అన్నమయ్య‌ అన్నది 1

0
144

(రోచిష్మాన్, 9444012279)

అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగుభాషకు సంబంధించినంత వఱకూ ప్రజలలో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.

అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా‌ సంవిధానం, ఏ‌ విధమైన చింతన, ఏ విధమైన‌ భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య.

అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!

అన్నమయ్యలోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!

ఆ అన్నమయ్య‌ అన్నది మనకై ఉన్నది… స్మరించుకుందాం రా రండి-

(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)

“విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా “

అన్నమయ్య వేంకటేశ్వరుడికి పాడిన మేలుకొలుపు ఈ సంకీర్తన. పై పాదాలు పల్లవి. విన్నపాలను వినడం కోసం వేంకటేశ్వరుణ్ణి లెమ్మంటున్నారు అన్నమయ్య.

ఒక్కొక్కరిదీ ఒక్కో విన్నపం. ఒకరి విన్నపాలు మఱొకరికి వింత వింతగా ఉంటాయి కదా? ‘పన్నగపు దోమ తెర’ అనడం మంచి భావన. శేషుని పడగే దోమతెర అయిందట. గొప్ప భావుకత ఇది. అన్నమయ్య కాలానికే దోమతెర వాడుకలో‌ ఉందని తెలియవస్తోంది.

“తెల్లవాఱె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదివో వారె
చల్లని తమ్మిరేకుల సారస్యపుఁ గన్నులు
మెల్ల మెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా”

అని మొదటి చరణంలో అన్నమయ్య పొద్దు పొడుపు సమయంలోని ప్రకృతి సన్నివేశాన్ని ఉల్లాలకు అల్లుకుపోయేట్టుగా చిత్రించారు. మూడవ పాదంలో ‘చల్లని తమ్మిరేకులు సారస్యపు కన్నులు’ అనడం ఎంతో బావుంది; ఎంతో మేలైంది. సారస్యపు కన్నులు అంటే ‘సరసత్వం ఉన్న కన్నులు’ అని మాత్రమే కాదు ‘సరసత్వపు కన్నులు’ అనీ మనం అవగతం చేసుకోవచ్చు. ‘సరసత్వపు కన్నులు’ ఒక గొప్ప కవి సమయం.

“గరుడ కిన్నెర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింత ఆలాపాల
పరిపరి విధముల బాడేరు రాగాల నిన్నదివో
సిరిమొగము దెఱచి చిత్తగించవేలయ్యా”

అని రెండో చరణంలో అంటున్నారు‌ అన్నమయ్య. ఇక్కడ గములై అంటే వచ్చిన వారై అని అర్థం.‌ గరుడ కిన్నెర యక్ష కామినులు వచ్చినవారై విరహపు గీతాలతో, వింత ఆలాపనలతో, రాగాలతో అదిగో నిన్ను రకరకాలుగా పాడారని వేంకటేశ్వరుడికి చెబుతున్నారు అన్నమయ్య. మేఘాలు, పిల్లగాలులూ. పరిమళాలు, వెలుగులు వీటికి గరుడ, కిన్నెర, యక్ష, కామినులను ప్రతీకలుగా అర్థం‌చేసుకోవచ్చు లేదా ఈ భావనలో ఎవరికి కావాల్సింది‌ వాళ్లు ఊహించుకోవచ్చు.

‘సిరి మొగము’ అనడమూ, ‘సిరి మొగము‌ తెఱచి‌‌‌’ అనడమూ చాల గొప్పగా‌ ఉన్నాయి.‌ కళ్లు‌ తెఱచి అని అంటారు మామూలుగా. మొగము తెఱచి అని అనడం విశేషంగా ఉంది. సిరి అంటే శోభ అని అర్థం.
వేంకటేశ్వరుడి మొహమే శోభ అనీ, శోభ వేంకటేశ్వరుడి మొహమై ఉంది అనీ, శోభాయమానమైన మొహం తెఱచి అనీ మనం‌ అనుకోవచ్చు లేదా అందుకోవచ్చు.

అంతర్జాతీయంగా గొప్ప కవులుగా చలామణిలో ఉన్న జలాలుద్దీన్ రూమీ, హాఫిజ్, ఖలీల్ జిబ్రాన్‌లలో ఈ‌‌ రచనా వైఖరి‌ కనిపిస్తుంది.

“పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజ భవాదులు నీ పాదాలు చేరి
అంకెల నున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుఁడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా”

అంటూ మూడో చరణంలో నారదుడు, బ్రహ్మ (పంకజ భవ), మొదలైన వాళ్లు నీ పాదాల చెంత చేరి సామీప్యం (అంకెల)లో ఉన్నారు అని వేంకటేశ్వరుడితో అన్నమయ్య చెబుతున్నారు. ఇతర దేవతలు పాదాల చెంత ఉన్నారు అని అన్నమయ్య చెప్పడం వేంకటేశ్వరుడు ఆ దేవతల కన్నా ఎంతో ఉన్నతమైనవాడని చెప్పకనే చెప్పడమే. అన్నమయ్య వేంకటేశ్వరుణ్ణి ‘పరమాత్మ’గా పరిగణించారు. ఇతర దేవతలందఱి కన్నా పరమాత్మ ఉన్నతుడు.

హృదయంగమంగా ఉన్నది ఇలా అన్నమయ్య‌ అన్నది.

(Author is a prominent columnist)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here