అన్నమయ్య అన్నది – 4
(రోచిష్మాన్, 9444012279)
అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగు భాషకు సంబంధించినంత వఱకూ ప్రజలలో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.
అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం, ఏ విధమైన చింతన, ఏ విధమైన భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ స్థాయిలో కవిత్వం చెప్పారు అన్నమయ్య.
అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!
అన్నమయ్యలోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!
అన్నమయ్య అన్నది మనకై ఉన్నది… స్మరించుకుందాం రా రండి-
(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)
తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే
అనుగు దేవతలకును అల కామసుఖ మొకటే
ఘనకీట పశువులకు కామసుఖ మొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు
కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే
తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే
పరగ దుర్గంధములపై వాయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే
కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే
పుడమి శునకము మీఁదఁ బొలయు నెండొకతే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే
“బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అంటూ అన్నమయ్య రాసిన సంకీర్తన విశ్వంలోనే ఒక మహోన్నతమైన రచన. ఈ బ్రహ్మమొక్కటే అన్నది వేదంలో ఉన్నదే. మన దేశంలో ఎప్పటినుంచో చెప్పబడుతున్నదే. ఆ సత్యాన్ని తీసుకుని దానికి తమ ప్రత్యగ్రమైన (కొత్తదైన, పరిశుద్ధమైన) చింతనను మేళవించి అనితరసాధ్యమైన కావ్య శిల్పంతో ఒక మహోన్నతమైన సంకీర్తన చేశారు అన్నమయ్య. పదునైన లేదా చొచ్చునిపోయే అవగాహనతో అన్నమయ్య ఈ రచనను విప్లవాత్మకంగా విరచించారు. ఔను ఇలాంటి రచనా సంవిధానం కవిత్వంలో ఓ విప్లవం.
“బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అని అన్నాక మళ్లీ “బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అని అన్నారు. “బ్రహ్మం అన్నది ఒక్కటే, అది అందఱికీ ఒక్కటే” అని మనం అన్నమయ్యను అర్థం చేసుకోవాలి.

“కందువగు హీనాధికములు ఇందులేవు” అని వేఱు వేఱు తెగలుగా ఉన్న తక్కువ ఎక్కువలు బ్రహ్మంలో లేవు అని తెలియజేస్తున్నారు అన్నమయ్య.
“నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే / అండరే బంటు నిద్ర అదియు నొకటే” ఇలాంటి ఆలోచనను ఇటువంటి అభివ్యక్తితో అంతకు ముందు మఱెవరూ చెప్పలేదు. “మెండైన బ్రాహ్మణుడు మెట్టు (తొక్కే) భూమి యొకటే / చండాలు డుంటేటి సరిభూమి యొకటే” అనడం ఒక విప్లవాత్మకమైన సత్యావిష్కరణ.
“కామం అన్నది దేవతలకూ, కీటకాలకూ, పశువులకూ ఒకటే అనీ, పగలు, రాత్రి అన్నవి ధనవంతులకూ, బీదవాళ్లకూ ఒకటే” అనీ ఈ సంకీర్తనలో అన్న అన్నమయ్య ప్రపంచంలోనే అలా అన్న తొలి కవి అయ్యారు.
“తినేది ఏదైనా ఆకలి అన్నది ఒక్కటే” అనీ, దుర్గంధాలపై వీచినా, పరిమళాలపై వీచినా గాలి అన్నది ఒకటే” అంటూ అపూర్వమైన వ్యక్తీకరణ చేశారు ఈ సంకీర్తనలో అన్నమయ్య.
“ఏనుగు మీదా, శునకం మీదా కాసే ఎండ ఒకటే” అనీ, “పుణ్యం చేసిన వాళ్లకూ. పాపులకూ శ్రీ వేంకటేశ్వరుడి నామం ఒకటే” అని అన్నమయ్య అనడం అనన్యం.
ఇవాళ ప్రపంచంలో గొప్ప కవులుగా పరిగణించబడుతున్న ఖలీల్ జిబ్రాన్, రూమీ, హాఫిజ్ కొంత వఱకూ ఇలా చెప్పగలిగారు. కానీ మఱెవ్వరూ ఈ స్థాయి భావాన్ని ఇంత గొప్ప శిల్పంతో చెప్పలేదు. రచనా సంవిధానం, శిల్పం, శైలి, భావం పరంగా ఈ రచనకు సరి రాగల కృతి విశ్వంలో మఱొకటి లేదు. విశ్వంలోనే ఒక విశిష్టమైన రచనగా తనరారుతున్నది ఇలా అన్నమయ్య అన్నది.
(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)