కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారి ఓ మకుటాయమానమైన ఎడిటోరియల్ ఇది 1978 మార్చి 29న రాశారు. ఆ నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓబుల రెడ్డిగారు వెలువరించిన అభిప్రాయాలకు మద్దతుగా ఈ ఎడిటోరియల్ రాశారు. న్యాయవ్యవస్థలో లోపాలను ఎలా దిద్దుకోవాలి అనే దిశగా సూచనలు చేశారు. చదవండి మీకే అర్థమవుతుంది. నేటి మార్పులు ఆనాడు కూచిమంచి వారు చేసినవే అనేది ఈ ఎడిటోరియల్ చెప్పకనే చెబుతుంది.
ఎవరి తప్పు?
న్యాయ పరిష్కారం సకాలంలో జరగకపోతే అసలు న్యాయం జరగనట్లే. ఇందుకు ఎన్నయినా దృష్టాంతాలు చూపవచ్చు. ఏదో గారడీ చేసి ఒక పేదవాని పంట భూమిని ఒక మోతుబరి కబ్జా చేసుకుంటాడు. న్యాయం జరిపించండి మహా ప్రభూ అంటూ పేదవాడు కోర్టుకు వెడతాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తిఇక ఒక ఏడాదికి కన్నుమూస్తాడనగా కోర్టు తీర్పు వెలువడితే ఏమి లాభం? అంత వరకూ ఆ నిర్భాగ్యుడు అడుక్కుతినవలసిందేనా? మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ రకంగా రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు జరుపుకున్న కేసులు కోకొల్లలు. న్యాయానికి సంబంధించిన వ్యవహారాలలో జాప్యం విషతుల్యం అనే మాట నిజమే అయినా దీనితో మరొక న్యాయ సూత్రం కూడా ముడివడి ఉన్నది. ఏమిటది? కేసు పరిష్కారం కొంచెం ఆలస్యమైనా పరవాలేదు కానీ నిరపరాధికి శిక్ష పడకుండా చూడడం చాలా అవసరం. న్యాయ వ్యవస్థ ఔన్నత్యానికి ఇది గీటురాయి. ఈ లక్ష్యం దెబ్బతినకుండా ఉండాలంటే కేసులను సావధానంగా పరిశీలించాల్సి ఉంటుంది. తొందర పనికిరాదు. న్యాయమూర్తులుకూడా మానవ మాత్రులే. ఎంత సదుద్దేశంతో కేసులను పరిశీలించినా, అప్పడప్పుడు పొరపాట్లు జరగొచ్చు. అందుచేత, ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పై స్థాయిలో మరొకరు తిరిగి క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశం కల్పించడం అవసరం. అప్పీల్ చేసుకునే హక్కు కల్పించడానికి కారణం ఇదే. ఈ రెండు షరతులూ మంచివే. వాటిని అవశ్యం పాటించవలసిందే. వాటిని కాలదన్నడం వల్ల అత్యయిక పరిస్థితిలో ఎటువంటి దారుణాలు, వైపరీత్యాలు జరిగాయో అందరికీ తెలుసు. న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావుగారు చెప్పినట్లు అత్యయిక పరిస్థితిలో ఒక్క న్యాయ వవస్థకే గ్రహణ స్థితి వంటిది దాపురించింది. న్యాయం స్థంభించిపోయిందా అనిపించిన గడ్డుకాలమది. మామూలు పరిస్థితి నెలకొ్న ప్రస్తుత తరుణంలో పై రెండు సూత్రాలకూ భంగం కలుగని రీతిన కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానాలు, ప్రభుత్వం, న్యాయవాదులు ఎలా చర్యలు తీసుకోవాలన్నది ప్రశ్న. కోర్టులలో నానాటికీ కేసులు పెరిగిపోతున్నాయనేది నిర్వివాదాంశం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎస్. ఓబులరెడ్డి గారు సహితం అంగీకరించారు. అయితే ఈ స్థితికి బాధ్యులెవరు? న్యాయమూర్తులా? ప్రభుత్వమా? న్యాయవాదులా? కోర్టు పక్షులా? న్యాయమూర్తులకు న్యాయ దృష్టి మెండు. తమవాదనలను వినిపించడానికి అన్ని పక్షాలకూ తగినంత అవకాశం కల్పించి, వివిధ అంశాలనుఏ క్షుణ్ణంగా పరిశీలించి, తీర్పు చెప్పడం వృత్తిరీత్యా న్యాయమర్తుల ప్రధాన కర్తవ్యం. దీనివల్ల ఒక్కొక్కప్పుడు కొంచెం ఆలస్యం జరగవచ్చు.
కానీ న్యాయమూర్తులు కావాలని అదే పనిగా కేసులను అపరిష్కృతంగా ఉంచుతున్నారనడం గర్హనీయం. తగినన్ని కోర్టును ఏర్పాటుచేయకపోవడం వారి తప్పా? ఉన్న కోర్టుల ఖాళీలను భర్తీ చేయకుండా ఉండడం ఎందుకు జరిగింది? అందుకు బాధ్యులెవరు? టట్రిబ్యునల్స్‌కు సభ్యులను నియమించకపోవడం వల్ల ఈ సంస్కరణల అమలు దెబ్బతింటే అందుకు బాధ్యత వహించవలసింది ప్రభుత్వం కాదూ! గాలి వెలుతురు చొరని అద్దె కొంపల్లో కోర్టులను ఏర్పాటు చేస్తే నిర్వహణ సామర్థ్యం దెబ్బతినకుండా ఉంటుందా? ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఓబులరెడ్డి వేలెత్తి చూపిన ఈ విషయాలు నిజం కావని ప్రభుత్వం భావించగలదా? అయితే కేసుల పరిష్కారంలో జాప్యం జరగడానికి ఈ లోపాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. చట్టాలలో తికమకలు ఎక్కువ. రాజ్యాంగ అంశాలు కూడా జటిలం. విచారణ విధానం క్లిష్టాతిక్లిష్టం. వీటన్నింటిని సరళతరం చేస్తే తప్ప కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడం కష్టం. అప్పీళ్ళ సంఖ్యను తగ్గించడం సత్వర పరిష్కారానికి మార్గం. బీదసాదలకు ప్రభుత్వపరంగా తగిన చేయూత లభిస్తే తప్ప, న్యాయమనేదానికి అసలు అర్థమే ఉండదు. ఖర్చులను తట్టుకునే స్తోమతు లేక న్యాయం తమ పక్షాన ఉన్నా కేసులను విరమించుకున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. వారికి నిజంగా న్యాయం జరిగినట్లు భావించగలమా? అందుచేత బీదవారికి న్యాయ సహాయం అందజేసే పథకాన్ని మరింత విస్తృతస్థాయిలో అమలు పరచడం అవసరం. న్యాయ వ్యవస్థకు అవసరమైన సిబ్బందిని ఎంచుకునే అధికారం న్యాయశాస్త్రంలో నిష్ణాతులైన వారికి ఇవ్వడం మంచిదన్న సూచన కూడా ఎంతో విలువైనది. ఇందుకొరకు జ్యుడిషియల్ సర్వీస్ అనే పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం అభిలషణీయం. (బుధవారం, 1978 మార్చి 29) Andhraprabha