పాత్రికేయ చక్రవర్తి… సంపాదక స్రష్ట
విశాలాంధ్ర రాఘవాచారికి అక్షర నివాళి
సెప్టెంబర్ 10 – 83 వ జయంతి
(నందిరాజు రాధాకృష్ణ, 98481 28215)
ఆయన అధ్యయనం విస్తారం, వైవిధ్యభరితం. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలోనూ ఆయనకు ప్రవేశమేకాదు, పాండిత్యమూ ఉంది. భారత రామాయణాలు మొదలుకొని ప్రాచీన సాహిత్యాన్ని, మార్క్సిస్టు గ్రంథాలను, యూరోపియన్ సాహిత్యాన్ని, వివిధ దేశాల రాజ్యాంగాలను ఆయన ఔపోశనపట్టారు. లోతైన విశ్లేషణ, పదునైన వ్యాఖ్యానం, ఏ రంగంలో ఏ అంశంపైనైనా సాధికారిత, నిబద్ధత, అతి సాధారణ జీవితం, కలుపుగోలుతనం, చక్కని స్నేహభావం తదితర ప్రత్యేకతలన్నీ కలగలిస్తే… సి రాఘవాచారి ఈ పేరు చెబితే కొంతమందికీ, “సి రా” అంటే ఇంకొంచెం మందికి, విశాలాంధ్ర రాఘవాచారి అంటే అందరికీ తెలుస్తుంది. అందరికీ అర్థమవుతుంది. పూర్తి పేరు చక్రవర్తుల రాఘవాచారి. నిజం ఆయన అక్షరాల చక్రవర్తి. అయిదున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ అనుభవంతో పదునెక్కిన కలం ఆయనది. అన్ని విశేష లక్షణాలున్న ఆయన జీవించి ఉన్నంతకాలం నిత్య విద్యార్థి గానే వ్యవహరించారు.
సంపాదకునిగా ఒకే పత్రికకు మూడు దశాబ్దాలు
1953 నుండి చదవటం ప్రారంభించి ‘విశాలాంధ్ర’ పత్రికకు అరవై అయిదు సంవత్సరాలకు పైగా పాఠకుడాయన. పాఠకుడైన పత్రికకు ప్రాణాధారమైన సంపాదకుడవడం రాఘవాచారి ప్రత్యేకత. 1972 లో విశాలాంధ్ర సంపాదకునిగా బాధ్యత స్వీకరించి మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా ఆ స్థానంలో కీర్తి గడించారు.. సంపాదక బాధ్యతల నుంచి ఓ పదిహేనేళ్ళ క్రితం విశ్రాంతి తీసున్నా ఆయన విశాలాంధ్ర రాఘవాచారిగా జనం మదిలో, హృదిలో నిలిచిపోయారంటే ఆ పత్రికతో ఆయనకున్న అనుబంధం అటువంటిది. ఏ తెలుగు దినపత్రికల సంపాదకులకు లభించని అరుదైన గౌరవం. అది అతిశయోక్తి కాదు. పత్రిక సంపాదకుడికి ఏ లక్షణాలు ఉండాలో ప్రముఖ ఆంగ్ల పాత్రికేయుడు హెన్రీ వాటర్‌సన్ నిర్వచిస్తూ, ‘విస్తృత అధ్యయనం, గొప్ప తెలివితేటలు, దేనికీ జంకని ధీరత్వం’ సంపాదకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలన్నారు. ఆ సలక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వ్యక్తి రాఘవాచారి. విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకులుగా ఉండి, ఎన్నోన్నో సంపాదకీయాలు తనదైన శైలిలో నిర్మించి ఆ పత్రికకే గొప్ప సొబగు తెచ్చిన వ్యక్తి.
సరళ స్వభావి… స్నేహ శీలి
దరహాసం నర్తించే వదనం, మిసిమి పసిమి ఛాయ దేహం, ఆకట్టుకొనే స్పురద్రూపం, చురకత్తి చూపు, సరళ స్వభావం, స్నేహహృదయం, తెల్లని గిరజాల జుట్టూ, అంతకంటే మల్లెపూవు తెల్లదనం పాంటూ- చొక్కా… ఇద్దీ ఆయన రూపం. వేదిక పైనా, వేదిక ముందూ ఆయన ఉండడం ఒక అలంకారం, ఆయనది మహా నిశిత పరిశీలనం, పరిశోధనం, అనర్గళ వాగ్వైభవం. చాందస భావాలకు దూరం, అయినా సనాతన ధర్మం సాహిత్యంమంటే విపరీతమైన అభిమానం, పూర్తి కమ్యూనిస్ట్ అయినప్పటికీ, విశ్వనాధ అన్నా, ఆయన సాహిత్యమన్నా రాఘవాచారికి వల్లమాలిన అభిమానం, అభిరుచి. విజయవాడలో ఆయన లేని సభ దాదాపు లేదంటే అతిశయోక్తి కాదు. చరిత్ర లోతుల్ని శోధించి మాట్లాడే నేర్పు. రేడియోలో ఆయన ప్రసంగించని అంశం లేదు.
1939లో జననం
వరంగల్లు జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వరదాచార్యులు – కనకవల్లి దంపతులకు 1939 సెప్టెంబరు 10వ తేదీన జన్మించిన రాఘవాచారి శ్రీవత్స గోత్రీకులు. పూర్తి వైష్ణవ సాంప్రదాయంలో పెరిగిన ఈయన తల్లిగారిది కృష్ణాజిల్లా మానికొండ దగ్గర బొకినాల. ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్య నేర్చారు. అమ్మ తమిళం నేర్పింది. ఆంధ్రనామ సంగ్రహం, రుక్మిణీ కల్యాణం బాల్యంలోనే చదివేశారు అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులోని భావనారాయణ సంస్కృత కళాశాలలో సంపత్కుమారాచార్య, చల్లా సత్యనారాయణ శాస్త్రి వద్ద పంచకావ్యాలు నేర్చారు. చిన్నప్పుడే ఉర్దూ, సంస్కృతంలో రాటుదేలారు.
నిక్ నేమ్ చైనీస్ కమ్యూనిస్ట్
హైదరాబాద్ లాల్ గుడా రైల్వే స్కూల్ లో హైస్కూల్ విద్య అభ్యసించారు. నిజాం కాలేజి లో ఉస్మానియా పరిధిలో పియుసి 6వ రాంక్ సాధించారు. ప్రీ ఇంజనీరింగ్ పాసైనా చేరకుండా బి.ఎస్.సి. చదివారు. 1961లో ఉస్మానియాలో ‘లా కోర్సు’, తదనంతరం ఎల్.ఎల్.ఎం. పూర్తి చేశారు. ధర్మ శాస్త్రాధ్యయనం ‘’జూరిస్ ప్రుడెన్స్’’ అంటే విపరీతమైన అభిమానం. ఇది చాలా కష్టమైన పాఠ్యాంశమైనా పట్టుదలగా దానినే ఎంచుకొని 1964లో ఉత్తీర్ణులయ్యారు. అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసిడెంట్ మాజీ కేంద్రమంత్రి, కీర్తిశేషులు ఎస్. జయపాల్ రెడ్డితో సన్నిహితంగా మెలిగారు. ఇక్కడే రాజకీయ అరంగేట్రం చేశారు. రాఘవాచారిని ‘ఆంధ్రా’అని, ‘చైనీస్ కమ్యూనిస్ట్’ అనీ సహచరులు పిలిచేవారు.
తొలి రచన జనధర్మలో ప్రచురితం
ఎం ఎస్ ఆచార్య నిర్వహణలో వరంగల్ నుంచీ వెలువడే ‘జనధర్మ’ చదివే వారు. జనధర్మ పత్రికలో రాఘవాచారి తొలి రచన ప్రచురితం అయింది. విద్యార్థి దశలోనే -క్రీడాభిరామం- లో “ఓరుగల్లు వర్ణన” వ్యాసం రాసి ప్రశంసలందు కొన్నారు. అప్పటినుంచీ దృష్టి పాత్రికేయం వైపు మళ్ళింది. అప్పుడే ఈయనపై మక్దూం మొహియుద్దిన్, శ్రీశ్రీ ప్రభావం పడింది. క్రికెటర్ జయసింహ, దర్శకుడు శ్యాం బెనెగల్, చేకూరి రామారావు, జే. బాపురెడ్డి, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, అంపశయ్య నవీన్, ముదిగొండ వీరభద్రయ్య ఈయన సహాధ్యాయులు. న్యాయవాద వృత్తిపై కాక జర్నలిజంపై దృష్టి సారించారు. భారత రాజ్యాంగం, ఇతర దేశాల రాజ్యా౦గాలను తులనాత్మకంగా పరిశీలింఛి కరతలామలకం చేసుకొన్నారు.
అన్ని అంశాలూ కరతలామలకమే
విద్యార్హి దశలో కమ్యూనిస్ట్ భావజాలం అలవడి మహాకవి శ్రీశ్రీ అంటూ కాలేజీ రోజుల్లోనే విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉస్మానియా లా కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షునిగా వ్యవహరించారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు కనపర్తి నాగయ్య కుమార్తె జ్యోత్స్నను వివాహమాడారు. విద్యార్థిగా న్యాయశాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేట్ చేసిన ఆయన రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, సామాజిక అంశాలు ఆయనకు కరతలామలకం. కేవలం చదవడమే కాదు, దాన్ని మదిలో నిక్షిప్తం చేసుకోవడం ఆయన ఘనత.. అదే జ్ఞానం. ఆయన జ్ఞానపకశక్తి అమోఘం. అందుకేనేమో ఆయనను తోటి జర్నలిస్టులు, రచయితలు, మేధావులు ‘నడుస్తున్న విజ్ఞానసర్వస్వం’ అని పిలిచేవారు.
మొదట కమ్యూనిస్టును…తరవాతే జర్నలిస్టును
కొందరు ఆయనను కమ్యూనిస్టు జర్నలిస్టుగా అనేవారు. ఆయనే “నేను మొదట కమ్యూనిస్టును, ఆ తర్వాత జర్నలిస్టును..” అనే వారు. ఆయన ఆలోచనలో, రాతలో, మాటలో ఇతరుల కన్నా భిన్నత్వం, సామాజిక దృక్పథం ప్రతిబింబిస్తాయి. సంపాదకీయాల్లోనూ అ వే ప్రతిబింబించేవి. వామపక్ష భావాలున్నా, సిద్ధాంతరీత్యా, ఆచరణరీత్యా ఆయన కమ్యూనిస్టు అయినా ఇతర సిద్ధాంతాలు, విశ్వాసాలను నమ్మే వ్యక్తులతో కూడా ఎంతో స్నేహంగా ఉండడం ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకత. నొప్పించక, తానొవ్వక అన్నట్లు వ్యవహరించినా తమ అభిప్రాయాలు, విశ్వాసాలలో ఆయన ఏనాడూ రాజీపడకుండా కచ్చితంగా వ్యవహరించేవారు.
పాత్రికేయులంటే ప్రత్యేకం కాదనేవారు
ఉస్మానియా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఆయన జర్నలిజం విజిటింగ్ ప్రొఫెసర్ బాధ్యతలు నిర్వర్తించారు. పాత్రికేయులూ సమాజంలో భాగమే తప్ప భిన్నంకాదు, ప్రత్యేకంకాదు అని రాఘవాచారి జర్నలిస్టుల సభలు, సమావేశాల్లో హెచ్చరించేవారు.. వినయ, విచక్షణ, వివేచనతో మెలిగినప్పుడే పాత్రికేయులు రాణించ గలుగుతారని అనేవారు.. పాత్రికేయులు సమాజంలో పౌరులే. వారికి కొమ్ములు లేవు. అందరిలాగే వారు కూడా సమాజాన్ని పీడించే రుగ్మతలకు లోనవుతుంటారని మరచిపోతున్నారేమో ననిపిస్తుందని అనేక సందర్భాలలో గుర్తుచేసేవారు. సమాజంపైపడి బతికే పాత్రికేయం వృత్తి విలువలను దిగజార్చుతుందని నిర్మొహమాటంగా, ముక్కుమీద గుద్దినట్లు చెప్పారు. పేట్రియాట్ ఆంగ్ల పత్రికలో పనిచేశారు.
సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా సంపాదకీయాలు
ఆయన సంపాదకీయాల ప్రధాన లక్ష్యం సామాజిక ప్రయోజనమే. అతిశయోక్తులు, సంచలనాలు, రెచ్చగొట్టే ధోరణులు, భయానక వాతావరణాన్ని సృష్టించే మాటలు, వ్యాఖ్యలు ఆయన సంపాదకీయాల్లో భూతద్దం పెట్టి వెదికినా కనిపించేవి కాదు. మనిషిలో ఆలోచన, వివేచన కల్పించడమే ఆయన సంపాదకీయాల ధ్యేయంగా ఉండేది. 1972 నుంచి తెలుగువారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పరిమాణాలను గురించి చర్చించాల్సి వచ్చినా, విశ్లేషించాల్సి వచ్చినా, ఆయన సంపాదకీయాలను ప్రస్తావించాల్సిందే. శ్రమజీవుల పక్షాన నిలబడి అక్షరాగ్నులు సంధించడంలోనూ, కమ్యూనిస్టు సిద్ధాంత చర్చలోనూ, సంగీతనిధి ఎం ఎస్ సుబ్బులక్ష్మిని స్మరించడంలోనూ, భక్తపోతన సాహిత్యాన్ని విశ్లేషించడంలోనూ.. దేనిలోనైనా ఆయన సంపాకీయాలు కొలబద్దలుగా నిలుస్తాయి. ఆయన సంపాదకీయాలను ‘జర్నీఇన్‌టు వరల్డ్’ గా పేర్కొనవచ్చు. అరవిందుని సావిత్రి గురించి ఎంత ఆసువుగా మాట్లాడారో, ఆంగ్లికన్ జ్యూరిస్ ప్రుడెన్స్ గురించి అంతే అనర్గళంగా విశదీకరించారు కూడా. ఇటీవలే ఆయన సంపాదకీయాలను రెండు సంపుటాలుగా హైదరాబాద్ లో విడుదల చేయడం ఆయన పట్ల ఉన్న గౌరవాభిమానాలకు తార్కాణం.
పత్రికా స్వేచ్ఛపై వెల కట్టలేని ఎడిటోరియల్స్
పత్రికాస్వేచ్ఛ, విలువలు, ప్రవర్తనా నియమావళి, సంస్కరణలు, పాలకులు ఆర్డినెన్స్‌లు, అవాంఛనీయ ధోరణులు, గుత్తాధిపత్యం ధోరణులపై ఆయన రాసిన సంపాదకీయాలు వెలకట్టలేనివి. పత్రికా స్వాతంత్య్రం పేరిట యజమానులు చేస్తున్న అక్రమాలను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన సంపాదకీయాల్లో డొంకతిరుగుళ్లు లేవు… సూటిగా భావవ్యక్తీకరణ ఉంది. అరవై అయిదేళ్ల విశాలాంధ్ర ప్రస్థానంలో దాదాపు సగం కాలం ఆయన సంపాదకీయ మార్గదర్శనంలో ఆ పత్రిక తన రూపురేఖలు తీర్చిదిద్దుకొంది. అనేక అవార్డులు, రివార్డులు పొందారు. రాఘవాచారి సంపాదకుడే కాదు, అంతకుమించి వక్త. ఆయన సభ ఉందంటే హాజరయ్యే వారి సంఖ్య ప్రత్యేకం.. ఏ విషయం మాట్లాడినా అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, చమత్కారంగా ప్రసంగించేవారు. ఆధ్యాత్మిక సభలకు వెళ్లినా తన విశ్వాసాలు, సిద్ధాంతాలనుంచి పక్కకు తొలగ కుండా, ఆ భావాలు ఉన్నవారిని నొప్పించకుండా చెప్పదలచిన విషయాన్ని చురుక్కు మనిపించేవారు.
1979 నుంచే పరిచయం
నేను 1979లో విజయవాడలో పాత్రికేయ అక్షరాభ్యాసం చేసిన నాటినుంచి వారితో పరిచయం. నేను విశాలాంధ్రలో పనిచేయకున్నా కొత్త లేకుండా, మొదటి అయిదు సంవత్సరాల్లోనే వెన్నుతట్టి ప్రోత్సహించిన గురుతుల్యులు రాఘవాచారి. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించేవారు. బాగోగులు కనుక్కునేవారు. అనారోగ్యం బాధించినా, ఆయన పాత్రికేయ మిత్రులను కలవకుండా ఉండలేదు. ఎక్కువ సమయం అధ్యయనంలోనే గడిపారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్‌కు ప్రధాన కార్యదర్శిగా, సమాచార, పౌరసంబంధాల శాఖ పునర్వ్యవస్థీ కరణకు ప్రభుత్వం నియమించిన డాక్టర్ నరేంద్ర లూథర్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. నిత్య చైతన్యంతో నిలిచిన మనిషి. ముఖంపై చిరునవ్వుతో హైదరాబాద్, విజయవాడ వీధుల్లో అతి సాధారణంగా దర్శనమిచ్చిన ఆధునిక రుషి. పాత్రికేయులకే కాదు, కమ్యూనిస్టులకు, మేధావులకు, నిజాయతీగా బతకాలని బలంగా నమ్మే ప్రతి ఒక్కరికీ ఆయన స్ఫూర్తి. కొంత కాలం అనారోగ్యంతో బాధపడి, 81వ ఏట 2019 అక్టోబర్ 28 తెల్లవారు ఝామున తుదిశ్వాస విడిచారు. ఆ హాస వదనం మాయమైంది. ఆ అధ్యయనం నిలిచిపోయింది, ప్రసంగాలు మూగవోయాయి. ఆ పార్థివ దేహాన్ని సి పి ఐ కార్యాలయ ఆవరణలో కొద్ది సేపు ఉంచి తరువాత విజయవాడకు తరలించి అభిమానులు, పాఠకులు, కమ్యూనిస్ట్ నాయకులు, ఘనమైన నివాళి అర్పించారు. (వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)