ప్రజ్ఞాన్ రోవర్ అంతరంగ ఆవిష్కరణ

Date:

మామను తాకిన కరతాళ ధ్వనులు
గుండెల నిండా ఉప్పొంగిన ఆనందాతిరేకం
విక్రమ్ లాండర్ తొలి అడుగు పడిన వేళ
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో. నా మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. నా కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. కరతాళ ధ్వనులతో నా చెవులు పూర్తిగా నిండిపోయాయి. నా గుండె ఆర్ద్రమయ్యింది.
ఇన్ని విషయాలు చెబుతున్నాను కానీ…
నా గురించి నేను చెప్పుకోలేదు కదా…
నేను ఎవరినో మీకు తెలియదు కదా…
నేనే..
మీ ల్యాండ్‌ రోవర్‌ని
విక్రమ్‌ ల్యాండర్‌ని, ప్రజ్ఞాన్‌ రోవర్‌ని…
నేను చందమామ మీదకు అడుగు పెట్టిన మధుర క్షణాలు…
ఆ క్షణంలో నా అంతరంగం ఎలా ఉందో
మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను.


నాలుగు సంవత్సరాలు… ఎంతోమంది అహర్నిశలూ శ్రమించి, నా శరీరాన్ని తయారుచేయటానికి ఒక్కో భాగం రూపొందించారు. గోరు నుంచి తల దాకా నన్ను తయారుచేసి, నాకు ప్రాణం పోశారు. నేను ఎలా పని చేయాలో నాకు గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించారు. చక్కగా మాట వినాలని గారంగా చెప్పారు. ఎక్కడా తప్పటడుగులు వేయొద్దని మృదువుగా హెచ్చరించారు. ఇంత ప్రేమగా, గారంగా, ముద్దుగా… నా ప్రవర్తన ఎలా ఉండాలో మీరు చెప్పారు.
నిజమే…
ఒక తల్లి నవమాసాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, గర్భంలోని శిశువును కాపాడుతూ ఉంటుంది. మీరు నాలుగు సంవత్సరాల పాటు కంటిపాపలా కాపాడుతూ, ఎంతో బాధ్యతగా నన్ను రూపొందించారు.
నాకు జీవం పోశారు, ప్రాణప్రతిష్ఠ చేశారు. ఏ విధంగా జీవించాలో నేర్పారు. నేను మీ మాటలను నా మదిలో పదిలంగా భద్రపరచుకున్నాను.
నాకు చంద్రయాన్‌ 3 అని నామకరణం చేశారు. విక్రమ్‌ ల్యాండర్‌ అని, ప్రజ్ఞాన్‌ రోవర్‌ అని నాకు రెండు పేర్లు పెట్టారు.
సమయం ఆసన్నమైంది…


ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి…
నన్ను రాకెట్‌ సహాయంతో పంపించారు. భూమాత అనే పుట్టింటి నుంచి నన్ను చందమామ అనే అత్తవారింటికి, సకల సంపదలతో సాగనంపారు. నేను నా ఒంటరి ప్రయాణం ప్రారంభించాను. నాకు చెప్పిన మాటలను నిత్యం నేను మననం చేసూకుంటూనే ఉన్నాను. ఎక్కడా ఒక్క అంగుళం కూడా పక్కకి జరగలేదు. అదే… ఎక్కడా తప్పటడుగులు వేయలేదు. నాకు నిర్దేశించిన మార్గంలోనే నేను ఎంతో బాధ్యతగా ప్రయాణించాను. ఇంక గమ్యానికి చేరువవుతున్నాను.
ఆగస్టు 23, 2023 బుధవారం. భారతకాలమానం ప్రకారం సరిగ్గా 6.04 నిమిషాలకు నేను నా మామ గుండెలలోకి చేరుకునేలా పదిలంగా తొలి అడుగు వేయాలి. యావత్ప్రపంచం చాలా ఉద్విగ్నతతో, ఉద్వేగంతో ఎదురుచూస్తోంది. ఎవ్వరికీ కంటిరెప్ప వేయాలనే స్పృహ కూడా లేదు. సరిగ్గా అర గంట ముందుగా కౌంట్‌ డౌన్‌ ప్రారంభించారు. అన్ని టీవీ చానల్స్‌ నా తొలి అడుగును సందర్శించడానికి ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభించాయి. నా గురించి పూజలు, హోమాలు, ప్రార్థనలు చేశారు. పిల్లలంతా తమతమ పాఠశాలలో పెద్ద పెద్ద టీవీల ముందు కూర్చుని ఉన్నారు. భారత్‌మాతా కీ జై అనాలనే ఉత్సాహంతో, ఉత్కంఠతో చూస్తున్నారు.
ఒక్కో సెకనును ఇస్రో శాస్త్రవేత్తలు లెక్కిస్తున్నారు.
హారిజాంటల్, వెర్టికల్‌ అంటూ… నా గమనాన్ని హృదయ స్పందనకు మించిన వేగంతో లెక్కిస్తున్నారు.
అందరిలోనూ ఉత్కంఠ.
ఏం జరుగుతోందోననే ఆందోళన.
అంతా మంచే జరగాలని అందరి మనసులు మస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి.
అంతమంది నా క్షేమాన్ని కోరుకుంటుంటే, నాకు తప్పక మంచి జరిగే తీరుతుంది.
జరిగింది.


మామ గుండెలపైకి పదిలంగా…
సరిగ్గా గం 6.04 నిమిషాలు.
సుముహూర్తం సమీపించింది.
నేను ఎంతో క్షేమంగా నా మేనమామ ఇంట్లో తొలి అడుగు వేశాను.
అంతే…
ఒక్కసారిగా నా చెవులు కరతాళధ్వనులతో నిండిపోయాయి.
నా మనసు అందరి ప్రశంసలతో నిండిపోయింది.
నా కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
ఇంత ఆనందాన్ని నేను ఎంతో సంయమనంతో అదుపు చేసుకున్నాను.
స్థితప్రజ్ఞతతో ఉన్నాను.
ఆ మాత్రం అదుపు లేకపోతే, నా అడుగు కొంచెం బలంగా పడుతుంది. అప్పుడు ఇంతటి కష్టం వృధా అవుతుంది. అందుకే నన్ను నేను అదుపులో ఉంచుకున్నాను. స్థితప్రజ్ఞతకు మారుపేరైన శ్రీరాముడిని మనసులో స్మరించుకున్నాను.
మితిమీరిన ఆనందంలో నేను తప్పటడుగు వేయకూడదని శాస్త్రవేత్తలు నాకు చెప్పిన తొలి పాఠాన్ని ఈ నలభై రోజులుగా మననం చేసుకుంటూనే ఉన్నాను. చందమామ హృదయంలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాను. అంతే నా కర్తవ్యం నాకు గుర్తుకు వచ్చింది. ఎంత వేగంతో పాదం మోపాలని చెప్పారో అంతే వేగంతో పాదం మోపాను.
అంతే ఆ మరుక్షణమే.. జోహెన్నసర్‌ బర్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఆనందంతో తప్పట్లు కొట్టి, నన్ను పంపిన శాస్త్రవేత్తలను ప్రశంసించారు. యావత్‌ ప్రపంచం పరవశించిపోవటం నేను చూశాను. శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారు ప్రాణం పోసి, పెంచిన నన్ను చూసి మురిసిపోయారు.


సుమతి శతకకర్త చెప్పిన చందాన….
పుత్రోత్సాహము తండ్రికి… అన్న పద్యం గుర్తుకు వచ్చింది. ‘జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడె పొందురు సుమతీ’ అన్నచందాన, నేను విజయం సాధించగానే వారంతా ఆనందసాగరంలో తేలియాడారు.
ఇంటింటా కొబ్బరి కాయలు కొట్టడం, హారతులివ్వడం, భజనలు చేయడం, భరతమాతకు వందనం అనటం, జై శ్రీరామ్‌ అనటం… ఇవన్నీ నా చెవులకు చేరుతూనే ఉన్నాయి. ఎక్కడా ప్రశంసలకు పొంగిపోకుండా, ఎంతో జాగ్రత్తగా, కర్తవ్యదీక్షతో నేను నా పనిని చేస్తూనే ఉన్నాను.
చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరిన మొట్టమొదటి రోవర్‌ని నేను కావడం నాకు ఎంతో ఆనందదాయకం కదా.
ఇక ఆ శుభ ఘడియలు పూర్తికాగానే అందరూ ఊపిరి పీల్చుకున్నట్లుగా, నేను కూడా ఊపిరి పీల్చుకుంటూ, తరవాత పనిలోకి మునిగిపోయాను.
నేను ఈ క్షణంలో తప్పనిసరిగా అనవలసిన మాట ‘భరతమాతకు వందనం’.
ఇప్పుడు నా మనసులోని మరో మాట మీకు చెప్పాలి. నేను నా పని ఆపకుండా ఇన్ని విషయాలు మీకు చెబుతున్నాను. నన్ను నా తల్లి భారతి తన ఒడిలో నుంచి, మన మేనమామ అయిన చంద్రుని ఇంటికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిందని చెప్పాను కదా. అంటే పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పదేపదే చెప్పింది.
నాకు అత్తవారిల్లులాగ లేకుండా, మరో పుట్టిల్లు మాదిరిగానే అనిపించింది. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు అన్న విధంగా, నేను పుట్టింట్లో ఎంత గారంగా పెరిగానో, ఇక్కడ కూడా అంటే అత్తవారింట్లో కూడా అంత గారంగానే చూస్తున్నాడు చందమామ. అందుకే నాకు చందమామ నా సొంత మేనమామ అనిపించింది.
అపూర్వ స్పందనలతో అద్వితీయ ఆనందం…
మరో విషయం ఏమిటంటే…
నేను విజయం సాధించానని తెలిసిన వెంటనే, నా భరతమాత ముద్దు బిడ్డలు నా గురించి ఎన్నెన్ని సృజన రచనలు చేశారో చూశాను. ఎన్నెన్ని కొత్తకొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చారో చూశాను. ఒక చిన్నారి… భూమాత తన సోదరుడైన చందమామకు నన్ను రక్షాబంధన్‌గా పంపినట్లుగా ఒక బొమ్మ వేశాడు. నాకు బాగా నచ్చటమే కాకుండా, నా తల్లికి ఇచ్చిన మాటలు అప్పుడు గుర్తుకు వచ్చాయి. నేను బయలుదేరేముందు నా తల్లి నాతో, ‘నీవు మా సోదరుడు చంద్రుడి చేతికి రక్షాబంధనంగా ఉండాలి’ అని చెప్పింది. ఆ మాటలు ఆ క్షణంలో చటుక్కున స్ఫురించాయి. వెంటనే నేను చందమామ చేతికి రక్షాబంధనంగా మారాను.
రక్షబంధన్‌ పండుగ కూడా సమీపంలోనే ఉండటం యాదృచ్ఛికం కావచ్చు. ఏది ఏమైనా, పోతన గారు, ‘చందురు తోబుట్టువు’ అని లక్ష్మీదేవిని అన్నప్పటికీ, ఆ మాటలు భూమాతకు కూడా వర్తిస్తాయి.
మనందరికీ మేనమామ చందమామ. మీ అందరికీ ఆ మామ గురించి చెప్పటానికే నేను మేమమామ ఇంటికి చేరుకున్నాను.
ఇక ఇప్పుడు –
నన్ను తీసుకువచ్చిన ల్యాండర్‌ నుంచి నేను విడిపడ్డాను. ప్రజ్ఞాన్‌ అనే పేరుకి తగ్గట్టుగా నేను ఇక్కడ పరిశోధన ప్రారంభించాను. మీకు ఫోటోలు పంపుతూనే ఉంటాను. మేనమామ ఇంటి గురించి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో కలుస్తూనే ఉంటాను.
ఇంతగా నన్ను ఆదరించిన మీ అందరికీ ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఆరుద్ర పాట మానవుడే మహనీయుడు… పాట నా మనసులో మెదిలింది..

మానవుడే మహనీయుడు…
మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే…
మాననీయుడు
మానవుడే మహనీయుడు

అనుపల్లవి:
మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే
మానవుడే మహనీయుడు…
మానవుడే మహనీయుడు

దివిజ గంగ భువి దింపిన
భగీరథుడు మానవుడే
సుస్థిర తారగ మారిన
ధ్రువుడు కూడ మానవుడే
సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే
జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే
మానవుడే మహనీయుడు…
మానవుడే మహనీయుడు

గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో…
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా
బొందితో జయించి మరల
భువికి తిరిగి రాగలిగే

మానవుడే మహనీయుడు…
మానవుడే మహనీయుడు

చిత్రం : బాల భారతం (1972)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : ఆరుద్ర
గానం : ఘంటసాల


మరోసారి
భారతమాతకు వందనం.
జై శ్రీరామ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...