పింగళి మాటల గారడీ గుణసుందరి

0
210

డింగరి మాటల పింగళి – 4
కథ, మాటలు, పాటలు – పింగళి నాగేంద్ర
గుణసుందరి కథ
వాహిని స్టూ్టడియోస్‌ బ్యానర్‌ మీద విడుదలైంది.
మార్కస్‌ బార్ట్లే కెమెరా
కమలాకర సహాయ దర్శకుడు
కె వి రెడ్డి దర్శకులు

మహారాజులుంగారు పలికిన పలుకులకు, కడు ముదమునొందిన కాలమతి…
‘మావయ్య బుద్ధికి బృహస్పతి, దెబ్బకి దేవేంద్రుడు’ అనుచు పలికిన పలుకులు చిత్రంగా లేవూ. బుద్ధికి బృహస్పతి తెలిసిందే. దెబ్బకి దేవేంద్రుడు అంటే ఏమిటో. అంటే వజ్రాయుధపు దెబ్బలన్నా. లేకపోతే ఠక్కున దేవేంద్రుడు అయిపోతాడనా. ఏమో. పింగళి మామను అడిగి తీరవలసినదే.
––
అరమతి, కాలమతి, దైవాధీనం ఆ ఇంటి అల్లుళ్లయ్యారు. దైవాధీనం అష్టావక్రుడు కదా. అందుకే అన్నలుంగార్లు తమ్ములుంగార్లను హేళన చేయటం ప్రారంభించారు.
బండికి ఎద్దును కట్టినట్లుగా… ‘‘మన ఎద్దు మొద్దు తాతన్నకి తోపుదారిగాకుదిరానురా’’ అని కాలమతి పలికిన పలుకులకు అర్థంబేమిటో.
మనకు అర్థం కాకపోతేనేం… వాటికి అర్థాలు ఉండేతీరతాయి. పింగళి మాటలా! మజాకానా!!!
మరో కొత్తనూతన ప్రయోగం చూద్దాం..
‘స్వయంవరం పెళ్లికొడుకులు’ ట. స్వయంవరానికి రాకుమారులు వస్తారే కాని, పెళ్లికొడుకులు వస్తారా.. వస్తారా అంటే వస్తారు. పెళ్లికొడుకులేగా వరరాకుమారులు. అందుకే వస్తారు. వచ్చి తీరతారు.
ఏంటి తమ్ముడు ఇంట్లో గొడ్లని తోలుతున్నావు.
ఇక మరో ప్రయోగం…
వారే వారే..
పింగళి మణులు వీరే… వీరే..
‘వధూమణులు’ ‘యువరాణీమణులు’ ‘అమ్మాయీ మణులు’.. పింగళి మాటలు మణులమూటలు. మాణిక్యాల గనులు.
సరే…
మరోటి చూద్దాం..
అష్టావక్రుడున్నాడుగా… అదే దైవాధీనం…
ఒకసారి ఏదో మంచి ఆలోచన పలికాడు. అంతే.. అన్నలుంగార్లు ఏమన్నారో చూడండి..
‘తాళం వేసి స్థాపితం చేసిన ఇనప్పెట్లోకి దొంగ దూరినట్లు… ఇంద్రియాలు మూసుకుకుని పోయిన వీడి బుర్రలోకి ఎలాగో ఏదో ఒక కులాసా దూరుతూనే ఉంటుందిరా’ అని ఇంత అందమైన చమత్కార శరం మరొకరు వేయగలరా. వేయలేరు.. వేయనే లేరు..
అసలు ‘ఇంద్రియాలు మూసుకుపోయినాయి’ ట. అవును నిజమే. జ్ఞానేంద్రియాలలో కళ్లు కూడా ఉన్నాయి కదా. అందుకే కళ్లు మూసుకుపోయాయి అనటం సాధారణం కదా, ఇంద్రియాలు మూసుకుపోయాయి అంటే మనకు కాస్తంత తెలివిజ్ఞానం వస్తుంది కదా.
మరో సంఘటన..
దైవాధీనం గురించి అన్నలుంగార్లు…
‘తమ్ముడితో గోష్ఠి చేసుకుంటున్నాం’ అన్నారు. కవిపండితులతోనేనా గోష్ఠి, తమ్ముడితో ఎందుకు చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదూ. చక్కగా చేసుకోవచ్చు. గోష్ఠి మాత్రమే కాదు సమావేశం కూడా చేసుకోవచ్చు.
అందుకే దైవాధీనం.. ‘ఓ సోకులారి అన్నగారూ, దయచేయండి గోష్ఠి చేసుకుందాం’ అని ఎగఎగతాళిగా జవాబించాడు.
అక్కడితో ఊరుకోలేదు…
మరిన్ని మాణిక్యాలను మిలమిలలాడించాడు.
‘మరదలు మాణిక్యం, గుణగణ గాణిక్యం, తెలియని చాణుక్యం..’ అన్నాడు దైవాధీనం. మరదలు మాణిక్యం తెలుసు. గుణగణ గాణిక్యం ఏమిటో, తెలియని చాణుక్యం కూడా తెలుసు.
బుర్రను చురుకుచురుకు చేసుకోమంటున్నాయి పింగళి మాటల మాణిక్యాలు.
మాటిమాటికీ ‘గడిగిడి గిడిగిడి’ అంటూ నవ్విస్తుంటే, అర్థం కోసం ఎవరు మాత్రం వెతుకుతారు.
ఏదో పని చేస్తుంటే…
‘చీల్చుకో చుట్టుకో కాల్చుకో (పొగాకు చూపుతూ) అంటుంటే… కట్టె.. కొట్టె… తెచ్చె అన్నట్లుగా లేదూ.
––––––––
కొత్త సామెతలు కూడా పుట్టించారు. అవే పింగళీయం అనుకోవాలి మనం.
‘లచ్చి కోసం, పిల్ల కోసం లచ్చ అబద్ధాలు ఆడచ్చని లెమ్మన్నారు మన పూర్వ చచ్చినాళ్లు..’ అని దైవాధీనం మనకు జ్ఞానబోధ చేశాడు.
––––––––
ఇంత కథనూ అల్లుకుంటూ ముందుకు సాగిపోతున్నాం గానీ…
ఇంతకూ ఈ అల్లుళ్లుంగారల పేర్లను గురించే చెప్పుకోలేదుగా.
కాలమతి, అరమతి వెరసి ముక్కాలుమతి…
అర్థమైందా.
నెల్లూరు వారు పావుని కాలు అని, అర్థను అర అని, ముప్పాతికను ముక్కాలు అని అంటారు. అందుకే ఒకడికి సగం మతి, ఒకడికి పావు మతి ఉందంటూ కొత్త పేర్లను సృష్టించారు. మరి దైవాధీనం పేరో… అది కూడా అంతే. ఆ అష్టావక్రుడు సాక్షాత్తు మహారాజు. రకరకాలుగా మారుతుంటాడు. మరి దైవాధీనం కాక మరేమవుతాడు.
వాటితో పాటు –
‘మందమతి, బుద్ధిమతి… ఇవేనా ముక్కాలు మతి కూడా ఉండాలి. మూడొంతులు తెలివి ఉందన్నమాట’ అంటూ బుద్ధిని కూడా మన బుద్ధికి బోధపరిచారు.
దైవాధీనం కనుకను, అష్టావక్రుడు కనుకను… ఎవ్విధంబున పలికినను అర్థమే చేసుకోవలయును.
అందుకే –
‘ఆగమ్మ కాకినెరుగుదు… దేశమ్మ కాకినెరుగుదు.. ఆళ్ల మేనమామ అల్లుళ్ల ఏకాకి తమ్ముణ్ని’ అంటుంటే
ఇవేం కాకులో అనిపించదు.
లోకంలో నల్ల కాకి, తెల్ల కాకి.. వంటివి ఉన్నాయి. వాటితో పాటు దేశమ్మ కాకులు, ఆగమ్మకాకులు.. ఇవన్నీ సరే ఒంటరిగా ఉంటే ఏకాకి అంటాం. అందువల్ల ఈ కాకుల్లో ఏకాకులు ఉండే తీరాలి.


ఇంకా చెప్పాలంటే వాళ్ల మేనమామ… ఏకాకి తమ్ముణ్ని.. ఏకాకి తమ్ముడా… అవును, ఏకైక తమ్ముడికి బదులు అదే గుణింతంలో ‘ఏకాకి తమ్ముడు అంటే పోయిందేం. అర్థం మారలేదుగా. అరమతికి, కాలమతికి… దైవాధీనమేగా ఏకాకి తమ్ముడు.
సరే ఈ అన్నదమ్ముల్ని కాసేపు పక్కన కూచోబెడదాం…
మహారాజులుంగారు కోపంతో ఆవేశంతో గెంతులు వేయగా జారిపడ్డారు. కాలు విరిగింది.
దైవాధీనం ఊరుకుంటాడా…
రాజును ఉద్దేశించి హాస్యంగా పలికినా కూడా సత్యమే పలికాడు –
‘కాటికి కాళ్లు జాచినాడు యాటకెగిరితే తుంటి యిరగదా…’
నిజమేగా… కాస్తంత వయసు పెరిగితే.. వేట కోసం ఎగిరితే.. తుంటి విరగదా మరి. విరిగే తీరుతుంది. తీరనూ వలసిందే.
–––––––––––
మహారాజులుంగారికి మూడో కూతురు గుణ మీద కావలసినంత, అక్కరలేనంత ముక్కోపం రానే వచ్చింది. అందుకే దైవాధీనం తన భార్యను చూపుతూ –
‘ఇదే ఇక్కడ తప్ప పుట్టింది… కాకిమూకలో రామచిలుకలా’ అని గుణసుందరి సోదరీమణులను కాకుల్ని చేసేశాడు.
అని నొక్కి వక్కాణించి…
రాజులుంగారి ఇంటి నుంచి తన ఇంటికి చేరనేచేరాడు.
హాయిగా సూర్యచంద్రులు కాపురం చేస్తున్న ఇంటిని చూస్తూ…
‘అరె కప్పెగిరిపోయిందే.. ఇక సూర్యచంద్రులు నక్షత్రాలు పందిరి మంచం పన్నీరు బుడ్లే మనకు. చలేస్తే ఎండకు, ఎండేస్తే ఎన్నెలకి గడప దాటక్కర్లేదు…’ అని సత్యవేదాంతబోధ సత్యంగానే చేసేశాడు.
అక్కడితో ఊరుకున్నాడా… లేనేలేదు.. ఊరుకోవనే లేదు…
‘పైర గాలి, పడమటి గాలి, పిల్లగాలి, చల్లగాలి… ఇల్లంతా గాలి సందాళింపే. మన ఇల్లు ఇంద్రభవనమే..’ అంటూ ు దైవాధీనం పలుకుంటే ఏం గుర్తు వస్తోంది. పైరగాలి, పడమటి గాలి, చల్ల గాలి సరే.. వాటితో పాటు పిల్ల గాలిని కూడా గాలిని చేసేశాడు దైవాధీనం.
అంతలోనే గుణసుందరి తన తండ్రిని చూడాలని దుఃఖించి, శోకిస్తుంటే…
‘రెక్కలల్లే నీ అక్కలున్నారు
కుక్కలల్లే నా అన్నలున్నారు’ అన్నాడు దైవాధీనం.
అంటే –
అక్కలిద్దరూ తండ్రికి రెండు రెక్కలు.
అన్నలిద్దరూ తండ్రికి కాపలా అని అర్థమా.
అంతే అంతే..
బాగు బాగు…
బహు బాగు బాగు…
ఇక ఇక్కడ రాజుగారి దగ్గర…
‘సేనాపతీ ఈ కాలు నీదే, రక్షించుకో’ అని సేనాపతిని ఆదేశించాడు. ఆ కాలు సేనాపతిది ఏంటో… ఏమో… ఆ కాలు తనది కాదేమో.. డింగరి అంతరంగం ఎవరికెరుక.
ఇక మహారాజులుంగారి కాలును బాగు చేయటానికి మహేంద్రమణిని తీసుకుని రావాలి.
ఇంద్రమణులే ఉండాలా ఏంటి..
మహేంద్రమణులూ ఉండొచ్చు. ఉన్నాయి. ఉంటాయి. ఉండాలి.
ఆ మణి విలాసం చెప్పుటకు ఒక భూతవైద్యుడు వచ్చాడు..
గదిలో ముగ్గు వేసాడు..
హ్రాం హ్రీం ఐం ఓం…
అంటూ మంత్రాలు చదివాడు..
‘దారి చూడూ… తెన్ను చూడూ… ’ అని పలికించాడు. మహేంద్రమణి మార్గానికి ఒక్కో అడుగు దారి బాట కనులకు చూపాడు భూతవైద్యుడు.
నిజమేగా –
తెలియని చోటుకి వెళ్లాలంటే… దారితెన్ను తెలియట్లేదు అనేగా పలుకుతాం.
అందుకే
మన డింగరి మామ…
పదే పదే
‘దారి చూడూ… తెన్ను చూడూ’ అనుచునే యుండెను.
అంతలోనే పండితవరేణ్యప్రకాండులు…

‘వచ్చేది సంక్రాంతి, మహాచెడ్డ పర్వదినం. ఆనాడు ప్రాణ గండం ముదురుతుంది’ అన్నారు.
వచ్చేది సంక్రాంతి… బాగానే ఉంది.
మహాచెడ్డ పర్వదినంట…
పండుగలు కూడా చెడ్డవా..
ఏమో ..
కాదు కాదు…
మీరు మా (మహా) చెడ్డ మంచోరండి అనటం వినలేదూ…
ఇదియును అంతియే…
మహా చెడ్డపర్వదినం..
‘ప్రాణ గండం ముదురుతుంది’ అని వక్కాణించారు మన పింగళి డింగరి మామ.
రోగం ముదిరితే… ప్రాణ గండం మాత్రం ముదరదా…
ఒక్కసారి బుద్ధిని సురుగ్గా పనిసాయించితే..
అంబ పలికి, అన్నీ బోధపరుస్తుంది

మణి పేరు… ప్రాణ గండం ముదరడం.. రెండూ వినగానే మహారాజులుంగారు… ‘మణిని తెచ్చినవారికి మహారాజ్యం మొత్తం ఇచ్చేస్తాను’ అని చెప్పకనే చెప్పేశాడు. ఇక ఆ మాటలు వినగానే చిందుల మారి కూతుళ్లు, ‘కాళ్ల కోసం రాజ్యం ఇస్తారా..’ అంటూ మూతులు, ముక్కులు, కళ్లు, ఒళ్లు, కాళ్లు, చేతులు… అన్నీ తిప్పేసుకున్నారు.
వైద్యులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని పలుకుతూ,
‘ఏ మాత్రం బాధలే కుండా చల్లగా కాలు తీసేస్తాను ప్రభూ’ అన్నారు. చల్లగా తియ్యగలరా. నొప్పి బాధ లేకుండా కాలును తీసివేయగలరా. పింగళి మాటకు ఆ వైద్యం తెలుసు. ఆ వైద్యులే ఇంకా… ‘బాధ విషమించితే
దుఃఖాంగంబు ఖండించి, శేషాంగంబు రక్షసేయు క్రియ అందరికీ తెలిసిన భాగోతమే కదా’ అన్నారు.
దుఃఖాంగంబు ఏమిటో… శరీర భాగం బాధ పడుతుందా, మనిషి బాధ పడతాడా… ఏమో ఆ అవయవమే బాధపడుతుందని పింగళి మనసు చెప్పిందేమో. అందుకే అలా అన్నాడేమో. అసలు దుఃఖాంగంబు అంటేనే అదేదో కొత్త భాషలా లేదూ. అయ్యే ఉంటుంది. అది పింగళి మామ భాషే అయి ఉంటుంది. ఇక రెండో పదం శేషాంగం… ఈ పదానికి మిగిలిన అవయవాలు అనాలా… మిగిలిన శరీరం అనాలా… ఏదైనా అనుకోవచ్చు. రెండుయును సరిౖయెన అర్థములే. అనర్థమేమియును లేదు.
ఇక –
కాలు తీసేస్తాను అనగానే మహారాజులుంగారు,
‘గండపెండేరం ధరించిన కాలు’ అంటూ దుఃఖించాడు. అల్లుళ్లు తక్కువ వారా, మరో కాలు చూపుతూ ‘ఈ కాలికి వేసుకోవచ్చు’ అంటుంటే, అమ్మాయీమణి రాక్షసులు మాత్రం, ‘నీకు కాలు తీసేస్తేనే కాని మాకు ఊపిరి ఆడేలా లేదు’ అంటూ వాలు జడలను వేసరంగా విసిరేశారు.

గుణసుందరి కథ సినిమాను అక్షరం అక్షరం వింటూ, అర్థం చేసుకుంటూ చూడాల్సిందే. అక్షరలక్షలు కాదు. అక్షరానంతలక్షలు అనాల్సిందే మరి.

(మిగతా భాగం వచ్చేవారం)

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here