గుంటూరు, ఏప్రిల్ 29: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో దోషిగా నిరూపణ అయిన శశికృష్ణకు ఉరి శిక్ష పడింది. శుక్రవారం ఉదయం న్యాయమూర్తి నిందితుణ్ణి దోషిగా నిర్థారించారు. మధ్యాహ్నం తన తీర్పును వెలువరించారు.
శశి గత ఏడాది ఆగస్టు 15న పట్టపగలు గుంటూరులో రమ్యను కత్తితో పొడిచిపొడిచి హత్యచేశాడు. మొత్తం 9సార్లు కత్తితో పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే రమ్య కన్నుమూసింది. తనను ప్రేమించడానికి తిరస్కరించిందనే కారణంతోనే అతడీ దారుణానికి పాల్పడ్డాడు. తొమ్మిది నెలల్లో విచారణ పూర్తయ్యింది. 28మందిని విచారించారు. ఈ కేసులో వీడియో ఫుటేజీ కీలక పాత్ర పోషించింది. సుదీర్ఘ వాదనల అనంతరం గుంటూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది. 302 సెక్షన్ కింద శిక్ష విధించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేసిందని రమ్య కుటుంబం తెలిపింది. శశికృష్ణకు ఉరి శిక్ష పడాలని తాము కోరుకున్నామనీ, ఉరి అమలైతే మాకు మరింత ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఇంత తొందరగా విచారణ పూర్తయ్యి, తీర్పు వస్తుందని అనుకోలేదని అన్నారు. నా బిడ్డ ఆత్మకు ఈరోజు శాంతి కలిగిందని రమ్య తల్లి తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తీర్పుపై శశికృష్ణ హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.