అన్నమయ్య అన్నది- 11
(రోచిష్మాన్, 9444012279
“తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద
వెలుఁగు లోపలికి వెఁలుగేలా?”
చీకట్లో తెలియడానికి దీపం కావాలి కానీ వెలుగు ఉన్నప్పుడు అదీ పెద్ద వెలుగు ఉన్నప్పుడు మళ్లీ దీపపు వెలుగెందుకు? ఎత్తుగడతోనే సార్వజనీనమైన, సార్వకాలికమైన భావనను పల్లవింపజేస్తూ ఒక గొప్ప సంకీర్తనను సంకల్పించారు అన్నమయ్య.
వెలుగులోపలికి వెలుగేలా? అని అనడం ఎంతో బావుంది కదా! ఇలాంటి నుడి తదనంతర తరాలవారికి ఒరవడి. అవును అన్నమయ్య మాట ఒక ఒరవడి. అంతేకాదు అన్నమయ్య నుడి అభివ్యక్తికే గుడి. ‘అన్నమయ్య తెలుగు కవితా సౌభాగ్యాల అయ్య’
ఆదిశంకరులు ఆత్మబోధ(శ్లోకం 29)లో ఇలా అన్నారు: “స్వబోధే నాన్యబోధేచ్ఛా బోధ రూప తయాత్మనః / న దీపస్యాన్య దీపేచ్ఛా యథా స్వాత్మ ప్రకాశనే” అంటే దీపం వెలుగుతోంది… దానికి సొంతంగా ప్రకాశించే సామర్థ్యం ఉన్నది. కనుక ఒక దీపానికి మఱో దీపం అవసరం ఉండదు. ఆ విధంగా ఆత్మ అన్నది జ్ఞాన స్వరూపమైనది కనుక ఆత్మ జ్ఞానం పొందడానికి అన్యజ్ఞానం అవసరం ఉండదు అని అర్థం. ‘దీపానికి మఱో దీపం అక్కఱ్లేదు’ అన్న ఆదిశంకరుల మాటే ఇక్కడ అన్నమయ్య
తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద / వెలుఁగు లోపలికి వెఁలుగేలా? అన్న ఉక్తికి ఆధారం, ప్రేరణ అని అవగతం ఔతోంది.
“అరయ నాపన్నుని కభయ మీవలెఁగాక
ఇరవైన సుఖిఁగావ నేలా?
వఱతఁ బోయెడివాని వడిఁదీయవలెఁగాక
దరివానిఁ దివియఁగఁ దానేలా?”
ఆపన్నులకు అభయమివ్వాలి కానీ సుఖంగా ఉన్నవాళ్లను కాపాడడమెందుకు? వఱద (వఱత)లో కొట్టుకుపోయే వాణ్ణి తొందఱగా బయటకు తియ్యాలి కానీ గట్టుపై ఉన్న వాణ్ణి తియ్యడానికి తాను ఎందుకు? ఇక్కడ తాను అన్నది భగవంతుణ్ణి సూచిస్తూ అన్నది. కష్టాల్లో కొట్టుకుపోతున్నవాడికి భగవంతుడు ఉండాలి కానీ సుఖాల గట్టున ఉన్నవాడికెందుకు అంటున్నారు అన్నమయ్య.
“ఘనకర్మారంభుని కట్లు విడవవలెఁ గాక
యెనసి ముక్తునిఁగావ నేలా?
అనయము దుర్బలుని కన్నమిడవలెఁ గాక
తనిసిన వానికిఁ దానేలా?”
పెద్ద పెద్ద కర్మలు చెయ్యాలనుకున్న వాడి కట్లు విప్పాలి కానీ ఎన్నుకుని (యెనసి) ముక్తుడైన వాణ్ణి కాపాడ్డం ఎందుకు? ఎప్పుడూ (అనయము) బలహీనుడికి అన్నం పెట్టాలి కానీ తృప్తిగా ఉన్న (తనిసిన) వాడికి తాను (భగవంతుడు) ఎందుకు? అంటున్నారు అన్నమయ్య.
“మితిలేని పాప కర్మికిఁ దావలెఁ గాక
హిత మెఱుఁగు పుణ్యుని కేలా?
ధృతి హీనుఁ గృపఁజూచి తిరువేంకటేశ్వరుఁడు
తతిఁ గావకుండినఁ దానేలా ?”
అలవిలేని పాపాలు చేసిన వాడికి తాను (భగవంతుడు) కావాలి కానీ మంచి తెలిసిన పుణ్యవంతులకు ఎందుకు? ధైర్యం లేనివాళ్లను కృపతో చూసి శ్రీవేంకటేశ్వరుడు తగిన సమయంలో కాపాడకపోతే తానెందుకు? అంటున్నారు అన్నమయ్య.
మహోన్నతమైన కవితాత్మక ఎత్తుగడతో కష్టాల్లో, వఱదలో కొట్టుకు పోతున్న వాడికీ, పెద్ద, పెద్ద కర్మల్లో చిక్కుకున్న వాడికీ, ఆకలితో ఉన్నవాడికీ, పాపికీ, ధైర్యం లేని వాడికీ కాకపోతే భగవంతుడు ఇంకెందుకు? అని ప్రశ్నిస్తున్నారు అన్నమయ్య.
“అలమటించేవాళ్ల కోసమే భగవంతుడు” అన్న అభివ్యక్తితో అలరారుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)