పరమాత్ముడు పసిబిడ్డా?

0
95

అన్నమయ్య అన్నది- 9
(రోచిష్మాన్, 9444012279)

“భక్తి కొలఁది వాఁడే పరమాత్ముడు
భుక్తి ముక్తిఁ దానె యిచ్చు భువి పరమాత్ముడు”

అంటూ అన్నమయ్య పరమాత్ముడిపై సంకీర్తన చేశారు‌. భక్తి కొద్దీ పర్మమాత్ముడు అని అనడం గొప్ప అభివ్యక్తి. ‘పరమాత్ముడు భక్తి ఉన్నంత’ అని చెప్పిన మాట లోతైన జ్ఞాన సాగరం నుంచి అన్నమయ్య వెలికి తీసి ఇచ్చిన సత్యం‌ అనే బసరముత్యం. ఈ సంకీర్తనలో భక్తి కొద్దీ పరమాత్ముడు అని అన్నాక భుక్తీ, ముక్తీ ఈ భూమిపై పరమాత్ముడే ఇస్తాడని చెబుతూ “అనన్యాశ్చింత యన్తో మాం యే జనాః పర్యుపాసతే / తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్. (ఏ జనులు నా‌కంటే‌ వేఱైన‌ వాళ్లను కాదని నన్నే చి‌ంతన చేస్తూ ఉపాసిస్తూంటారో ఆ అసక్తి కలవాళ్ల యోగక్షేమాన్ని నేనే వహిస్తాను)” అన్న భగవద్గీత (అధ్యాయం 9, శ్లోకం 22) ఉవాచను తలపింపజేస్తున్నారు అన్నమయ్య.

“పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముఁడు
బట్టబయటి ధనము పరమాత్ముఁడు
పట్టపగటి వెలుఁగు పరమాత్ముఁడు
ఎట్టనెదుటనే వున్నాఁడిదె పరమాత్ముఁడు”

పట్టుకున్నవాళ్ల చేతి‌ బిడ్డ పరమాత్ముడు (పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు); బయట ఉండే ధనము పరమాత్ముడు (బట్ట బయటి‌‌ ధనము‌ పరమాత్ముడు); పట్ట పగలులోని వెలుగు పరమాత్ముడు(పట్ట పగటి వెలుగు పరమాత్ముడు); ఎదురుగానే ఉన్నాడు పరమాత్ముడు; (ఎట్ట యెదుటే వున్నాఁడిదే పరమాత్ముడు) అని మొదటి చరణంలో చెబుతూ ఎవరో, ఎక్కడివాడో కాదు పరమాత్ముడు ఎత్తుకున్నవాళ్ల బిడ్డ అని, తవ్వి తీయవలసిన నిధి కాదు పరమాత్ముడు బయటే ఉన్న‌ ధనం అని, చీకటి కాదు పరమాత్ముడు స్పష్టమైన వెలుగు అని, ఎక్కడో లేడు పరమాత్ముడు ఎదురుగానే ఉన్నాడు అని మనకు బోధపఱిచారు అన్నమయ్య. ఇక్కడ పట్టుకున్నవాళ్ల చేతి‌ బిడ్డ పరమాత్ముడు అని చెప్పిన అన్నమయ్య మఱో‌ సంకీర్తనలో‌ “బ్రహ్మమైనవాడు పసిబిడ్డ” అనీ అన్నారు. పరమాత్ముడు పరంగా ఈ తరహా భావనలు ఫార్సీ సూఫీ కవుల రచనల్లోనూ ద్యోతకమౌతాయి.

‘పచ్చిపాలలోని వెన్న పరమాత్ముఁడు
బచ్చిన వాసిన రూపు పరమాత్ముఁడు
బచ్చుచేతి వొరగల్లు పరమాత్ముఁడు
ఇచ్ఛ కొలఁది వాడువో యీ పరమాత్ముఁడు”

పరమాత్ముడు‌ పచ్చిపాలలోని వెన్న (పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు) అనీ, పైపూత లేని రూపం (బచ్చెన వాసిన రూపు పరమాత్ముడు)‌ అనీ, బంగారం వ్యాపారి చేతిలోని ఒరపిడి రాయి (బచ్చు చేతి వొరగల్లు) అనీ, ఇష్టం‌ కొద్దీ ఉండే వాడే ఈ పరమాత్ముడు (యిచ్చ కొలఁది వాఁడు పో యీ పరమాత్ముడు) అనీ రెండవ చరణంలో‌ పరమాత్ముణ్ణి మనకు విశదపఱుస్తున్నారు అన్నమయ్య.

వెన్న పచ్చిపాలలో అంతటా ఉన్నట్టే పరమాత్ముడు‌ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడని తెలియజెప్పేందుకు పచ్చిపాలలోని వెన్న‌ పరమాత్ముడు‌ అని చెప్పారు. ఈ చెప్పడం అచ్చం ఆది‌శంకరాచార్యులవారు చెప్పినట్టే ఉంది. ఆత్మ‌బోధ(59వ శ్లోకం)లో “తద్యుక్త మఖిలం‌ వస్తు వ్యవహార స్తదన్వితః / తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాఖిలే” అని అన్నారు శంకరాచార్యులు. సమస్త వస్తు సముదాయమూ, అన్ని వ్యవహారాలూ బ్రహ్మంతో కూడుకుని ఉంటాయి. కనుక పాలు మొత్తంలో‌ వెన్న వ్యాపించి ఉన్నట్టు బ్రహ్మం అంతటా‌ వ్యాపించి ఉంటుంది అని‌ ఆ మాటలకు భావం. ఆ ఆదిశంకరులవారి భావాన్ని అన్నమయ్య ఇక్కడ తన పలుకు చేసుకున్నారు.

పైపూత లేని రూపం పరమాత్ముడు అని అనడం చాల గొప్పగా ఉంది. పరమాత్ముడికి పైపూత ఉంటుందా? పరమాత్ముడిది నిర్వాణ రూపం కదా?! “మాన్త్ర వర్ణికమేవ చ గీయతే” అని బ్రహ్మసూత్రం (1-1-15) చెబుతోంది. బ్రహ్మం (పరమాత్మ) రహస్య రూపం కలది అని గానం చెయ్యబడుతోంది అని ఆ సూత్రానికి అర్థం. రహస్య రూపం కలిగిన బ్రహ్మం లేదా పరమాత్మకు పైపూత ఉంటుందా? ఉండదు. ఆ విషయాన్నే అన్నమయ్య వక్కాణించారు.

బంగారం వ్యాపారి చేతిలోని ఒరపిడి రాయి పరమాత్ముడు అని అన్నారు. ఒరపిడి రాయి మీద గీచి, గీచి బంగారం నిగ్గు తెల్చబడుతుంది. మన నిగ్గు మనమే తేల్చుకునేందుకు మనల్ని మనం గీచుకోవాల్సింది పరమాత్ముడితో‌. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహనీయులు పరమాత్మతో తమను తాము గీచుకుని, గీచుకుని నిగ్గు తేల్చుకున్నారు. బంగారం వ్యాపారి చేతిలోని ఒరపిడి రాయి అని ఎంత గొప్పగా చెప్పారు అన్నమయ్య! ఈ చెప్పడం అన్నమయ్య జన జీవన విధానాన్ని విడిచిపెట్టని కవి అన్నదాన్ని స్పష్టం చేస్తోంది.

ఇష్టం‌ లేదా కోరిక లేకపోతే ఏదీ ఉండదు. స్నేహం అయినా ప్రేమ అయినా, బాంధవ్యం అయినా ఇష్టం లేదా కోరిక (ఇచ్ఛ) ఉన్నప్పు మాత్రమే సిద్ధిస్తాయి.
పరమాత్మ కూడా అంతే. ఇష్టం లేదా కోరిక ఉంటేనే పరమాత్మ ఉంటాడు. ఇష్టం లేని వ్యక్తికి పరమాత్మ ఉండడు. అందుకే వేమన “లేదు లేదటన్న లేదు లేనేలేదు / కాదు కాదటన్నఁ గానె కాదు / తోడు తోడటన్నఁ దోడనే తోడౌను” అన్నారు. ఇష్టం లేదా కోరిక కొద్దీ ఉండే వాడే పరమాత్ముడు.

“పలుకులలోని తేట పరమాత్ముఁడు
ఫలియించు నిందరికిఁ బరమాత్ముఁడు
బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముఁడు
ఎలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముఁడు”

పలుకులోని‌ తేట (పలుకులోని తేట పరమాత్ముడు), అందఱికీ సిద్ధించేది (ఫలియించు నిందరికి పరమాత్ముడు) పరమాత్ముడు అని అనీ, అటుతరువాత శక్తిమంతుడు వేంకటాద్రి‌ పరమాత్ముడు (బలిమి శ్రీ వేంకటాద్రి పరమాత్ముడు), ఈ పరమాత్ముడు ప్రేమతో జీవులకు ప్రాణమై ఉన్నాడు (ఎలిమి జీవుల ప్రాణ మీ పరమాత్ముడు)అని అనీ సంకీర్తనను ముగించారు అన్నమయ్య. శక్తిమంతుడైన పరమాత్ముడు ప్రేమతో జీవులందఱికీ ప్రాణమై ఉన్నాడు అనడం చాల చాల బావుంది కదా!

ప్రపంచంలో ఎక్కువగా చదవబడుతూ, ఆదరించబడుతున్న‌ కవులలో ఒకరైన చైనీస్ కవి, తాత్త్వికుడు లావొ- చు (Lao – tzu) తన తావొ – త – చింగ్ (Tao – Te – Ching) 73వ కవితలో “పరమాత్ముడు ఎల్లప్పుడూ సౌలభ్యం చొప్పున ఉంటాడు” (The Tao is always at ease. Tao అంటే పరమాత్మ లేదా‌ బ్రహ్మం.) అని అన్నారు. ఆ అనడం ఈ సంకీర్తనలో అన్నమయ్య చెప్పిన దానికి దగ్గఱగా ఉంది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here