నా ప్రతి సినిమాలో ఈ తరహా పాట తప్పనిసరి….

0
269

యమలీలలో పాటపై ఎస్.వి. కృష్ణారెడ్డి
జూన్ ఒకటో తేదీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు
(దర్శకులు ఎస్‌. వి. కృష్ణారెడ్డితో వైజయంతి పురాణపండ సంభాషణ)
జూన్ ఒకటో తేదీ ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో డాక్టర్ వైజయంతి పురాణపండ యమలీల చిత్రంలో సిరులొలికించే పాట గురించి సంభాషించారు. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఎస్.పి. బాలు, చిత్ర ఈ పాటను పాడారు. దీనికి ఎస్‌.వి. కృష్ణారెడ్డి గారే సంగీతం సమకూర్చారు.

‘యమలీల’ చిత్రం కోసం సీతారామశాస్త్రి గారు రాసిన ‘‘సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు/
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు/బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు/
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు/ఎదగాలీ ఇంతకు ఇంతై ఈ పసికూనా ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా/మహారాజులా జీవించాలి నిండు నూరేళ్లూ’’ పాట తనకు చాలా ఇష్టమని ఎస్.వి. కృష్ణారెడ్డి చెప్పారు. ఈ సినిమా వచ్చి పాతికేళ్లయినా మరో వందేళ్ల తరవాత కూడా ఈ పాటను గుర్తు పెట్టుకుంటారన్నారు. అమ్మ సెంటిమెంట్‌ మీద ఈ సినిమా కథ నడుస్తుందని తెలిపారు. ఏ సినిమాలోనైనా ఒక పాటను… జరగబోయే సినిమా కథ చెప్పేదిగా ఈ రూపొందిస్తానని కృష్ణారెడ్డి తన స్టైల్ గురించి చెప్పారు. ఆ రకంగా యమలీల సినిమాకి ఈ పాటే ప్రధానమని చెప్పారు. అదే రీరికార్డింగ్‌కి పనికొచ్చే పాటగా చేయించుకున్నానని పేర్కొన్నారు. మనసులను హత్తుకునేలా, సెంటిమెంటల్‌ టచ్‌ తో ఈ పాటను తీసినట్టు వివరించారు.
ఆయన ఇంకా ఈ పాట గురించి ఏమి చెప్పారో ఆయన మాటల్లోనే చదవండి…


పాట రాయించుకునేటప్పుడు నోట్స్‌ ఇవ్వాలి, ఎలా కావాలో చెప్పాలి, సన్నివేశం వివరించాలి, ఆ పాటలో ఏం చెప్పాలి… ఏది కంటిన్యూ చేయాలో కూడా వివరిస్తాం. పాత్రల ఆటిట్యూడ్, ఎలా షూట్‌ చేయాలో కూడా చెబుతాం. ఆ జ్ఞాపకాలలోకి వెళ్లడమే ఈ పాటలోని కంటెంట్‌. ఇలాంటి పాటలో సీతారామశాస్త్రి అద్భుతాన్ని సృష్టించారు. ‘‘నాలో మురిపెమంతా పాల బువ్వై పంచనీ/ లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ/మదిలో మచ్చ లేని చందమామే నువ్వనీ/ ఊరూవాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ/కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ’’ అంటూ చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునేలా రాశారు. అమ్మ అనే పదంలో జీవం నిండి ఉంటుంది. ఈ పాటలోనూ ఆ జీవం అలాగే ఉంది.
ముఖ్యంగా తల్లి పాత్రలో మంజుభార్గవి చాలా ఫీల్‌ అయ్యి నటించారు. శంకరాభరణం తరవాత బాగా డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఈ చిత్రంలో చేశారు. ఇందులో ఆవిడది మంచి డిగ్నిటీ ఉన్న పాత్ర. శంకరాభరణంలోలాగే ఈ సినిమాలో కూడా ఆవిడకు చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. ‘‘వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా/ నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా/నాలో అణువు అణువు ఆలయంగా మారగా/ నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా/తోడుండగా నను దీవించే కన్నప్రేమ/ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా’’ అంటూ రెండో చరణం కొడుకు పాత్రలో ఆలీ పాడతాడు. తల్లిదండ్రులు తన కోసం ఏమేం చేశారో ఇంటిపనివాడు చెప్పిన మాటలతో అర్థం చేసుకోవడంతో ఆలీలో మార్పు వస్తుంది. ఆల్బమ్‌ చూస్తూ, గతంలోకి వెళ్లిపోతాడు. తల్లి ఒడిలో తల పెట్టుకుని పాడతాడు. ఈ చిత్రంలో మంజుభార్గవి స్వయంగా ఆవిడకు ఉన్న బంగారు ఆభరణాలు ధరించారు. ఈ పాట షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలోను, జ్ఞాపకాలను సికింద్రాబాద్‌ లీ ప్యాలెస్‌లో తీశాం. ఈ రెండింటినీ కంబైన్‌ చేసి, మొత్తంగా మూడు రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. ఆలీ చిన్నపిల్లవాడి వేషంలో మా కెమెరామన్‌ శరత్‌ గారి బిడ్డ, ఆ తరవాత కొద్దిగా పెద్దయిన పాత్రలో కిశోర్‌ రాఠీ గారి బిడ్డ నటించారు.
నా దృష్టిలోనే కాదు అందరి దృష్టిలోను ‘అమ్మ ఉన్నవారు గొప్పవారు. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. నాకు అమ్మే దైవం. నాకే కాదు ఎవరికైనా తల్లంటే దైవంతో సమానమే. పశుపక్ష్యాదులు సైతం ఇంతే కదా.
అమ్మ అంటే ఒక అద్భుతం అంటారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే ఒక గొప్ప అనుభవం అన్నారు. అమ్మ అంటే ఒక జీవితంలోకి మలచిన అనుభవమని వివరించారు ఆయన.

(Author is a Senior Journalist)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here