ఈనాడు-నేనూ-1
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
స్కైల్యాబ్ పడిపోతోందని చెప్పిన నాటి నుంచి ఈనాడుతో నాకు మానసిక అనుబంధం చిగురించింది. నాటి నుంచి అది ఆస్ట్రేలియా సముద్ర తీరంలో పతనమైందని వార్త ప్రచురితమయ్యేంత వరకూ ఒక్కరోజు కూడా విడవకుండా చదివేవాడిని. అప్పట్లో నేను పదో తరగతి చదువుతున్నాను. రాజమండ్రి దానవాయిపేట చిన్నగాంధీ బొమ్మ తరువాత సందులో ఎత్తరుగుల పెంకుటింట్లో అద్దెకుండేవాళ్ళం మేము. పేపరు కొని చదివే తాహతు లేదు అప్పట్లో. లైబ్రరీకి వెళ్ళో.. లేదా స్కూల్లో స్టాఫ్ రూములోనో ఈనాడును చేజిక్కించుకుని (ఇలా ఎందుకంటున్నానంటే.. ఆ రోజుల్లో అంతా గ్రంథాలయానికే వచ్చి చదువుకునేవారు) గబగబా స్కైల్యాబ్ వార్త ఎక్కడుందో వెతికి చదివేసేవాణ్ణి. అదే సమయంలో మా ఇంటికి కొంచెం ముందరగా హోతా శివరామకృష్ణ గారు అడ్వొకేట్ ఇల్లుండేది. అక్కడ శంకరాభరణం సినిమా షూటింగ్ చేశారు. వాళ్లు తెచ్చిన జనరేటర్ బండి దగ్గర నిలబడి కూడా వార్తను చదివిన రోజులున్నాయి. ఈనాడు యజమాని ఎవరు? ఈ వార్త ఎవరు రాశారు? ఎలా ప్రచురిస్తారు? అసలీ పేపరు ఎక్కడ ప్రింటవుతుంది? రాజమండ్రికి ఎలా చేరుతుంది? ఈ విషయాలేమీ అవసరం లేని మనసూ! వయసూనూ!! అది. ఇక్కడో విచిత్రం ఉందండోయ్!
స్కైల్యాబ్ పడిపోతే ఊళ్ళకు ఊళ్ళు నాశనమైపోతాయనీ, మాడి మసైపోతాయనీ కూడా ప్రచారంలో ఉండేది. అది విని ఆస్తులమ్మేసుకుని అనుభవించిన వాళ్ళూ ఉన్నారని ఆనోటా ఈ నోటా విన్నాను. కొంచెం బాధ వేసేది. ఎందుకిలాంటి వార్తలు వేస్తారు? స్కైలాబ్ పరిస్థితి వరకూ రాయచ్చుకదా! అనంతర పరిణామాల్ని వివరించి సామాన్యుల్ని ఎందుకు భీతిల్లచేస్తారనే ఆలోచనలూ నా మనసుని తొల్చకపోలేదు. అది మాఇంటిమీదనే పడుతుందేమోనని నిద్రపోని రోజులూ ఉన్నాయి. వార్తా రచన ఎంత వాస్తవంగా ఉండేదనేదానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఆ శైలి నచ్చింది. అప్పటి నుంచి ఈనాడుపై అభిమానం మెండయ్యింది. చదువు పూర్తయ్యేసరికి అది కొండంతయ్యి కూర్చుంది. ఎలాగైనా పేపర్లో పనిచేయాలనే కాంక్ష బలీయంగా నాటుకుంది. అప్పటినుంచే వార్త ఎలా రాయాలనే అంశాన్ని ఔపోసన పట్టాను.
మా నాన్నగారికి నన్ను డాక్టర్‌గా చూడాలని ఆశ. తాహతుకు మించినదైనా గుంటూరు రవి కళాశాలలో కోచింగ్‌కు పంపారు. ఎంసెట్లో మన ర్యాంకు ఎక్కడో ఉందనుకోండి. ఫలితంగా రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో బిఎస్‌సి చదివాను. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సహాధ్యాయి నాకు. చదువు పూర్తయిన తరవాత ఉద్యోగాన్వేషణ. చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను. కానీ పత్రికలో పనిచేయాలన్న ఆశ నాలో ఓ మూల దాగునే ఉంది. అదే సమయంలో రాజమండ్రి మునిసిపల్ కాలనీ ప్రాంతంలో మేము ఉంటున్న అద్దె ఇంటి ఎదురుగా గౌతమీ టైమ్స్ ప్రాంతీయ సాయంకాల పత్రిక ప్రారంభమైంది.
దిగవల్లి శివరామకుమార్ దానికి వ్యవస్థాపక సంపాదకుడు. ఖాళీగా ఇంట్లో ఉన్న నన్ను చూసి, పేపర్లో పనిచేస్తావా అని అడిగారు. ఇంకేముంది. నాలో తృష్ణ బయటకి లేచింది. వెంటనే అవునన్నాను. ఇతర పత్రికలు చూసి వార్తల్ని తిరగరాసిచ్చేవాణ్ణి. ఆ పత్రికకే సాదనాల వెంకటస్వామినాయుడు మినీ కవితలు రాసేవారు. ఇప్పుడు వాటినే నానీలు అంటున్నారు. చురకత్తుల్లా అవి సంబంధిత నాయకుడికి గుచ్చుకునేవి. వీటితో పాటు ప్రతిరోజు ఓ బ్యానర్. ఎవరో ఒక నాయకుణ్ణి టార్గెట్ చేస్తూ సాగేది. ఇది అందరికీ నచ్చదు కదా. ఓ రాత్రి బయటకు వెడుతున్న మాపై ఆరుగురి దాడి. నాకు ఓ వెన్నుమీద ఓ చిన్న పాటి కత్తిపోటు. కాళ్ళమీద హాకీ బ్యాట్ల దెబ్బలు. శివరామ్‌కుమార్‌ని మాత్రం బాగా కొట్టారు. రెండు చేతుల మీదా నరికారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మమ్మల్ని ఎందరో వచ్చి పరామర్శించారు. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. పత్రికలో చేరాం కాబట్టే కదా ఇంత పేరొచ్చిందనిపించింది. ఆ సమయంలో తెల్ల పంచె, చొక్కా ధరించి, తెల్లటి జుట్టుతోఉన్న ఓ పెద్దాయన కూడా ఆస్పత్రికి వచ్చారు.
ఆయన కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యంగారు. మా నాన్నగారికి సోదరుడి కుమారుడు. కొంత సేపైన తర్వాత బయటికి వెడుతూ నన్ను పిలిచారు. నీకు పత్రికలో ఉద్యోగం చేయాలనుంటే నా దగ్గరకి రా. నేర్పుతానని చెప్పి వెళ్ళారు. ఆయన ఆంధ్రప్రభకు ఎడిటర్‌గా పనిచేశారు. అప్పట్లో కోస్తావాణి అనే ప్రాంతీయ పత్రికకు రాజమండ్రిలో ఎడిటర్‌గా వచ్చారు. అక్కడ నా ఉద్యోగం సుబ్రహ్మణ్యంగారు రాసిన సంపాదకీయాలు దిద్దడం. అంటే ప్రూఫ్ రీడింగ్. సంపాదకీయం దిద్దడం అంటే ఆషామాషీ కాదు. ఆయన రాసే పదాలకు నిఘంటువుల్లో అర్థాలు వెతకాల్సి వచ్చేది. అలా భాషనేర్చుకున్నాను. ఎందుకో ఆ పత్రిక యజమానికి నాపై ఆగ్రహం కలిగింది. సుబ్రహ్మణ్యంగారు లేని ఓ రోజు చూసి, ఈ రోజు నుంచి ప్రకటనల సేకరణకి వెళ్ళమన్నారు. అది నచ్చలేదు నాకు. అదే విషయాన్ని ఎడిటర్ గారికి చెప్పి సెలవు తీసుకున్నాను.
(అక్కడినుంచి ఈనాడుకు చేరడానికి నాకు నాలుగేళ్ళు పట్టంది. ఎలా చేరానూ..అందుకేం చేశానూ.. అన్నది రేపు చదవండి)