వందేళ్ల‌నాటి అల్లూరి అరుదైన ఇంట‌ర్వ్యూ

Date:

విప్ల‌వ జ్యోతి అల్లూరి ఇంటర్వ్యూ
(1923, ఏప్రిల్ 23, ఆంధ్ర పత్రిక)
అది 19 ఏప్రిల్ 1923 వ సంవత్సరం. విప్ల‌వ జ్యోతి అల్లూరి సీతారామరాజు ఈనాడు పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతున్న అన్నవరానికి విచ్చేసారు. అది ప్రొద్దున ఆరు గంటల ముప్పై నిముషాల సమయం. ఉన్నట్టుండి అల్లూరి సీతారామరాజు గారు అయిదుగురు ప్రముఖ అనుచరులతో మరికొంత మంది తన ఆటవిక అనుయాయులతో అన్నవరం కొండ గుట్ట మెట్లెక్కారు. అక్కడ ఆయన రాకతో అమితానందముతో కొంద‌రు, ఏమి జరగబోతోందో అన్న ఆత్రముతో కొందరు ప్రజలు అక్కడ గుంపులుగా చేరారు. అపుడే బహిర్భూమి నుండి విచ్చేస్తున్న ఓ ఇరవై ఏళ్ళ యువకుడు ఈ వార్త విని అతి సంతోషముతో అతి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం అయిందనిపించి పరుగున అన్నవరం కొండ వద్దకు చేరుకున్నారు. ఆ యువకుడు పేరు చెరుకు నరసింహా రావు.
అన్నవరం స్వామి వారి దర్శనం కొందరు అనుచరులు చేసిరి. రాజు గారు తాను స్నానమొనర్చలేదని దర్శనం చేసుకోలేను అని అక్కడ ఉన్న సత్రములో కూర్చున్నారు. ఆ వెంటనే అన్నవరం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని పోలీస్ కానిస్టేబుల్ ని పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాల వివరాలు అన్నీ తీసికుని వాటిని స్వాధీనం చేసుకున్నారు అల్లూరి సీతారామరాజు.
అక్కడకు వెళ్లిన ఆ యువకుడు బక్క పలుచగా, గడ్డం పెంచి, మోమున నామము, ఖద్దరు ఖాకీ నిక్కరు, ఖద్దరు చొక్కా ధరించి, చేతిలో ఒక పేము బెత్తము పట్టి అమిత తేజస్సుతో, నవ్వు మొగముతో, చురుకైన చూపులతో, పాదాలకు చెప్పులు కూడా లేకుండా ఉన్న అల్లూరి వారిని మీరు ఏ సంవత్సరం లో జన్మించారని అడిగారు. తను హేవిళంబి నామ సంవత్సరం లో జన్మించాను అని తన వయస్సు 26 ఏళ్ళు అని చెప్పారు.
అల్లూరి వారి పక్కన ఒక వస్తాదు వలె పొట్టిగా అయిదడుగుల ఎత్తు, ధోవతీ, కోటు, తలపాగా ధరించి ఓ చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీ , భుజాన నాణాల సంచి వేలాడుతూన్న అతడిని గంటం మల్లు దొర అని రాజు గారి ముఖ్య అనుచరుడని, అతని వయస్సు ముప్పది అని తెలుసుకున్నాడు ఆ యువకుడు.
మిగతా నలుగురు అనుచరులు ధోవతీ, తలపాగా మాత్రమే ధరించి , చెప్పులు కూడా లేకుండా నిలబడి ఉన్నారు. వారిలో అందరూ యువకులే.. ఒకతను మాత్రము యాబది ఏళ్ళు వయసు ఉన్నా చురుగ్గా ఉన్నాడు. అందరి వద్దా పదునైన కత్తులు, విల్లంబులు, తుపాకులు కూడా ఉన్నాయి.
మిగతా అనుచరులు అందరూ కత్తులు, విల్లంబులు ధరించి ఉన్నారు.
రాజు గారు గొప్ప తపస్సంపన్నుడని , అమిత తేజస్సుతో ఉన్న ఆయన్ని అనేక జనులు పాదములు త్రాకి మ్రొక్కిరి. అక్కడకు వచ్చిన జనులందరికీ అల్లూరి వారి దేశ స్వతంత్ర ప్రాముఖ్యాన్ని తెలుగు మరియు ధారాళంగా ఆంగ్ల భాషలో వివరించి చెప్పారు.
అప్పుడా యువకుడు మీరు ఎంతసేపు ఇచట ఉండెదరు అని ప్రశ్నించెను.
అల్లూరి – నేను మరో రెండు గంటలు ఇక్కడ ఉండెదను. పోలీసులు నా వివరాలు తంతి ద్వారా తెలిపిన కాకినాడలో ఉన్న ఆఫీసర్లు ఇక్కడకు మోటారు వాహనాలు మీద రావడానికి రెండున్నర గంటలు పైగా పట్టును. అప్పటికి మేము క్షేమముగా ఇక్కడ నుండి వెళ్లిపోయెదము.
మీరు ఇచట నుండి ఎక్కడకు వెడుతున్నారు?
అల్లూరి- మేము ఎపుడు ఎక్కడ ఉండాలి, మకాం వాటిని ఎన్నడూ నిర్ణయించుకోము ( నవ్వుతూ చెప్పెను).
మీరు ఇక్కడికి ఏల వచ్చితిరి?
అల్లూరి- మా అనుచరులు కొందరు పొరబాటున నేను ఇచ్చిన సూచనలు పాటించక కాల్పులు జరిపిరి. క్షేమం కోసం మేము వెంటనే మకాం మార్చి ఇక్కడకు వచ్చితిమి.
మీరు ఏ సంకల్పంతో ఈ పితూరి ఉద్యమము నడుపుతున్నారు?
అల్లూరి – స్వాతంత్య్ర‌ సిద్ధి కోసం. దౌర్జన్యం చేస్తున్న వారిని అదే రీతిలో వెడల గొట్టిన గానీ స్వతంత్ర సిద్ధి కలుగదు.
ఉద్యమం వల్లే స్వతంత్ర సిద్ధి కలుగునని మీకు నమ్మకము కలదా?
అల్లూరి – రెండేళ్లలో స్వతంత్ర సిద్ధి కలుగును.
రెండేళ్లలో స్వాతంత్య్ర‌ సిద్ధి విప్ల‌వ‌ మార్గమున లభించ గలదా?
అల్లూరి – అవును ..నా అనుచరగణం లెక్కకుమిక్కిలిగా ఉన్నది. జనములో ఇపుడు మిక్కిలి స్వాతంత‌త్య్ర‌ పిపాస ఉంది. కానీ తుపాకులు, మందు గుండ్లు ఉన్నచో వీరిని రెండేళ్లలో తరిమి కొట్టెదము.
ఈ దౌర్జన్యం వల్ల కాల్పులు వీటి వల్ల జన క్షయం కలుగును. జర్మనీ వంటి దేశాలు కూడా ఇపుడు స్వాతంత్య్ర‌ సిద్ధికి అహింసా సిద్ధాంతాన్ని గాంధీ గారు బోధిస్తున్నటుల అనుసరిస్తున్నారని వింటున్నాము. శాంతి మార్గం మంచిదని అందరూ నమ్ముతున్నారు కదా?
అల్లూరి – అహింసా పరమోధర్మ సూక్తి మంచిదే కానీ దాని పూర్తి అర్థం మార్చి వేశారు. ప్రజలు ఆకలితో బాధింపబడుతూ చస్తూ ఉంటే అహింసా సిద్ధాంతానికి మడికట్టుకు కూర్చోవడం మీద నాకు నమ్మకం లేదు.
హింసా సిద్ధాంతాన్ని నమ్మితే జనులు ఎక్కువగా చనిపోవుదురేమో. ఇంతకు మునుపు మీ అనుచరుల పరిస్థితి ఎలా ఉండెను?
అల్లూరి – నా అనుచరులు తక్కువ అయినా, మిక్కిలి ధైర్యం కలిగిన పోరాట పటిమ కలిగిన వారు. మేము ఆరు యుద్దాలు చేసి ఆంగ్లేయ ముష్కరులను తరిమికొట్టాము. ఇది చివరి యుద్ధం, ముగిసింది, అని కొందరు అనుచరులు ఏమరుపాటుతో నిద్రపోవుచు ఉండగా, పోలీసులు కాల్పులు జరిపిరి. పోలీసుల సంఖ్య మిక్కిలిగా యున్నది. మా అనుచరులు కొందరు అడవిలోకి అప్పటికే వెళ్లిపోయిరి.. నా మీద కూడా కాల్పులు జరిపారు. పరుపు అడ్డం పెట్టుకుని నేను తప్పించుకుని అనుచరుల ప్రాణాలు పోకుండా తప్పించుకుని సుదీర్ఘంగా ఉన్న కొండ సానువుల్లోకి వెళ్లిపోయాము. నాలుగు నెలలు అక్కడ వారికి శిక్షణ కొనసాగించాము.
అపుడు మీరేమి చేసిరి?
అల్లూరి – నా అనుచరులకు శిక్షణ ఇస్తూ మిగతా సమయములో తపస్సు చేసితిని.
గయ లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో మీరు ఉంటిరని కొందరు చెప్ఫకున్నట్టు తెలిసింది. అది నిజమేనా.
అల్లూరి -ఆ సమయంలో నేను అడవిలో ఉన్నాను. నా స్థూల శరీరము అక్కడికి వెళ్లలేదు గానీ. సూక్ష్మ శరీరం వెళ్ళింది. (అనేక ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు సైతం నాకు తెలుసు అంటూ గయలో ఆనాడు కాంగ్రెస్ సభలో జరిగిన సంఘటనలు, దేశములో ఇతర ప్రాంతాల్లో జరిగిన అనేక ఇతర సంఘటనలు పూస గుచ్చినట్టు చెప్పెను)
ఈ రాజకీయ సంఘటనలు, ఉత్తర దేశంలో జరిగినవి, జరుగుతున్నవి మీకు ఎలా తెలుసు?
అల్లూరి -దానికి తగ్గ ఏర్పాట్లు నాకు ఉన్నవి.
నవ్వుతూ సత్రం వద్ద ఉన్న నీటిలో అరగంట పైగా చల్ల నీటిలో అనుచరులు నీటిని తోడి పోస్తూ ఉండగా స్నానం చేసి, జపము చేసికొనెను. వారెవ్వరూ ఏమియునూ తినలేదు. వేగముగా అక్కడకు దూరంగా ఉన్న శంఖవరం అడవిలోకి అనుచరులతో రాజుగారు పోలీసులు రాక మునుపు వెడలిపోయిరి.

1 COMMENT

  1. […] చదువుతుంటే https://app.kagadanews.com/ సైటులో విప్ల‌వ జ్యోతి అల్లూరి ఇంటర్వ్యూ  అని ఓ కథనం కనిపించింది… బాగుంది… […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...