వేయి ప‌డ‌గ‌లు ఎందుకు చ‌ద‌వాలంటే….

Date:

క‌ల్లూరి భాస్క‌రం విశ్లేషాత్మ‌క ర‌చ‌న‌
(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును…
ఈ వాక్యంతోనే వేయిపడగలు పుస్తకం ప్రారంభం అవుతుంది. గణాచారి పలికే ఈ మాటలను చాలామంది ఛాందసంగా భావించారు. ఇటీవల విడుదలైన కాంతార చిత్రంలో వావ్‌ అంటూ భవిష్యత్తు చెబుతుంటే అందరూ నోరు వెళ్లబెట్టుకుని చూశారు. కొన్ని దశాబ్దాల క్రితమే గణాచారి లాంటి వారు ఉంటారని విశ్వనాథ వారు వాస్తవాలను వేయిపడగలులో చూపారు.
ప్రస్తుతంలోకి వస్తే…
కల్లూరి భాస్కరం రచించిన ‘వేయి పడగలు నేడు చదివితే పుస్తకం చదివితే నాడు కలిగిన అనుభూతి మళ్లీ కలుగుతుంది. విశ్వనాథ వారి మనస్సును తనలోకి ఆవహింపచేసుకుని, ఆయన అంతరంగాన్ని యథాతథంగా చూపారు అనిపిస్తుంది. ఈ పుస్తకంలో ’ఒక కోణం నుంచి చూస్తే గొప్ప అనుభూతి గాఢత నిండిన కవిత్వమూ, గొప్ప దుఃఖమూ విమర్శకు అతీతాలు. వేయిపడగలు పేరుతో వేయి పుటల మీదుగా ప్రవహించినది, విశ్వనాథ వారి అలాంటి మహాదుఃఖం. మహాకవితాత్మక దుఃఖం. అది గతించిన, గతించిపోతున్న ఒకానొక వ్యవస్థను గురించిన దుఃఖం. బహుశా అప్పటికి ఎంతోకాలంగా హృదయంలో సుడులు తిరుగుతున్న ఆ దుఃఖం ఒకానొక క్షణంలో కట్టలు తెంచుకుని ఇరవై తొమ్మిది రోజులపాటు ఏకబిగిని ప్రవహించి అక్షరరూపం ధరించి మహాశోకప్రవాహం అయింది. ఆ ప్రవాహపు ఉరవడిలో మనం ఉక్కిరిబిక్కిరవుతాం. అప్రతిభులమైపోతాం. మనకు తెలియని ఒకానొక అపూర్వ జగత్తులో, అనేకానేక సందేహాలు, విచికిత్సల మధ్య దిక్కుతోచని స్థితిలో కొట్టుకుపోతాం’ అంటున్న ఒక్క విషయం చదివితే చాలు, ‘వేయిపడగలు’ వేయి పేజీల సారాంశం మన మనోఫలకం మీద శిలాక్షరాలు లిఖిస్తుంది.


వేయిపడగలు మీద సమీక్ష రాయటం ఎంత సాహసమో, ‘నేడు వేయి పడగలు చదివితే’ మీద సమీక్ష రాయటమూ అంతే సాహసం. ఈ పుస్తక రచనా విధానంలో మరో విశ్వనాథ కళ్ల ముందు నిలబడి, మనలను చేయి పట్టుకుని తన వెంట నడిపిస్తారు.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఆయన ఒక చేత్తో కాకుండా, తన రెండు చేతులూ అందించి, రెండుచేతులతో తన పాదాల మీద నిలబెట్టుకుని తాను అడుగులు వేస్తూ, మన చేత అడుగులు వేయించారు రచయిత కల్లూరి భాస్కరం. మిచెల్‌ రచించిన గాన్‌ విత్‌ ద విండ్‌ పుస్తకానికి, వేయిపడగలు కి గల పోలికలను విపులంగా విశదీకరించారు. ఆ రెండు పుస్తకాలు చదవలేనివారు ఈ పుస్తకం చదివితే ఆ రెండూ చదివిన ఫలితం వచ్చి తీరుతుంది.
‘నాలుగు వర్ణాల వారూ ఎవరెవరి వృత్తిధర్మాల పరిధిలో వారు ఉంటూనే దేవాలయం, దైవభక్తి కేంద్రంగా పరస్పర ప్రేమాభిమానాలతో హృదయైక్యతతో ఉండడం’ అంటూ వేయిపడగలను వివరించారు.
ఈ రెండు పుస్తకాల మధ్య ఉన్న పోలిక గురించి, ‘‘రెండింటి మధ్య ప్రధానమైన పోలిక – ఒకానొక కులీన , శ్రేష్ఠ, సాంప్రదాయిక సమాజం ఎలా పతనమైందో చిత్రించడం’’ అంటారు.
‘వేయిపడగలులో అట్టడుగున శ్రామికవర్ణం (గోపన్న) ఉన్నట్లే గాన్‌ విత్‌ ద విండ్‌లో బానిసల రూపంలో శ్రామిక వర్ణం ఉంది. బానిసలలో కూడా మళ్లీ హెచ్చుతగ్గులు. పొలంలో పని చేసే బానిసల కంటె, గృహంలో పనిచేసే బానిసలు ఉన్నతస్థానంలో ఉంటారు’. వర్ణ వివక్ష ప్రపంచవ్యాప్తంగా ఉన్నదనటానికి ఇంతకంటె నిదర్శనం ఏం కావాలి.


‘వెయ్యేళ్ల అంధ చరిత్ర నుంచి యూరప్‌ బయటపడి, పునరుజ్జీవన రూపంలో తెచ్చుకున్న అసాధారణ క్రియాశీలత అమెరికాలోకి ప్రసరించిన పరిణామంలో భాగమే గాన్‌ విత్‌ ద విండ్‌లోని కులీన సమాజం. యూరప్‌లో జరిగినట్టు వేయిపడగల వర్ణసమాజపు, లేదా ఆ వర్ణ సమాజం గురించిన ఊహల తాలూకు పునాదులను కదిలించి పెద్ద ఎత్తున క్రియాశీలం చేయగల, పునరుజ్జీవనంతో పోల్చగల పరిణామం భారతదేశంలో ఆధునిక కాలం వరకూ లేదు. లేకపోగా ఆ స్తబ్దతను, ఘనీభవస్థితిని, క్రియాశీల, పోరాట రాహిత్యాలను తాత్వీకరించి ఘనంగా కీర్తించటం భారతదేశంలోనే ఉంది’ అంటూ తులనాత్మక అధ్యయనాన్ని అందించారు.
‘వేయి ప్రశ్నల పడగలు’ అంటూ ఎన్నో ప్రశ్నలను సంధించారు.
ఈ పుస్తకం గురించి నాలుగు ముక్కలలో సమీక్షించటం కష్టమైన పని.
స్వయంగా పుస్తకం కొని చదివితే కలిగే అనుభూతి ఎవరికి వారు అనుభవించాల్సిందే. పుస్తకం చదువుతున్నంతసేపు, వేయిపడగల నాటి సుబ్బన్నపేట మళ్లీ మన కళ్ల ముందు కదులుతుంది. గాన్‌ విత్‌ ద విండ్‌ చదువుతున్నా అదే అనుభూతి కలుగుతుంది.
ఇటువంటి విలక్షణమైన పుస్తకాలు రావలసిన అవసరాన్ని కల్లూరి భాస్కరం గుర్తించి, ఎంతో పరిశోధనతో ఈ పుస్తకం రచించారని అర్థం అవుతుంది.
నిజానికి ‘వేయిపడగలు’ పుస్తకం మీద ఉన్న మమకారంతో ఈ సమీక్ష రాయటానికి సాహసించానే కాని, ఈ పుస్తకం గురించి రాయడానికి అర్హత కన్నా సాహిత్యం పై అభిమానం,విశ్వనాధ వారి మీద అపారమైన గౌరవం, భక్తిప్రపత్తులు. అందుకే
ఒక అభిమానిగా మాత్రమే ఈ నాలుగు అక్షరాలు రాశాను.
‘వేయిపడగలు’ కవికి, ‘వేయి పడగలు నేడు చదివితే’ రచయితకి వినమ్రంగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
పుస్తకం: వేయి పడగలు నేడు చదివితే
రచన: కల్లూరి భాస్కరం
వెల: 225 రూపాయలు
పేజీలు: 182
ప్రతులకు:7093800303

Book Author Kalluri Bhaskaram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...