Thursday, March 23, 2023
Homeటాప్ స్టోరీస్తెలంగాణ స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు

తెలంగాణ స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు

నిర్ణ‌యించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్
పార్ల‌మెంటు భ‌వ‌నానికీ బిఆర్ పేరు పెట్టాలి
ఈ మేర‌కు ప్ర‌ధానికి లేఖ రాస్తాన‌న్న సీఎం
ఆర్టికిల్ 3 వ‌ల్ల‌నే ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది
హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 15:
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…. ‘‘ తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమ‌ని చెప్పారు.

ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమ‌ని పేర్కొన్నారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నాయ‌ని వివ‌రించారు.

డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో పొందుప‌రిచిన ఆర్టికల్ 3 వ‌ల్ల‌నే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందని వెల్ల‌డించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తోంద‌ని కేసీఆర్ తెలిపారు.


భార‌త దేశంలో ప్ర‌త్యేక ప్రజాస్వామిక ల‌క్ష‌ణం
అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉందని చెప్పారు. ఫెడరల్ స్పూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు ద‌క్కుతాయనే అంబేద్కర్ స్పూర్తి త‌మ‌ను నడిపిస్తోంద‌ని సీఎం చెప్పారు.

భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయతని చెప్పారు. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుందన్నారు. అందుకోసం త‌మ‌ కృషి కొనసాగుంతుంద‌న్నారు. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంద‌ని తెలిపారు.


భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని ఆషామాషీగా కోరుకున్నది కాదన్నారు. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిన విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు.

ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా రాస్తాన‌ని సీఎం కేసీఆర్ తెలియ‌జేశారు. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణన‌లోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును పెట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నానని తెలిపారు. జై భీం… జై తెలంగాణ జై భారత్ అంటూ కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ