జర్మనీలోని తురింగియాతో తెలంగాణ ఎంఓయూ
టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం కీలక ఒప్పందం
తెలంగాణ రైజింగ్ దర్శనీకతపై జర్మనీ ప్రతినిధుల ప్రశంసలు
హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో, జర్మనీలోని తురింగియా రాష్ట్రం పలు కీలక రంగాల్లో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, థురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో బుధవారం ప్రత్యేకంగా సమావేశం కాగా, ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రగతికి జర్మనీ కితాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల పనులను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సమావేశంలో తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ తెలంగాణను భారతదేశంలో అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి ప్రత్యేకమైనదిగా వ్యాఖ్యానించారు. భారత-జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా ఉందని వివరించారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో కొత్త అవకాశాలు వస్తున్నాయని వివరించారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు), పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధన విధానాలను మార్చేందుకు తురింగియా సహకారం కావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన… తురింగియా ముఖ్యమంత్రి మారియో వోయిట్… తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రూపొందించేందుకు తమ పరిశ్రమలు, విద్యాసంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జర్మనీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఏమిటో గుర్తించి, వాటికి అనుగుణంగా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తెలంగాణ యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ విజయాల్లో తెలంగాణ యువత కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రపంచంలోని అనేక అగ్రశ్రేణి సంస్థల్లో హైదరాబాద్‌కు చెందినవారే కీలక పదవుల్లో ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో జర్మన్ భాషా పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో జర్మన్ భాషా శిక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో సహకరించాలని తురింగియా ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ గురించి కూడా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీలను తెలంగాణకు ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యాపారాలకు అవసరమైన ప్రపంచ స్థాయి వసతులు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. ఇటీవల మిస్ వరల్డ్-2025 పోటీలకు వందకు పైగా దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు రావడం రాష్ట్ర ప్రతిష్టకు నిదర్శనమన్నారు.
సెమీకండక్టర్ రంగంలో కొత్త అవకాశాలు
జర్మనీలోని తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ సెమీకండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి అవకాశాలను పరిశీలించి పెట్టుబడులపై చర్చలు జరుపుతామన్నారు. అయితే, ఈ ప్రతిపాదనను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్వాగతిస్తూ ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక అంతర్జాతీయ సెమీ కండక్టర్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే తయారీ రంగంలో కూడా తెలంగాణ ముందంజలో నిలుస్తుందని తెలిపారు.

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా ఇప్పటికే జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో యువతకు అత్యాధునిక నైపుణ్యాలు అందిస్తున్నామని, తురింగియా ప్రతినిధులు ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా వెళ్లి పరిశీలించవచ్చని సూచించారు.

పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో తెలంగాణకు కొత్త అవకాశాలు అందజేయనున్న ఈ ఒప్పందం రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించే దిశగా కీలక అడుగుగా మారనుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుండగా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల రాష్ట్రాలు తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తురింగియా స్టేట్ సెక్రెటరీలు డా. టైచార్ట్, సకెర్ట్, జర్మన్ కాన్సుల్ జనరల్ హాస్పర్ సహా వివిధ రంగాలకు సంబంధించిన జర్మనీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి అజిత్ రెడ్డి, టీజీఐఐసి ఎండి శశాంక కూడా పాల్గొన్నారు.

