ఉషశ్రీ స్వరంలో వ్యాసోచ్చిష్టం

Date:

గురుపౌర్ణమికి వ్యూస్ ప్రత్యేకం
గురువంటే ఎవరు? సకల విద్యలూ నేర్పేవాడు మాత్రమేనా? అంతకు మించి ఏముంది అనుకుంటారా? దీనికి సమాధానం ఒకే పదం అదే వ్యాస భగవానుడు. జగత్తు ఎన్ని తరాలను చూసినా… ఎన్ని యుగాలను దొర్లించినా… ఏ కాలానికైనా ఆపాదించుకునేలా రచన చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. ఆ గురువు బాటను అనుసరించిన వారు శ్రీయుతులు పురాణపండ రామ్మూర్తి ఆయన జ్యేష్ఠుడు ఉషశ్రీ. వ్యాస పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని వ్యూస్ సమర్పిస్తున్న సృజన రచన ఇది.

(డా . పురాణపండ వైజయంతి)
ఆదిశేషువు తెలుపు ఐరావతము తెలుపు
ఇంకా
ఆ బాలుడు ధరించు వస్త్రములు తెలుపు కేశములు తెలుపు
నవ్వులు తెలుపు నయనముల చూపులు తెలుపు
మానసము తెలుపు పలుకు తెలుపు
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అంటూ వస్తున్నాడు వ్యాసభగవానుడు.
తనను సమీపిస్తున్న వ్యాసభగవానుని చూసి పులకరించిపోయాడు పలితకేశముల బాలుడు.
ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ సగోత్రస్య పురాణపండ రామ్మూర్తి, అన్నపూర్ణస్య జ్యేష్ఠ పుత్రస్య సూర్యప్రకాశ దీక్షిత నామధేయస్య అహంభో అభివాదయేత్ అంటూ సాష్టాంగపడుతూ…
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం
అని ఆయనను స్తుతించాడు.


ఎదురేగి స్వచ్ఛమైన జలాలతో పాదప్రక్షాళన చేసి, మల్లెలతో పూజించి వినమితాంగుడై యుండగా…
ఏమయ్యా! నిన్ను చాలా పొగరుమోతు అంటారు. నువ్వేమో ఇంత వినయంగా నాకు నమస్కరిస్తున్నావు అంటూ కరుణామృత వచనాలు పలికాడు వ్యాసుడు.
తమకు తెలియనిది ఏదైనా ఉంటుందా మహానుభావా! అన్నీ తెలిసి కూడా నాతో పలికించాలనే మీ యోచనకు మోకరిల్లుతున్నాను.. అంటూ పలికాడు ఉషశ్రీ.
శతాయుష్మాన్‌భవ అని ఆశీర్వదించాడు వ్యాసుడు.
మహర్షీ! ఈ రోజు నా మీద మీకు కనికరం కలగడానికి కారణం ఏమిటి? ఇలా నా దగ్గరకే మీరు స్వయంగా వచ్చారు? అని నిర్భయంగా ప్రశ్నించాడు ఉషశ్రీ.
ఎందుకో ఈ రోజు నీ దగ్గరకు రావాలనిపించిందిరా నాకు.. అంటూ మూర్ధాఘ్రాణం చేశాడు వ్యాసభగవానుడు.
ఇంత పెద్ద వరం ఇచ్చి, నా జన్మ ధన్మం చేశావు. ఇంతకీ నీ రాకకు గల కారణం చెప్పనేలేదు మీరు’ అన్నాడు తన జలద గంభీర గళంతో ఉషశ్రీ.
అదిచెప్పడానికే వచ్చాను.
విను.


చెప్పండి మహర్షీ!
నేను మీ తండ్రి గారైన పురాణపండ రామమూర్తిగారి గురించి మొట్టమొదటగా ప్రస్తావించాలి’ అంటుంటే ఉషశ్రీ అప్రయత్నంగా తండ్రిగారికి మనసులోనే నమస్కరిస్తూ, ఏమీ ఎరగనట్టుగా ‘ఎందుకు?’ అని సహజధోరణిలో ప్రశ్నించాడు.
ఎందుకంటావేమిటీ? నీకు తెలియక కాదు, నాతో చెప్పించాలని నీ కొంటె కోరిక అని నాకు తెలుసు’ అన్నాడు వ్యాసభగవానుడు అంతే కొంటెదనంతో.
తండ్రి దగ్గర దొరికిపోయిన పిల్లవాడిలాగ చిరునవ్వులు చిందించాడు ఉషశ్రీ.
వ్యాసమహర్షి ఉషశ్రీ ధర్మసందేహాల కార్యక్రమాన్ని ప్రారంభించిన విధంగా ప్రారంభిస్తూ –
‘చూడు నాయనా! మీ నాన్నగారు చేసిన పని సామాన్యమైనది కాదు. భగవదనుగ్రహం ఉంటేనే కానీ అది సాధ్యపడదు. నేను రచించిన లక్ష శ్లోకాల భారతాన్ని యథాతథంగా తెలుగులోకి తీసుకువచ్చాడు. నేను రాసిన అర్థం చెడకుండా, తన స్వీయ కల్పనలు జోడించకుండా, తెలుగుదనం ఉట్టిపడేలా వచనీకరించాడు ఆయన.


వ్యాసభగవానుడు తన తండ్రిగారిని స్తుతిస్తుంటే ఉషశ్రీ మరింత పసిబాలుడైపోయాడు. వ్యాసభగవానుడి ఒడిలో పసిబాలుడిలా కేరింతలు కొట్టాడు.
అంతలోనే మహర్షి ఉషశ్రీ కేరింతలకు అడ్డుతగులుతూ –
నువ్వు మాత్రం తక్కువవాడివా. ఆ తండ్రికి తగిన తనయుడివి. మీ నాన్నగారు కొద్దిగా గ్రాంథికంలో రచన కొనసాగిస్తుంటే, దానిని నువ్వు సరళ వ్యావహారికంలోకి మార్పు చేశావు. నాకు ఇంకా బాగా గుర్తు, అప్పుడు నీ వయస్సు కేవలం రెండున్నర పదులు మాత్రమే. ఆ వయస్సులో సాధారణంగా వివాహం చేసుకుని, సంసారనౌకలో విహరిస్తూ ఉంటారు. కాని నువ్వు నీ తండ్రిగారి యజ్ఞాన్ని సఫలం చేసిన సమిధవు. ఆయన వేస్తున్న ఆహుతులను ‘స్వాహా’ అంటూ నాకు సక్రమంగా అందించావు. నిన్ను కన్న ఆ తండ్రి ఎంత ధన్యుడో, ఆ తండ్రికి పుట్టిన నువ్వు కూడా అంతే ధన్యుడివి. నీ పూర్వజన్మ సుకృతం వల్లే ఆయన కడుపున పుట్టావు. మరో చోట జన్మించి ఉంటే ఏ మార్గాన ఉండేవాడివో తెలియదు కానీ, పురాణాలకు పుట్టినిల్లయిన కాకరపర్రు అగ్రహారీకులైన పురాణపండ వారి వంశంలో జన్మించి, నీ తండ్రి ఋణం తీర్చుకున్నావు. అంతేనా ఋషి ఋణం కూడా తీర్చుకున్నావు’ అంటూ ప్రశంసల జల్లులతో ముంచెత్తుతుంటే, ముడుచుకుపోయాడు ఉషశ్రీ.
అదేమిటయ్యా, ఏదో కొత్తగా ముడుచుకుంటున్నావు, ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా మాట్లాడుతావు కదా నువ్వు. మరి ఇప్పుడిలా ఏంటి? అంటూ సంశయంగా పలికాడు వ్యాసభగవానుడు.


మహర్షీ! మీ ముందు మాట్లాడటమా. ‘వ్యాసోచ్చిష్టం జగత్సర్వమ్‌’ అన్నారు. మీరు పలికిన విషయాలనే కాలానుగుణంగా వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నాను, అంతే, నా తెలివితేటలేమీ లేవు. మీరు వెనక ఉండి నడిపిస్తేనే, నేను ఈ మాత్రం చేయగలుగుతాను’ అంటూ రెండు చేతులూ జోడించి, ఆనందబాష్పాలతో నిండిన నేత్రాలతో పరవశంగా పలికాడు ఉషశ్రీ.
నీ మాటలు ఒప్పుకుంటానయ్యా. నన్నయ మొదలు ఎంతో మంది నా భారతాన్ని వారి కాలానికి చెందిన వారికి అందించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు గొప్పే. ఈ రోజు నాకు నీతో మాట్లాడాలనిపించింది. అందుకు కారణం చెప్పాను. పాతిక సంవత్సరాల యువ ప్రాయంలో లక్ష శ్లోకాల భారతాన్ని, నాన్నగారికి సహకరిస్తూ అంత సరళంగా వ్రాయటం సామాన్య విషయం కాదు. నీకు ఆ నేర్పరితనం నీ తండ్రి గారి నుంచి సంక్రమించినదే. నేనే ఆ భారతాన్ని అంత చిన్న వయసులో రచించలేదు. మరి నువ్వు రాసినందుకు నిన్ను ప్రశంసించకుండా ఉండగలనా’ అంటూ వేదవ్యాసుడు తనను పొగడుతుంటే, ఉషశ్రీకి నోట మాట లేదు.
మహర్షీ! కాళిదాసు చెప్పినట్లు ‘అధవా కృత వాగ్ద్వారే’ చందాన మీరు మాకు మార్గం ఏర్పరిచారు, మా అన్నగారు ఆ మార్గాన్ని మరింత సుగమం చేశారు. మీ వంటి వారి ఆశీస్సులతోనే నేను ఆ పని చేయగలిగాను’ అంటూ ఆనందబాష్పాలను తన తెల్లటి కండువాతో తుడుచుకున్నాడు ఉషశ్రీ.
నీ మాటలన్నీ ఒప్పుకుంటాను కానీ, నీకు ఇప్పుడు మరో విషయం కూడా గుర్తు చేయాలి. నీ తండ్రి గారు మూడు సంవత్సరాల పాటు భారతాన్ని తన గంభీర గళంతో రోజుకు మూడు గంటల చొప్పున ప్రేక్షకులకు వినిపించారు. అప్పుడు నేను కూడా వినేవాడిని. మీ నాన్నగారికి గవర్నర్‌ పతకం వచ్చినప్పుడు, గజారోహణం జరిగినప్పుడు ఎంత సంతోష పడ్డానో తెలుసా’ అని పలుకుతుంటే, ఉషశ్రీ మనసు తండ్రి పాదాల మీద లగ్నమయింది. అంతలోనే మహర్షి అందుకుంటూ –


ఈ విషయంలోనూ నువ్వు మీ తండ్రి గారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నావు. నువ్వు పనిచేస్తున్న ఆకాశవాణి కేంద్రం నుంచి ‘ధర్మసందేహాలు – ఉషశ్రీ సమాధానాలు’ అని ప్రేక్షకులు అడిగిన కొంటె ప్రశ్నలకు నువ్వు గడుసుగా సమాధానాలు చెబుతుంటే, నాకే ఆశ్చర్యం వేసేది. ఈ సమాధానాలు ఎక్కడ నుంచి నీ బుర్రలోకి ప్రవేశించాయో అర్థమయ్యేది కాదు. అలాగే ప్రతి ఆదివారం నువ్వు పావు గంట సేపు నా భారతాన్ని నీ అమృతగళంలో వినిపించేవాడివి. ఆ గళంలో భారతం వింటుంటే, ‘నేనేనా భారతాన్ని ఇంత అందంగా రచించినది’ అని ఒకసారి నిశ్చేష్టుడనయ్యేవాడిని… అంటూ గంగాఝరిలా వేదవ్యాసుడు పలుకుతుంటే, ఉషశ్రీ సిగ్గుల మొగ్గయిపోయాడు. అమాంతం వ్యాసమహర్షిని ఆలింగనం చేసుకుని, మహర్షీ, ఇదంతా మాకు మీరు పెట్టిన భిక్ష. ఈ భారతం మొదలుపెడుతూ మీరు
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌
అని ఎంతో అహంకారంతో పలికారు.


నిజమే
భారతంలో లేనిదేదీ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్నవన్నీ భారతంలో ఉన్నాయి. అందుకే నేను కూడా మీ అహంకారాన్ని అందుకుని, ఆత్మ స్థైర్యంతో, ఆచరణ పూర్వకంగా భారతాన్ని అందరికీ వినిపించాను. మీరు, మా నాన్నగారు వెనుక ఉండి నడిపించబట్టే ఇదంతా సాధ్యమైంది’ అంటూ పసిబాలుడిలా నిర్భయంగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా పలికాడు ఉషశ్రీ.
తండ్రీ! నాదొక చిన్న సందేహం.
అందరికీ సందేహాలు తీరుస్తావు కదా, నీకు సందేహం కలిగిందేమిటి అన్నాడు వ్యాసుడు.
ఏం లేదు మహర్షీ! మీరు విష్ణు సహస్ర నామాలు రచిస్తూ,
‘శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే’

విష్ణు సహస్రనామాలు చదవలేనివారు ‘రామ’ అని ఒక్క పదం పలికితే చాలు అన్నారు. మీరేమో కృష్ణుడి గురించి రచించి, రామనామం చేయమన్నారేమిటి? ఇదే నా సందేహం అన్నాడు ఉషశ్రీ, కుతూహలంగా.
మంచి ప్రశ్న వేశావు. శ్రీకృష్ణుడు కూడా రాముని అవతారమే కదా. అంతేనా శ్రీరామునిలా మరొకరు ఉండరు. ఉండటం సాధ్యపడదు. అంతటి మహానుభావుడిని స్మరించడం కంటె ఏం కావాలి. అందుకే ఆయనను స్మరించమన్నాను.
ఈరోజు నన్ను ప్రశ్నించి నన్ను ఆనందపరిచావు.
ఈ ప్రశ్నకు నువ్వు ఇచ్చే కొంటె సమాధానం వినాలని ఉంది.
నా సమాధానం విని నన్నేమీ అనకూడదు మరి..
వెయ్యి సార్లు కృష్ణ లేదా విష్ణు అంటే వచ్చే పుణ్యం ఒక్కసారి రామ అంటే వస్తుంది అని చెప్తాను..
అంటూ నమస్కరించాడు.
వ్యాసభగవానుడు మురిసిపోతూ, ఉషశ్రీని గట్టిగా ఆలింగనం చేసుకుని, ‘నాయనా! ఇన్ని రోజులు భూలోకంలో అందరినీ అలరించి, ఇప్పుడు అంటే ఈ మూడు దశాబ్దాలుగా మా అందరినీ నీ గళంతో అలరింపచేస్తున్నావు. నీ జన్మ ధన్యం’ అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు వ్యాసుడు.

(ఇది నా కల్పన మాత్రమే. ఇందులో ఎవ్వరినీ తగ్గించడం కానీ, దూషించడం కానీ లేదు. మంచి మనస్సుతో చదవండి. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాసుడికి, మా నాన్నగారికి నేను సమర్పించుకుంటున్న సృజన సుమం ఇది)

1 COMMENT

  1. 🙏 మీరు కూడా తండ్రికి తగిన వారశురాలు. ఇందులో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...