మనసుపై అన్నమయ్య అద్భుత కీర్తన
అన్నమయ్య అన్నది – 10
(రోచిష్మాన్, 94440 12279)
అది కంచూ కాదు, అది పెంకూ కాదు మఱి ఏమిటండి అది? మీకు ఒక సూచన; అది పెళుసుగా ఉంటుంది. ఆలోచించండి… మీ ఆలోచనకు ఏమైనా తోస్తోందా? ఆలోచనా చెయ్యలేం! దాన్ని అర్థం చేసుకోనూలేం! ఏమిటండి అది? ఏమిటి, ఏమిటది??
మనసు!!! మనసండి అది మనసు. ఎటువంటిదో ఈ మనసు?
“కంచూఁగాదు పెంచూఁగాదు కడుఁబెలుచు మనసు
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీ మనసు”
అంటూ మనసు మీద ఒక గొప్ప సంకీర్తన చేశారు అన్నమయ్య. శృంగారం, భక్తి , తత్త్వం, భావుకత, సామాజిక చింతన, మనిషి ఇలా ఎన్నిటిపైనో, దాదాపుగా అన్నిటి పైనా సంకీర్తనలు చేసిన అన్నమయ్య మనసుపై ఈ సంకీర్తన చేశారు. మనసు గుఱించి మహోన్నతంగా చెప్పారు.
మనసు ఇతివృత్తంగా తెలుగులో వచ్చినంత మంచి కవిత్వం మఱో భాషలో రాలేదేమో? చలనచిత్రాల్లో కవి ఆత్రేయ మనసుపై చెప్పినంతగా మఱే భాషలోనూ మఱే కవీ చెప్పి ఉండకపోవచ్చు. తెలుగు కావ్యాల్లోనూ మనసుపై గొప్ప కవిత్వం వచ్చింది. అన్ని రకాలుగానూ తెలుగులో పండిన మనసు కవిత్వం ప్రపంచానికి అందిన మన సుకవిత్వం. మనం గర్వించతగ్గ కవిత్వం మన మనసు కవిత్వం. అందుకు ఇదివో ఇల్లిదివో ఈ అన్నమయ్య సంకీర్తనే ఒక ప్రత్యక్ష ప్రమాణం.
ఆదిశంకరాచార్య వివేకచూడామణి (170 వ శ్లోకం)లో ఒక చోట మనసును “అగ్ని (… మనోమయాగ్ని ….)” అన్నారు. అదే వివేక చూడామణి (శ్లోకం 178)లో శంకరులు మనసు అనే పేరున్న పెద్దపులి (మనో నామ మహా వ్యాఘ్రః …)” అనీ అన్నారు.
భగవద్గీత (అధ్యాయం 6 శ్లోకం 34)లో “మనసు చంచలమైనది లేదా ఎక్కువగా చలించేది, కలతపెట్టేది, బలమైనది, దృఢమైనది కదా? దాన్ని అణచడం అసాధ్యం అని నేను అనుకుంటున్నాను కృష్ణా! (చంచలం హే మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్/ తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్)” అని అర్జునుడు అంటాడు.
తేజోబిందూపనిషత్‌లోని కొన్ని శ్లోకాల్లో మనసే సంకల్పం, తాపత్రయం, కాయం, కోపం, బంధం, విశ్వం, దోషం, కాలం, సర్వజగత్తు, మహాశత్రువు, సంసారం, దుఃఖం, ముసలితనం అని చెప్పబడింది.
“మనో హి హేతుః సర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే (అన్ని ఇంద్రియాలు పనిచెయ్యడానికి మనసే కారణం)” అని సుందర కాండ (11వ అధ్యాయం, 41 శ్లోకం) చెప్పింది.
అన్నమయ్య వాటికి భిన్నంగా అదనీ, ఇదనీ, ఎటువంటిదో అనీ, ఒక ప్రత్యేకమైన రచనా సంవిధానంతో మనసు గుఱించి చెప్పి తన ఈ సంకీర్తనను మనసు కావ్యం చేశారు: మన సుకావ్యం చేశారు; ఇదిగో ఇలా…
“పట్టఁ బస లేదు చూడ బయలుగాదీ మనసు
నెట్టనఁ బారుచునుండు నీరూఁగాదీ మనసు
చుట్ట చుట్టి పాయకుండుఁ జుట్టముగాదీ మనసు
యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీ మనసు”
పట్టుకోవడానికి తగ్గ బలం (పస) ఉన్నదీ కాదు, చూడడానికి బయట కనిపించేదీ కాదు, పాఱుతూంటుంది కానీ నీరు కాదు, చుట్టుకుని ఉంటుంది కానీ చుట్టమూ కాదు ఈ మనసు, ఎక్కడో కాక ఎదురుగానే ఉంటుంది ఎటువంటిదో ఈ మనసు అంటూ ఆలోచనను కదిలించారు అన్నమయ్య. మనసు నీరు కాదట అయినా పాఱుతూ ఉంటుందట. ‘మనసు పాఱుతూ ఉంటుంది’ ఇది ప్రపంచంలోని ఏ కవీ చెప్పని, చెప్పలేని భావన. మనసు పాఱడాన్ని దర్శించిన ఒకే ఒక్క కవి అన్నమయ్య.
“రుచులెల్లాఁ గానుపించు రూపు లేదు మనసు
పచరించు నాసలెల్లాఁ బసిడిగాదీ మనసు
ఎచటాఁ గరగదు రాయీఁగాదు మనసు
ఇచటా, అచటాఁ దానే యేఁటిదో యీ మనసు”
రుచులన్నిటిలో కనిపిస్తుంది కానీ రూపు లేనిది మనసు – ఎంత గొప్ప అభివ్యక్తి ఇది?! ఆశలన్నిటా ప్రకాశిస్తుంది కానీ బంగారం కాదీ మనసు అనీ, ఎక్కడా కరగదు ఆయినా రాయీ కాదు అనీ చెప్పారు. మనసు కరగనిదట అలా అని అది రాయీ కాదట. మనసు గుఱించి ఎంత సరిగ్గా చెప్పారు అన్నమయ్య! ఆపై ఇక్కడా, అక్కడా తానే ఉంటుంది ఎటువంటిదో ఈ మనసు అంటూ ఆలోచనను కదిలించారు అన్నమయ్య.
“తప్పక నాలో నుండు దైవముఁ గాదు మనసు
కప్పి మూటఁగట్ట రాదు గాలీఁ గాదు మనసు
చెప్పరాని మహిమల శ్రీ వేంకటేశుఁ దలచి
ఇప్పు డిన్నిటా గెలిచె నేఁటిదో యీ మనసు”
తప్పకుండా నాలో ఉంటుంది కానీ దైవం కాదు, మూట కట్టడానికి రాదు అట్లా అని గాలి కూడా కాదు మనసు చెప్పలేనన్ని మహిమలున్న శ్రీవేంకటేశ్వరుణ్ణి తలుచుకుని ఇప్పుడు ఇన్నిట్లోనూ గెలిచింది ఎటువంటిదో ఈ మనసు అని అంటూ ముగించారు అన్నమయ్య.
మనసు దైవం కాదు, మూటా కాదు, గాలి కాదు అని చెప్పాక ఎలాంటిదీ కాని ఈ మనసు దైవాన్ని తలచి గెలిచిందట! ‘మనసు గెలిచింది’ అని అనడం నక్షత్ర తుల్యమైన మాట. ఇది ఒక్క అన్నమయ్య మాత్రమే అందించగల మెఱుపు. ‘మనిషి జీవనం మనసు గెలవడంపై నిర్మితమౌతుంది’; ‘మనిషి జీవితం ఫలించాలంటే మనసు గెలవాలి’. దైవాన్ని తలచే మనసు గెలుస్తుందని అన్నమయ్య ఇక్కడ చెప్పకుండానే చెబుతున్నారు.
ఈ సంకీర్తన మనసు కృతి; తెలుగువాళ్లమైన మన ‘సుకృతి’. భావన, భావం, శైలి, శయ్యల పరంగా ఇది ఒక మహోన్నతమైన కృతి. ప్రపంచానికి అందిన తెలుగు సత్కృతి. ప్రపంచం మొత్తంలో మనసుపై ఇలా ఈ తీరులో, ఈ స్థాయిలో ఏ కవీ, ఏ తాత్త్వికుడూ చెప్పి ఉండకపోవచ్చు.
మన సుకృతికి సాకారంగా ఒక అసమాన్యమైన మనసు కృతిగా ఉన్నది ఈ అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)
చక్కని వ్యాసం