలబెట్టుకున్నారు. సురేఖ విషయంలో అంత కఠినంగా ముఖ్యమంత్రి ఉంటారని కాంగ్రెస్లోని వారెవ్వరూ ఊహించలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడంతో రేవంత్ తన మార్క్ రాజకీయాన్ని ప్రారంభించారు. పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టు సంపాదించిన ముఖ్యమంత్రి ఇక ప్రతిపక్షాలపై దృష్టిని సారించేరు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోలేదు.
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో తనను తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో వున్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావును కించపరుస్తూ దారుణంగా మాట్లాడిన బిఆర్ఎస్ నాయకుల తీరుపై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగేరు. అంతేగాక కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద దళితులు ధర్నా చేసి వెళ్లిన తర్వాత ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుభ్ర పరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, దళితులను దారుణంగా అవమానించడంపై క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కెసిఆర్, కేటీర్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ స్పీకర్కి మద్దతు అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఊహించని దెబ్బ తగిలినట్లయింది.
కెసిఆర్ అధికారంలో వున్నపుడు అయనతో పాటు అయన కుటుంబం, మంత్రి సహచరులు ధరణి పేరుతో పట్టా భూములను లాకోవడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం, ఫామ్ హౌస్ ల బండారమంతా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టం, కెసిఆర్ ఫామ్ హౌస్ భూములపైనా విచారణకు ఆదేశించడం బిఆర్ఎస్ నేతలకు దిమ్మ తిరిగిపోయింది. 22a భూముల విషయంలో, రైతులకు మద్దతుగా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇరుకున పెట్టి లబ్ది పొందాలని భావిస్తే, తమ వ్యూహం బెడిసి కొట్టడమే గాక తాము అందులో ఇరుకు పోవడం కెసిఆర్ కు మింగుడు పడని విషయం.
ఇక 2009 నుండి తిరుగులేని విధంగా గెలుస్తూ వస్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. అంతేగాక సిరిసిల్లలో మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తీరు, అక్కడ బహిరంగ సభలో కేటీర్ ఆస్తులు, హైటెక్ సిటీ వద్ద వున్న స్టార్ హోటల్స్ గురించి ప్రజలకు ముఖ్యమంత్రి వివరించిన విధాన్ని చూస్తే కేటీర్ కు చుక్కలు కన్పించేయి. తాను హోటల్ వ్యాపారం చేసుకుంటే తప్పేమిటి అంటూ కేటీర్ సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. అక్కడి ప్రజల్లో ఇదొక ప్రధాన ఆసక్తికర చర్చగా మారింది. కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వేల్, హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దపేటలోనూ పర్యటించి ప్రత్యర్థుల కోటలను బద్దలు కొట్టేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇది ట్రయిల్ మాత్రమేనని ఇంకా చాలా విషయాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించడం చూసి బిఆర్ఎస్ నేతల గుండెల గుభేలుమంటున్నాయి. తమ నాయకులు చిట్టా మొత్తం బయటపెడితే ప్రజల్లో తమ పార్టీ ప్రతిష్ట ఎంతగా దిగజారుతుందన్న భయం ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొంది.
ఇక రాష్ట్రంలోకి భారతీయ జనతా పార్టీ దూకుడికి కళ్లెం వేయాలంటే జాతీయస్థాయి నాయకత్వంపైనే దృష్టి పెట్టాలని భావించిన రేవంత్ ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. “మేము ద్రావిడులం. ఇక్కడి (ఉత్తర) ప్రజలు ఆర్యులు. మేము శివ భక్తులం. వారు శ్రీరామ భక్తులు. బీజేపీ రాముడిని తమ వైపునకు లాగేసుకుంది. ఇది ఒక భావోద్వేగం, ఒక సెంటిమెంట్. మోదీ గారు ‘హర్ హర్ మహాదేవ్’ అని ఎందుకు అనరు? బీజేపీ వారు ఎప్పుడైనా వేదికపై ‘హర్ హర్ మహాదేవ్’ అని అన్నారా? వారు కేవలం ‘జై శ్రీరామ్’ అని మాత్రమే అంటారు. మేము ‘హర్ హర్ మహాదేవ్’ అని అన్నప్పుడు వారికి అది నచ్చదు,” శివుడు పేదల దేవుడని, రాముడు ధనికుల దేవుడని, అలాగే బీజేపీ ధనికుల పార్టీ అని న్యూదిల్లీలోని ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ‘ది కాంక్లేవ్ 2026’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ నాయకత్వం ఆఘమేఘాలమీద దీనికి వివరణ ఇస్తూ మోడీ హరహర మహాదేవ్ అన్న వీడియోలను సోషల్ మీడియాలోకి విడుదలచేసి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించించి. రేవంత్ వ్యాఖ్యలు వెనుక వున్న ఆంతరార్ధం ఏమిటో బిజెపికి బోధపడినట్టు వున్నది. అందుకే అంతగా హడావుడి చేసింది.
నిజానికి “జై శ్రీరామ్” నినాదమే భారతీయ జనతాపార్టీ రాజకీయంగా ఎదగానికి కారణమయియింది. దీనిని ఎవరూ కాదనలేని నగ్నసత్యం. 1992 లో కేవలం రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే వున్న బీజేపీ ఎల్కే అద్వానీ నాయకత్వంలో అయోధ్య రామమందిరాన్ని తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుందన్న వాస్తవాన్ని మరువకూడదు. దేవుడ్ని రాజకీయంగా బీజేపీ ఉపయోగించుకున్నంతగా దేశంలో మరేపార్టీ ఉపయోగించుకోలేక పోయింది. జై శ్రీరామ్ పేరుని ఎంతగా బీజేపీ ప్రయోగించిన అస్త్రం అయినా ఉత్తర భారతదేశంలో విజయవంతమైంది కానీ దక్షిణ భారత దేశంలో పనిచేయలేదు. ఫలితంగా దక్షిణాదిన ఆ పార్టీకి పూర్తి స్థాయి ఆధిపత్యం దక్కడంలేదు.
అయితే బీజేపీ దేవుళ్ళ పేరు చెప్పి వ్యవస్థలను ఎంతగా దిగజార్చుతుందన్న అభిప్రాయం ప్రజల్లో లేకపోలేదు. వ్యవస్థలు గురించి చెబితే ఎవరూ పట్టించుకోరు. అదే దేవుళ్ళు గురించి చెబితే అది రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల కమిషన్ ప్రస్తుతం సర్ పేరుతో చేస్తున్న అరాచకమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే రేవంత్ రెడ్డి ఎంతో లోతుగా ఆలోచించే ఈ దేవుళ్ళ వ్యాఖ్యలు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ప్రస్తుతం న్యాయస్థానాలపై బీజేపీ ఏవిధంగా వత్తిడి తెస్తుంది, నీట్ పరీక్షల వైఫల్యం వల్ల విద్యార్థులు ఎంతగా నష్టపోయింది, ఎన్నిక కమిషనర్ జ్ఞానేశ కుమార్ ఎంతగా ప్రధానమంత్రి మోడీ, అమిత్ శాలకు లొంగిపోయి పనిచేస్తుంది… ఈ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపట్ల ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడదామన్నది మామూలు విషయం కాదు కదా మరి. అందుకే బీజేపీలో ఆ వ్యాఖ్యలవల్ల అంతగా అలజడి రేగింది.
మొత్తానికి తన సొంత పార్టీలోనే గాకుండా, ప్రతిపక్షాలలో ఆందోళన రేకెత్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దూకుడుతో వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు ఏవిధంగా నడిపిస్తారో చూడాలి మరి.

