(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)
దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు (5.5.2024) పురస్కారం సందర్భాన
దాసరి సాహసం, ఆయనే కొండంత ధైర్యం
“నాకు ఎన్ని గౌరవాలు, సత్కారాలు, పదవులు, బిరుదులు వచ్చినప్పటికీ పరిశ్రమ ఇచ్చిన ‘‘దర్శకరత్న’’ మాత్రమే నా ఉనికికి సంకేతంగా .. సంతకంగా భావిస్తాను, other than Cinema nothing is greater nor bigger to me” అన్నారు దాసరి. “దర్శకులకే దర్శకుడు అని సుప్రసిద్ధులైన వ్యక్తి ఆయన. అయితే వారి మరో గొప్ప రంగం… జర్నలిజం. ఈ రంగంలో కూడా నిపుణులయ్యారు. ఇది మరో అద్భుతమైన కోణం. దర్శకునిగా భాసిస్తూనే దాసరి ఒక దశాబ్దం పాటు పత్రికను, జర్నలిస్టును, జర్నలిజాన్ని ‘ఉదయం’ పత్రికను స్థాపించి ఉజ్జీవించిన వీరుడు. అందులో ఈ రచయితను (నన్ను) పెద్దలలో ఒక పరిశోధనా జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి. సంపాదకుడు ఎబికె ప్రసాద్ తో పాటు ఒక పూర్తి కాలపు సంపాదకునిగా పనిచేస్తూ దాసరి నారాయణ రావు గారు ఉదయంలో సారథిగా ఉన్నారు.
దర్శకరత్నగా విశ్వరూపం చూపిన తరువాత మరో రంగంలో విజయాన్ని సాధించిన ఘనత ఆయనది. అది దాసరి ‘ఉదయం’ పత్రికను 1984న ప్రారంభించడమే. కనుక ఇప్పుడు తెలుగు జర్నలిజాన్ని, నిజాన్ని, ఘన విజయాన్ని అని ముఖ్యమైన భాగంగా దాసరి గారి తెలుగు పత్రికలను వర్గీకరించ వచ్చు. అదే విధంగా ఈ రచయితకు ‘ఉదయం’ పత్రికతో కూడా 1984 నుంచి 1994 ఒక దశాబ్దకాలంలో పరిశోధన పాత్రికేయ కృషి చేసిన తరువాత లా ప్రొఫెసర్ రంగంలో ప్రవేశించి, సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా రాష్ట్రపతి ద్వారా నియమితులైనారు. ఈ పత్రికా రంగం తరువాత ఫ్రొఫెసర్, సిఐసి కావడం మరో భాగం అది.
ఇదీ ‘ఉదయం’తో నా అనుబంధం
తిరుపతి తిరుమలలో జరుగుతున్న అవినీతి పైన ఉదయం పత్రికలో 9 వ్యాసాలను (investigative reports) రూపొందించారు. ఆ వార్తావ్యాసాలకు జవాబుగా ఆనాటి ఐ ఎ ఎస్ అధికారి, టిటిడి ఈవో గారు వివరమైన 25 వ్యాసాల ద్వారా ఇచ్చిన ఖండన వివరణ వ్యాసాలను కూడా ఉదయం ప్రచురించాలని సారథి దాసరి, ఎడిటర్ ఎబికె నిర్ణయించారు. అవి కూడా సంచలనం కలిగించాయి. ఉదయం రచించిన వార్తలను దర్యాప్తు చేయడానికి ఒక హైకోర్ట్ జస్టిస్ అధ్వర్యంలో కమిషన్ ను అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావ్ గారు ఆదేశించారు. అంతేకాదు, ఆ ఆరోపణలపై నేనే (ఉదయం ద్వారా) స్వయంగా కమిషన్ ముందు దర్యాప్తు చేయాలని చెప్పారు.
ఈవో గారి కార్యాలయంలో ఫైల్స్ కొన్ని చూపాలని నేను డిమాండ్ చేసాను. అవి ‘‘నా ఆఫీస్ ఫైల్స్ కనుక నేను ఇవ్వబోను’’ అని ఈవో అన్నాడు. ‘‘ఇవి మీ సొంత కాగితాలు కావు, ధర్మకర్త అధ్వర్యంలో మీరొక మేనేజర్ మాత్రమే. భక్తులు ఇచ్చిన వేలాది కోట్ల రూపాయల డబ్బు మీది కాదు. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీ మీరే’’ అని వాదించాను. కమిషన్ అందుకు అంగీకరించింది. కొన్ని లక్షల ఫైల్స్ ను… తిరుపతిలో 400 మంది ఉద్యోగులు, అధికారుల సమక్షంలో నన్ను ఒక్కడిని మాత్రమే చూసే అవకాశం ఇచ్చారు. ఒకే రోజులో ఇన్ని పేపర్లు చూడాలని కూడా అన్నారు. ఆ సాయంత్రం ఆరు గంటల సమయంలో దాదాపు 380 డాక్యుమెంట్స్ నెంబర్లు లిస్ట్ ఇచ్చి, ఆ పేపర్ల కాపీలు కావాలని డిమాండ్ చేసాను. ఇది 1986 న జరిగిన సంఘటన. (అప్పుడు ఫైళ్లు చదివే అవకాశం ఇవ్వాలని కాపీలు ఇవ్వాలని ఆర్ టి ఐ చట్టం 2005 లేదు). అంతకు ముందు ఆ టిటిడి 1986 నాటి ఫైళ్లతో ఆధారంగా వారి అవినీతి ఆరోపణలను దాదాపు 90 శాతం ‘ఉదయం’ రుజువు చేయగలిగింది. అది మరొక సంచలనం.
ఆ న్యాయ కమిషన్ వివరమైన నివేదికను అసెంబ్లీలో సమర్పించారు. అది శాసనసభ చర్చించక ముందే ఎవరూ ప్రచురించకూడదు. ఆ నివేదికలు మేము ఉదయం పక్షాన దాన్ని పట్టుకున్నాం. ఇది చట్టవ్యతిరేకం అవుతుంది. కాని అసలు నిజాలను జనం ముందుకు తేవడం కోసం, దాచిన కొన్ని నిజాలను బయటకు తీసుకుపోవాలని.. దాసరి గారు, తదితర ఉదయం పెద్దలు చర్చించారు. కమిషన్ ఆఫ్ ఇంక్వయిరీ చట్టం కింద సెక్షన్ 10 ప్రకారం వారిపై కేసులు పెట్టి అరెస్టు చేసే అధికారం ఉంది అని వివరించారు .
దాసరి ధైర్యం సాహసం ఏమిటో తెలుసుకునే సందర్భం ఇది. ఈ కమిషన్ రిపోర్ట్ ప్రచురించాలా లేదా అనేది ఒక సవాల్ గా మారింది. ఆ వివరాలను ఉదయం దిన పత్రికలో ప్రచురిస్తే ఆ ఎడిటర్ ను అరెస్టు చేసే పరిస్థితి ఉంది. ఈ విధంగా అరెస్టు చేసే అధికారం ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ ప్రభుత్వానికి ఉంటుంది. సహజంగా ఎండి రామకృష్ణ ప్రసాద్ గారు ఈ పని మంచిది కాదని వ్యతిరేకించారు. అదికూడ ‘ఏం చేస్తారబ్బా’ అని ఎదురు చూస్తున్న దశ. ఎన్ టి ఆర్ గారు చేయదలచుకుంటే ఎడిటర్, రిపోర్టర్, తదితర ఎం డి కొందరిని అరెస్ట్ చేసే అధికారం కూడా ఉందని ఎండి అన్నారు. ‘‘ఈ వ్యాసాలు రాసింది మేం కనుక నన్ను అరెస్ట్ చేయవచ్చు. అందులో దాసరి గారు ఎడిటర్ పేరుతో కూడా ప్రచురిస్తే ఆయనను కూడా అరెస్ట్ చేయవచ్చు’’ అని నేను వివరించాను. ప్రచురించాలని నేను అన్నాను. కొందరికి దాసరి గారిని అరెస్టు చేయించే పనిచేస్తావా అని కోపం వచ్చింది. ‘‘ఏమైనా దాసరిని అరెస్ట్ చేయాలని అంటారా’’ ఎం డి గారు అన్నారు. ‘‘నేను అవును’’ అన్నాను. కోపించకుండానే దాసరి ప్రశాంతంగా ‘‘నీ ఆలోచనేమిటి’’ అని అడిగారు. ‘‘సార్ నా వినతి గమనించండి, దాసరిని అరెస్టు చేసే ధైర్యం ముఖ్యమంత్రి గారికి ఉంటుందా? అని నా ప్రశ్న. ‘‘నాతో మీ పేరు కూడా రాయండి సార్. అప్పుడు ఎన్ టీ ఆర్ కి అరెస్టు చేసే ధైర్యం ఉంటుదా?’’ అని అడిగాను. చిరునవ్వుతో సరే, ‘నా పేరు కూడా చేర్చండి’ అని దాసరి ధైర్యంగా అన్నారు. ఎండీ గారు ఇతర పెద్దలు ఆశ్చర్యపోయారు. అదీ దాసరి గారి సాహసం. అందుకే ఆయనే హీరో. అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదు. పదకండేళ్లు మా మీద కేసు నడిపారు. తరువాత కథ సుఖాంతంగా ముగిసింది.
ఈ సందర్భంలో 30 సంవత్సరాల తరువాత ఫైళ్ల వివరాలు ఇవ్వాలని భారతదేశమంతా అమలు చేసే ఆర్టీఐ చట్టం 2005 లో పార్లమెంట్ లో వచ్చింది. ఆ చట్టం కింద కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన జాతీయ కమిషనర్ గా పదకొండు మంది.. అందులో ఒక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గా రాష్ట్రపతిగారు నన్ను నియమించారు. అది దాసరి గారి ఆశీస్సుల వల్లనే కదా. (2016-17న కొందరు ప్రముఖ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన డిగ్రీ వివరాలు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసారు. అది అప్పీల్ లో నా ముందుకు వచ్చింది. ఆర్టీఐ చట్టం కింద ఇవ్వడమే బాధ్యత అని ఆర్డర్ ఇచ్చాను. అదో సంచలమైన తీర్పు.
‘ఉదయం’ ముందు
1.నేను ఉదయం రచయితగా 1984 వరకు పనిచేస్తే, అంతకు ముందు 1975… ఎమర్జన్సీలో నేను రాసిన వ్యాసం అరెస్టు చేయించే దగ్గరికి వెళ్లింది. మా ఎడిటర్ (మా నాన్నగారు ఎం ఎస్ ఆచార్య) ‘‘మీరు సెన్సార్ షిప్ చేసిన తరువాతే నేను వ్యాసం రాసాను. కనుక నన్ను మీరు అరెస్ట్ చేయలేరు’’ అని అప్పటి కలెక్టర్ నిలదీసారు. కనుక నన్ను, నాన్నగారిని అరెస్టు చేయలేకపోయారు.
2.1975. నేను డిగ్రీ చదివే కాలంలో (సి ఎం కె కాలేజ్ వరంగల్) వ్యాసరచన పోటీలో గెలిచి, ఎడిటర్ గా రాసిన వ్యాసాలు ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వానికి కోపం తెచ్చింది. ప్రచురించిన ‘చైతన్య’ మ్యాగజేన్ ను నిషేధించారు. కాపీలు confiscate చేసి పోలీసుల సమక్షంలో ప్రిన్సిపల్ అందరి ముందు ఆ పుస్తకాలన్నీ తగలబెట్టారు.
3.ఎల్ ఎల్ బి పరీక్షలో కాకతీయ యూనివర్సిటీ బంగారు పతకం, ఉస్మానియా యూనివర్సిటీ నాలుగు బంగారు పతకాలు మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం సి జె) ఇచ్చారు.
4.1979-81 ఎడిటర్లు ఎబికె ప్రసాద్, పొత్తూరు వేంకటేశ్వరరావ్, సమాచార భారతి (ప్రముఖ జర్నలిస్ట్ ఆదిరాజు వెంకటేశ్వరరావు), తరువాత 1984 నుంచి దాసరి investigative reports ప్రోత్సహించారు.
5.1983-84 వరంగల్ నుంచి నేను రిపోర్ట్ చేసిన సందర్భంలో ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ ప్రెస్ investigative reports దేశమంతటా ఉండే 14 ఎడిషన్లలో ప్రచురించారు.
6.ఆ తరువాత 1984లో ఉదయం ద్వారా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం వారు జెకొస్లవేకియా లో అడ్వాన్స్డ్ జర్నలిజం, ఫోటోగ్రఫీ లో నాలుగు నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చదివించారు.
(దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు (5.5.2024) నాకు బహూకరించిన పెద్దలకు నమస్కారం)
(వ్యాస రచయిత కేంద్ర మాజీ ఆర్టీఐ, ప్రస్తుతం మహీంద్రా స్కూల్ ఆఫ్ లా డీన్)