క‌ళా త‌ప‌స్వికి ఏపీ అవార్డు

Date:

క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌
ఆర్ద్ర‌త త‌ప్ప అన్య‌మెరుగ‌ని సినీ ద‌ర్శ‌కుడు
(డాక్ట‌ర్ వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
కె. విశ్వనాథ్‌…
కె – కళాతపస్వి.
విశ్వనాథ్‌ – సినీ విశ్వానికి నాథుడు.
ఆదుర్తి అనే గురువును మించిన శిష్యుడు కాశీనాథుడు.
సినీ పంకంలో పుట్టిన తెల్ల కలువ, రాజహంస.
మానవ మేధస్సును ఆలోచింపచేసే పరమశివుడు.
విశ్వనాథుని శిరస్సు నుండి జాలువారిన గంగమ్మలు ఎంతమందో.
ఆ జటాజూటంలో చిక్కుకున్న బహుమతులు ఎన్నో.
ఎందరో భగీరథులు తపస్సు చేసి, విశ్వనాథుని గంగాకలం నుంచి కావలసినన్ని అలకనందన, భాగీర ధులను ప్రవహింపచేశారు.
సార్థకనామధేయులు. సినీ ప్రేక్షకులకు పంచభక్ష్యపరమాన్నాలు అందించిన అక్షయపాత్ర.
నియమాలతో జీవిస్తూ, నిబద్ధతతో చిత్రాలు నిర్మించిన మౌని. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం
కె. విశ్వనాథ్‌కు జీవిత సాఫల్యపురస్కరం ప్ర‌క‌టించిన‌ సందర్భంగా ఈ చిరు కపాలపాత్రను ఆ దిగంబరునికి కానుకగా అందిస్తున్నాం.
దిక్కులే తన వస్త్రాలుగా ధరించినవాడు దిగంబరుడు. అన్ని దిక్కులకు తన ఆలోచలను విస్తరించినవారు విశ్వనాథులు. ఈ విశ్వనాథుని గురించి నాలుగు అక్షర కుసుమాలు.


––––––––––––
చిత్రం ముగింపులో ప్రధాన పాత్ర మరణించినా బాధ కలిగించనివ్వరు. మనిషికే కాని మరణం, కళకు కాదు అని ఒప్పిస్తారు. బలవంతపు విషాదాంతం ఈ విశ్వనాథుని కలం రాయలేదు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతికిరణం… కంటనీరు రాదు. మనసు ఆర్ద్రతతో తడిసిపోతుంది.
నిర్మాతల ఒత్తిడికి, బాక్స్‌ ఆఫీసు సూత్రాలకు తల వంచకుండా, తాను నమ్మిన విలువలకు కట్టుబడి తన పంథాను విడిచిపెట్టకుండా సినిమాలు తీసి, అందరికీ సంగీతసాహిత్యనాట్యాలు నేర్పారు. ప్రేక్షకుడి మనసును కదిలించి, కలకాలం గుర్తు ఉంచుకునేటట్టు చేయగలగటమే ఆయన శైలి. తరతరాల ప్రేక్షకులను ఆకర్షించగలిగేవి, ప్రేక్షకులను సినిమాలో లీనం చేసి, పాత్రల ఆశయాలు, కష్టసుఖాలు తనవిగా అనుభూతి కలిగించేవి మాత్రమే మంచి సినిమాలు. పెద్దవాళ్ల నిర్ణయాలు మన మంచికేనని తెలియచేశారు విశ్వనాథ్‌. ఎదుటివారి ప్రతిభకు తన ప్రావీణ్యం అడ్డు రాకుండా చూసుకున్నారు.

K Viswanath Launched Kooniragalu Book Photos


విశ్వనాథ్‌ కళా ప్రేమికుడు. ఓ సీత కథ చిత్రంలో హరికథ చూపారు. సూత్రధారులు చిత్రంలో గంగిరెద్దుల మేళం వారి జీవితాలను ఎంతో సహజంగా చూపారు.
ఇక సిరిసిరి మువ్వ నుంచి తన సంగీతసాహిత్య ప్రయాణం పూర్తిగా ప్రారంభించారు. తెలుగు వారికి లలితకళల పరమానాన్ని తినిపించారు. జంధ్యాల, సిరివెన్నెల, కె.వి. మహదేవన్, బాలు, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, చంద్రమోహన్‌… వంటì వారిని కుటుంబ సభ్యులను చేసుకున్నారు. ఇది ఆదుర్తి సుబ్బారావు నుంచి నేర్చుకున్న సంస్కార సంప్రదాయం.


విశ్వనాథ వారి చిత్రాలలో పాత్రలు సంభాషిస్తాయి. నటులు కనిపించారు. నటన అసలు కనపడదు. శంకరాభరణంలో ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి’ పాటలో అద్వైతాన్ని నీటిలో నీడతో కలిపి చూపిన సునిశిత భావప్రకటనా లక్షణం వారి సొంతం. పాత్రకే తులసి అని పేరు పెట్టి, ఆ పవిత్రతను చిత్రమంతా చూపారు. కుల సంకెళ్లు తెంచారు. పసిపిల్ల బిందెతో నీళ్లు తెస్తూ పడిపోతే, ‘ఏం నీకు వంట చేయటం రాదా’ అని శంకరశాస్త్రి పాత్రతో ప్రశ్నించారు. శంకరశాస్త్రి తన కళను శంకరానికి అందిస్తూ, పసిపిల్లవాడి పాదాలకు గండపెండేరం తొడిగి, శతమానం భవతి అంటూ ఆశీర్వదించి కళ్లు మూస్తాడు. కళకు అంతం లేదనే విషయాన్ని గుర్తు చేశారు.
ఇది మచ్చుకి మాత్రమే.


స్వాతి కిరణం చిత్రంలో ఆనతినీయరా హరా… పాటలో రాధిక భావప్రకటన, సాగరసంగమం చిత్రంలో జయప్రద బొట్టు వాన నీటి బొట్టుకి చెదరకుండా చెయ్యి అడ్డుపెట్టడం, స్వర్ణకమలంలో పంచాక్షరీ మంత్రం, సప్తపది చిత్రంలో సబిత తన గురించి తాతయ్య గుండెల మీద తల ఉంచి ‘తాతయ్యా’ అనటంలో కథంతా చెప్పటం… ఇవన్నీ కళాతపస్వికి మాత్రమే సాధ్యం.
అల్పాక్షరాలు – అనంతార్థం… ఇదీ విశ్వనాథ్‌ శైలి.
సిరివెన్నెల చిత్రంలో ఫ్లూట్‌లో సిరాక్షరాలు పోసి, కథానాయిక మనసుతో పాడించటం విశ్వనాథ్‌కు మాత్రమే సాధ్యం. రామకృష్ణ పరమహంసకు భార్యలో తల్లి కనిపించింది. సప్తపదిలో పరాధీన అయిన భార్యలో అమ్మవారు కనిపించింది.
ఎన్నని చెప్పగలం. ఎంతని ప్రశంసించగలం.


అనన్వయాలంకారంలాగ కె. విశ్వనాథ్‌ ఒక్కరే. ఒక్కరు విశ్వనాథ్‌. అంతే.
ఆయన సినిమా ద్వారా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. మనసులోని మాలిన్యాన్ని కడిగేసుకోవచ్చు
కె. విశ్వనాథ్‌ గారికి అభినందనలు చెబుతోంది మా వ్యూస్‌ చానెల్‌.

Author with Kalatapasvi K Viswanadh during an interview at Vijayawada Mural Fortune Hotel when she is working with Sakshi

1 COMMENT

  1. విశాల విశ్వం గర్వించదగ్గ, మహోన్నత వ్యక్తిత్వం గల
    *కళాతపస్వి* కె విశ్వనాద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన *జీవన సాఫల్య పురస్కారం* ప్రకటించడం హర్షణీయం.
    *అభినందనలు*

    …బోడి ఆంజనేయ రాజు
    ప్రధాన కార్యదర్శి,*ఎక్స్ రే*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...