(AR Rahman Birthday)స‌రిగ‌మ‌ల ప్ర‌యోగ‌శాల‌-న‌వ‌రాగాల మాల‌

Date:

సంగీత యాంత్రికుడు స్వరమాంత్రికుడు
జ‌న‌వ‌రి 6 ఏఆర్ రెహ్మాన్ జ‌న్మ‌దినం(AR Rahman Birthday)
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
సరిగమలకు సాంకేతికతను జోడించి నవ్యమైన శ్రావ్యమైన సంగీతాన్ని అందించి గెలుపుకి కొత్త సూత్రాన్ని కనుగొన్న సంగీత తుఫాన్ ఎ.ఆర్.రెహమాన్. రెహమాన్ సరిగమల ప్రయోగశాల, నవరాగాల మాల. భారతీయ సినీ సంగీతానికి విశ్వ వేదికపై అస్కారం కల్పించి “జయహో” అనిపించుకున్న సంగీత యాంత్రికుడు స్వరమాంత్రికుడు. ఆపాటల్లో భారతీయత ధ్వనిస్తుంది.పాశ్చాత్యం కొత్తగా పల్లవిస్తుంది.ఈ రెండిటి మేళవింపు నవ రాగానికి నాంది పలుకుతుంది.
ఎ.ఆర్.రెహమాన్ చెన్నై లో ముదిలియార్ కుటుంబంలో 1967 సంవత్సరంలో జనవరి 6వ తేది జన్మించాడు తండ్రి ఆర్,కె శేఖర్ తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. రెహమాన్ తండ్రి రెహమాన్ అభిరుచిని గుర్తించి ఆతనిలో దాగున్న ప్రతిభకు పసితనం నుండే సరిగమలతో పదును పెట్టాడు . సంగీత వాయిద్యాలపై పట్టు సాధించేటట్లు తర్పీదు ఇచ్చాడు. పాఠ‌శాలలో ఎక్కువ సమయం గడపటంవల్ల పాఠశాలకు దూరమైనాడు. రెహమాన్ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి అతనిని ప్రోత్సహించింది.. తల్లి నగలు అమ్మి ఆర్దిక చేయూతనిచ్చింది స్వాంతన కోసం సూఫివైపు మళ్ళింది. తనపేరును కరీమా బేగంగా మార్చుకుంది. డిసెంబర్ 28 వ తేదీ 2020 సంవత్సరంలో రెహమాన్ తల్లి కరీమా బేగం అనారోగ్యంతో మరణించింది.


దిలీప్ కుమార్ నుంచి రెహ్మాన్‌గా…
దిలీప్ కుమార్ గా ఉన్న పేరును అల్లారఖ రెహమాన్ గా మార్చుకున్నాడు. రెహమాన్ భార్యపేరు సైరాభాను. పరిస్దితుల ప్రభావం రెహమాన్ లో పట్టుదలనిపెంచాయి. తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడం కోసం తల్లికి సహాయంచేస్తూ ఇంట్లోని వాద్య పరికరాలని అద్దెకిస్తూ వేరు వేరు సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు. కీబోర్ద్ ప్లేయర్ గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో వాద్య పరికరాలుకొని రమేష్ నాయుడు ఎం.యస్.విశ్వనాధన్, ఇళయరాజా , రాజ్ కోటి దగ్గర పనిచేశాడు. ఈ సమయంలోనే వాణిజ్య సంస్దల ప్రకటనల కోసం జింగిల్స్ చేసేవాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్ట్ కోసం బాపు తో కలిసి పనిచేశాడు. రెహమాన్ తొలి తెలుగు ప్రాజెక్ట్ ఇదే. వాణిజ్య ప్రకటనలు చేస్తున్న సమయంలోనే మణిరత్నంతో పరిచయం ఏర్పడింది.


ప్రతిభను ప్రోత్సహిస్తూ, కొత్తవారికి అవకాశాలనిచ్చి అద్బుతాలు రాబట్టగల మణిరత్నానికి దొరికిన మరో రత్నం ఎ.ఆర్.రెహమాన్ దొరికిన వరాన్ని వినియోగించుకొని స్వరాల జల్లును కురిపించాడు సంగీత ప్రియులను మరిపించాడు. రెహమాన్ సంగీత పూతోటలో విరిసిన స్వర పుష్పం “రోజా” గుభాళించి తొలి సినిమాతోనే జాతీయస్దాయిలో గుర్తింపు తెచ్చింది. సంగీత దర్శకునిగా ఎదగాలన్న చిన్నవాడి చిన్ని ఆశకు ఆయువు పోసింది. ఆ ప్రోత్సాహం దశాబ్దాల సంగీత ప్రస్దానానికి నాంది పలికింది. రోజా సినిమా పాటలను తన చిన్న గదిలోని స్టూడియోలో మణిరత్నానికి వినిపించిన రెహమాన్ ₹25 వేలు పారితోషికంగా తీసుకున్నాడు. పాతికేళ్ళ తర్వాత చెలియ సినిమా కోసం చేసిన ట్యూన్ లను విమానంలో వినిపించాడు. ఎంత ఎదిగినా ఒదిగి వుంటూ కొత్త మెళకువలని ఆకళింపు చేసుకుంటూ, సాంకేతికతను అందిపుచ్చుకుని, అధునాతన రీతిలో రాగాలను స్వరపరచడం రెహమాన్ కఠోర శ్రమకు ప్రజ్ఞకు తార్కాణం.
అతిశ‌య‌మే అచ్చెరువొందేలా బాణీల రూప‌క‌ల్ప‌న‌
అతిశయంకాదు ఆక్షరసత్యం, ఆతిశయమే అచ్చెరువొందేలా బాణీలను రూపొందించగల సంగీత ద్రష్ట, కనుకనే దర్శకుడు శంకర్ సినిమాలకి రెహమాన్ సంగీత దర్శకుడైనాడు. ఈ ఇద్దరి కలయిక సంచలనాలను సృష్టించింది. టెలిఫోన్ ధ్వనిలా నవ్వించింది. జెంటిల్ మ్యూజిక్ తో సరి కొత్త మ్యానియాను వ్యాపింపజేసింది. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మను పలకరించింది. నెల్లూరి నెరజాణ అందెలలో మువ్వ మ్రోగింది ఇనుములో హృదయాన్ని మొల‌కెత్తించింది. యంత్రలోకపు సుందరిచేత డిజిటల్ స్వరాలను పాడిస్తోంది.


ఎల్ల‌లు తుడిచేసిన స్వ‌రాల జ‌ల్లు
రెహమాన్ స్వరాల జల్లు ఎల్లలను తుడిచేసింది. దక్షిణాదిన ప్రారంభమై ఉత్తరాదిన సైతం ప్రభంజనమై వెల్లువెత్తింది. రంగీలా సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించి రాగ రంజితం చేసి, బొంబాయిలో పాగావేసిన దక్షిణ భారత సంగీత దర్శకుడు. పాశ్చాత్య, కర్నాటక, హిందుస్దాని సంగీతంపై పట్టు సాధిస్తూనే అతనికి ఇష్టమైన నుస్రత్ ఫతే అలీఖాన్ గజల్స్ ని సూఫీ మిస్టిసిజం మేళవించి ఖవాలీ శైలిలో రూపొందించి బాణీలు దిల్ సేలో ఛయ్య ఛయ్య ఛయ్యా అని చిందులు వేయించింది. జోదా అక్బర్ లో క్వాజా మేరి క్వాజా అని భక్తి భావాన్ని పలికించింది. తాళంతో తన్మయులని చేయగలదు.

బంకిం చంద్ర చటర్జి ఆనంద్ మఠ్ లో పొందు పరచిన వందేమాతరం లక్షలాది మంది భారతీయుల స్వేచ్ఛ‌కు మూల మంత్రం కాగా, 1997 లో భారత స్వాతంత్రీయ స్వర్ణోత్సవాల సందర్బంగా రెహమాన్ రూపొందించిన వందేమాతరం కోట్లాది భారతీయులకు స్పూర్తి మంత్రం. రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన జనగణమన‌ జాతీయగీతం ప్ర‌ఖ్యాత గాయక గళం నుంచి జాలువారి రెహమాన్ సంగీత తరంగంతో మిళితమై జనగళంతో సమ్మిళితమైంది. భారత భాగ్య విధాతలకు జాతివిశిష్టతను తెలియజెప్పే వినూత్న గీతమై, విశిష్ట స్దానాన్ని సంపాదించుకున్నది.
ఇంతై ఇంతింతై రెహమాన్ సంగీతం విశ్వఖ్యాతిని గాంచింది. సినీ వినీలాకాశంలో అందని జాబిలిలా ఊరిస్తున్న ఆస్కార్ అవార్డు. ఆ జాబిలిని తాకి ముద్దులిడాలనే ఆశ స్ల‌మ్‌డాగ్ మిలీయనీర్ తో సాకారమైంది.

స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రం రెండు ఆస్కార్లూ, రెండు గ్రామీల్నీ, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్నీ గెలుచుకుంది . ఒకే ఏడాది రెండు ఆస్కార్లు ఆందుకున్న ఏకైక ఆసియా సంగీత దర్శకుడు, తొలి భారతీయుడు ఎ.ఆర్.రెహమాన్
ఎ.ఆర్. రెహమాన్ పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి. 1995 లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుని ప్రదానం చేసింది. టైమ్ మ్యాగజైన్ రూపొందించిన జాబితా ‘10 బెస్ట్ సౌండ్ ట్రాక్స్‌’ ఆఫ్ ఆల్ టైమ్ హిట్స్ లో ‘రోజా’ ఒకటి. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా ఎ.ఆర్.రెహమాన్ ని గుర్తించింది.

దేశవిదేశాలలో సంగీత కచేరీలు చేసి తనదైన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయంచేశాడు. బహుళ జాతి సంస్దలతో కలిసి పనిచేస్తూ పేదరికం నిర్మూలనకై ఐక్యరాజ్య సమితి అమలు చేస్తున్న ప్రాజెక్టులో భాగస్వామిగా పాత్ర పోషిస్తునాడు జీవితకాలంలో మనిషి వినే 1000 పాటల జాబితాలో బొంబాయి పాటలను ఉంచింది గార్డియస్ పత్రిక. ఇది ఒక సంగీత దర్శకుడికి దక్కిన అరుదైన గౌరవం స్వర యంత్రంతో వైవిధ్య భరిత బాణీలతో సంగీత తుఫాన్ సృష్టిస్తున్న స్వరమాంత్రికుడు రెహమాన్. ఆ రాగం యదలో ఏదో మాయ చేస్తుంది. పెదవే పలికిన తియ్యనిమాటగా నిలుస్తుంది యావత్ సంగీత ప్రపంచం నీకు చేస్తోంది సలాం. నిండు మనస్సుతో నీకు అందిస్తున్న అక్షరాంజలి. సమర్పిస్తున్న హృదయాంజలి రెహమాన్ జి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)

ALSO READ: టికెట్ల‌పై ట్వీట్ల యుద్ధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...