పుడమితల్లికి వందనాలు…

Date:

ఏప్రిల్‌ 22 ఎర్త్‌డే సందర్భంగా
(డా. పురాణపండ వైజయంతి, 8008551232)
పచ్చటి పొలాలతో ఆకుప‌చ్చ‌ చీరను ధరిస్తుంది భూమి…
పర్వతాలను శిఖరాయమానంగా అలంకరించుకుంటుంది భూమి…
పండ్లు, పూలు, కాయలు, ఆకులకు జన్మనిచ్చే నిత్య గర్భిణి భూమి..
మానవుల దోషాలను భరిస్తూ, గుణాలను స్మరిస్తూ…
అందరినీ కడుపులో పెట్టుకుంటుంది భూమి…
భూమి గురించి ఎన్నో వివరాలు…
భూమి… ఎన్నో ప్రాణులకు, జీవరాశులకు ఆవాసం. భూమి లేనిదే మానవ జీవనం లేదు. భూమిని భూమాతగా కొలుస్తాం. క్షమకు మారు పేరు భూమి కావడం వల్లనే ‘క్షమయా ధరిత్రీ’ అంటారు.


నమస్కరించాలి… ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, భూదేవికి నమస్కరించి, ‘సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే‘ విష్ణుపత్నీ నమస్తుభ్యమ్‌ పాదఘాతం క్షమస్వమే ‘‘’ అని చదవడం సంప్రదాయంగా వస్తోంది. అంటే ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని ప్రార్థిస్తాం. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి మనిషిని నేల మీద నిలకడగా ఉంచుతోంది.
పంచభూతాలలో మొట్టమొదటగా నమస్కరించేది భూమాతనే. పృధివ్యాపస్తేజో వాయురాకాశః… అని పంచభూతాలను వరుసక్రమంలో చెబుతాం. మహోత్కృష్టమైన భూమి గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పురాణాలలో గోచరిస్తాయి.
గంధవతీ పృథివీ…
దేవునికి అర్చించే పుష్పాల జన్మస్థానం భూమి. కుసుమాలు భూమి నుండి ఉద్భవిస్తున్నప్పుడే వాటికి సువాసన సమకూరుతుంది. అంటే భూమి విత్తనంతో సమ్మేళనం చెందుతున్నప్పుడే ఈ ఘుమఘుమలు సమకూరతాయి. ఈ కారణంగానే భూమిని ‘గంధవతీ పృథివీ’ అంటారు.


సృష్టి…
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, పునరుత్పత్తి… ఇది సృష్టిక్రమం అని వేదాలు చెబుతున్నాయి. ఓషధులకు భూమి ప్రధానమైనది. ‘భూమి’ శబ్దానికి అన్నిటినీ భరించగలిగేది అని ఒక అర్థం ఉంది. అచల, అనంత… ఒక్కో కారణంగా ఒక్కో పేరు వచ్చింది. భూమి తాను కదులుతున్నప్పటికీ భూమి మీద నివసించే ప్రాణులు, ఇతర వస్తువులను నిశ్చలంగా ఉంచే శక్తి కలిగి ఉంది. అంటే కంపం లేకుండా ఉంచుతుందన్నమాట. అందుకే భూమాతను అచల అంటారు.


భూమికి ఉన్న మరో పేరు అనంత. భూమి గుండ్రంగా ఉందన్న విషయాన్ని నాడే మనవారు గ్రహించారని తెలుస్తోంది. భూమి బల్లపరుపుగా ఉంటే సరిహద్దులు ఉండాలి కదా! వృత్తాకారపు వస్తువులకు ఆద్యంతాలు ఉండవు. అందుకే భూమి ‘అనంత’ అయ్యింది. ఎంత బరువువైనా భరించగల శక్తి భూమికి మాత్రమే ఉంది. సహనానికి మారుపేరు పుడమి. పిల్లలను కనిపెంచడానికి తల్లిదండ్రులకున్నంత సహనం భూమాతకు ఉంది. అంత సహనం కలిగిన భూమాత తన కుమారుడి వల్ల ప్రజలకు చేటు జరుగుతోందని గ్రహించి, తన కుమారుడని కూడా చూడకుండా, నరకాసురుడిని సంహరించింది.
మాతృత్వం…
పంచభూతాలలో భూమికి మాత్రమే దైవత్వం, మాతృత్వం అనే రెండు లక్షణాలు ఉన్నాయి. వేదాలు మాతృదేవోభవ అని చెప్పిన వాక్యం భూమికి సైతం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. భూమిని దైవంగా భావించి గౌరవించాలి. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి ఆ తల్లిని బయటకు తీసి, భూభారాన్ని ఆయన స్వయంగా మోశాడు. భరించే వాడు భర్త కనుక, భూదేవికి విష్ణుమూర్తి భర్త అయ్యాడు. భూమిని ఎందరో దుర్మార్గులు ఆక్రమించడం వల్ల భూమాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తన మీద ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు మాత్రం ఇక భరించలేక ‘ఈ భారం నేను మోయలేను’ అనగానే విష్ణుమూర్తి తక్షణం దుష్టశిక్షణ చేసి, ఆమెను రక్షిస్తుంటాడు.


అనేక నామాలు…
భూమి, భూదేవి, భూమా దేవి, భూమి దేవి, వసుంధర, వసుధ, వైష్ణవి, కాశ్యపి, ఉర్వి, హిరణ్యం, వసుమతి… ఈ పదాలతో నేలతల్లిని పిలుస్తాం. విష్ణుమూర్తి అవతారమైన వరాహావతారంలో వరాహుని భార్య భూమి. సీతామాత తల్లి భూదేవి అని, రాముని విడిచి సీత. భూమాత ఒడిలోకి వెళ్లిపోయిందని ఉత్తరకాండ చెబుతోంది. నరకాసురుడి తల్లి భూమాత. లక్ష్మీ దేవి రెండు అంశలలో భూదేవిని ఒకరిగా చెబుతారు. (రెండవ అంశ శ్రీదేవి). ఆమె నిరంతరం నారాయణునితోనే దర్శనమిస్తుంది. భూదేవి అంటే భూమికి అధిదేవత అని అర్థం. అలాగే లక్ష్మీదేవి యొక్క సంతానప్రదాత రూపం. కశ్యప ప్రజాపతి కుమార్తె భూదేవి. అందుకే భూమిని కాశ్యపి అంటాం. భూదేవిని శ్రీకృష్ణుని భార్య సత్యభామగా కూడా పురాణాలు చెబుతున్నాయి. నరకాసుర వధ సమయంలో నరకుడు తన కుమారుడేనని తెలుసుకున్న సత్యభామ, నరకుడిని ఒడిలోకి తీసుకుని విలపిస్తుంది.
వీరంతా భూగర్భ ఉద్భవులే…
భూమాత అనేకమంది దేవతామూర్తులకు జన్మనిచ్చింది. సీతాదేవి జననంలాగే తిరుచానూరు పద్మావతీదేవి కూడా ఆకాశరాజు పొలంలో దున్నుతుండగా దొరుకుతుంది. శ్రీవిల్లుపుత్తూరులోని ఆండాళ్‌ కూడా పెరియాళ్వార్‌ నాటిన తులసి చెట్టు కింద దొరుకుతుంది.


రూపవిలాసం…
భూదేవి చతుర్భుజి. ఒక చేతిలో దానిమ్మ, ఒక చేతిలో జలపాత్ర, ఒక చేతిలో మూలికలతో నిండిన పాత్ర, మరో చేతిలో కూరలతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో కుడిచేతిలో నీలోత్పలం (కుముదం లేదా ఉత్పలం, రేకలువ), ఎడమ హస్తం అభయముద్రతోను సాక్షాత్కరిస్తుంది. అభయహస్తాన్నే లోలహస్త ముద్ర అని కూడా అంటారు. పృథివికి ఆఘ్రాణ శక్తి ఉంది. అందుకే పృథివిని నాసిక భాగంతో పోలుస్తారు. హస్తంలో పృథివిని ఉంగరం వేలుగా గణిస్తారు. పృధ్విని కేంద్ర స్థానంగాను, నిశ్చలత్వానికి ప్రతీకగాను శాస్త్రం చెబుతోంది. పృధ్వితో జలం కలిస్తే తియ్యటి రుచి ఏర్పడుతుంది. పృథివితో అగ్ని కలిస్తే చేదు రుచి ఉద్భవిస్తుంది.
భూమాతను మానవజాతి ఎన్నివిధాలుగా ఇబ్బందిపెడుతున్నా ఎంతో ఓర్పుగా అన్నిటినీ భరిస్తుంది.

అందువల్లే పంచభూతాలలో పృధివికి మాత్రమే దైవత్వం, మాతృత్వం రెండూ ఆపాదించారు శాస్త్రకారులు. అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఆకాశరాజు అంటాం… ఒక్క పృధివిని మాత్రమే భూమాత అంటాం. భూదేవి లాంటి విశేషణాలు మిగతా భూతాలకు లేవు. ఏదైనా భరించలేని తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని పరిపాలకులకు తెలియచేయాలని, అటువంటి బాధ్యతలు ఆవిడ నిర్వర్తించి దుష్టశిక్షణకు తోడ్పడి, ఆచరణపూరకంగా తెలియచెప్పింది. భూదేవి సజ్జనులను భరించగలదు కాని, దుర్జనులను సహించలేదు. అందుకే ఆమెకు నిత్యం గౌరవంగా వందనాలు సమర్పించాలి. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...