ఇరవై ఒక్క రోజులు అవతరణ ఉత్సవాలు

Date:

వివరాలను విడుదల చేసిన తెలంగాణ సీఎం
హైదరాబాద్, మే 23 :
‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మంగళవారం సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్ ఇలా ఉంది….
• జూన్ 2
‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. జూన్ 2న హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలుంటాయి.

• జూన్ 3 రైతు దినోత్సవం
జూన్ 3 శనివారం నాడు ‘‘తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.

• జూన్ 4 సురక్ష దినోత్సవం
జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.

• జూన్ 5 విద్యుత్తు విజయోత్సవం
జూన్ 5వ తేదీ సోమవారం నాడు ‘‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.

• జూన్ 6 పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
జూన్ 6వ తేదీ మంగళవారం ‘‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’’ జరుగుతుంది. ఈరోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

• జూన్ 7 సాగునీటి దినోత్సవం
జూన్ 7వ తేదీ బుధవారం ‘‘సాగునీటి దినోత్సవం’’ నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతారు.

• జూన్ 8 చెరువుల పండుగ
జూన్ 8వ తేదీ గురువారం ‘‘ఊరూరా చెరువుల పండుగ’’ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్య కారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసిచెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

• జూన్ 9 సంక్షేమ సంబురాలు
జూన్ 9 శుక్రవారం రోజున ‘‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో సభ ఉంటుంది.

• జూన్ 10 సుపరిపాలన దినోత్సవం
జూన్ 10వ తేదీ, శనివారం ‘‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’’ నిర్వహిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.

• జూన్ 11 సాహిత్య దినోత్సవం
జూన్ 11వ తేదీ, ఆదివారం నాడు ‘‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’’ నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులందజేస్తారు.

• జూన్ 12 తెలంగాణ రన్
జూన్ 12వ తేదీ సోమవారం ‘‘తెలంగాణ రన్’’ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

• జూన్ 13 మహిళా సంక్షేమ దినోత్సవం
జూన్ 13 మంగళవారం ‘‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’’ నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.

• జూన్ 14 వైద్య ఆరోగ్య దినోత్సవం
జూన్ 14వ తేదీ బుధవారం ‘‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవా’’న్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ది గురించి వివరిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

• జూన్ 15 పల్లె ప్రగతి దినోత్సవం
జూన్ 15 గురువారం ‘‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’’ జరుపుతారు. ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలుంటాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.

• జూన్ 16 పట్టణ ప్రగతి దినోత్సవం
జూన్ 16వ తేదీ శుక్రవారం ‘‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’’ నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.

• జూన్ 17 గిరిజనోత్సవం
జూన్ 17వ తేదీ శనివారం ‘‘తెలంగాణ గిరిజనోత్సవం’’ జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.

• జూన్ 18 మంచినీళ్ల పండుగ
జూన్ 18వ తేదీన ఆదివారంనాడు ‘‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’’ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.

• జూన్ 19 హరితోత్సవం
జూన్ 19వ తేదీ సోమవారం ‘‘తెలంగాణ హరితోత్సవం’’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.
• జూన్ 20 విద్య దినోత్సవం
జూన్ 20వ తేదీ – మంగళవారం ‘‘తెలంగాణ విద్యాదినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభిస్తారు. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.

• జూన్ 21 ఆధ్యాత్మిక దినోత్సవం
జూన్ 21వ తేదీ బుధవారం ‘‘ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’’ నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.

• జూన్ 22 అమరుల సంస్మరణ
జూన్ 22వ తేదీ గురువారం ‘‘అమరుల సంస్మరణ’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు.
• మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు.
ఈ ఉన్నతస్థాయి ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్; ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, శంకర్ నాయక్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్పిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాస్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిజిపి అంజనీ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రిస్టియానా చోంగ్తు, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ సంచాలకులు రాజమౌళి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...