అన్నమయ్యకు అపచారం

0
118

ఆయన హరివాసం అని మాత్రమే రాశారు
అన్నమయ్య‌ అన్నది 2
(రోచిష్మాన్, 9444012279)

అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగుభాషకు సంబంధించినంత వఱకూ ప్రజలలో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.

అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా‌ సంవిధానం, ఏ‌ విధమైన చింతన, ఏ విధమైన‌ భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య.

అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!

అన్నమయ్యలోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!

అన్నమయ్య‌ అన్నది మనకై ఉన్నది… స్మరించుకుందాం రా రండి-

(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)

  • * *

“అదివో అల్లదివో హరి వాసము
పదివేలు శేషుల పడగలమయము”

అంటూ‌ అన్నమయ్య తిరుమల‌ను‌ వర్ణిస్తూ‌ ఒక సంకీర్తన‌ చేశారు. “పదివేలు శేషుల పడగలమయము” అనడం‌ చాల గొప్ప అభివ్యక్తి. ఒక చదువరి తన మానసిక స్థాయిని బట్టి ఈ‌‌ అభివ్యక్తిని‌ అర్థం చేసుకోవచ్చు. పాఠకులు తమ సామర్థ్యాన్ని బట్టి‌ అర్థం చేసుకోగలిగే అభివ్యక్తిని ఇవ్వడం ఒక‌ మహాకవి లక్షణం. ఆది‌శంకరాచార్య, కాళిదాసు, లావొచు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, హాఫిజ్ వంటి అంతర్జాతీయ కవులలో ఈ గుణం, ఈ తనం ఉంటాయి.

ఇక్కడ “హరి వాసము” అని అనే అన్నమయ్య అన్నారు. ‘శ్రీ‌ హరి వాసము’ అని కాదు. ఇలా అన్నమయ్య రాయని ‘శ్రీ’ ని కలిపి “అదివో అల్లదివో శ్రీ హరి వాసము” అనడం సరికాదు. అది అన్నమయ్యకు జరిగిన అపచారం. అన్నమయ్యది కాని దాన్ని అన్నమయ్య రచనలో కలపకూడదు. ఈ ‘శ్రీ’ లేకపోవడం వల్ల తాళం పరంగా రెండక్షరాల కాలం వ్యవధి ఉంటుంది. ఆ‌ వ్యవధి అన్నమయ్య ఇచ్చినదే. అది అలాగే ఉండాలి. దాన్ని ఇతరులు నింపకూడదు. అదివో లో‌ని ‘అ’కు హరి‌ వాసము లోని ‘హ’కు యతి‌.‌ ఆ హ-కు ముందు శ్రీ-చేరిస్తే యతి‌స్థానం తప్పుతుంది. రెండవ పాదంలో పదివేలు లోని‌ ‘ప’కు పడగలమయము లోని ‘ప’కు యతి. ఈ‌ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సంగీత, సాహిత్యాల పరంగా జరిగిన పొరపాటు ‘శ్రీ’ అక్షరాన్ని కలపడం. అదివో అల్లదివో అన్న ఆరంభాన్ని గానం పరంగా అతీతంగానో, అనాగతంగానో తీసుకుంటే హరి వాసము దగ్గఱ తాళం పరంగా ఇబ్బంది రాదు; ఉండదు. ఈ సంకీర్తనను అతీతంగానో, అనాగతంగానో ఆరంభించడమే అన్నమయ్య ఆకాంక్షించిన, ప్రతిపాదించిన, దర్శించిన సౌందర్యం. దాన్ని అర్థం చేసుకుందాం. ఆలోచనా రాహిత్యంతో ఆ సౌందర్యాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు.

అదివో అల్లదివో అన్న ఆరంభాన్ని తాళం ప్రకారం సమంలో తీసుకోవడంవల్ల హరి వాసము దగ్గఱ తాళం కొంత సమస్య ఔతుంది. అందుకే అక్కడ ‘శ్రీ’ని కలిపి కొందరు శ్రీహరి వాసము అని పాడడానికి అలవాటు పడి ఉంటారు. రాగి రేకులపై హరి వాసము అని మాత్రమే ఉన్నది. 1946 లో మద్రాసు ఆకాశవాణిలో ఈ సంకీర్తనను మల్లిక్ పాడారు. ఆయన ‘హరి వాసము’ అనే పాడారు.‌ ఇక్కడ ‘శ్రీ‌’ వర్జనీయం.

ఈ సంకీర్తనలో వస్తువు‌ తిరుమల‌. ఈ‌ సంకీర్తనలో తిరుపతి గుఱించి చెబుతూ అన్నమయ్య ప్రదర్శించిన పద పురోగతి చాల గొప్పది.

“అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిలమునులకు
నదె చూడుఁడదె మొక్కుఁడానందమయము”

అంటూ తొలి చరణాన్ని పలుకుతూ తిరుమల గురించి చెబుతున్నారు అన్నమయ్య.

“చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము”

అంటూ రెండో చరణాన్ని పలికారు అన్నమయ్య. ‘ముంగిట నల్లదివో మూలనున్న ధనము’ అనడం కడు గొప్ప అభివ్యక్తి. మూల అన్న పదానికి అగోచర లేదా కనిపించని స్థానం అని కూడా ఒక అర్థం ఉంది. పరమాత్మ స్థానం అగోచరమైంది కానీ అది (ముంగిట) ముందే లేదా ఎదురుగా ఉంది అని అన్నమయ్య తెలియజెబుతున్నారు. ‘ధనము’ పదానికి మూలద్రవ్యం అన్న అర్థం ఉంది. పరమాత్మ సకల సృష్టికీ మూలద్రవ్యం. ఆ ‘మూలద్రవ్యం మన ముందే వేంకటేశ్వరుడి రూపంలో ఉంది’ అని అన్నమయ్య హృదయం.

“కైవల్య పదము వేంకట నగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్లఁ బావనమయము”

అంటూ మూడో చరణాన్ని అందించారు అన్నమయ్య.

“బహు బ్రహ్మ‌మయము” అనడం‌‌ అన్నమయ్య మాత్రమే అనగలిగింది.”పావనములకెల్ల పావనమయము” అనడం‌‌‌ గొప్పకే గొప్ప‌! ఈ అభివ్యక్తి ఈనాడు మనం వింటున్న‌ “మంచికే మంచి” “అందానికే అందం” లాంటి‌ వ్యక్తీకరణలకు మూలమయింది లేదా ప్రేరణ అయింది.

ఇలా‌‌ మనకు ఆదర్శమై మనల్ని ముందుకు నడుపుతున్నది అన్నమయ్య అన్నది.
(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here