మన కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శం: కె.సి.ఆర్.

Date:

మరింత ఉన్నతంగా వైద్య, ఆరోగ్య రంగం
పట్టుదలగా పనిచేస్తాం
నిమ్స్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
హైదరాబాద్, జూన్ 14 :
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందనీ, కరోనావంటి కష్టకాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డాక్టర్లు నర్సులు సిబ్బంది ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు గొప్పదని సిఎం కొనియాడారు. ఎంతచేసినా వైద్యశాఖకు పలు దిక్కులనుండి విమర్శలు వస్తుంటాయని ఈ విషయాన్ని గమనించి ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆ దిశగా ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకుని ప్లానింగ్ చేసుకోవాలని సిఎం సూచించారు.


రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. ఇందులోభాగంగా నిర్మించనున్న ‘దశాబ్ధి వైద్య భవనా’ల్లో నూతనంగా 2000 ఆక్సిజెన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి.


న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసిన కె.సి.ఆర్.
గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. కేసీయార్ న్యూట్రిషన్ కిట్ లబ్ధిదారులు పార్వతి – ఉదయనగర్ కాలనీ చెందిన పార్వతి, భోళానగర్ కు చెందిన పర్వీనమ్మ, ఎంబీటీ నగర్ కు చెందిన శిరీషమ్మ, ప్రతాప్ నగర్ పంజాగుట్ట తేజశ్విని, శ్రీరామ్ నగర్ కు చెందిన సుజాతమ్మ, అంబెడ్కర్ నగర్ రేణుకమ్మ లకు న్యూట్రిషన్ కిట్లను సిఎం కేసీఆర్ లబ్ధిదారులకు అందచేశారు.


దేశ చరిత్రలో ఇదో చారిత్రక సందర్భం
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే మనిషి తపన వొకచోట ఆగేదీకాదు వొడిసేదీ కాదు. నిరంతరం కొనసాగుతూనే వుంటుంద’’ని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రంగాలతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య రంగంలో కూడా అద్భుతమైన అభివృద్ధిని నమోదుచేసుకున్న నేపథ్యంలో, అత్యద్భుత రీతిలో నిర్మించబోయే నిమ్స్ దవాఖానా విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం భారతదేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భమని సిఎం స్పష్టం చేశారు.
నిమ్స్ దవాఖాన విస్తరణ లో భాగంగా నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం… వైద్యారోగ్య అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.


“గురువుగారిని శిష్యుడు నివాసయోగ్యమైన ప్రాంతం ఏదంటే
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన, యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ”
అంటూ సుమతీ శతకకారుడు చెప్పిన పద్యాన్ని చెప్పారు. సమాజ పురోగమనానికి అప్పిచ్చేవాడు ఉండాలి. వైద్యుడు ఉండాలి అంటూ వైద్యుని ప్రాముఖ్యత గురించి శతకకారుడు వివరంగా చెప్పారు. వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా తప్పకుండా కొనసాగుతూనే ఉంటుంది.
• మంత్రి హరీష్ రావు ప్రసంగం ఒక్క మాటలో చెప్పాలంటే.. 2014 లో వైద్యరంగానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపు రూ. 2,100 కోట్లు. 2023-24 లో కేటాయింపులు రూ. 12,367 కోట్లు. అన్నం ఉడికిందా అని కుండంత పిసికి చూడాల్సిన అవసరం లేదు. దీన్నే బట్టే మనకు తెలంగాణ పురోగమనం అర్థం అవుతుంది.
• వైద్యారోగ్య శాఖ చాలా ప్రాధాన్యత కలిగిన శాఖ. ఏ సందర్భంలోనైనా చాలా లైవ్ గా ఉండాల్సిన శాఖ.
• వైద్యారోగ్య శాఖను చాలా అనూహ్యంగా విస్తరిస్తున్నాం. 17 వేల పడకల నుండి 50 వేల పడకలకు విస్తరించాం. వందో రెండొందలో ఉన్న ఆక్సిజన్ బెడ్లను 50 వేలకు పెంచుకున్నాం.
• కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నులు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం.
• నాకొక విచిత్రమైన అనుభవం ఉంది. మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదు. ఈ మధ్య మిడతల బెడద లేదు. వెనుకటి కాలంలో ఉండేది.
• మహాకవి శ్రీనాథుడు నిర్బంధంలో ఉండి చనిపోయే సమయంలో పాడతాడు. పొలం కౌలుకు చేసుకుంటుంటే కృష్ణవేణమ్మ కొంత తీసుకుని పోయింది. బిలబిలాక్షులు(మిడతలు)కూడా కొంత తీసుకుపోయిందని బాధపడతాడు.


• ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడత బెడద లేదు.
• మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తూంటుంది.
• నేను చాలా ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ చెప్తున్నాను.
• ఈ మిడతల దండు హర్యానాలోకి వచ్చి అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోకి ప్రవేశించి, ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వస్తున్నది.
• భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తే ఆదిలాబాద్ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫైరింజన్లు, స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నాం.
• ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా ఆఫీసర్, మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇద్దరు ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వచ్చారు. వారికి హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపాం.
• మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదు.


• అనంతరం ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు మమ్మల్ని కలిసి మాకు హెలికాప్టర్ ఇచ్చి, మమ్మల్ని గౌరవించి బాగా చూసుకున్నారని ధన్యావాదాలు తెలిపారు.
• సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు కనుక్కో లేదని నేను వారిని నా అకాడమిక్ ఇంట్రస్ట్ కొద్దీ ప్రశ్నించాను.
• సార్ మిడతలను చంపలేము. నిర్మూలించలేము. అది అసాధ్యమని చెప్పారు
• మనిషి 4 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు. కానీ ఈ మిడతలు, బాక్టీరియాలు, ఇతరత్రా 8 లక్షల సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. అవి నిద్రాణంగా ఉంటాయి. వాటికి వ్యతిరేక చర్యలతో ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయని ఎంటమాలజిస్టులు చెప్పారు.
• కరోనా కూడా అటువంటిదేనా అంటే అటువంటిదే అని వారు చెప్పారు.


• ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సలహాలివ్వాలని అడిగితే, ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయని వారు చెప్పారు. లేకపోతే నష్టాలు ఎక్కువగా జరుగుతాయని వారు తెలిపారు. ఆరోగ్యశాఖ ప్రాధాన్యతను దీన్ని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
• అప్పటి నుండి ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దాలని భావించి, ఆరోగ్య శాఖ మంత్రులను, అధికారులను పిలిచి గంటలు, రోజులు, వారాల తరబడి చర్చించి అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా పెంచి ఈ శాఖను మనం ముందుకు తీసుకుపోతున్నాం.
• గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం.


• పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్ళు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే, మళ్ళీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. పెరుగుదలలో సమస్య రాకుండా ఉండాలంటే ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పంచబడుతున్నవే న్యూట్రిషన్ కిట్లు. వీటి పరమార్థం ఇదే.
• ఈ రోజు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది ? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి ? చేపట్టాల్సిన చర్యలు ఏంటి ? అనే ప్రణాళికల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని నేను ఆరోగ్యశాఖ అధికారులను కోరుతున్నాను
• “బెస్ట్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్” ( ఉత్తమ ప్రణాళికతో సగం విజయం సాధించినట్లే) అని చెప్పినట్లు, వైద్యారోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి. ఇంకా ఎంతో ముందుకు పోవాలి. ఎలా ఈ లక్ష్యాలను ఎలా సాధించవచ్చో మీరు బాగా ఆలోచించగలరు.


• డాక్టర్లు గొప్పవారు. మంచి మనసున్న వాళ్ళు. నిరుపేదల వైద్యం కోసం వస్తే, బెడ్లు అందుబాటులో లేనప్పుడు ఉదారమైన హృదయంతో ఒక అరగంట ఎక్కువ పని చేసైనా కిందనే బెడ్డు వేసి వైద్యం అందిస్తారు. అది వాస్తవం. కానీ పత్రికలు, జర్నలిస్టులు అవాస్తవాలను ఉస్మానియాలో బెడ్లు లేవు. పేషెంట్లను కింద పడుకోబెడుతున్నరు అంటూ వక్రీకరణలు చేస్తారు.
• వైద్యారోగ్య శాఖ అధికారులకు పబ్లిక్ రిలేషన్స్ (పిఆర్) చాలా తక్కువ. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు. నేను మీతో గంటల తరబడి మాట్లాడిన సందర్భాల్లో కలిగిన అనుభవాలు ఇవి.
• మనం కూడా మానవత్వ కోణంలో ఆలోచించాలి
• వైద్యం ప్రత్యేక చదువు. ప్రత్యేకమైన అర్హత. ఐఎఎస్ లైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా డాక్టర్ల దగ్గరకు రావాల్సిందే.
• ఒకసారి విచిత్రమైన సందర్భం వచ్చింది. ములుగు, భూపాలపల్లి ప్రాంతానికి పోస్టింగ్ లు ఇచ్చారు.వాళ్ళు జాయిన్ కావడం లేదు. కారణమేంటని నేను వాళ్ళను పిలిచి అడిగాను.


• మేం పోవడానికే సిద్ధమే కానీ మా భార్యలు రావడం లేదని చెప్పారు. ఎందుకని అడిగితే అక్కడ ఒక ఒక సినిమా మాల్ లేదు, ఇతరత్రా సౌకర్యాలు లేవని తమ సమస్యలు చెప్పారు.
• ఈ సందర్భంగా వాళ్ళు తాలూకా కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో ఉండేలా రూల్స్ సడలింపు చేయాలని చెప్పి అప్పుడున్న హెల్త్ సెక్రటరీ గారికి చెప్పాను. దాంతో పాటు వారికి ఎక్స్ ట్రా అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పాను.
• పోలీస్ స్టేషన్ లలో, పోలీస్ ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్ళిన ప్రజలకు, ప్రముఖులకు పోలీసులు మర్యాద ఇస్తున్నారని, ఇది మంచి మార్పు అని భావిస్తున్నారు.
• వైద్యారోగ్య శాఖ మంత్రి మంచి చురకైన వ్యక్తి కాబట్టీ వారికి నేను మనవి చేస్తున్నాను. వైద్యశాఖ అందించే సేవలు ప్రజల్లోకి పోయేలా పిఆర్ ను పెంపొందించాలి. ప్రజలతో పెనవేసుకున్న విభాగం కాబట్టీ వైద్యారోగ్య రంగం పిఆర్ బాగా పెరగాలి. వైద్యారోగ్య శాఖ ప్రజల బాగు కోసం ఏం చేస్తుంనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలి. ప్రయత్నిస్తే ఫలితముంటుంది.
• గతంలో పేద గర్భిణులు ప్రసవానికి ప్రైవేట్ ఆసుపత్రికి పోయేది. ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కిట్ల ద్వారా వారికి నగదు సాయంతో పాటు, ప్రసవానంతరం ఇచ్చి కిట్లతో నేడు ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి.
• గతంలో హాస్పటల్స్ లో 30 శాతం ప్రసవాలు జరిగితే, నేడు 70 శాతం ప్రసవాలు హాస్పటల్స్ లోనే జరుగుతున్నాయి. దానివల్ల మహిళల ఆరోగ్యం బాగుంటున్నది. అనవసరమైన అబార్షన్లు, దుర్మార్గపూరిత చర్యలు కూడా ఉండటం లేదు. సమాజాన్ని కాపాడుకోగలుగుతున్నాం. మాతా మరణాలు, శిశు మరణాలు చాలా తగ్గాయి.


• మీ పీఆర్ బాగా పెరగాలి, మీ ప్లానింగ్ బాగుండాలి అని నేను మంత్రి గారిని కోరుతున్నాను.
• రాష్ట్రంలో గొప్పగా హాస్పటల్స్ కట్టుకుంటున్నాం. వరంగల్ లో ప్రపంచంలో ఎక్కడలేనటువంటి సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను కడుతున్నాం. ఒకప్పుడు నిమ్స్ లో 900 పడకలుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 1500 పడకలకు తీసుకునిపోయాం. మరో 2000 పడకలను మనం కట్టుకుంటున్నాం.
• హైదరాబాద్ లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటి హాస్పటల్స్ కట్టుకుంటున్నాం.
• విదేశాలకు పోకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలిమెడిసన్ బాగా వినియోగించడం, వీటి సమాహారంగా అద్భుతాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది.
• ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి.


• క్వెస్ట్ ఫర్ ఎక్స్ లెన్స్ నెవర్ ఎండ్స్ (శ్రేష్ఠత కోసం పడే తపన నిరంతరమైనది). శ్రేష్ఠత, సంస్కరణల కోసం చేసే పనులకు ముగింపు ఉండదు.
• ఉత్తమోత్తమ సేవలు ప్రజలకు అందించడానికి, కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తే కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది.
• ప్రైవేట్ హాస్పటల్స్ లో కరోనా సోకిన పేషెంట్ పరిస్థితి విషమిస్తే గాంధీ హాస్పటల్స్ కు పంపించే వారు. గాంధీ డాక్టర్లు అటువంటి పేషెంట్స్ ను కూడా బతికించారు. వారి సేవలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గొప్పగా సేవలు అందించారు.
• వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో మన రాష్ట్రంలోని పరిస్థితులకు అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా వైద్యసేవలు అందించేలా వైద్యులు ప్రణాళికలు రూపొందించాలి.


• వైద్యారోగ్య శాఖ మీదున్న అపవాదును తొలగించుకొని, రాష్ట్రంలో వైద్యశాఖే నెంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి.
• వైద్యారోగ్య సాధించిన విజయాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరోసారి మీకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు.
• జై తెలంగాణ అంటూ ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరక్టర్ గడల శ్రీనివాస్, మెడికల్ హెల్త్ డైరక్టర్ రమేశ్ రెడ్డి, టిఎస్ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సిఎం వోఎస్డీ గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, నిమ్స్ డైరక్టర్ బీరప్ప, పర్యాటక శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్,వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...