Saturday, December 2, 2023
Homeటాప్ స్టోరీస్అబ్ కీ బార్ కిసాన్ సర్కార్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్

భార‌త్ రాష్ట్ర స‌మితి నినాదం
జాతీయాభివృద్ధికి నూత‌న విధానాలు అవ‌స‌రం
వ‌న‌రులున్నా ఉప‌యోగించుకోలేని అస‌మ‌ర్థ‌త‌
కొత్త పాల‌సీల‌కు మేధావుల‌తో స‌మావేశాలు
బీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ‌లో అధ్య‌క్షుడు కేసీఆర్
(వ్యూస్ ప్ర‌తినిధి, హైద‌రాబాద్‌)

భార‌త్ రాష్ట్ర స‌మితి ఆవిర్భ‌వించింది. ద‌క్షిణాది రాజ‌కీయాల్లో న‌వ‌శ‌కాన్ని ప్రారంభించే దిశ‌గా అడుగులు వేసింది. భార‌త్ రాష్ట్ర స‌మితి ఆవిర్భావంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరు కాల‌గ‌ర్భంలో కలిసిపోయింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 1.20గంట‌ల‌కు అధికారిక ప‌త్రం మీద సంత‌కం చేసి, బీఆర్ఎస్‌కు శ్రీ‌కారం చుట్టారు ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజు, ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పార్టీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ సందోహంగా మారింది. కార్య‌క‌ర్త‌ల సంబ‌రాల‌తో మార్మోగిపోయింది. అధికారిక లేఖ‌పై సంతకం చేసిన అనంత‌రం, సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. పిడికెడు మందితో ప్రారంభ‌మై ఉప్పెన‌లా మారి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఊహించ‌ని విధంగా దేశానికే మార్గ‌ద‌ర్శ‌నం చేస్తున్నామ‌ని సీఎం అన్నారు. అద్భుతమైన ప్రగతితో దూసుకుపోతున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలకు చేరుకుంద‌న్నారు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, చైర్మన్లుగా, సర్పంచులుగా లక్షలాదిమంది నాయకులు త‌యార‌య్యార‌న్నారు. కరోనా క్లిష్ట సమయంలో దేశమంతా ఆర్థికంగా వెనుకకు పోయినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణతో నిలదొక్కుకున్న అంశాన్ని ఆయ‌న గుర్తుచేశారు.


ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే…
• ఒకనాడు కరువు కాటకాలతో కునారిల్లిపోయి, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్న మనం నేడు పాలమూరు తల్లి సాగునీటితో, అద్భుతమైన పంటలతో పచ్చని పైట కప్పుకున్నది అని పాడుకుంటున్నం.
• ఎక్కడివాళ్లం అక్కడ పనిచేసుకుంటూ ముందుకు సాగితేనే ఇంత అభివృద్ధి సాధ్యమైంది.
• ఇంత వెనుకబడిన ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రాంతాన్నే ఇంత గొప్పగా మనం అభివృద్ధి చేసుకున్నపుడు రత్నగర్భ అయిన భారతదేశాన్ని ఇంకెంత గొప్పగా అభివృద్ధి చేసుకోగలం.


• అద్భుతమైన జల వనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతావరణం ఈ ప్రపంచంలో మరే దేశానికీ లేదు. మనకున్న వసతులకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ చైన్ దేశంగా ఇండియా మారాల్సి ఉండె.
• మానవ వనరులను వాడుకోలేక పోతున్నం. అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమై పోతున్నది. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె. ఇందులో భాగంగా దేశంలో భావజాల వ్యాప్తిని, దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది.
• ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పు కోసం ఉన్నతస్థాయికి చేరుకునే ఆర్ధిక ప్రగతి కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తది. ఇన్నాళ్లూ మనం కొససాగిస్తూ వచ్చిన అదే అంకితభావంతో ముందుకు పోదాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, నూతన విధానాలను అమల్లోకి తెద్దాం.
• 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండి, 70 వేల టీఎంసీల నీటి వనరులుండి, రైతుల ధర్నాలు ఇంకెంత కాలం?
• ఆకలి ఇండెక్సులో మనం ఎందుకు ముందు వరుసలో ఉన్నాం?
• ఎన్నో ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలో పరిస్థితి ఎందుకు మారడం లేదు?


• రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదు.
• ఎన్నికల్లో ప్రజలు గెలవాలె. ప్రజా ప్రతినిధులు గెలవాలె. సరిగ్గా ఇదే పరివర్తన కోసం ఏర్పాటైందే బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో విమర్శలను అధిగమించి ఇంతదూరం వచ్చినం. ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతునే ఉంటయి. ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్ఎస్ పార్టీ.


నూతన జాతీయ విధానాలు అవసరం
ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముందని సీఎం అన్నారు. వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం (New Agriculture Policy) అవసరమున్నది.


నీటి కోసం ఇంకా యుద్ధాలా?
అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరగడం శోచనీయం. చెన్నై లాంటి మహానగరానికి బకెట్ నీళ్ళు దొరకని దుస్థితి ఏమిటి? ఇదే సమస్య పై బాలచందర్ లాంటి దర్శకుడు తన్నీర్ తన్నీర్ అనే సినిమా తీస్తే ఆ నీటి బాధకు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితులున్నాయి. ఇటువంటి అసంబద్ధ విధానాలను సరిచేయాల్సి ఉన్నది. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నది. దిక్కుమాలిన ట్రిబ్యునల్స్ పేరుతో నీటి యుద్ధాలను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి బాగు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ (New Water Policy) కావాలి.


జ‌ల‌వ‌న‌రులున్నా…. ప‌ల్లెల‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేదెందుకు?
ఈ దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నయి. అయినా పల్లె పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అందుకు నూతన విద్యుత్ పాలసీ (New Power Policy) కావాలి.
ఆర్థికంగా ఉజ్వలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా ఫారిన్ ఎక్సేంజీ నిల్వలు ఎందుకు తరిగిపోతున్నాయి. డాలర్ ముందు మన రూపాయి విలువ ఎందుకు వెలవెలబోతున్నది. అందుకోసం నూతన ఆర్ధిక విధానం (New Economic Policy) కావాలి.


ఈ దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్నా.. పచ్చదనానికి కొరత ఎందుకున్నది. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో నూతన పర్యావరణ పాలసీ (New Environmental policy) తేవాల్సి ఉన్నది. అదే సందర్భంలో ఈ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఇంకా జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు అభివృద్ధి ఫలాలను ఈ దేశ పాలకులు అందించలేకపోతున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన విధానం (weaker section upliftment policy) తేవాల్సిన అవసరం ఉన్నది.


దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలను అనేకరకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటు పడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉన్నది. దేశ ప్రగతిలో మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం women empowerment policy తేవాల్సి ఉంది. అంతే కాకుండా, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ఆయా రంగాల్లో తెలంగాణ స్ఫూర్తితో వినూత్నమైన ప్రగతికాముక విధానాలను రూపొందించి బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది.


మేధావుల‌తో సాగుతున్న క‌స‌ర‌త్తు
ఇందుకోసం ఈ విధివిధానాల రూపకల్పన కోసం మాజీ జడ్జీలు ప్రముఖ ఆర్థిక, సామాజిక వేత్తలతో, మేధావులతో కసరత్తు కొనసాగుతున్నది.
తెలంగాణలో అమలు చేస్తున్నట్టు భారత ప్రజలు అవకాశమిస్తే రెండేండ్లలో బిఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం 24 గంటల పాటు కరెంటును అందించగలదు. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళితబంధును అందించగలం. దేశాన్ని నూతన ఆలోచన దిశగా వినూత్న ప్రగతి ఒరవడిని సృష్టించడానికి బిఆర్ఎస్ నడుంకడుతుంది. రాజకీయాల్లో ప్రజలే గెలవాలనే పద్ధతికి బిఆర్ఎస్ ద్వారా శ్రీకారం చుట్టబడాలె. దేశానికి దేశమే సమాన హక్కులతో పరిఢవిల్లబడాలి. పాలనలో నియంతృత్వ ధోరణి పోవాలె. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలె. స్వయంపాలన విధానం అమలు కావాలె. దళిత, బహుజన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలె.
వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగనం కాబట్టీ తెలంగాణను సాధించుకోగలిగినం. అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోగలిగినం. అదే స్ఫూర్తితో ఈ వాస్తవాలన్నింటిని దేశ ప్రజల ముందుకు తీసుకుపోయి అర్థం చేయించగలిగినప్పుడు ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఆటంకాలను ఎదుర్కొంటూ, అవమానాలను భరిస్తూ ముందుకు సాగుతూ ఎక్కడ మంచి కోసం విప్లవాత్మక కార్యాచరణకు బీజాలు పడతాయో అక్కడ తప్పకుండా విజయం సాధ్యమవుతుంది అనేది చరిత్ర నిరూపించిన సత్యం.


బిఆర్ఎస్ ఓ వెలుగు దివ్వె
బిఆర్ఎస్ అనే వెలుగుదివ్వెను దేశం నలుమూలలకు వ్యాపింపచేద్దాం. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల ముందు పెట్టి దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేసి భరతమాత సంతృప్తిచెందేలా బిఆర్ఎస్ తో మన ప్రయాణం కొనసాగిద్దాం.
దేశ సౌభాగ్యం కోసం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న దేశ రైతాంగం కోసం, ఉత్పత్తి కులాల, సబ్బండ వర్గాల సౌభాగ్యం కోసం “అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అనే నినాదంతో బిఆర్ఎస్ ముందుకుపోతుంది.


జేడీఎస్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు
రాబోయే కర్నాటక ఎన్నికల్లో మనం జెడిఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటాం. మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని, జెడిఎస్ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. అందుకు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను వారికి వివరిద్దాం. గతంలో కర్నాటక పోయినప్పుడు చెప్పినట్టే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. భగవంతుని కృపతో, మన పట్టుదలతో మరోసారి సీఎం అవుతాడనే విశ్వాసం ఉంది. బిఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే ప్రారంభం అవుతుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు మనం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో ప్రజల్లోకి పోయి సాధించుకున్నాం. నేడు భారతదేశ అభివృద్ధి గుణాత్మక మార్పు లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెందడం చారిత్రక అవసరం.


14న ఢిల్లీలో కేంద్ర కార్యాల‌య ప్రారంభం
డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలి. మరో రెండు మూడు నెలల్లో మన సొంత బిఆర్ఎస్ భవనం పూర్తవుతుంది. అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.
ఈ సమావేశానికి అతిథులుగా హాజరైన కర్నాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ రైతు సంఘాల నాయకులకు, మేధావులకు పేరుపేరునా ధన్యవాదాలు.

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం – హైలెట్స్
• మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని తర్వాత నేరుగా తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకొని, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు
• అనంతరం తెలంగాణ భవన్‌లో త్రైలోక్య మోహన గౌరీ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు సీఎంను ఆశీర్వాదించారు.
• అనంతరం జయజయధ్వానాల మధ్య, బీఆర్ఎస్ పార్టీ గులాబీ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.


• బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు.
• ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల దివ్య ముహూర్త సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రాలపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు.
• బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తొలి పలుకులతో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావు మాట్లాడారు.
• ఈ సందర్భంగా కర్నాటక జెడిఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసముందని తనకుందని తెలిపారు.
• ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
• కాగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో అట్ట‌హాసంగా జ‌రిగాయి.


• ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి కర్ణాటక జేడీఎస్ నేత,మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు సామాజిక రాజకీయ వేత్త ప్రకాశ్ రాజ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
• బిఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు అభిమానుల కేరింతలతో, బాణాసంచా కాల్పులతో మారుమోగింది. దేశ్ కి నేత కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, బిఆర్ఎస్ జిందాబాద్ నినాదాలతో మారుమోగింది.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గారితోపాటు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ర్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రెబ్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, రాజ్యసభ, లోక్ సభ పక్షనేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావుతో పాటు రాజ్యసభ, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, మేయర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నాయ‌కులు, హర్యానా నుంచి గుర్నామ్ సింగ్, ఒడిస్సా నుండి అక్షయ్ కుమార్, హిమాంశు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ