‘కర్ణాటక సంగీతం సంగతి’ మంగళంపల్లి

0
198

ఇవాళ బాలమురళీకృష్ణ జయంతి.
(రోచిష్మాన్, 9444012279)

కర్ణాటక సంగీత వైతాళికుడు బాలమురళీకృష్ణ.
1910 తరువాత కర్ణాటక సంగీతం‌ వికలమైపోయి జనాదరణకు దూరమైపోయింది. ఆ తరుణంలో దాన్ని బతికించి, జనాళి ఆమోదాన్ని , ఆదరణను పొందేట్టు చేసిన మేధావంతమైన కళాకారులు మహారాజపురం విశ్వనాద(థ) అయ్యర్, చెంబై వైద్దియనాద(థ)బాగవదర్ (భాగవతార్), జీ.ఎన్.‌బాలసుబ్రహ్మణియన్,‌ అరియక్కుడి రామానుజ అయ్యంగార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్. ఈ ఐదుగురూ తమ మేధతో, గాన ప్రతిభతో కర్ణాటక సంగీతానికి విభవాన్ని తీసుకు వచ్చారు.

అటు తరువాత బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీతానికి పెను ఊపును తీసుకు వచ్చారు. కర్ణాటక సంగీతంలో ఒక ఉద్ధృతి, ఒక వెల్లువ బాలమురళీకృష్ణ.

ఒక దశలో బాలమురళి పాడేది సంగీతం కాదని మద్రాస్ కోర్ట్ లో కేసు కూడా జరిగింది! ఆ కేసులో బాలమురళి విజయం సాధించారు. బాలమురళి విజయం కర్ణాటక సంగీతం విజయం.‌ బాలమురళి స్ఫూర్తిగా ఎందరో గాయకులు వచ్చారు. ఆయన ఆదిగా కర్ణాటక సంగీతంలోకి విశేషమైన మేధ వచ్చింది.

బాలమురళి వేదిక ఎక్కగానే సరస్వతి‌ వారిని అవహిస్తుంది. వారు సంగీతం పాడరు. వారిని‌ సంగీతం పాడుకుంటుంది. మామూలుగా శాస్త్రీయ సంగీత గాయకులు‌ కఠోరమైన సాధన‌ చేస్తారు. బాలమురళి చెయ్యరు. సభలో పాడడానికి కూర్చున్నాక, గళం విప్పాక వారి నుంచి సంగీతం‌ వచ్చేస్తుంది. ఆదిభట్ల నారాయణ దాసు తమ హరిశ్చంద్రోపాఖ్యానంలో‌ “నా నాల్క యద్దంబున బూని నిన్నే చూచుకో” అని‌ అమ్మవారిని కోరుకుంటారు. మఱి బాలమురళి కూడా అలా అమ్మవారిని కోరుకున్నారేమో? బాలమురళి నాలుకపై‌ అమ్మ‌వారు గానంగా ప్రతిబింబిస్తుంది. బాలమురళి సంగీతంలో ఒక బాలమేధావి. వారు ఒక శాస్త్రీయ సంగీత‌‌ పరిశోధకులు. కర్ణాటక సంగీతంలో వారు ఒక విప్లవం.

సాహిత్యాన్ని చంపకుండా, జిడ్డు లేకుండా గొప్పగా పాడగలిగిన వారు ఆయన. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తొలిదశలో జీ.ఎన్. బాలసుబ్రహ్మణ్యన్ గానాన్ని ఆదర్శంగా తీసుకున్న బాలమురళి తరువాతి కాలంలో కట్ణాటక సంగీత గానానికి అవసరమైన ఆదర్శమయ్యారు. కర్ణాటక సంగీతాన్ని తన గానంతో ఉజ్జ్వలనం చేశారు. బాల మురళి గాత్రం baritone. తన baritone (అంటే పురుష గాత్రం)తో కర్ణాటక సంగీతానికి విశేషమైన శోభను తీసుకువచ్చారు బాలమురళి.

మేధ… మేధ…మేధ.‌.‌. బాలమురళి అన్న మేధ కర్ణాటక సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది. బాలమురళి వేదికపై పాడుతున్నప్పుడు ప్రేక్షకుల్ని చూస్తూ, చిరునవ్వుతో పాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ అది ప్రేక్షకుల్ని చూస్తూ చిరునవ్వు నవ్వడం కాదు. ఆయన తాను పాడుతున్న రాగాన్ని చూస్తూ, ఆ రాగానికి తన చిరునవ్వుతో అభివాదం చేస్తూ పాడడం! తాను పాడుతున్న రాగాన్ని దర్శిస్తూ పాడతారు బాలమురళి!! (ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఆంతరంగీక చర్చల్లో తెలియజేశారు)
మహోన్నతమైన విషయం ఇది.

‘గానమో, సంగీతమో స్వరాలకు పైన ఉంటుంది’. ఆ తెలివిడి ఉన్నవారు, ఆ రహస్యం తెలిసినవారు బాలమురళి. పాడుతున్నది స్వరాలనే… కానీ ఆ స్వరాలకు పైన సంచరించడం బాలమురళి నైజం; విశిష్టత.

బాలమురళి విజయవాడ నుండి మద్రాసుకు వెళ్లడంవల్ల వారికి, సంగీతానికి మేలు జరిగింది. ఆంధ్రలోనే ఉండి ఉంటే బాలమురళి ఈ మేరకు రాణించి ఉండేవారు కాదు. ఒక సందర్భంలో నా చిన్నప్పుడు నేను సభామర్యాదను కూడా పాటించకుండా ఓ పేరున్న గాయకుడి పాటకు పెద్దగా నవ్వేస్తే వారు నన్ను చూస్తూ మెచ్చుకోలుగా చేతి సైగ చెయ్యడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్నిస్తుంది. ఆ సంఘటన నాకు నాపై నమ్మకాన్ని కలిగించింది.

బాలమురళి విశేషమైన సంగీత కళాకారుడు, సంగీత వేత్త మాత్రమే కాదు ఓ కవి కూడా. ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశారు. మంచి వచనం రాశారు‌. తెలుగు, తమిళ, సంస్కృతం భాషల్లో కీర్తనలు రాశారు. ఆ భాషల్లో వారు రాసిన‌ కీర్తనలు సూర్యకాంతి పేరుతో పుస్తకంగా వచ్చాయి. వారి చేతి రాతతోనే ఆ రచనల పుస్తకం అచ్చయింది. అందులో వారు రాసిన వర్ణాలు, కీర్తనలు,కృతులు, తిల్లానాలు ఉన్నాయి.

బాలమురళీకృష్ణ సినిమా పాటలు పాడారు. కొన్ని సినిమాలకు సంగీతం చేశారు. సినిమా గాయకుడుగానూ, సంగీత దర్శకుడుగానూ కేంద్ర ప్రభుత్వ పురస్కారాలను పొందారు.

బాలమురళీకృష్ణ సంగీతంపరంగా భారతరత్న.

శ్రీమాన్ బాలమురళీకృష్ణ స్మరణలో…


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

బాలమురళీకృష్ణ గారిని ప్రముఖ కవి
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారితో
స్మరించుకుంటున్న వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here