అన్నమయ్య అన్నది-13
(రోచిష్మాన్, 9444012279)
“నేనేమిఁ జేయఁగలేను నీవు పరిపూర్ణుఁడవు
హీనుఁడ నే నధికుఁడ వన్నిటా నీవు”
అంటూ భక్తితో అన్నమయ్య భగవంతుడు ఎవరో, భక్తుడు ఎవరో, భక్తుడికి భగవంతుడు ఏమౌతాడో, భగవంతుడు భక్తుడికి ఏం చేయ్యాలో అన్నవాటిని ఆలపిస్తూ ఈ సంకీర్తన చేశారు.
“పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను” అని ఒక సంకీర్తనలోనూ, “దీనుఁడ నేను దేవుఁడవు నీవు” అని ఒక సంకీర్తనలోనూ అన్న అన్నమయ్య ఈ సంకీర్తనలో భగవంతుణ్ణి “పరిపూర్ణుడవు” అంటున్నారు.
“ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే/ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”. ఇది ఈశ, బృహదారణ్యక ఉపనిషత్తులకు శాంతి మంత్రం. భగవంతుడు పూర్ణమైనవాడు; ఈ ప్రపంచం పూర్ణమైనది; పూర్ణమైన భగవంతుడి నుంచే పూర్ణమైన ప్రపంచం పుట్టింది; పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసిన తరువాత కూడా పూర్ణమే అవశేషంగా ఉంది అని ఆ మంత్రానికి అర్థం. ఆ మంత్రార్థాన్ని అన్నమయ్య ఈ సంకీర్తనలో నెమరేసుకున్నారు.
చైనీస్ కవి, తాత్త్వికుడు లావ్ – చు. ఆయన 81 కవితల సంకలనం టావ్ – ట – చింగ్. అది టావ్ (TAO) మతానికి మూలం అయింది. టావ్ – ట – చింగ్ 41వ కవితలో “నిజమైన సంపూర్ణత్వం శూన్యంగా కనిపిస్తుంది. అయినా అది సంపూర్ణంగా ఉంటుంది” అని అన్నారు లావ్ – చు. ‘భగవంతుడు సంపూర్ణుడు’… ఇది విశ్వవ్యాప్తమైన సత్యం.
హీనుణ్ణి నేను, పరిపూర్ణుడివి నువ్వు అని భగవంతుణ్ణి అన్నాక అన్నమయ్య కొనసాగుతున్నారు…
“దండము పెట్టుట నాది తప్పు లోగొనుట నీది
నిండి నీ వెపుడూ దయానిధివి గాన
అండఁ జేరుకొంట నాది అందుకు నూఁకొంట నీది
దండియైన దేవ దేవోత్తముఁడవు గాన”
దణ్ణం పెట్టడం నా వంతు, నా తప్పుల్ని నీలోకి తీసుకోవడం నీ వంతు ఎందుకంటే నిండుగా ఉండే నువ్వు ఎప్పుడూ దయానిధివి కనుక. నీ దగ్గఱికి చేరడం నా వంతు, అందుకు ఒప్పుకోవడం నీ వంతు ఎందుకంటే నువ్వు ప్రతాపవంతుడివైన దేవ దేవోత్తముడివి కనుక.
“శరణు చొచ్చుట నాది సరుగఁ గాచుట నీది
పరమ పురుష శ్రీపతివి నీవు
విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది
పొరి నీవు భక్త సులభుఁడవటు గాన”
శరణు అని రావడం నా వంతు, రక్షించడం నీ వంతు ఎందుకంటే నువ్వు పరమ పురుషడవైన శ్రీపతివి కనుక. పువ్వులు చల్లడం నా వంతు, ఎన్నో సంపదల్నివ్వడం నీ వంతు ఎందుకంటే నువ్వు భక్త సులభుడివి కనుక.
“దాసుఁడ ననుట నాది తప్పక యేలుట నీది
ఆసఁ దీఱ్చే వరదుఁడు వటుగాన
నీ సేవ యొక్కటి నాది నిచ్చలుఁ గై కొంట నీది
ఈసు లేని శ్రీ వేంకటేశుఁడవు గాన”
దాసుణ్ణి అనడం నా వంతు తప్పకుండా ఏలుకోవడం నీ వంతు ఎందుకంటే ఆశను తీఱ్చగలిగే వరమిచ్చే వాడివి కనుక. నీ సేవ ఒక్కటే నా వంతు నిత్యమూ నన్ను తీసుకోవడం నీ వంతు ఎందుకంటే ఈర్ష్య లేని శ్రీవేంకటేశ్వరుడివి కనుక.
ఈ సంకీర్తన మొదటి చరణంలో ‘నిండుగా ఉండే నువ్వు’ అని అన్నమయ్య చెప్పింది చదివాక “అందు నిందు నుండు నఖలుండుఁ జూడఁగా / నెందుఁ దానె నిండి యెఱుఁగు చుండు / నతని పూజ ఫలము నందుటే ముక్తిరా / విశ్వదాభిరామ వినుర వేమ” అని వేమన చెప్పినది గుర్తుకు వస్తోంది. భగవంతుడు నిండైన వాడు, పరిపూర్ణమైన వాడు అన్న భావన సార్వకాలికమైనది.
అన్నమయ్య ఈ సంకీర్తనలో ఎంత గొప్ప రచనా సంవిధానాన్ని ప్రదర్శించారో గమనిద్దాం. భక్తుడికి, భగవంతుడికి ఉండాల్సిన సత్సంబంధాన్ని వివృతం చేస్తూ “ఇది నా వంతు; అది నీ వంతు” అంటూ అలా ఎందుకు అన్న ప్రశ్నకు బదులును ఇస్తూ అద్భుతమైన శిల్పంతో సాగిన రచన ఈ సంకీర్తన. అచ్చమైన భక్తి భావంతో స్వచ్ఛమైన భావనల విరచన ఈ సంకీర్తన.
“అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః”. ఇది నారద భక్తి సూత్రాలలో మొదటి సూత్రం. శుభం కాబట్టి భక్తి గుఱించి వివరిస్తున్నాను అని ఈ సూత్రానికి అర్థం.
భక్తి శుభాన్నిస్తుంది… అదెలా? దానికి సమాధానాన్ని భగవద్గీత ( 9వ అధ్యాయం 31వ శ్లోకం) ఇలా తెలియజేస్తోంది… “క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి/ కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి” అంటే త్వరితగతిన ధర్మాత్ముడుగా అవుతున్నాడు, శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు ఓ కుంతీపుత్రా, నా భక్తుడు నశించడని నీకు నువ్వుగా తెలుసుకో అని అర్థం. ఇక్కడ చెప్పబడ్డట్టుగా త్వరితగతిన ధర్మాతుడవడమూ, శాశ్వతమైన శాంతిని పొందడమూ భక్తుడికి శుభం కదా? అవును శుభమే; శుభాతిశుభమే.
భగవద్గీత (అధ్యాయం 9 శ్లోకం 29 పాదం 2)లో “యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చావ్యహం” అని చెప్పబడ్డది. అంటే ఎవరు నన్ను భక్తితో భజిస్తూంటారో వాళ్లు నా దగ్గఱుంటారు నేను కూడా వాళ్లతో ఉంటాను అని అర్థం. ఆ స్థితి కోసం అన్నమయ్య ఈ సంకీర్తనను ఆలపించారు. భక్తితో భక్తుడు, భగవంతుడు వీళ్లిద్దఱి సంబంధాన్ని చెబుతూ ఒక విశేషమైన సంకీర్తనగా మనతో ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)