దర్శక నిర్మాతగా చేయికాల్చుకున్న పేకేటి

1
358

దేవదాసులో భగవాన్‌ పాత్ర ఇష్టం…
పేకేటి కుమారుడు కృష్ణమోహన్
అక్టోబర్ 8 పేకేటి శివరాం జయంతి
(డాక్టర్ వైజయంతి పురాణపండ)

‘మనసు అద్దం లాంటిది, మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది’ దేవదాసు సినిమాలో భగవాన్‌ (పేకేటి) గా మాట్లాడారు..
జవహర్‌లాల్‌ నెహ్రూకి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు..
ఎన్‌టిఆర్‌ రాజకీయ రంగప్రవేశం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే అంటూ ఇందిరాగాంధీకి సూచించారు….
దర్శకనిర్మాతగా చేయి కాల్చుకున్నారు..
డిటెక్టివ్‌ కథలు రాశారు.. డాక్యుమెంటరీలు తీశారు..
జాతకాలు, సంఖ్యా శాస్త్రాలను విశ్వసించారు..
ఎనిమిది సంఖ్య తనకు పడదంటూ, 2006లో కన్నుమూశారు.
పేకేటి శివరామ్‌ జయంతి సందర్భంగా ఆయన గురించి పెద్ద కుమారుడు కృష్ణమోహన్‌ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…


మనిషి అంటే మనీ ప్లస్ షి
మనిషి అంటే మనీ ప్లస్‌ షి అనేవారు నాన్న. అన్నట్లుగానే అమ్మని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నాన్న పూర్తి పేరు పేకేటి శివరామ్‌. ప. గో. జిల్లా పేకేరులో 1918, అక్టోబరు 8న పుట్టారు. తాతగారు చిన్నప్పుడే పోవటంతో నాన్నగారు కష్టపడి ప్రైవేటుగా భీమవరంలో బిఏ చదువుకున్నారు. అమ్మ పేకేటి ప్రభావతి. మేం నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలం. నేనే పెద్ద అబ్బాయిని. నా పేరు పేకేటి కృష్ణమోహన్‌. తమ్ముడు పేకేటి రంగా సినిమాలలో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మిగతా తమ్ముళ్లు రంగారావు, వెంకటేశ్వరరావు, గోపాల్‌. అమ్మాయిలు రాజ్యలక్ష్మి, శాంతి, వరలక్ష్మి, పూర్ణిమ. అందరూ బిఏ చదివారు. నేను మాత్రం మెట్రిక్‌ వరకే చదివాను. నాన్నగారి పెంపకం వల్ల ఇప్పటికీ కుటుంబసభ్యులమంతా ఏడాదికోసారి తప్పనిసరిగా కలుస్తున్నాం.
ఆయన ఇచ్చిన సలహా ఎప్పటికీ మరువను
నా 18 వ ఏట, నాన్నగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని, ‘నేను నీకు స్నేహితుడిని, నీకు ఏ ఇబ్బందులు వచ్చినా నాతో చెప్పు. నీ పైవాడిని చూసి అసూయపడకు, నీ కింద వాడిని చూసి సంతోషపడు’’ అని చెప్పేవారు. నాన్న మాకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఆయన చెప్పినదల్లా పాటిస్తున్నాం. మాకు మంచి పేరు, సంఘంలో గౌరవం ఇచ్చారు.
కష్టాలు ఎదుర్కోవాలన్నారు…
నౌకల మీద జల ఉష, జల ప్రభ అని రెండు డాక్యుమెంటరీలు తీశారు. రైజింగ్‌ సన్‌ అని సంజయ్‌ గాంధీ మీద ఒక డాక్యుమెంటరీ రూపొందించాలని నిశ్చయించుకున్నాక, ఆర్థిక ఇబ్బందులు వచ్చి, వడ్డే రమేశ్‌గారిని అడిగారు. ఆయన నాలుగు రోజులయ్యాక రమ్మన్నారు. నాలుగు రోజుల తరవాత నాన్న నన్ను పంపితే, నేను వెళ్లాను. అప్పుడు ఆయన ‘మా అకౌంటెంట్‌ బ్యాంక్‌కి వెళ్లాడు, కాసేపు ఆగు’ అన్నారు. సరిగ్గా అప్పుడే వార్తాపత్రికలలో సంజయ్‌గాంధీ మరణించాడనే వార్త కనిపించింది. నేను నిరాశ చెందాను. అప్పుడు నాన్న, నాతో, ‘‘ఎప్పుడూ అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. సుఖాలే ఎల్లకాలం ఉండవు’’ అంటూ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండేవారు కాదు. కాంగ్రెస్‌ పార్టీ, షూటింగులలో తలమునకలై ఉండేవారు. ఇంట్లో ఉండకపోయినా పిల్లలకు ఏ లోటూ రానివ్వలేదు.
నాన్నను కరివేపాకులా వాడుకున్నారు..
ఒకరోజు స్కూల్‌ నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాను. అప్పట్లో నాన్న సినిమాల్లో నటిస్తున్నారు. ఆయనకు క్యారేజీ కారులో పంపేవారు. ఆ రోజు క్యారేజీతో పాటు నేను కూడా కారులో షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లాను. పుల్లయ్యగారు వెంకటేశ్వర మహాత్మ్యం సినిమా తీస్తున్నారు. నేను షూటింగ్‌ చూడటానికి వచ్చానని నాన్నతో చెబితే, నన్ను తిట్టి, అదే కారులో ఇంటికి పంపేశారు.
ఆ సంఘటన ఇప్పటికీ నాకు బాగా గుర్తు. మరోసారి నాన్నను, ‘నువ్వు సినిమాలు ఎందుకు తీయట్లేదు’ అని అడిగాను. అందుకు ఆయన , ‘నువ్వు రోజుకి మూడుసార్లు భోజనం చేస్తున్నావు, నీకు ఇలా తినటం ఇష్టం లేదా’ అన్నారు. ఆ రోజు నుంచి నాన్నను ఎన్నడూ అడగలేదు. ప్రతిఫలం ఆశించకుండా ఎంతోమందికి సహాయం చేశారు. ఆయనను అందరూ అభిమానించేవారు. సినీ పరిశ్రమలో ఆయనను చాలామంది కరివేపాకులా వాడుకున్నారు.
మాకు మా నాన్నగారంటే భయం ఎక్కువ.
నాన్నగారంటే కొంచెం భయమే. నాకు నాన్నగారు నటించిన దేవదాసు, వద్దంటే డబ్బు, చిరంజీవులు సినిమాలు చాలా ఇష్టం. నాన్నగారు ఏం చేసినా మాకు ఆయన మీద ఎంతో గౌరవం. ఇంట్లో అమ్మ చదువుకోని ఎంబిఏ లా ఇల్లు చూసుకునేది. అద్దె ఇంట్లో ఉంటున్న రోజుల్లో, నెలాఖరు వచ్చేసరికి.. ఇంటి అద్దె, పనిమనిషి జీతం, సరుకుల కోసం అంటూ డబ్బుల్ని విడివిడిగా ప్యాక్‌ చేసేసేది. అలా నాన్నకు అమ్మ ఎంతో సహాయంగా ఉండేది. నాన్నకు ఇష్టమైన వంటలు చేసి పెట్టేది. తల్లి నవ మోసాలు మోసి పెంచుతుంది. ఆ త ల్లి ప్రేమ నీళ్లలాంటిది. కంటికి కనిపిస్తుంది. కాని తండ్రి ప్రేమ మాత్రం కనపడదు. నాన్న ప్రేమ కూడా అంతే, బయటకు కనిపించేలా ఉండేది కాదు. నాన్నతో 65 ఏళ్లు, అమ్మతో 73 ఏళ్లు ఉన్నాను. ఇంతటి అదృష్టం ఎవరికో కానీ దక్కదు. ఇప్పుడు నా వయస్సు 82 సంవత్సరాలు.


నెహ్రూకు పర్సనల్ ఫోటోగ్రాఫర్
నాన్నగారు కాంగ్రెస్‌ పార్టీ. జవహర్‌లాల్‌నెహ్రూకి పర్సనల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తరవాత ఇందిరాగాంధీ సమయంలో, నాన్నను దక్షిణభారతదేశం పబ్లిసిటీ ఇన్‌చార్జిగా నియమించారు. ఎన్‌టిఆర్‌ పార్టీ పెట్టినప్పుడు, ఇందిరాగాంధీ నాన్నకు ఫోన్‌ చేసి, ఎన్‌టిఆర్‌ గురించి అడిగితే, 72 పేజీలు రిపోర్టు రాసి పంపారు. అది ఆవిడ చదివి, వాస్తవాలు తెలుసుకోవటం కోసం మూపనార్‌ను అడిగితే, ఆయన ప్రాబ్లమ్‌ లేదన్నారు. కాని ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో ఎన్‌టిఆర్‌ ఘనంగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ఇందిరాగాంధీ నాన్నకు ఫోన్‌ చేసి, ఆర్జెంటుగా ఢిల్లీ రమ్మని పిలిపించి, ‘‘నేను మిస్టేక్‌ చేశాను. నీ మాటను లెక్కచేయలేదు’’ అంటూ ఆవిడ ఆవిడ తప్పును ఒప్పుకున్నారని, నాన్న స్వయంగా చెప్పారు. ఆలిండియా ఎన్‌ఆర్‌ ఫ్యాన్స్‌ ఆసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఏఎన్‌ఆర్‌కి కావలసినవన్నీ చూసేవారు. డిటెక్టివ్‌ కథలు రాసేవారు. పోలీస్‌ వాళ్లకి డాక్యుమెంటరీలు తీసి ఇచ్చారు. నాన్నకి ఎన్‌టిఆర్‌కి ఎంతో స్నేహం వున్నా, ఆయన టీడీపీ పెట్టి, పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా, నాన్న కాంగ్రెస్‌ విడిచిపెట్టలేదు. ఎంతో సంపాదించుకున్నా ఏమీ మిగుల్చుకోలేకపోయారు. మా ఇంటికి సాధారణంగా భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు భోజనానికి వచ్చేవారు. మాతో.. జగ్గయ్య, హీరో కృష్ణ గారి తల్లి, రాజసులోచన, షావుకారు జానకి బాగా ఆప్యాయంగా ఉండేవారు. మా ఇంట్లో మంచిచెడులకు వస్తుండేవారు.
బంగారు పూలతో…
అమ్మనాన్నలు మునిమనవలను కూడా చూశారు. ముని మనవడు పుట్టాక, వాడితో మా అమ్మనాన్నలకు బంగారుపూలతో అభిషేకం చేయించాం. ఒకసారి అమ్మ నాన్నతో ‘‘మీరు నాకు ఏ రోజు కాల్‌ షీట్‌ ఇస్తే, ఆ రోజు లక్ష ఒత్తుల నోము చేసుకుంటాను’’ అంది. నాన్న అమ్మను ‘చిట్టీ’ అని పిలిచేవారు. ఆయన నవ్వుతూ ‘అలాగే’ అన్నారు. అలా అమ్మ లక్ష ఒత్తుల నోము, పసుపు కొమ్ముల నోము చేసుకుంది. ఆ సందర్భంలోనే ప్రముఖ సీనియర్‌ నటి ఎస్‌. వరలక్ష్మి గారి ఇంటికి ఎవరో జర్మనీ లేడీ వస్తే, ఆవిడకు మా ఇంట్లో జరిగే నోము గురించి వివరాలు చెప్పి, తీసుకువచ్చి ఈ విధానం అంతా చూపించారు.
మంచి మిత్రులు..
ఒక రోజున నాన్న కడుపు ఉబ్బి, యూరిన్‌ రాకపోతే, జగ్గయ్యగారికి ఫోన్‌ చేసి, ‘‘మావయ్యా! నాన్నకు ఒంట్లో బాలేదు, హాస్పిటల్‌కి తీసుకువెళ్లాని’’ అని చెబితే, ఆయన అంత అర్ధరాత్రి వచ్చి, నాన్నను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి, అడ్మిట్‌ చేసి, అప్పుడు ఆయన ఇంటికి వెళ్లారు. అటువంటి మిత్రులు మళ్లీ రారు. ఇటువంటివారు ఇంకొరు ఉండరు. నాన్నగారికి ఆర్థికంగా అక్కినేని, దాసరి, పద్మాలయ, కృష్ణ సోదరులు, ఆడిటర్‌ రామమోహన్‌రావుగారు, రాయపాటి సహాయం చేసేవారు.
నాన్న నటించిన సినిమాలు
దేవదాసు, వద్దంటే డబ్బు, గులేబకావళి కథ, వెలుగు నీడలు, బభ్రువాహన, సువర్ణసుందరి, భాగ్యరేఖ, చిరంజీవులు, పెళ్లినాటి ప్రమాణాలు, జయభేరి, వీరకంకణం, పాండురంగ మహాత్మ్యం, అనార్కలి, కన్యాశుల్కం, కులగౌరవం, అల్లూరి సీతారామరాజు వంటి ఎన్నో చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాసులోని భగవాన్, అల్లూరి సీతారామరాజులో డిప్యూటీ కలెక్టర్‌ పాత్రలు బాగా గుర్తింపు తెచ్చాయి.
మూడుతరాల ప్రేమ వివాహాలు..
నాన్నగారిది, నాది, మా పెద్దబ్బాయికి ప్రేమ వివాహాలు. ఆయన కారు హారన్‌ మోగితే అందరూ తలుపు తీసేవాళ్లం. నిత్యం మెయిల్‌ పేపర్‌ తప్పనిసరిగా చదివేవారు. నాన్నకి జాతకాల మీద నమ్మకం ఎక్కువ. అందరికీ చెబుతుండేవారు. సినిమా వాళ్లకి కూడా జాతకాలు చెప్పేవారు. న్యూమరాలజీని బట్టి, పేర్లు మార్చేవారు. ‘‘ఇది 2006, ఈ సంఖ్య నాకు పడదు. బహుశ నేను ఇంక ఉండను, మీ నాన్న జీవితం అయిపోయింది, అని డెత్‌ని ప్రిస్కయిబ్‌ చేశారు. నాన్న ఎక్కువ కాలం బాధపడలేదు. పదిహేను రోజులు అవస్థపడి, వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 30, 2006 రాత్రి కాలం చెందారు. ఆ రోజు అక్కినేని ఫోన్‌ చేసి, ‘బాబూ! నేను డెడ్‌బాడీని చూడలేను, తరవాత వస్తాను. మీ ఆంటీ మాత్రం మంచి రోజు సెలవు తీసుకున్నారు అని చెప్పమంది. నాకు దేవుడి మీద నమ్మకాలు లేవు. ఆవిడ చెప్పమన్నది చెప్తున్నాను’’ అన్నారు.
(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

1 COMMENT

  1. బహు ముఖ ప్రజ్ఞాశాలి, సీనియర్ నటులు శ్రీ పేకేటి శివరాం గారి గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ఆయన జయంతి సందర్భంగా వారి కుమారుడు చాలా విశేషాలు అందజేశారు👌👌👌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here