తాగు నీటి సరఫరాపై ఎల్‌నినో ప్రభావం పడకుండా చూడాలి
- తాగునీటి వనరులను అనుసంధించాలి
- నిర్దేశిత సమయంలో ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలి
- వాటర్‌బోర్డు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జులై 23: క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగు నీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం సూచించారు. హైదరాబాద్ మహా నగర తాగు నీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలని సీఎం సూచించారు. ఏదైనా కారణాలతో ఒక సోర్స్ నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్స్ నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత ఉపయోగపడుతుందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగు నీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం తేల్చిచెప్పారు. ఎస్టీపీల నిర్మాణ పనులపై సీఎం ఆరా తీశారు. ఎస్టీపీల నిర్మాణాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు.
తాగు నీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల ప్రగతిపై ప్రతి నెల తనకు నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో ఎంఏ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

