నాన్నతో విమానం ఎక్కాను
సుత్తి వీరభద్రరావు తనయుడు చక్రవర్తి
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
ఆయన తొలుత ఆకాశవాణి ఆర్టిస్టు. అద్భుతమైన వాచకం, పదాల విరుపులు శ్రోతల మనసులో సుస్థిర స్థానాన్ని తెచ్చిపెట్టాయి. సినీ రంగ ప్రవేశంతో తన నటనా చాతుర్యాన్ని కూడా నిరూపించుకున్నారు. కామెడీ సీన్లను పండించి, కామెడీ కింగ్ అయ్యారు. సుత్తి కొట్టే పాత్రతో సుత్తిని ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆయనే సుత్తి వీరభరరావు. 41 సంవత్సరాల వయసుకే చేసిన కామెడీ చాలంటూ ఇహ లోకాన్నుంచి నిష్క్రమించారు. జూన్ ఆరో తేదీ ఆయన జయంతి. ఈ సందర్భంగా గతంలో ఆయన కుమారుడు చక్రవర్తితో నిర్వహించిన ముఖాముఖి వ్యూస్ పాఠకుల కోసం….
నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే…
హైదరాబాదు, ముస్తాబాదు, సికిందరాబాదు
నీ నవరంధ్రాల్లోను మైనం కూరతానురా తలకు మాసిన కుంకా
అలా మార్నింగ్ వాక్‌కి వెళ్లొద్దామా
రాగం కల్యాణి, ఆది తాళం, ఆరున్నర శృతి…
ఈ డైలాగులతో మనల్ని నవ్వించినవారు గుర్తుకు వచ్చారా..
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో హీరోగా నటించిన వీరభద్రరావు, జంధ్యాల మార్కు సినిమాలతో సుత్తి వీరభద్రరావుగా హాస్యనటుడిగా తెలుగు సినీ ప్రపంచంలో స్థిరపడిపోయారు. వేలుతో కలిసి సుత్తి జంటగా అందరి ఇళ్లలోకి ప్రవేశించి, అందరి గుండెల్లోను నేటికీ సుత్తి కొడుతూనే ఉన్నారు. ఈ సుత్తిని భరించిన మామిడిపల్లి ఉరఫ్ సుత్తి వీరభద్రరావు కుమారుడు మామిడిపల్లి చక్రవర్తి తన తండ్రి గురించి వివరించిన విషయాలు…
సుత్తి ఆంటీ…
అమ్మ పేరు శేఖరి. విజయవాడ కృష్ణలంకలో ఉండేవాళ్లం. నాన్నగారు 1971లో ఆలిండియా రేడియోలో చేరారు. నేను 1972లో పుట్టాను. నా తరవాత రెండు సంవత్సరాలకి చెల్లాయి విజయ నాగలక్ష్మి పుట్టింది. నేను పుట్టాక నాన్నకు ప్రమోషన్ వచ్చిందట. నాన్న 1982లో ఆకాశవాణి విడిచిపెట్టేసి, 1983లో చెన్నై వచ్చి, సినిమాలలోకి ప్రవేశించి, సుత్తి వీరభద్రరావు అయ్యాక అమ్మను అందరూ ‘సుత్తి ఆంటీ’ అని పిలిచేవారు. మేం చెన్నై వచ్చేనాటికి నేను ఎనిమిదో క్లాసు చదువుతున్నాను. ఆ తరగతి నుంచి చెన్నైలోనే నా చదువు కొనసాగింది. అయితే ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారటంతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డాను. ఆ తరవాత అలవాటు పడిపోయాను. పదో తరగతిలో ఫస్ట్ క్లాసు సాధించాను. ఆ రోజు నాన్న ఎంతో సంబరపడిపోయారు. అయితే ఆ సంబరం ఎంతోకాలం నిలబడలేదు. నేను ఇంటర్ సెకండియర్ చదువుతుండగా అంటే, 1988లో నాన్న చనిపోయారు. ఒక్కసారిగా మమ్మల్ని దుఃఖం ఆవహించింది. అయితే అమ్మ చాలా మొండి మనిషి కావటం వల్ల, నాన్న మరణాన్ని దిగమింగి, మమ్మల్ని ధైర్యంగా చదివించింది.
ఏమీ తెలియలేదు…
నాన్న మరీ అంత త్వరగా చనిపోవడంతో ఇంటి పక్కనే ఉన్న లయోలా కాలేజీ గురించి కూడా నాకు తెలియలేదు. ఇంటర్ పూర్తయ్యాక ఎమ్‌సెట్‌లో 3000 ర్యాంకు వచ్చినా మంచి కాలేజీలో సీటు రాలేదు. నన్ను ముందు నుంచి నాన్న కంప్యూటర్ సైన్స్ చదవమని చెప్పారు. ఆయన మాట కోసం కంప్యూటర్ సైన్స్‌లో సీటు కోసం ప్రయత్నించాను, కానీ సీటు రాలేదు. అందువల్ల, లయోలా నైట్ కాలేజీలో బి.ఎస్‌సి. ఫిజిక్స్‌లో చేరాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఉదయం వేళ ఉద్యోగం చేస్తూ, చదువుకున్నాను. కొద్దిగా స్థిరత్వం వచ్చాక, పై చదువుల కోసం కొంతకాలం అమెరికా వెళ్లాను. ఉద్యోగం చేస్తూ, చదువుకుందామని వెళ్లి, అక్కడే పి.జి. డిప్లమా ఇన్ మేనేజ్‌మెంట్ చేశాను.
అమెరికా నుంచి ఇండియాకి…
అమెరికాలో బాగా నిలదొక్కుకున్నాక, ఇండియా వచ్చేశాను. పోలారిస్ సాఫ్ట్‌వేర్‌లో చేరాను. చెల్లి ఎం.ఎస్‌సి మాథమేటిక్స్ చేశాక, 2002లో చెల్లిలికి వివాహం చేశాను. 2005లో నా వివాహం జరిగింది. ఆ తరవాత యునైటెడ్ కింగ్‌డమ్ వెళ్లి, కొంతకాలం తరవాత వెనక్కి వచ్చేశాను. 2008లో సొంత కంపెనీ ప్రారంభించాను. నాకు క్రియేటివ్ సైడ్ వెళ్లాలని ఉండేది. కానీ నాన్న పోవడంతో ఇంటి∙బాధ్యతలన్నీ వచ్చి చేరాయి. దానితో కంప్యూటర్ వైపుకి వెళ్లాను.
ఆ బాధ తీరదు…
నేను నా జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నప్పుడు నాన్నను మిస్ అయ్యాననే భావన కలుగుతూనే ఉంటుంది. కాని ఆయన నా వెనకాలే ఉండి, నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నట్లే భావించుకుంటాను. నాన్నని చాలా త్వరగా పోగొట్టుకోవడం ఒక దురదృష్టమైతే, చెల్లిని పోగొట్టుకోవటం మరో బాధాకర సంఘటన. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సరు వచ్చి కన్నుమూసింది. చెల్లెలికి ఒక కూతురు. పేరు తనుశ్రీ. పదో తరగతి చదువుతోంది.
నాన్నతో ప్రయాణాలు…
నాన్నకి ప్రయాణాలంటే చాలా ఇష్టం. నాలుగు సార్లు ఆయనతో కలిసి శబరిమలకు వెళ్లాను. ఒకసారి మా కారుకి ప్రమాదం జరిగింది. దేవుడి దయ వల్ల బయటపడ్డాం. అది నిజంగానే దేవుడి మహిమేనేమో అనిపిస్తుంది. నాన్న విజయవాడలో ఉన్న రోజుల్లో నాటకాలు బాగా వేసేవారు. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నాన్న నటించిన నాటకాలు చూడటానికి వెళ్లేవాడిని. కన్యాశుల్కం నాటకం చూసినట్టు గుర్తు. అలాగే నాన్న రేడియోలో వేసిన నాటకాలు వినేవాడిని. నాన్నతో గడిపిన కాలం చాలా తక్కువ. చెన్నైలో నాన్నతో గడిపిన నాలుగు సంవత్సరాలు నాకు గోల్డెన్ పీరియడ్. ఆ టైమ్‌లో సినిమా షూటింగులు, డబ్బింగులకు నాన్నతో వెళ్లేవాడిని.
చదువు ఇలా సాగింది…
నాన్నగారికి నన్ను ఇంజినీర్ చేయాలని ఉండేది. ఎంసెట్ ఎంట్రన్స్‌లో నాకు వచ్చిన ర్యాంకుకి సివిల్ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. అది ఇంటరెస్ట్ లేకపోవటంతో, డిగ్రీలో చేరి, సమాంతరంగా ఎన్‌ఐఐటీలో చేరాను. అలా రెండూ చడవటం వల్ల ఒక ఏడాది వేస్టు అయిపోయింది. డిగ్రీ అయ్యాక ఏఎంఐఈ, ఐసీడబ్లు్య ఇలా చేశాను. విజయవాడ వెళ్లిపోవటం కంటె ఇది చేయడమే నయమనిపించింది. ఎన్‌ఐఐటిలో మొదటి లేదా రెండో స్థానంలో ఉన్నాను. వీటన్నిటికీ కారణం అమ్మ మాత్రమే. అమ్మకి మంచి స్నేహితులు ఉండటం వల్లే ఇవన్నీ చేయగలిగాను. అందుకే అక్కడ ఉండిపోయాం.
నిర్మాతల దగ్గర నిలబడి…
నాన్న పోయేనాటికి నాన్నకు సుమారు నాలుగు లక్షల రూపాయలు బాకీలు ఉన్నారు. ఎవరెవరు ఎంత ఇవ్వాలో నాన్న ఒక లిస్టు రాసి పెట్టారు. వాటిని రాబట్టుకోవటం కోసం చెన్నైలోనే ఉండిపోదాం అంది అమ్మ. అందులో సగం మందిని అడిగితే, ‘మేం ఏమీ ఇవ్వక్కర్లేదు’ అన్నారు. మిగిలిన వారు మాత్రం ఏదో ఇచ్చారు. నాలుగేళ్లు తిరిగితే మూడు లక్షలు తెచ్చుకోగలిగాను. పొద్దున్నే వెళ్లి నిర్మాతల దగ్గర నిలబడాల్సిందే. కొంతమంది నిర్మాతలు బాగానే మాట్లాడేవారు. కొందరు మాత్రం చాలా చులకనగా మాట్లాడేవారు. ఇదంతా చూసిన జంధ్యాలగారు చాలా బాధపడ్డారు. నిర్మాతల బదులు ఆయన ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆ అనుభవమే పునాది…
నాన్నగారి జీవితం నాకు మంచి అనుభవాన్ని నేర్పింది. అమ్మకు.. మా చదువు, ఆర్థిక లావాదేవీలు మేనేజ్ చేయగలనన్న నమ్మకం ఉండటం వల్లే అక్కడ ఉండిపోయాం. అమ్మ స్నేహితులంతా పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్‌గా ఉన్నారు. నేను బి. ఎస్‌సిలో చేరినప్పుడు దగ్గరి బంధువులంతా ‘బోడి బియస్‌సి’ అని వెటకారమాడారు. అటువంటి సంఘటనలు చూసినప్పుడు ‘కొందరికి దూరంగా ఉంటేనే బాగుపడతాం’ అనిపించింది. తండ్రి లేని పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడతారో బాగా అర్థమైంది.
దీపావళి మాతోనే…
నాన్న షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా, దీపావళికి మాత్రం మాతోనే గడిపేవారు. ఉదయమంతా షూటింగ్‌లకి వెళ్లినా, చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేవారు. అందరం కలిసి బాణా సంచా కాల్చేవాళ్లం.
ఇవన్నీ ఇష్టం…
’ ‘పుత్తడిబొమ్మ’ చిత్రంలో నాన్న చదివిని పద్యాలు చాలా ఇష్టం. ఆ చిత్రానికి నాన్నకు అవార్డు వచ్చింది. పుత్తడిబొమ్మ డబ్బింగ్‌కి నాన్నతో నేను వెళ్లాను.
’ ఆనందభైరవి, శ్రీవారికి ప్రేమలేఖ చిత్రాలలో నాన్న పాత్రలు చాలా బావుంటాయి.
’ రెండు రెళ్లు ఆరు, బాబాయ్ అబ్బాయి చిత్రాలలో నాన్న సొంతంగా ఇంప్రొవైజ్ చేశారు. బాబాయ్ అబ్బాయ్, వివాహ భోజనంబు షూటింగులకు కూడా వెళ్లాను. ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్ర షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు మొదటిసారి నాన్నతో విమానం ఎక్కాను.
’ కామిక్ వాయిస్‌లో పొట్టిప్రసాద్ గారిది నంబర్ వన్. నూతనప్రసాద్‌గారు కూడా. గొంతులోనే హ్యూమర్ జనరేట్ చేయడం పుట్టుకతో వచ్చే వరం. పడమటి సంధ్యారాగం చిత్రంలో నాన్న డబ్బింగ్ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది.
ఒక కళాకారుడు కష్టాలన్నీ మరచిపోయి, వేదిక మీద ఆనందం పొందుతాడు. ఆ తరవాత ఆ ఆనందం వారి మీద స్వారీ చేస్తుంది. అందువల్లే నాన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి ఉంటారు.
బాధ్యతలు అన్నీ నిర్వర్తించాను…
ఒక కొడుక్కి తండ్రి అవసరం, ఒక కూతురికి తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను ఎన్నడూ బాధ్యతల నుంచి పారిపోలేదు. అమ్మ ఆశీర్వాదంతో ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. నా భార్యపేరు కిరణ్మయి చావలి. తను ఆయుర్వేదిక్ డాక్టర్. మా అమ్మాయి పేరు అనన్య. ఈనాటికీ నాన్న సినిమాలు టీవీలో వస్తుంటే, మా అమ్మాయికి చూపిస్తాను. చూస్తున్నంతసేపు ఆయన బతికి వచ్చినట్లుగా మా దగ్గర ఉన్నారన్న భావన కలుగుతుంది. నా పుట్టినరోజు నాడు ఆయన సినిమా వస్తే నాకు పండగే. నాన్న నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందుతాను. నాకు క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంటరెస్ట్ ఉంది. అది బహుశ నాన్న ప్రభావం కావొచ్చు. కార్టూన్లు, స్కిట్స్ చేశాను. ఇది హాబీ మాత్రమే. అది నా జీవితంలో మరచిపోలేని రోజు. ప్రస్తుతం ‘ప్రొడక్ట్ సర్సీస్ మేనేజ్‌మెంట్’ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు.
ఆ సినిమాలో నేను నాన్నకు దండ వేసాను…
రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో ‘భామాకలాపం’ షూటింగ్ ప్రారంభ వేడుక జరుగుతోంది. ఆ రోజు నాన్న పుట్టినరోజు. నాన్నతో నేను, చెల్లి కూడా కలిసి వెళ్లాం. ఒక పెద్ద కేక్ తెచ్చి, నాన్న చేత కట్ చేయించారు. నా జీవితంలో నేను మరచిపోలేని రోజు అది. నాన్న అక్కడున్న నటులందరితో సరదాగా కలిసిపోవటం ఇంకా బాగా గుర్తు. ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రంలో నాన్న ‘సీతారామసంగ్రామం’ ఘట్టంలో ఆడవేషం వేసి పాట పాడతారు. ఆ తరవాత నాన్నకి దండ వేయాలి. నన్ను వేయమన్నారు. నేను మెళ్లో వేసి వెళ్లిపోవాలి. ఆ దృశ్యం ఎప్పటికీ మరచిపోలేను.