తప్పక, తప్పక చూసితీరాల్సిన సినిమా ‘ఆదిపురుష్’

Date:

(వనం జ్వాలా నరసింహారావు)

సినిమాలు చూసే అలవాటు అంతగా లేకపోయినా, మంచిదని ఆనోటా, ఈ నోటా వింటేనో, లేదా సమీక్ష చదివితేనో, లేదా పిల్లలు తీసుకుపోతేనో చూస్తుంటాను. చూసినవాటిలో ‘చాలా బాగావున్నవి’, ‘బాగావున్నవి’, ‘పరవాలేదు అనిపించినవి’, ‘వినోదాత్మకమైనవి’, ‘సందేశాత్మకమైనవి’, ‘సంగీత ప్రాదాన్యమైనవి’, ‘కుటుంబంతో కలిసి చూసేవి’ వున్నాయి. అలాంటి కొన్ని సినిమాల పేర్లు చెప్పుకోవాలంటే ‘సుడిగుండాలు’, ‘సీతారాముల కల్యాణం’, సంపూర్ణ రామాయణం’, ‘అన్నమయ్య’, ‘భక్తరామదాసు’, ‘లవకుశ’, ‘దానవీర శూర కర్ణ’, ‘శతమానంభవతి’, ‘మిథునం’, ‘బాహుబలి’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘రంగస్థలం’ లాంటివి వున్నాయి.

వీటన్నిటికీ అతీతంగా, పూర్తి భిన్నంగా, మొట్టమొదటిసారిగా విడుదలైన రోజునే ఒక పౌరాణిక (జానపద, సాంఘిక కలిమిడిని పోలిన) సినిమా చూసే అవకాశం కలిగింది. ఓహో, రాఘవ (శ్రీరాముడు), శేషు (లక్ష్మణుడు), జానకి (సీత) భజరంగ్ (హనుమంతుడు), రావణ, విభీషణ, కుంభకర్ణ, మండోదరి, శూర్ఫనక, ఇత్యాదులు ఇలాకూడా వుంటారా అని ఆశ్చర్యం, విస్మయం, ఉలికిపాటు, గగుర్పాటు కలిగింది. బహుశా సినీ నిర్మాత, దర్శకుడు బాగా శోధించి, పరిశోధించి ఈ పాత్రలను ఇలా అపురూపంగా రూపుదిద్దారేమో, ఇలా వుండడమే సబబేనేమో అనిపించింది. అనాదిగా భారతీయులు రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని ఆచరిస్తూ వస్తున్న అపారమైన సంస్కృతీ, సంప్రదాయాలను ఈ విధంగా (వక్రీకరించి) కూడా చూపించసాధ్యమా? అనిపించింది. అందుకే ఈ సినిమా చూడాలి. చూసితీరాలి.

ఆ చక్కటి సినిమా పేరు ‘ఆదిపురుష్’. నిడివి మూడు గంటలకు పైగానే అనిపించింది. మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు కనుక్కున్న మేథావి థామస్ ఆల్వా ఎడిసన్, దాన్ని కనుగొనే ప్రక్రియలో ఎన్నిరకాలుగా తప్పులు చేయవచ్చో ముందుగా కనుక్కున్నాను అన్నాడట! అలా వుంది ఈ సినిమా ఆద్యంతం. వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన సినిమా ఇదని ఉపోద్ఘాతంలో చెప్పటం జరిగింది. ఏఏ విషయాలలో వాల్మీకి రామాయణంలోని అంశాలు ప్రామాణికంగా ఇందులో వున్నాయో నిర్మాత, దర్శకులకే తెలియాలి. ఇది అర్థం చేసుకోవడానికైనా చూడాలి ఈ సినిమా.

వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి పదహారు గుణాలను వర్ణించాడు నారదుడు, ఈ పదహారు గుణాలు కాకుండా ఈ సినిమాలో పదిహేడవ గుణం, ఆమాటకొస్తే మరిన్ని రకాల గుణాలు ఉన్నవేమో అన్న భ్రమ కలుగుతుంది. ముఖ్యంగా ‘రౌద్ర గుణం’ చూపించిన తీరు వర్ణనాతీతం’.

శ్రీరాముడి పాత్ర అంటే ఆబాలగోపాలానికి ఒక చెరగని ముద్రలాగా మహానటులైన ఆ తరంవారు వాల్మీకి రామాయణంలో చెప్పిన గుణగణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు అప్పటి నిర్మాత, దర్శకులు. గ్రాఫిక్స్ ఆధారంగా అనవసరమైన కుప్పిగంతుల సన్నివేశాలకు రూపకల్పన చేసి ఎబ్బెట్టుగా చూపించారు శ్రీరాముడిని ఈ సినిమాలో. ఒక సన్నివేశంలో ఎవరికీ అంతుచిక్కని జీవరాశులతో రాఘవ జానపద శైలిలో పోరాడుతాడు! అసలు ఆ సన్నివేశంలో ఒంటరిగా రాముడు అక్కడ ఏం చేస్తున్నాడో అంతుచిక్కదు. ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి చరితాన్ని ఆదికావ్యంగా, శ్రీరామాయణ కావ్యంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. శ్రీసీతారాముల చరితానికి సంబంధించినంతవరకు వాల్మీకి రామాయణం మాత్రమే ఏకైక ప్రామాణిక గ్రంధం. ‘ధ్వనికావ్యంగా’ పేరున్న రామాయణం చదువుతుంటే కళ్లకు కట్టినట్లు వుండే పాత్రలు, ముఖ్యంగా శ్రీరాముడి పాత్ర ఈ సినిమా చూస్తుంటే ‘ఓహో! ఇలా వుంటుందా?’ అనిపించడం సహజం. అందుకే తప్పక చూసి తీరాలి ఈ అద్భుతమైన సినిమాని.

ఏకారణాన రామాయణాన్ని అరణ్యకాండ కథతో మొదలుపెట్టారో అర్థంకాదు. ఒకింత కిష్కింధకాండ, చాలావరకు యుద్ధకాండ అంశాలకే వక్రీకరించి ప్రాధాన్యత ఇచ్చారు. ఆరంభంలోనే ఎక్కడో రాముడు వుంటే, శేషు అనబడే లక్ష్మణుడు, లక్ష్మణరేఖను మించిన గ్రిల్ లాంటి నిర్మాణాన్ని సృష్టించడం, అది దాటి బయటకు రావద్దని వదిన ‘జానకి’ కి చెప్పడం విశేషం. అలాగే ఏవిధమైన నేపధ్యం లేకుండా జింకల గుంపులో వున్న బంగారు జింకను కావాలని జానకి అడగ్గానే, రాఘవ మారుమాట్లాడకుండా, సాంఘిక సినిమాలలో విలన్ ను వెంబడించే హీరో లాగా పరుగెడుతూ, దాన్ని వేటాడి బాణం వేస్తాడు. అది ‘శేషు’ అని అరుస్తూ (కాదు గొణుక్కుంటూ) చచ్చిపోయి రాక్షసుడు అవుతుంది సినిమాలో. అలా చనిపోయింది మారువేషంలో వున్న మారీచుడు అన్న విషయం సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. శూర్ఫనక ప్రోద్బలంతో జానకిని అపహరించడదానికి రావణుడు పోయినట్లు, మండోదరి వారించినట్లు చూపించారుకాని, మారీచుడు రావణుడిని వారించినట్లు సూచనప్రాయంగానైనా లేదు. వీటిని ఆస్వాదించడానికన్నా ఈ సినిమా చూడాలి.

‘శేషు’, ‘శేషు’ అన్న కేకలు విని జానకి బలవంతం మీద ఆమెను వదిలి రాముడికి సహాయంగా (గ్రిల్ లాంటి రక్షణ నిర్మాణాన్ని ఏర్పాటుచేసి) పోతుండగా అన్నదమ్ములిద్దరూ కలుస్తారు. ఏవిధమైన సంభాషణ జరగలేదక్కడ. వాస్తవానికి అన్నకు సాయంగా వెళ్తూ-వెళ్తూ సీతను జాగ్రత్తగా వుండమని అన్నాడే లక్ష్మణుడు కాని ఎలాంటి రక్షణ రేఖ ఏర్పాటుచేయలేదనేది వాల్మీకి రామాయణంలో స్పష్టంగా వున్నది. బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో వచ్చిన రావణాసురుడు ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడిచేత్తో తొడలను, బెదిరించి, బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, తన మాయా రథంలో వేశాడు. అంటే, వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సినిమాలో చూపించినట్లు గారడీ, కనికట్టు విద్యద్వారా కట్లుకట్టి, స్పృహ కోల్పోయేటట్లు చేసి, తనవెంట తీసుకుని పోలేదు. అందుకే ఈ సినిమా చూడాలి.

‘ఆదిపురుష్’ సినిమాలో మరో చూసితీరాల్సిన వింత ఎవరికీ అంతుచిక్కని ఒకరకమైన వస్త్రాలు ధరించి, కనీసం విభూతి రేఖలు కూడా ముఖాన లేకుండా, అదునాతమైన మంచి హెయిర్ స్టయిల్ తో రావణుడు తనే స్వయంగా స్టీరింగ్ తిప్పుకుంటూ, అతి జుగుప్సాకరంగా వున్న ఒక పక్షి వాహనం మీద సీతను తీసుకుని పోవడం. మరో సందర్భంలో ఆ వాహన జంతువుకు టన్నులకొద్దీ మాంసాన్ని స్వయంగా రావణుడే తినిపించడం! సీతను ఎత్తుకుపోతుంటే రాఘవ-శేషు చూస్తూ నిలబడ్డారేకాని ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక్క బాణం కూడా సంధించలేదు. వాస్తవానికి వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుడు ఎత్తుకుపోయిన చాలా సేపటికి కాని రామలక్ష్మణులు ఆశ్రమానికి చేరుకుంటారు. చెట్టు, పుట్ట, గుట్ట, మొత్తం అరణ్యం గాలిస్తారు. ఈ మార్పుకోసమైనా చూడాలి ఈ సినిమాను.

సుగ్రీవుడితో స్నేహం చేసుకొమ్మని రాముడికి చెప్పింది కబంధుడు కాని, శబరి కాదనేది వాల్మీకంలో స్పష్టంగా వుంది. వానర రాజు సుగ్రీవుడు తన అన్న వాలికి తనమీద కోపం రాగా, నలుగురు వానరులను సహాయంగా తీసుకుని పంపానది ఒడ్డున వున్న ఋశ్యమూక పర్వతం మీద సంచరిస్తున్నాడనీ, అతడితో రాముడు స్నేహం చేస్తే ఆయన భార్యను వెదకడానికి అతడు సహాయపడతాడనీ, అతడికి తెలియని రాక్షసులు వుండే చోటు భూమ్మీద లేదనీ, సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడతడనీ కబంధుడు చెప్పిన తరువాతే సుగ్రీవుడి అన్వేషణలో రామలక్ష్మణులు పోతారు.

అలా పోతున్న రామలక్ష్మణులు శబరి వుండే ఆశ్రమం చేరుకుంటారు. శబరి వీరి పాదాలకు నమస్కరించి, రామలక్ష్మణుల దర్శనం చేసుకుంటే తనకు మళ్లీ జన్మలేని లోకం లభిస్తుందని తన గురువులు చెప్పిన కారణాన వారికొరకు వేచి చూస్తున్నానని, మంచివి, ఏరి-కోరి నానా రకాలైన కందమూల ఫలాలు సంపాదించానని, వాటిని తినిపిస్తుంది. సినిమాలో చూపించిన విధంగా శబరి ఏరి కోరి తెచ్చి రాముడితో ఎంగిలి పండ్లు తినిపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. రాఘవను కలిసిన తరువాత శబరి ప్రాణత్యాగం చూపించి, దేవకన్యగా మారి సుగ్రీవుడితో స్నేహం చేయమని అన్నట్లు సినిమాలో వున్నది. ఇంత చిన్న విషయాన్ని మార్చి చూపినందుకైనా ఈ సినిమా చూడాల్సిందే!

ఆ తరువాత రామలక్ష్మణులు పంపాతీరం చేరి, అక్కడినుండి ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, వారిని చూసిన సుగ్రీవుడు వాలి పంపగా తమను చంపడానికి వచ్చినవారిగా భయపడ్డాడు. హనుమంతుడికి తన భయానికి కారణం చెప్పి, వాళ్ల దగ్గరికి పోయి విషయం తెలుసుకొమ్మంటాడు. సుగ్రీవుడి కోరిక మేరకు రామలక్ష్మణుల దగ్గరకు వానర రూపం వదిలి బిక్షుక వేషంలో పోయాడు హనుమంతుడు. రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు చేసేవారే కాని పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు వారికి గౌరవంగా నమస్కారం చేశాడు. ఉభయకుశలోపరి, సుగ్రీవుడి గురించి వివరించి, ఆయన జయం కోరుతూ రామసుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు. అంతేకాని రాఘవ, శేషు వచ్చేసరికి ఒకచోట తిష్ట వేసుకుని కూర్చుని, అర్థంపర్థంలేని ప్రశ్నా-జవాబుల నేపధ్యంలో హనుమ (భజరంగ్), రామలక్ష్మణుల కలయిక జరుగదు. ఈ ట్విస్ట్ ఇచ్చినందుకైనా సినిమా చూడాలి మరి.

తమ వృత్తాంతాన్ని వివరించిన రామలక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరికి తీసుకుపోతాడు హనుమంతుడు. వాలి తనకు చేసిన అపకారాన్ని సుగ్రీవుడు రాముడికి చెప్పడం, వాలిని చంపడానికి రాముడి ప్రతిజ్ఞ, సీతను తాను తీసుకొస్తానని సుగ్రీవుడు రాముడికి చెప్పడం, సీతాదేవి ఉత్తరీయంలో మూటగట్టి విసిరేసిన సొమ్ములను చూపడం, వాలిసుగ్రీవుల ప్రధమ, ద్వితీయ యుద్ధాలు, శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి (సినిమాలో చూపించినట్లు ఎదురుగ్గా కాదు) బాణం వేయడం, ఇత్యాదులు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా వున్నాయి. వీటికి భిన్నంగా ఆదిపురుష్ కథ అల్లడం జరిగింది కాబట్టి ఈ సినిమా చూసి తీరాల్సిందే! వాస్తవానికి కిష్కింధకాండలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం, వాలి నేలకూలిన తరువాత, కొనవూపిరితో వున్న వాలి, తనను రాముడు అన్యాయంగా చంపాడని ఆరోపణ చేసినప్పుడు, అనేక రకాలుగా ధర్మ శాస్త్ర వాక్యాలను చెప్పి, వాలిని చంపడం ఏమాత్రం అధర్మం కాదని అన్న శ్రీరాముడి మాటలకు సమాధానపడి క్షమించమని కోరాడు వాలి. ఇవి లేని ఆదిపురుష్ చూడాల్సిందే.

సీతను వెతకడానికి సుగ్రీవుడు నలుదిక్కులకు వానర ప్రముఖులను పంపడం చూపలేదు. దక్షిణ దిక్కుకు హనుమదాదులను పొమ్మన్న వెంటనే, హనుమంతుడి చేతికి తన ముద్రికను (చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని) ఇస్తాడు శ్రీరాముడు. సినిమాలో చూపించినట్లు ‘ముత్యం’ కాదు. ఆ తరువాత జరిగిన అసలు కథ (ఈ సినిమాలోలాగా కాదు) హనుమంతుడు లంకను దాటడం, సీతాన్వేషణ చేయడం, అశోకవనంలో సీతను చూడడం, రామముద్రికను (ఉంగరం) ఇవ్వడం, ఆమె ఇచ్చిన చూడామణిని (గాజును కాదు) తీసుకోవడం, రావణుడి ఉద్యానవనాన్ని ధ్వంసం చేయడం, మూడు వంతుల మంది రావణ సైన్యాన్ని చంపడం, కావాలనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం, రావణుడికి హితబోధ, హనుమ తోక కాల్చడం, (ఆ సన్నివేశంలో ఈ సినిమాలో వున్న ఎబ్బెట్టు డైలాగులు వుండవు. హనుమంతుడు అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యాకరణ స్ఫూర్తితో మాట్లాడుతాడు), లంకా దహనం, మళ్లీ లంకను వదిలే ముందర సీతాదర్శనం, ఇత్యాదులు చూచాయగానన్నా లేకుండా, సినిమా తీసినందుకైనా దీన్ని చూడాల్సిందే!

సముద్రం మీద సేతువు కట్టిన విధానం కూడా తప్పుగా చూపించారు. వానరులంతా రాళ్లు వేయరు. ఒక్క నీలుడే ఇతర వానరులు తెచ్చిన రాళ్ళను వేస్తె అవి మునగకుండా వుంటాయి. అది ఆయనకున్న వరం. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు ప్రయోగించిన ‘శక్తి’ వలన లక్ష్మణుడు మూర్ఛపోతే (చనిపోతే కాదు), హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెస్తాడు ఒకసారి. హనుమంతుడు విభీషణుడి సలహా మేరకు మృతసంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనే మూలికలకోసం వేయి యోజనాల సంజీవని స్థలాన్ని వెతికి, కనపడక పోవడంతో ఆ శైలాన్ని పాటులతో సహా పెళ్ళగించి తెస్తాడు. హనుమంతుడు వస్తుంటేనే మూలిక గాలి సోకడం వల్ల వానరులంతా ప్రాణాలతో లేచి కూర్చున్నారు. ఆ మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. అంతేకాని సినిమాలో చూపించినట్లు ఒక భారీ ఔషధాన్ని తయారుచేయలేదు. దీనికొరకు కూడా సినిమా చూడాలి.

అదేవిధంగా, ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను ఆ బాణాలతో కట్టిపడేసినప్పుడు రామలక్ష్మణులు మూర్ఛ పోయారు కాని చావలేదు. గరుత్మంతుడు రాగానే పాములన్నీ చెల్లాచెదరై రామలక్ష్మణులు మూర్ఛ నుండి తెప్పరిల్లారు. మరోమారు యుద్ధానికి వచ్చిన ఇంద్రజిత్తు, రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, బ్రహ్మ వాక్కుకు కట్టుబడి వారు మూర్ఛపోయారు. అప్పుడు హనుమంతుడు హిమవత్పర్వతం పోయి, రెండవసారి సంజీవని పర్వతం తేవడంతో, మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. ఇంద్రజిత్తు లక్ష్మణుడిని చంపాడని ప్రచారంలో వున్న విధంగానే, ఈ సినిమాలో కూడా కొంత ట్విస్ట్ ఇవ్వడం సబబు కాదు. సంజీవని తేవడం వాస్తవం అయినప్పటికీ, లక్ష్మణుడిని బతికించడానికి కాదు. ఈ మార్పులు చూడడానికైనా సినిమా చూడాలిగా మరి!

ఇంద్రజిత్తు ఏదో నదిలో స్నానం చేస్తే ఎవరూ చంపలేరని, చేయకముందే చంపమని విభీషణుడు శేషుకు (లక్ష్మణుడు) సలహా ఇచ్చినట్లు సినిమాలో చూపించారు. ఇదికూడా వాస్తవం కాదు. ఇంద్రజిత్తు చేస్తున్న యజ్ఞాన్ని ఎవరు విఘ్నం చేస్తాడో అతడి చేతిలో ఇంద్రజిత్తు చస్తాడని బ్రహ్మవరం వుందనీ, యజ్ఞం పరిపూర్ణంగా సమాప్తమైతే వాడిని దేవతలైనా జయించలేరనీ, విభీషణుడు చెప్పినట్లు, ఆ విధంగానే లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపినట్లు వాల్మీకి రామాయణంలో వున్నది. దీనికి భిన్నంగా సినిమాలో చూపించినందుకైనా ఈ సినిమా చూసి తీరాలి.

రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు ఇంద్రుడి సారధి మాతలి రథాన్ని ఎక్కి బాణాన్ని సంధించి రావణుడి శిరస్సు నరికాడు. రావణుడి తల కిందపడ్డది కాని వెంటనే మరొక తల మొలిచింది. వాడు చనిపోయే విధం రాముడికి కనబడలేదు. అప్పుడు మాతలి సలహా ఇవ్వగా బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రమూర్తి రావణుడిమీద వేయడంతో అది పోయి రావణుడి రొమ్ముమీద పడింది. పడగానే ఆ అస్త్రం రావణాసురుడి రొమ్ము చీల్చి, ఆ నెత్తురులో స్నానం చేసి, వాడి దేహం నుండి ప్రాణాలను వెడలగొట్టి, పనంతా అయిపోయిన తరువాత భూమిలో దూరి వెలుపలికి వచ్చి, రాముడి అమ్ముల పొదిలో ప్రవేశించింది. రావణుడు చావగానే ఆయన దేహం ప్రాణాన్ని వదిలినట్లే, విల్లు, బాణాలు కూడా రావణుడిని వదిలి నేలమీద పడ్డాయి. ఇది వాల్మీకం ప్రకారం రావణుడి అంత్యఘడియలు. అంతేకాని రామరావణులు రొమ్ములు విరుచుకుని కండరాలు ప్రదర్శించుకుంటూ అతి జుగుప్సాకరమైన రీతిలో యుద్ధం చేయడాన్ని వాల్మీకి రామాయణం చెప్పలేదు. ఈ ఆఖరి సన్నివేశం కొరకైనా ఆదిపురుష్ చూసి తీరాలి.

రావణ వధ అనంతరం, బహుశా సమయాభావం వల్ల సీతారాముల కలయిక నేపధ్యం చూపడం కుదరలేదేమో!! జరిగినదంతా జరిగిన తరువాత కొన్ని డైలాగులు తీసేశాం, కొన్ని సన్నివేశాలు తీసేశాం అని దర్శక నిర్మాతలు ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. అదీ మంచిదే. బహుశా రాబోయే రోజుల్లో ఈ అభినవ రాముడి ఫోటోలు ఇళ్లల్లో వెలుస్తాయేమో!!! ఏదేమైనా సినిమాకు మంచే జరగాలని కోరుకుంటున్నాను. అభిమానులు వున్నంతకాలం ఆ విషయంలో అనుమానానికి తావేలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...