అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు

0
58

వర్షాలపై సమీక్షలో అధికారులకు సీఎం హెచ్చరిక
కోర్ అర్బన్ రీజియన్ లో మరింత అప్రమత్తంగా ఉండాలి
వర్షం కారణంగా ట్రాఫిక్ జాం అయితే సహించను
వర్షాల సమయంలో అధికారులు, పోలీసులు రోడ్ల పై ఉండాల్సిందే
అవసరమైతే నేనూ రోడ్ మీదికి వస్తా..
అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 14:
వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


తొమ్మిదో తేదీన ఏమి జరిగింది: ప్రశ్నించిన సీఎం
జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్‌లో వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు . వర్షాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేశానని గుర్తుచేశారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూన్ 9న వర్షం సమయంలో మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌లను ఆదేశించారు. మరో సారి ఇలాంటి పరిస్థితి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ముందస్తు చర్యలు చేపట్టాలి
వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షం సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనన్నారు. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని హెచ్చరించారు.


ఇలా రెడీ అవ్వండి…
వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలని సూచించారు. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు.


మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ…
వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలన్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు.ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు సూచించారు.


విత్తనాలు, యూరియా పంపిణీపై సన్నద్ధం కావాలి…
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలన్నారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. యూరియా స్టాక్ , పంపణి కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన ఎనిమిది రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


తాగు నీరు కలుషితం కాకుండా చర్యలు…
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గతంలో తాగునీటి కాలుషితం కారణంగా జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలని జలమండలి అధికారులను ఆదేశించారు.నీటి కలుషితం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాల కారణంగా నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.
ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు జ‌యేష్ రంజ‌న్ , వికాస్ రాజ్ ,ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటిపారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి ఈ శ్రీధ‌ర్, ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి గౌర‌వ్ ఉప్ప‌ల్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, విపత్తు నిర్వ‌హ‌ణ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి హ‌రిచంద‌న‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి, సీఎంసీ కమిషనర్ సృజన , జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ డి. కృష్ణ భాస్కర్,టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, అగ్నిమాపక శాఖ అదనపు డీజీ విక్రమ్ సింగ్ మాన్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం . రమేష్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, మేడ్చల్-మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here