వివాదాలతో స్వతంత్రత కోల్పోతున్న ఎన్నికల సంఘం!

0
56

(బాలినేని నాగభూషణరావు, సీనియర్ జర్నలిస్ట్)

సుప్రీం కోర్ట్ ఎటువంటి స్వతంత్ర కలిగి ఉంటుందో అటువంటి స్వతంత్రత కలిగి, దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ ఎన్నికల కమిషన్ (The Election Commission of India – ECI). కానీ 77 ఏళ్ళ ఎన్నికల కమిషన్ చరిత్రలో కొద్ది కాలం పాటు మినహా ఆ తర్వాత స్వతంత్రంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిన దాఖలాలు లేవు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ప్రధాన ఎన్నికల కమిషన్ నిర్ణయాలు వల్ల భారత ఎన్నికల సంఘం వివాదాస్పదంగా మారింది. తన స్వతంత్రతను కోల్పోయో పరిస్థితికి దిగజారింది. 2021 డిసెంబర్లో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పిలిచిందంటూ తన రాజ్యాంగ స్వతంత్రతను సైతం పక్కన పెట్టి ప్రధాన ఎన్నికల కమిషన్ వెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిని భట్టి చూస్తే ఈసీ స్వయంప్రతిపత్తిని తనకు తానే ఎంతగా దిగ జార్చుకుందో అర్ధమవుతోంది. ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఎన్నికల షెడ్యూలును నిర్ణయించే దుస్థితి ఏర్పడడం, ఓటర్ల వ్యవస్థ అవకతవకలకు ఎన్నికల సంఘమే కేంద్ర బిందువుగా మారడం వంటి కారణాలతో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఎంతగా అప్రతిష్ట పాలయ్యిందో అర్ధమవుతోంది. ఓట్లర్ల విశ్వాసమే ఎన్నికల సంఘానికి రక్ష. అటువంటిది వారి విశ్వాసాన్నే కోల్పోతుంటే ఇక ఎన్నికల సంఘానికి ప్రతిష్ట, స్వతంత్రత ఎక్కడ ఉంటుందన్నది అందరి ప్రశ్న?.

శేషన్… ఆయనొక సంచలనం!
ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వారిలో ప్రజల పక్షాన నిలిచి, తమకు రాజ్యాంగపరంగా కల్పించిన స్వేచ్ఛను ఉపయోగించుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న వారిలో ఒక్కరిద్దరు తప్ప ఇంకెవరు అంతగా ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనలేక పోయారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు టి.ఎన్.శేషన్ గా సుపరిచితుడైన తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్. ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ భారీ సంస్కరణలు కారణంగా దేశ ఎన్నికల వ్యవస్థనే మార్చేసింది. ఆయనొక సంచలనంగా మారేడు. ఎన్నికల సంఘం స్వతంత్రత, దానికున్న శక్తి సామర్ధ్యాలు ఏమిటో ప్రజలకు తెలియజేసిన ఘనత శేషన్ దే. ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు, సంస్కరణల వల్ల అప్పటి కేంద్ర ప్రభుత్వాలు మరియు రాజకీయ పార్టీలతో తీవ్రస్థాయిలో వివాదాలు ఎదురయ్యాయి. అయినప్పటికి శేషన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఎన్నికల్లో అక్రమాలు, బూత్ ఆక్రమించుకోవడం, ఓటర్ల గుర్తింపు కార్డులు సరిగ్గా పంపిణీ చేయలేదన్న కారణాలతో ఆయన అనేక నియోజకవర్గాల్లో ఎన్నికలను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరిగింది. దేశంలో ప్రతి ఓటరుకూ ఫోటో గుర్తింపు కార్డు (EPIC) ఉండాలని ఆయన పట్టుబట్టారు. “ఐడెంటిటీ కార్డులు పూర్తికాని పక్షంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరగనివ్వను” అని శేషన్ స్పష్టం చేయడం పెద్ద సంచలనం సృష్టించింది.

నిబంధనలను అతిక్రమించిన మంత్రులు, రాజకీయ నాయకులపై ఆయన నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులు అధికారంలో వున్న పార్టీలకు సహకరిస్తున్నారని భావించిన శేషన్ పారదర్శకమైన ఎన్నికల కోసం కేంద్ర పారామిలిటరీ బలగాలను భారీగా మెహరింప చేసి రాజకీయ పార్టీల గుండెల్లో కలవరం పుట్టించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ హక్కులను కాలరాస్తున్నారని శేషన్ పై కోర్టుకు వెళ్లినా అయన ఏమాత్రం అడుగు వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ముందకు వెళ్లారు.

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు, అధికార దుర్వినియోగం కాకుండా కఠినంగా ప్రవర్తించారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడానికూడా రాజకీయపార్టీలు భయపడిపోయాయి. ఆయన చర్యలతో భయపడిన రాజకీయ నాయకులు శేషన్‌ను పదవి నుంచి తొలగించాలని (Impeachment) తీవ్రంగా ప్రయత్నించినప్పటికే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అవినీతి రహిత ఎన్నికలు నిర్వహించడంలో శేషన్ కృతకృత్యులయ్యారు. ఈ వివాదాలన్నీ ఉన్నప్పటికీ, “ఎన్నికల కమిషన్ అనేది ప్రభుత్వానికి లొంగి ఉండే సంస్థ కాదు, అదొక స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ” అని దేశ ప్రజలకు స్పష్టంగా చూపించిన ఘనత టి.ఎన్. శేషన్‌కే దక్కుతుంది.

ముగ్గురు కమిషనర్లు …
జనవరి 25, 1950న భారత ఎన్నికల కమిషన్ (ECI) ప్రారంభమైంది. మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ గారు సుకుమార్ సేన్ నియమించబడ్డారు. అయన 1958 డిసెంబర్ వరకు కొనసాగారు. ఆతర్వాత 1990 వరకు పది మంది కమిషనర్లుగా వచ్చారు. 1990 నవంబర్ లో ఎన్నికల కమిషనర్ గా వున్న ఆర్ వి పేరిశాస్త్రి కాన్సర్ వ్యాధితో చనిపోవడంతో వి.ఎస్. రమాదేవి ని కమిషనర్గా నియమించారు. ఆమె తొలి మహిళా సీఈసీ. కానీ కేవలం 15 రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో కొనసాగేరు.
1990 డిసెంబర్లో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ కాబినెట్ సెక్రటరీ గా వున్న టి ఎన్ శేషన్ ను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమించారు. అయితే శేషన్ తీరుపట్ల రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తి తో ఉండడం, శేషన్ ఏకపక్షంగా, ఎవరికీ లొంగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించిన అప్పటి పి.వి. నరసింహారావు ప్రభుత్వం ఆయన అధికారాలకు చెక్ పెట్టడానికి 1993లో మరో ఇద్దర్ని ఎం.ఎస్. గిల్, జి.వి.జి. కృష్ణమూర్తి ఎన్నికల కమిషనర్లనుగా నియమించింది. దీనిని తన అధికారాలను తగ్గించే కుట్రగా భావించి శేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ బహుళ సభ్యుల రాజ్యాంగబద్ధ సంస్థ అని స్పష్టం చేస్తూ ప్రభుత్వం చేసిన నియమకాలను సమర్థించింది. అప్పటి నుండి ముగ్గురు సభ్యులు ఆమోదం మేరకు ఏ నిర్ణయమైనా ఎన్నికల కమిషన్ తీసుకునేది.

రాజకీయ వత్తిడులు – కమిషనర్ల మధ్య వివాదాలు:
1993 వరకు ఎన్నికల కమిషన్ ఒక్కరితోనే (సింగిల్ మెంబర్) కొనసాగేది, తర్వాత ఎన్నికల కమిషన్ అనేది బహుళ సభ్యుల కమిషన్‌గా మారినప్పటి నుండి, అధికారాల పంపిణీ, నిర్ణయాల ఏకగ్రీవం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సీఈసీకి, మిగిలిన ఇద్దరు కమిషనర్లకు మధ్య తరచూ విభేదాలు ఏర్పడి ఎన్నికల కమిషన్ ప్రతిష్ట దిగజారుతూ వస్తుంది. శేషన్ కు కొత్తగా నియమించిన ఎం.ఎస్. గిల్, జి.వి.జి. కృష్ణమూర్తి మధ్య విబేధాలు కొససాగేయి. కొత్త కమిషనర్లకు కార్యాలయ గదులు, వాహనాలు, సమాచారం ఇవ్వకుండా శేషన్ వారిని పక్కన పెట్టడం అప్పట్లో వివాదాస్పదమైంది.

2006 – 2009లో బి.బి. టాండోన్, ఎన్. గోపాలస్వామి వర్సెస్ నవీన్ చావ్లా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. నవీన్ చావ్లా ఎన్నికల కమిషనర్‌గా నియమితులైనప్పటి నుంచి వివాదం మొదలైంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అప్పటి సీఈసీ ఎన్. గోపాలస్వామి, మరో కమిషనర్ బి.బి. టాండోన్ ఆరోపించారు. 2009 లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు, సీఈసీ ఎన్. గోపాలస్వామి తన ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ నవీన్ చావ్లాను పదవి నుంచి తొలగించాలని (Dismiss) రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాజ్యాంగ చరిత్రలోనే ఇదొక సంచలనం. అయితే అప్పటి ప్రభుత్వం ఈ సిఫార్సును తిరస్కరించి, గోపాలస్వామి రిటైర్ అయ్యాక నవీన్ చావ్లానే సీఈసీగా నియమించింది.

2019 సాధారణ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, అమిత్ షా లతో సహా పలువురు నేతల ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వచ్చిన “ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct)” ఉల్లంఘన ఫిర్యాదుల విషయంలో సీఈసీ సునీల్ అరోరా మరియు కమిషనర్ అశోక్ లవాసాల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. మోదీ, అమిత్ షాలకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అశోక్ లవాసా తీవ్రంగా వ్యతిరేకించారు (Dissent vote). తన భిన్నాభిప్రాయాన్ని (Dissent Note) ఈసీ అధికారిక ఉత్తర్వుల్లో నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ఈసీ అంతర్గత సమావేశాలకు లవాసా హాజరుకాలేదు. అయన తన పదవీకాలం ముగియకుండానే రాజీనామా చేసి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) వైస్ ప్రెసిడెంట్‌గా వెళ్లిపోయారు.

ఇక 2021 డిసెంబర్లో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఎన్నికల సంస్కరణలపై చర్చించేందుకు నిర్వహించిన ఒక ఆన్‌లైన్ సమావేశానికి సీఈసీ సుశీల్ చంద్ర, కమిషనర్లు హాజరయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం పిలిచినంత మాత్రాన ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఈసీ అధికారులు వెళ్లడం ఏంటని కమిషనర్ రాజీవ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది ఈసీ స్వయంప్రతిపత్తిని దిగజార్చేలా ఉందనే విమర్శలు రావడం, కమిషన్ అంతర్గతంగా ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరగడం కలకలం రేపింది.

అలాగే 2024 లోక్ సభ ఎన్నికల కమిషనర్గా వున్న అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం కమిషన్లోనే అంతర్గత పరిస్థితులపై వివాదాస్పదంగా మారింది. సంస్థ స్వతంత్రతను కోల్పోయేవిధంగా అధికారంలో వున్న పార్టీకి అనుకూలంగా సీఈసీ వ్యవరించడంపై అయన అసంతృప్తితోనే రాజీనామా చేసిన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ప్రస్తుతం (2026) సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వర్సెస్ ఎస్.ఎస్. సంధూ, వివేక్ జోషి మధ్య విభేదాలు దేశవ్యాప్తగా తీవ్ర దుమారం రేగింది. ఆయనను అభిశంసించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అలాగే జ్ఞానేశ రాజీనామా చేయాలంటూ రాజకీయపార్టీలతోపాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జ్ఞానేశ తీరుపట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీలు సైతం అంసంతృప్తి వ్యక్తి చేశాయి.

ఈ సమస్యనుండి బయటపడేందుకు తమ మధ్య విభేదాలు లేవని ముగ్గురు ప్రకటించినప్పటికీ కొన్ని ప్రశ్నలకి మాత్రం సమాధానం లేదు. ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు.
ఫారం -6 మార్పుపైన, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పేర్లు తొలగింపు/పునరుద్ధరణపైనా ఎటువంటి వివరణ ఎన్నికల కమిషన్ ఇవ్వలేదు. ఓటర్ల డాటా నియంత్రణను ఒకేచోట కేంద్రికరించడంపైనా, తమ నిర్ణయాలను రికార్ట్ చేసేందుకు పోర్టల్ లో ఈఆర్వోలకు అవకాశం లేకపోవడంపైనా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, SIRకు సంబంధించిన అనేక అంశాలపై వున్న అభ్యతరాలు ఉండడంతో మొత్తం SIR ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా? లేదా అన్నమానాలు రాజకీయపార్టీల్లోనూ, ప్రజల్లో వున్నాయి. కానీ వాటికి సదనం లేదు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVM) లపై అనుమానాలు…
దేశంలో సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ పద్ధతి నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVM) వైపు మార్పు దశలవారీగా జరిగింది. దేశవ్యాప్తంగా పూర్తిగా ఈవీఎంలను ఉపయోగించడం 2004 లోక్‌సభ ఎన్నికల నుండి ప్రారంభమైంది. దేశంలోని మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బ్యాలెట్ పేపర్లను పూర్తిగా పక్కనబెట్టి కేవలం ఈవీఎంల ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మిషన్ల పనితీరుపట్ల ప్రజలకు వున్న అనేక అనుమానాలను ఎన్నికల కమిషన్ పూర్తిగా నివృత్తి చేయడంలేదు. 2024లో సుప్రీం కోర్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల సంధించిన తీర్పులో EVM వ్యవస్థను రద్దు చేయలేదు, అలాగే 100% వివిపాట్ కౌంటింగ్ చేయాలనికూడా ఆదేశించక పోవడం ప్రజల్లో వున్నసందేహాలు అలాగే ఉండిపోయాయి. హర్యానాలో 2024లో పోలింగ్ రోజు 61% అని చెప్పి, కౌంటింగ్ రోజు 68% అని ఎన్నికల సంఘం ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. “రాత్రికి రాత్రే ఓట్లు 7 శాతం ఓట్లు ఎలా పెరిగాయి? అన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం లేదు. అందుకే ఈవిఏంలపై ప్రజల్లో, రాజకీయ పార్టీల్లోకి నెలకొన్న సందేహాలు అలాగే ఉండిపోయాయి. “ఓటరు వేసిన ఓటు సరిగ్గా లెక్కించబడిందన్న” గట్టి విశ్వాసాన్ని ఓటర్లకు కల్పించడంలో సీఈసీ విఫలమైంది.

రాజకీయ పార్టీలలో చీలికలు
ఇక రాజకీయ పార్టీల్లో చీలికలపై ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు కూడా సీఈసీ పై ప్రజల్లో విశ్వాసం కోల్పోవడానికి మరొక ప్రధాన కారణం. రాజకీయ పార్టీలలో చీలికలు వచ్చినప్పుడు, ఏ వర్గం అసలైన పార్టీ అనే వివాదాన్ని పరిష్కరించే ఏకైక మరియు పూర్తి అధికారం భారత ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంటుంది.

పార్టీ గుర్తు, పేరు కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నప్పుడు, ఈసీఐ ప్రధానంగా ‘టెస్ట్ ఆఫ్ మెజారిటీ’ (Test of Majority) లేదా మెజారిటీ నిరూపణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. అయితే శివసేన (Shivsena), ఎన్సీపీ (NCP) మరియు ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ (TMC) వంటి పార్టీలలో చీలికలు వచ్చినప్పుడు హడావుడిగా ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు తీసుకున్నదన్న విమర్శలు వున్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమితాషాల వత్తిడి మేరకు, పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా తొందరపాటు ధోరణిలో ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ కుమార్ నిర్ణయం తీసుకున్నారన్న అపవాదు అయనపై ఏర్పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో పార్టీలను చెలిస్తుంటే దానికి జ్ఞానేశ వంతపాడుతున్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అంతేగాక సీఈసీ జ్ఞానేశ కుమార్ భారతీయ జనతాపార్టీకి అభ్యర్థులును చూసే బాధ్యతను కూడా నెత్తిన పెట్టుకున్నారన్న ప్రచారం బలంగా వున్నది. 2019 లోక సభ ఎన్నికల్లో బిజెపి తరపున తనను పోటీ చేయాలని జ్ఞానేశ కుమార్ సూచించారని కేరళం మాజీ సీఎస్ జి జి థామస్ చేసిన వ్యాఖ్యలు చూస్తే మోడీ, అమిత్ షాలు చెప్పిందే జ్ఞానేశ కుమార్ చేస్తారన్న దానికి మరింత బలం చేకూరినట్టయింది. ఈ కారణంగానే ఎన్నికల సంఘం స్వతంత్రత కోల్పోయి, తన ప్రతిష్టను దిగజార్చుకుంటుందన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here