డింగరి మాటల పింగళి – 4
కథ, మాటలు, పాటలు – పింగళి నాగేంద్ర
గుణసుందరి కథ
వాహిని స్టూడియోస్ బ్యానర్ మీద విడుదలైంది.
మార్కస్ బార్ట్లే కెమెరా
కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకుడు
కె వి రెడ్డి దర్శకులు
(గుణసుందరి కథ సినిమాను అక్షరం అక్షరం వింటూ, అర్థం చేసుకుంటూ చూడాల్సిందే. అక్షరలక్షలు కాదు. అక్షరానంతలక్షలు అనాల్సిందే మరి.)
కథ
షేక్‌స్పియర్ రాసిన “కింగ్‌లీర్” ఆధారంగా రూపొందించిన కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక భార్య. ముగ్గురు పిల్లల్ని ప్రసవించగానే కన్నుమూసింది. ఆ ముగ్గురు ఆడపిల్లలకు తల్లితండ్రి తానే అయి పెంచాడు తండ్రి. వారికి రూప సుందరి, హేమ సుందరి, గుణసుందరి…. అని పేర్లు పెట్టాడు. బాల్యం నుంచి గుణసుందరి భగవంతుడిని ఆరాధించేది. తండ్రి అంటే అత్యంత ప్రీతి. ఇక ఇద్దరు అక్కలకు తండ్రి ఆస్తి మీదే ప్రేమ. అల్లుళ్లు అటువంటివారే. అరమతి, కాలమతి వారి పేర్లు. తండ్రి షష్టి పూర్తి సందర్భంగా మహారాజు ముగ్గురు కూతుళ్లను పిలిచి, తన గురించి చెప్పమంటాడు. పెద్ద కూతుళ్లిద్దరూ తండ్రే దైవం అని పలుకుతారు. కాని గుణసుందరి మాత్రం స్త్రీకి వివాహమయిన తరువాత భర్తనే దైవంగా భావించాలి అని వాస్తవాన్ని పలుకుతుంది. దానితో తండ్రి కోపోద్రిక్తుడై ఆమెకు సకల అవయవ దోషాలు ఉన్న దైవాధీనాన్ని ఇచ్చి పెళ్లిచేస్తాడు. ఒకనాడు మహారాజు మెట్ల మీద నుంచి పడిపోవటంతో, కాలు విరుగుతుంది. దైవాధీనాన్ని, గుణసుందరిని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఆమెను తీసుకుని వెళ్లి, ఇల్లు కట్టుకుని నివసిస్తుంటాడు దైవాధీనం. రాజుగారి వైద్యం కోసం మణి తీసుకురావలసి వస్తుంది. ఆ మణి దైవాధీనానికి దొరుకుతుంది. కాని షడ్రకులిద్దరూ దానిని దొంగిలించి తామే తెచ్చామని పలుకుతారు. చివరకు విషయం తెలుస్తుంది. గుణసుందరిని, మహాత్ముడైన దైవాధీనాన్ని అక్కున చేర్చుకుంటాడు రాజు. స్థూలంగా పరిశీలిస్తే ఇదీ కథ.
ఇక కథను, మాటలను మాటల డింగరి పింగళి నడిపిన తీరు సాక్షాత్తు సూర్యచంద్రులకే కాదు శుక్రాచార్యుడికి, బృహస్పతికి, వాక్కుల దేవత సరస్వతికి కూడా రాయనలవి కాదు.

మాటల డింగరి…
నిత్యం… ప్రతి నిత్యం.. కైలాసంలో ఆసనం మీద స్థిరపడీపడీ కాస్తంత విహారవినోదం కోసం ప్రయాణించ బయలుదేరారు భవుడు, భవాని.
పార్వతి, ‘నన్నే ప్రార్థిస్తున్నట్టున్నదే’ అనగానే పరమశివుడు, ‘నిన్ను కాక నన్ను ప్రార్థిస్తారా’ అని మనలాగే దెప్పాడు.
‘పరమేశ్వరికి కరుణ కలిగితే ప్రయాణం ఆగుతుందా.. ’ అనే పరమశివుని మాటలు మన మాటల్లాగానే లేవూ.
భూలోకంలో ఒక ఆడ కాంత తన పక్కనే ఉన్న ఎలుగుబంటిని చూసి రోదిస్తూంటే, చూసి ‘జంతువుకు మానవ కాంతకు దాంపత్యమా!’ అని శివపార్వతులే అచ్చెరువాశ్చర్యం ప్రకటించగానే పరమేశ్వరుడు…
గొంతు కంఠం సవరించుకుని కథాకథనం మొదలుప్రారంభం చేశాడు.
కళత్ర వియోగము చింతాహేతువు
‘‘మహారాజుకు పుత్ర సంతానము కలుగకపోవుటయు, కళత్ర వియోగము చింతాహేతువు’ అన్నాడు తీర్థులు. ఈ తీర్థులు ఎవరా అనుకోకూడదు. స్వయంగా మహారాజులుంగారి మంత్రులుంగారు. అనగనగా రాజుగారికి ముచ్చటగా ఉన్న ముగ్గురు కుమార్తెలకు ముచ్చటపడుతూ మహారాజు అలంకారాలు చేస్తుంటే, మంత్రి గారు విచ్చేశారు. ‘ఈ అలంకారం ఎవరు చేశారనుకుంటున్నావు’ అని రాజమంత్రితో పలుకుతుండగా, ‘మీరే చేసి ఉంటారు’ అని పలికిన రాజమంత్రి మాటలకు, ‘ సూక్ష్మబుద్ధులండీ మీరు.
‘పిల్లలకు అలంకారం చేయడమనేది ఓ గొప్ప శిల్పం అంటాను నేను’ అని; తల్లి లేని ముగ్గురు ఆడపిల్లల తండ్రి అంటున్నాడంటే, ఆ తండ్రికి పిల్లల అలంకారం మీద ఎంత శ్రద్ధ, ఎంత శౌరు.
అంతేనా… రాజ్యపరిపాలన చాలా సులువట. ‘ఒక్క అదుపుతో ఆజ్ఞతో అవలీలగా సాగిపోయేది’ రాజ్య పరిపాలనట. ఆ రోజుల్లో అంతేనేమో. మరి నేడో –
‘ఒక్క ఆజ్ఞతో కాదు, ఒక్క అజ్ఞానంతోనే సాగుతుంది’ అని పింగళి డింగరించేవారు.
మహారాజుని మారు కల్యాణం చేసుకోమంటే చాలు…
‘ఒక మాట, ఒక బాణం, ఒకే పత్నీవ్రతం గలవాడిని’ అంటాడు. ఒకే పత్నీవ్రతంట. మనకు ఏకపత్నీవ్రతం తెలుసు కదా. అదే సంకర సమాసంగా మారితే ఒకటే పత్నీవ్రతంగా మారురూపం ధరించనేవలయును. ఈ మాట రాముడు కూడా నేర్చుకోవాలేమో. ఏకపత్ని కాదు, ఒకే పత్ని అని.

అక్కడితే ఆగకుండా –
‘కుమారులేనా వంశానికి. కుమార్తెలు నా అంశలు కాదా, ఇక ముందు రాజ్యానికి కాబోయే రాణులు వీరే..’ అని సువర్ణకాంచనబంగారంలాంటి మాట రాజు నోట పలికించారు మన డింగరి పింగళి.
ఇంకా కొనసాగిస్తూ…
‘రాజ్యపాలన కంటె ఇదిగో ఈ తల్లి లేని పిల్లల పరిపాలన, పోషణ ఎంత కష్టం’ అంటూ పిల్లల పట్ల ఎక్కుటమిక్కుటంగా ఉన్న ప్రేమను చూపాడు రాజు.
షడ్జామడ్జ పద్యంలో పిల్లలు పలకలేకపోతుంటే…
తీర్థులు ఆ ఒత్తులు తీసేసి చెప్పలేవూ
‘కుమారులేనా వంశానికి కుమార్తెలు నా అంశలు కారా?’ అదీ తండ్రి పలకవలసిన అంబపలుకులు. ముగ్గురు కుమార్తెలు కూడా ఆ రాజు అంశే కదా. వారికి మాత్రం రాజసం, రాజఠీవీ, రాజ పౌరుషం, రాజ శౌరు ఉండవా. ఉంటాయి ఉంటాయి. ఉండనే ఉంటాయి. తప్పక ఉండకనే ఉంటాయి.
ఇక అమ్మాయీమణుల చదువులోకి పరవేశిద్దాం..
‘షడ్జామడ్జ…’ అంటూ తీర్థులు పిల్లలకు పద్యం చెబుతుంటాడు. కొంచెం కష్టమే ఆ ఒత్తులు పలకడాలు. అందుకే, ‘తీర్థులు… ఆ ఒత్తులు తీసేసి చెప్పలేరు’ అన్నాడు ఒత్తులు పలకలేని ఉత్తి మేనల్లుడు. ఈ తీర్థులేమిటో మరి. మరేం కాదు, సాధువు, పూజనీయుడూనూ. అంతటి మహానుభావుణ్ని తీర్థులే అనాలేమో మరి.

‘మేనల్లుళ్లు, ఇల్లరికపుటల్లుళ్లు… వాళ్లూ ఒక అల్లుళ్లేనా
పిల్లలు ఎలాగో మరి అలాగే చదువుతున్నారు. వారి పాఠాలు పూర్తవుతుండగా కానుకలే రానే వచ్చాయి. అవే ఉగాది కానుకలు.
‘పాఠాలు వచ్చినాయి… కానుకలు వచ్చినాయి’ అన్నాడు అమ్మాయీమణుల తండ్రులుంగారు. అదే మహారాజులుంగారు. ఈ మాట వింటుంటే పసుపుతాడు, మొలతాడు, పడతాడు గుర్తుకు రావట్లేదు.
పిల్లల చదువులు పూర్తయినాయి.
పిల్లలకు తగిన వరుల కోసం వెదకాలిగా మరి.
పెద్ద పిల్లలిద్దరికీ ఉన్నారుగా మేనల్లుళ్లు.. అంటూ
అల్లుళ్లను పరిచయం చేస్తూ, ‘అరమతి మహారాజు, కాలమతి మహారాజు…’ అన్నారు రాజులుంగారు.
‘మేనల్లుళ్లు, ఇల్లరికపుటల్లుళ్లు… వాళ్లూ ఒక అల్లుళ్లేనా… ప్రభూ గౌరవం ఉండదు…’ ఠక్కున అనేశాడు మంత్రి.
రాజులుంగారేమైనా తక్కువా…
‘ఎందుకుండదు. నన్ను బట్టి నా అల్లుళ్లు…’ అని తన దర్పాన్ని చక్కగా ముందుపెట్టేశారు.
తీర్థులు మాత్రం కుమారుడు ఉండాలనే మంచి గొప్ప సదాలోచనతో, ‘వంశం నిలబడి, రాజ్యాన్ని నిలబెట్టడానికి.. ’ అంటూండగానే.. రాజులుంగారు..
‘ఒక మాట, ఒక బాణం, ఒకే పత్నీవ్రతం మాది’ అనేశాడు.
ఇక చేసేదేముంది.
తీర్థులు మంచితీర్థం పుచ్చుకుని మౌనవ్రతం పాటించితీరనూవలసిందే.
రాజులుంగారి సమీపానికి ప్రవేశిస్తూన్న సదరు అల్లుళ్లుంగార్లకు…
జగదేకవీర, ఆగ్రహానుగ్రహæసమగ్ర మహోగ్ర ప్రతాప
శ్రీశ్రీఉగ్రసేనమహారాజుల వారిప్రియభాజనేయులు
శ్రీ అరమతి మహారాజులు, శ్రీ కాలమతి మహారాజులు…’ అంటూ అల్లుళ్లుంగార్లకు స్వాగతం పలికారు భటులు.
నమస్కారం మావయ్యా అని అరమతి అంటే
సాష్టాంగ నమస్కారం మామయ్య మహారాజా అంటూ మరో పలికాడు కాలమతి.
మావయ్యా లేదా మహారాజా అంటే సరిపోదూ.

పోదు… పోనే పోదు…
అలా పోతే మన డింగరి ఎందుకు.
అందుకే మామయ్య మహారాజా అని వినిపించారు.
ఇక ఇద్దరూ దండకాలు చదువుతుంటే…
‘దండకంలో కూడా పోటీ పడుతున్నారోయ్… బుద్ధిమంతులోయ్… అని మురిసిపోయారు మహారాజులుంగారు.
ఆ ఆనందమరందంలో ‘వినయానికి వన్నె దిద్దారు. బాగా చదువుకున్నారుగా…’ అన్నారు. వినయానికి వన్నె తేవడమేమిటో. బంగారానికి కదా వన్నె తెచ్చేది. మరి మహారాజులుంగారికి అల్లుళ్లంటే బంగారమే కదా. అందుకే వినయానికి వన్నె తీసుకువచ్చారు.
అల్లుళ్లు ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. అందుకే –
‘నువ్వు రాసిన ఉత్తరం అందరికీ నేను చదివి వినిపించాను’ అని అరమతి.. ‘నేను తాత్పర్యం చెప్పాను మావయ్యా’ అని కాలమతి వారి చదువుకు వన్నెలు అద్దారు. ఉత్తరానికి తాత్పర్యం చెప్పడమేమిటో.
ప్రశ్నించకూడదు. వినాలి అంతే.
లేకపోతేనా…
పింగళి డింగరి దగ్గరా మన ప్రేలాపనలు.
రాజకూతుళ్లతో వివాహం కుదిరింది కనుక, ఇంక బావామరదళ్ల సరసాలు ఉండాలి కదా. ఉండాలి. ఉండనే తీరాలి. ఉండనేవలసింది. అందుకే –
‘జాణలంటే జాణలా మేనమామ కూతురా’ అంటూ రాజకూతుళ్లతో అరమతి కాలమతి మేలము, పరిహాసము ఆడనే ఆడారు.
ఏముంది…
రోజుల్లు ఇట్టే.. ఇట్టే అంటే ఇట్టే గడిచిపోయాయి.
రాజులుంగారికి అరవై వసంతాల షష్టిపూర్తి రానే వచ్చేసింది. మరి అల్లుళ్లు ఏవో ఒక బహుమతులు ఇవ్వాలిగా. వారికి సామాన్యమైన తెలివితేటలు లేవు. అతి తెలివితేటలు ఉన్నాయి. అందుకే రాజుగారికి వేయడానికి సిద్ధంగా ఉన్న ఆభరణాలు, వారు కానుకలు తెచ్చినట్లుగా బహుచక్కగా నటించారు. ‘బావలు గండ పెండేరం, వీరకంకణం సొంతంగా వేద్దామనుకున్నారు నాన్నా’ అంటూ పెద్దకూతురు చక్కగా వంత పాడింది.
మహాసంబరంగా రాజులుంగారు, ‘ఇవాళ ఎంతో ప్రసన్నంగా ఉందామనుకుంటున్నాను. మీరు కూడా కనిపెట్టి ఉండండే’ అన్నాడు కూతుళ్లతో.
ఆయన ప్రసన్నంగా ఉండాలంటే వీరు కనిపెట్టి ఉండడమేమిటో.
కృష్ణారెడ్డిగారు చెప్పినట్లు ఏమిటో???

‘ఒక మాట, ఒక బాణం, ఒకే పత్నీవ్రతం మాది’
పదహారేండ్ల అనంతరం సభకు వచ్చి, సగర్వంగా ప్రజలకు దర్శనమిస్తూ… ‘నాకు, నా రాజ్యానికి శోభస్కరంగా మూడు రత్నాలను సాధించాను’ అంటూ తన కూతుర్లను చూపిస్తూ… ‘రూపసుందరీ దేవి, హేమసుందరీ దేవి, గుణసుందరీ దేవి..’ అనగానే..
ఒక పండితుడు –
‘అమ్మాయీమణుల పరిపాలన బహు మధురతరంగా ఉంటుంది ప్రభూ’ అంటూ భజన చేయనేచేశాడు.
‘ఇటువంటి తల్లుల ప్రభుత్వంలో ప్రజలు మాతృప్రేమను అనుభవిస్తారు’ అన్నాడు ఒక సామంతుడు… తియ్యకమ్మటి మధుర పలుకులు ఉచ్చరించతూ…
‘మీకు ఈ సభా హృదయంలో నేను చేసే యువరాణి పట్టాభిషేకం అమ్మా ఇది’ అని మృదువుగా వక్కాణించి, తండ్రి ప్రేమ గురించి చెప్పమనగానే…
రూపాదేవి… ‘‘నాకు ‘నాన్న’ అనే మాటలో ‘నా’ అనే అక్షరమే తప్పితే ‘నా’ అనేది ఏదీ లేదు.. అని ఎంతో ప్రేమను మరింత నటన జోడించి కురిపించనే కురిపించింది.

‘స్వయం వరం పెళ్లికొడుకుల్రోయ్’
‘అమ్మాయీ మణి వారు మూడు ముక్కల్లో ముక్కోటి గ్రంథం చెప్పారు… అని పండితులుంవారు పలుకగానే…
‘మా చిన్నమ్మాయి ఒక్కముక్కలో శతకోటి గ్రంథం చెబుతుంది…’ అన్నాడు తండ్రి గుణసుందరి గురించి.
ఈ ఒక్కమాటకు ఈ డింగరికిఅక్షర లక్షలు ఇవ్వనేవలయును. శతకోటి గ్రంథమేమిటో అనరాదు. అది పింగళి శాసనము. ఆయన మాటే శాసనం.
తండ్రి ప్రేమను కాకుండా పతి భక్తి గురించి వక్కాణించిన మూడవ అమ్మాయీమణిగారి మీద మిక్కిలి కోపముతో.. ‘ఎంతో గారాబంతో పాలు పోసి పెంచాను. ఎంత విషం కక్కుతున్నదో చూడండి…’ అన్నాడు. పిల్లలేమైనా పాములా, పాలు పోసి పెంచడానికి. పిల్లలకు పాలిచ్చి పెంచుతారు. పాములకు పాలు పోసి పెంచుతారు. మరి రాజుగారికి కోపం వస్తే. మాటలు ఇలాగే వస్తాయి.
ఎంత విషం కక్కుతోందో అని.
రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా. అందునా తన మీద ప్రేమ లేదన్న అమ్మాయీమణి మీద కోపం ద్విగుణః, త్రిగుణం, చతుర్గుణం. అందుకే మూడవ అల్లునిగా.. ‘సర్వ అవలక్షణాల అష్టావక్రులను తీసుకునిరా..’ అని శాసించాడు..
దేశంలోని అష్టావక్రులు, నవావక్రులు, దశావక్రులు రానే వచ్చారు.
‘స్వయం వరం పెళ్లికొడుకుల్రోయ్’ అని మేలమాడారు మేనల్లుళ్లు.
ఇక గుణసుందరీదేవి పతివ్రత లక్షణాలు పలుకుతుంటే…
‘పెళ్లయినా కాలేదు,. సతివ్రతోత్సాహంతో చెలరేగుతున్నావు…’ అని కొత్త వ్రతాన్ని పలికించారు మన డింగరి.
పుత్రోత్సాహం తెలుసు కాని, ఈ పతివ్రతోత్సాహం ఏమిటో.
ఏమిటో ఏ మాయ అని ఈ డింగరి గురించి ఒక గీతం పాడనేవలయును.
(తరువాయి భాగం వచ్చేవారం)

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)