గాంధీత్వం నుంచి హిందుత్వం వరకూ..
హైదరాబాద్, డిసెంబర్ 10: గాంధీత్వం నుంచి హిందుత్వం వరకూ శీర్షికతో ప్రముఖ పాత్రికేయులు కల్లూరి భాస్కరం వివిధ పత్రికలలో రాసిన వ్యాసాల పరంపరను పుస్తకంగా ప్రచురించారు. బుక్ రీడర్స్ క్లబ్, అస్త్ర పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. సీనియర్ పాత్రికేయుడు కె. రామచంద్రమూర్తి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్ర జ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, పుస్తక రచయిత కల్లూరి భాస్కరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్, టంకశాల అశోక్ పుస్తకం గురించి మాట్లాడారు.
ఈ పుస్తకం వెనుక కథను కల్లూరి భాస్కరం వివరించారు. 2014కు పూర్వం తరవాత పరిస్థితులను తెలిపారు. ఉపనిషత్తుల కాలంలోనూ చర్చోపచర్చలు జరిగేవనీ, ఇప్పుడు అది కొరవడిందనీ పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన పరిణామమని ఆవేదన వ్యక్తంచేశారు. బిట్వీన్ ది లైన్స్ చదవితే పుస్తక నేపథ్యం అర్థమవుతుందని కె. రామచంద్రమూర్తి చెప్పారు. హిందుత్య భావాలు, వాదాల గురించి పుస్తకంలో వివరించారు తప్ప, దానిని ఎదుర్కొనడానికి జరిగిన సంఘటనలు రచయిత ఉదహరించలేదని ఆంధ్ర జ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ ఎత్తిచూపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సమన్వయకర్త దేవులపల్లి అమర్, దేశపతి శ్రీనివాస్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.