(డాక్టర్ వైజయంతి పురాణపండ)
‘గుణసుందరి కథ’ పద ప్రయోగాలను పరిశీలన శాయరా డింభకా.. అని డింగరి మామ పింగళి అంటున్నట్లుగా అనిపించుచున్నది.
పరిశీలన సాయుదమా…
’ ‘లోకమోహన కరంగా’
లోకోత్తరంగా… అంటే మామకు ఆనందం కలుగదుగా…
అందుకే లోక మోహన కరంగా అని పలికినందుకు వేయాలి రెండు వీరతాళ్లు.
’ మరోటి ‘కరగ్రహణం..’ పాణి గ్రహణం తెలుసు, కరచాలనం తెలుసును. ఆ రెంటినీ కలిపి వెరసి ‘కరగ్రహణం’ చేశారు మాటల సృష్టికర్త పింగళి మామ.
మాయాబజార్‌లోనూ ఉందిగా ఈ కరగ్రహణం, పాదపీడనం.
’ ‘మాంసం విషదుష్టమైపోయింది’
మాంసం పాడైపోవడం తెలుసు,
విషంగా మారటం తెలుసు.
ఈ దుష్టమైపోవడం ఏమిటో.
దుష్ట సమాసం అని విన్నామే కాని, విషదుష్టమైపోవటం మామకే చెల్లు.
––––
ఇక ఒకసారి కథలోకి పరవేశిద్దామా…
మహేంద్రమణి కోసం బయలుదేరారు అరమతి, కాలమతి.
కాలమతికి సందేహం కలిగింది. ‘యక్షితులు రాక్షసులా పిశాచాలా’ అని సందేహం అడగనే అడిగాడు.
‘యక్షితలు ఆడవారే’ అంది పెద్ద అమ్మాయీమణి.
అందుకు ఆ రెండు మతులవారు…
‘మీసం గల మొగోళ్లం… మోసం చేసైనా తెస్తాం’ అని గిరగిర గిరగిరమన్నారు కుక్క కాపలా అల్లుళ్లు.
ఏమైతేనేం –
వైద్యులు చెప్పిన స్థలచోటుకు చేరుకున్నారు.
పాతాళంలోకి వెళ్లాలి.
‘నేలసొరంగ ముఖద్వారం’ ద్వారా లోపలకు చేరుకున్నారు.

నిజమే…
సొరంగం నేలలోనే ఉంటుందిగా. ఆ సొరంగానికి ప్రధాన దవారం ఉంటుందిగా.. అదే నేలసొరంగ ముఖద్వారం’ అని పలికించారు పింగళి. అంతేనా
అక్కడ –
అమృత సరస్సు, కమల ద్వారం.. కూడా పుట్టించేశారు.
లోపలకు ప్రవేశించారో లేదో ఒక ఆడ వనితా స్త్రీమణి కంటికి విందులు చేస్తూ దర్శనమిచ్చింది.
ఇక ఇక్కడ దైవాధీనం –
బయలుదేరుతూ.. తన అష్టావక్ర రూపంలోకి మారడంతో, ‘నలుడు బాహుకుడయ్యాడు…’ అని ఒక్కమారు నలమహారాజును గుర్తుజ్ఞాపకం చేశారు.
వేషానికి తగ్గట్టుగా వస్తువులను చేతబూని, ‘ఈ వేషానికి ఇవేగా ఉత్సాహ సామగ్రి..’ అని దైవాధీనం అంటుంటే… ఉత్సాహానికి సామగ్రి ఏమిటా అనిపించలేదూ… ఎందుకు అనిపించదూ… అనిపించడానికేగా ఆ పదప్రయోగం ఆ బంగారు పాళీ నుండి చురుకుగా బయటకు వచ్చిచేరింది.
అంతలోనే గుణసుందరీదేవి అమ్మాయీమణి…
‘సుట్ట ముట్టించి, సూక్ష్మబుద్ధికి సురుకెట్టి (పదునెట్టి, పదానికి మారుగా) బయలుదేరు’ అని ఆవిడ అంటుంటే, ‘గిడి గిడి గిడి’ అంటూ ఈ దైవాధీనం పదచలనం చేశాడు.
దైవాధీనాన్ని చూస్తూ అన్నలు వెటకారమాడాలిగా అందుకే…
‘శౌర్యం జబ్బలోకెక్కింది (భుజబలం) ఊరు బలం
తమ్ముడు తాత’ అంటూ నవ్వనే నవ్వారు.

ముగ్గురూ మహేంద్ర మణి కోసం శోధన చేయవలసియే ఉన్నారు.
‘గర్భగుడి అంతా గాలించినా ద్వారం కనపడదేమిరా’ అని కాలమతి అంటే..
‘బయటుందేమో చూద్దాంరా’ అన్నాడు అరమతి.
‘నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను’ అంటూ దవారం కోసం అన్ని దిక్కులూ వెతుకులాట ఆడటం మొదలెట్టారు.
అంతలో ఒకానొక బావి నుయ్యి వారి కంట పడనే పడింది.
‘నిలువుగా తలాతలరసాతలంగా ఉంది, బావిరా ఇది’
‘అసలే పాతాళ బావి, అందునా పాడుపడ్డది’ అంటూ దిగులుపడ్డారు అల్లుళ్లు.
ఇది చూస్తే ‘అసలే కరవు కాలం, అందునా అధికమాసం’ గుర్తుకు రాలేదూ.
పాతాళ బావి అయితేనేమి, పాడు బడితేనేమి.
’ ’ ’
పింగళి మామ మాటలు వ్యాఖ్యానం రాయటం సాహసమే.
కాని మామే చెప్పారుగా…
సాహసం శాయరా డింభకా అని
ఇప్పుడు మామ మాటలను కొన్నిటిని కాస్తంతా చురుగ్గా చూసేద్దాం.
’ నమస్కారానికి టెంకణాలు
’ ఆకాశాన్ని చీల్చేస్తాం
పాతాళాన్ని బద్దలు కొట్టేస్తాం.
’ కాలు తగిలితే భూమి పఠేల్ పఠేల్ అనవలసిందే..
’ భళిభళి పడుచురాజులు పట్టుబట్టినారే పట్టి లాగినారే
’ ముసలాళ్లు మగ్గిపోతుంటే పడుచాణ్ని పకపకమనటం..
’ కాలు కదల్చలేకపోయావా, పెద్దల్లో కలిసిపోతావు
’ నీవు ఏ జాతి స్త్రీవో చెప్పు, శంఖిణివా ఢాకిణివా
’ ముఖాముఖి ముష్టాముష్టి కచ్చాకచ్చి బాహాబాహీ మల్లయుద్దం చేసి మటమటలాడించి మణిని కక్కించేవాడిని..
’ అనంతాస్తోక నిగమనిగమనఘృణి మహేంద్రమణి
’ హలో లక్ష్మణా, శత్రుఘ్నా (తోడల్లుణ్ని పిలుస్తాడు దైవాధీనం)
’ సూర్యచంద్రమణిరా
’ మా చిట్టితల్లి నైవేద్యాలతో దేవతలు బలిసిపోతున్నారు (శ్రీరంజనితో సురభి కమలాబాయి పలుకుతుంది)
’ ముద్దు పెట్టి ఒకర్తిని
చక్కలిగిలి పెట్టి ఒకర్తిని
మూడో యక్షితనే ఏం చేశాడో తెలీదు (అల్లుళ్ల మాటలు)
’ పడుకోండిరా మీ భర్తలను తలచుకుంటూ (వెటకారంగా దైవాధీనం తోడల్లుళ్లతో అంటాడు)
’ కాటికి కాళ్లీడుస్తుంటే, మనసు మణికేడుస్తుంటే ఊగిసలాడమని ఆ ముసలాణ్ని అడవులపాలు చేశావు (చెల్లెలు గుణసుందరితో అక్కయ్యలు పలికిన మాటలు)
’ నమస్కారం మావయ్యా!
సాష్టాంగ నమస్కారం మావయ్య మహారాజా! (అల్లుళ్లు రాజుతో అంటారు)
’ నీ పేరు ప్రకటించాం, మా పేరు చాటించుకున్నాం.. (అల్లుళ్లు)
(చివరిలో పార్వతీపరమేశ్వరుల మాటలు వినితీరవలసిందే)
’ ఎలుగుబంటి నటనకు… ఈ అభినయానికి నా టిప్పణం వినుకోండి… అని పార్వతీదేవి అంటే
‘నా ఒప్పణం వినుకో’ అంటాడు పరమశివుడు.
ఈ టిప్పణాలు, ఒప్పణాలు ఏమిటో….
’ భుగభుగ బొజ్జయ్య
మిసమిస మీసాలయ్య…
’ సత్యమున్నచోటనే నిత్యమూ దైవముండేది (శివుడు)
’ మోసం తిని రోసంతో రుసరుస లంటావే
ఎవరో ఆ టకటంకులు టాకోట్లు (అల్లుళ్లను ఉద్దేశించి పార్వతీపరమేశ్వరులు పలికిన మాటలు)
ఈ చిత్ర సంభాషణలను బాగా పరిశీలనగా వినాలి.
ఒకసారి కాదు రెండు సార్లు కాదు…
నాలుగైదు సార్లు చూస్తే..
పింగళి పదగుంఫనం, పద ప్రయోగం, పద సృష్టి, పద సౌందర్యం…
మనలను పదపదమనిపిస్తాయి.
ఆ పదాల వెంటే మన పాదాలు పదచలనం చేస్తాయి.
’ ’ ’
పింగళి వారి సంభాషణల గురించి చదివిన వారికి, రాసిన వారికి, ఇతరులకు వినిపించినవారికి సకల శుభములు కలుగుగాక!
నమో పింగళి! నమోన్నమః!

(Author is a senior journalist)

