Sunday, December 10, 2023
HomeArchieveబీజేపీ (Atal Bihari Vajpayee) ప్రస్థానంలో వాజపేయి ఓ చెరగని ముద్ర!

బీజేపీ (Atal Bihari Vajpayee) ప్రస్థానంలో వాజపేయి ఓ చెరగని ముద్ర!

రాజ‌కీయ శైలి అనిత‌ర సాధ్యం
అబ్బురపరిచే వాగ్ధాటి.. అచంచల ఆత్మవిశ్వాసం.. రాజకీయ చతురత
రాజనీతిజ్ఞతకు చిరునామాగా నిలిచిన ఆయన ప్రతి అడుగూ ఓ మైలురాయే

(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధ‌ర్, 9989855445)

ఆయన సేవలకు గుర్తింపుగా భారత్ సర్కారు ఆయనను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సమున్నత రీతిలో గౌరవించింది. ఆయ‌న జన్మదినాన్ని(డిసెంబర్ 25) కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది.
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నుంచి..
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అటల్ బిహారి వాజ్ పేయి అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజపేయి దంపతులకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25న ఆయన జన్మించారు. వాజ్పేయి తండ్రి కృష్ణ స్కూల్ టీచర్. కవి కూడా. గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో వాజపేయి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత గ్వాలియర్లోనే విక్టోరియా కాలేజీ గ్రాడ్యుయేషన్, కాన్పూర్లోని దయానంద్ ఆంగ్లో–వేదిక్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1939లో ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చురుగ్గా పాల్గొన్నారు. హిందీ మాసపత్రిక రాష్ట్ర ధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్లలో పని చేశారు
రాజకీయ ప్రస్థానం
ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజపేయి రాజకీయ రంగంలో ఒక్కో మెట్టు అధిష్టించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆయన అప్పటి హిందూత్వ పునాదులపై డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్(బీజేఎస్)లో చేరారు. అనతికాలంలోనే పార్టీ ఉత్తరాది జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 1957లో బలరాంపూర్ నుంచి తొలిసారిగా లోక్‌స‌భకు ఎన్నికయ్యారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అప్పట్నుంచి తన సహచరులు నానాజీ దేశ్‌ముఖ్, బల్రాజ్ మధోక్, ఎల్కే అద్వానీలతో కలసి పార్టీని కొత్త తీరాలకు తీసుకువెళ్లారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నేతృత్వంలో ఉద్దృతంగా సాగిన సంపూర్ణ విప్లవోద్యమంలో వాజపేయి చురుగ్గా పాల్గొన్నారు. 1977లో జనసంఘ్ మద్దతుతో కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కారు కొలువుదీరింది. అందులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు. 1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయడంతో కేంద్రమంత్రిగా కొద్దికాలం పాటే పనిచేయాల్సి వచ్చింది. అప్పటికే గొప్పనేతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు


3 సార్లు ప్రధాని పీఠం..
1984 ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ వాజపేయి నేతృత్వంలో 1996 సార్వత్రిక ఎన్నికల నాటికి తన సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ పదో ప్రధానిగా వాజపేయి ప్రమాణం చేశారు. అయితే మిత్రపక్షాలు సహకరించకపోవడంతో బలపరీక్షలో ఓడిపోయి 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత 1998లో మిత్రపక్షాలను కూడగట్టిన బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ సమయం(1998 మే)లోనే ఆయన రాజస్తాన్లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు. మరోవైపు పాక్తో శాంతిచర్చలకు శ్రీకారం చుట్టారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సర్వీసును ప్రారంభించారు. పాక్ కయ్యానికి కాలుదువ్వి కార్గిల్ వార్కు కారణమైంది. ఆ యుద్ధంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో పాక్ సైనికులను సరిహద్దుల నుంచి తరిమేసి జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా వాజపేయి ప్రభుత్వం పూర్తికాలంపాటు ప్రభుత్వాన్ని నడపలేదు. మిత్రపక్షం అన్నా డీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించింది. 1999 అక్టోబర్ 13న వాజ్పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999–2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి కావడం విశేషం.


సంస్కరణల బాటలో..
మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజపేయి కీలక ఆర్థిక సంస్కరణలకు బాటలు వేశారు. విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. స్వేచ్ఛా వాణిజ్యం, సరళీకృత విధానాలతో ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ రహదారుల అభివృద్ధి పథకం, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన పథకాన్ని చేపట్టారు. అమెరికా–భారత్ మధ్య స్నేహబంధం బలోపేతమైంది. 2000 మార్చిలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజాలు వేస్తూ అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాకు దగ్గరవుతూనే పాక్‌కు స్నేహహస్తం చాచారు వాజపేయి. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌తో ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. కశ్మీర్ అంశంపై ముషార్రఫ్ పట్టుపట్టడంతో ఇరుదేశాల మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.
అవార్డులు
1992: పద్మవిభూషణ్
1994:లోకమాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, గోవింద్ వల్లభ్పంత్ అవార్డు
2015: భారతరత్న
రాజకీయాల నుంచి నిష్క్రమణ
2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమిపాలైంది. యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టేందుకు వాజపేయి నిరాకరించారు. పార్టీ బాధ్యతలను అద్వానీకి అప్పగించారు. 2005 డిసెంబర్లో ముంబైలో జరిగిన బీజేపీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్నుంచి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు
జెనీవా వేదికగా భారతీయ గళం..
1994లో జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు తద్వారా భారత్ పరువు తీసేందుకు పాక్ పన్నాగం పన్నింది. మానవహక్కుల ఉల్లంఘన పేరుతో ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టి కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వివాదం చేయాలన్న ఈ కుట్రను ఛేదించేందుకు ప్రధాని హోదాలో పి.వి.నరసింహారావు ఎవరిని నియమించారో తెలుసా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజపేయిని. పీవీ తనకు ఇచ్చిన గౌరవాన్ని అంతే హుందాగా నిలుపుకున్నాడు. జెనీవా వేదికగా పాకిస్థాన్ కుట్రలను తన వాగ్ధాటితో ఛిన్నాభిన్నం చేశాడు. కశ్మీర్ విషయానికి వస్తే భారతీయులంతా ఒక్కటేనని.. మా భూభాగాన్ని కాపాడుకోవడం ఎలాగో మాకు బాగా తెలుసునని పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు.
అటల్జీ – విజయ రాజే సింధియా – సైకిల్
అప్పటికే వాజపేయి ప్రముఖ రాజకీయ నాయకుడు. ఎన్నోఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. అయినా సరే ఎంతో సాదాసీదాగా ఉండడమే ఆయనకు ఇష్టం. తాను పుట్టి పెరిగిన గ్వాలియర్‌లో సైకిల్‌పై తిరుగుతూ చిన్ననాటి స్నేహితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం అంటే వాజపేయికి ఎంతో సరదా. ఈ విషయాల్ని వాజపేయి మేనకోడలు క్రాంతి మిశ్రా పంచుకున్నారు.‘గతంలో అటల్జీ గ్వాలియర్ వచ్చినప్పుడు నా కుమారుడి సైకిల్ తీసుకుని చిన్ననాటి స్నేహితుడు దీపక్తో పాటు ఇతర స్నేహితుల ఇళ్లకు వెళ్లేవారు’ అని మిశ్రా పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.ఒకసారి ఈ విషయం తెలిసి అప్పటి బీజేపీ నాయకురాలు, రాజమాత విజయ రాజే సింధియా.. గ్వాలియర్కు వచ్చినప్పుడు తనకు చెపితే ప్రత్యేకంగా కారును ఏర్పాటు చేస్తానని చెప్పినా నిరాడంబరంగా ఉండేందుకు వాజ్పేయి ఇష్టపడేవారు.
ఎల్కే అద్వానీ
పానీ పూరీ తింటూ.. స్కూటర్‌పై షికారు చేస్తూ రాజకీయాల్లో అలాంటి మిత్రుల్ని అరుదుగా చూస్తుంటాం. వారే వాజపేయి, ఎల్కే అద్వానీలు.. దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. వారిద్దరి అనుబంధం 1950ల నాటిది. అప్పటి నుంచి వారి మధ్య ఒక ప్రత్యేక స్నేహబంధం కొనసాగింది. దాదాపు ఐదు దశాబ్దాలు నమ్మకమైన సన్నిహితులుగా కొనసాగిన వాజపేయి, అద్వానీ ప్రతీ సమయంలోను ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగారు. ఆ అనుబంధం దేశ రాజకీయాల్లో బీజేపీ రూపంలో పెనుమార్పులే తీసుకొచ్చింది. 1980, ఏప్రిల్లో వారిద్దరి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకుంది. వాజ్పేయితో చిన్ననాటి స్నేహాన్ని అద్వానీ గుర్తుచేసుకుంటూ.. ‘ఇద్దరం యువకులుగా ఉన్నప్పుడు వీధుల్లో పానీపూరీలు తింటూ షికార్లు చేసేవాళ్లం. నేను స్కూటర్ నడుపుతుంటే వెనుక వాజ్పేయి కూర్చునేవారు. నేను పెద్దగా చాట్ తినకపోయినా వాజ్పేయి చాలా ఇష్టంగా తినేవారు’ అని ఒక సందర్భంలో వెల్లడించారు.సినిమాలకూ.. హిందీ సినిమాలు కలిసి చూడటం మాకు అలవాటు. మొదట్లో దిల్లీలోని రీగల్, ఇతర సినిమాహాళ్లకు కలిసి వెళ్లేవాళ్లం. 1959లో మేం దిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల కోసం కష్టపడి పనిచేశాం. విజయం సాధించకపోవడంతో నిరాశకు గురయ్యాం. దీంతో సినిమా చూద్దాం పదమని అటల్జీ చెప్పారు. మేమిద్దరమూ పహాడ్గంజ్లోని ఇంపీరియల్ సినిమాహాల్కు వెళ్లాం. ప్రముఖ నటుడు, నిర్మాత రాజ్కపూర్ నటించిన ‘‘ఫిర్ సుబాహ్ హోగీ’’ సినిమా చూశాం. అంటూ గుర్తు చేసుకుంటారు.

ALSO READ: 27న “రెక్కీ” ఫస్ట్ లుక్!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ