ఆర్ష సంస్కృతి పున‌రుద్ధ‌ర‌ణే ల‌క్ష్యం-స‌నాత‌న ధ‌ర్మ రక్ష‌ణే ధ్యేయం

Date:


(డా. ఎన్. కలీల్, హైద‌రాబాద్‌)

జగద్గురు ఆది శంకరాచార్యులు, అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఒక్క‌టి చేసిన భార‌తీయ త‌త్వ‌వేత్త. దేశంలోని వివిధ మ‌తాల‌ను రూపుమాపి స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేసిన సిద్ధాంత‌వేత్త. బౌద్ధ‌, జైన మ‌తాల ప్రాబల్యంతో క్షీణించిన హిందూ మ‌తాన్ని ఉద్ధ‌రించిన త్రిమ‌తాచార్యుల్లో ప్ర‌థ‌ములు.. జ‌గ‌ద్గురు ఆదిశంక‌రాచార్యులు. అవ‌తార పురుషుడు.. సాక్షాత్తూ శివ‌స్వ‌రూపం. అలాంటి జ‌గ‌ద్గురు ఆది శంక‌రాచార్యులు.. జగద్గురు అది శంకరాచార్యులు, ధర్మానికీ, ధర్మానికీ మధ్య వైరం.. మతంలో ఉన్న శాఖల మధ్య దూరం.. వేద ప్రమాణాన్ని తృణీకరించి ప్రమాదంగా మారిన సమాజం.. కారుచీకట్లలో మగ్గిపోతున్న ఆర్ష సంస్కృతిని పునరుద్ధరించడానికి ఓ వెలుగు ప్రసరించింది. ఆ కాంతిపుంజం రంగు కాషాయం. అలంకారాలు దండ, కమండలాలు. ఆయుధం జ్ఞానం. మాయలు చేయలేదు. మహిమలు చూపలేదు. తన వాక్పటిమతో సనాతన ధర్మాన్ని స‌నూతనంగా ఆవిష్కరించిన వైనమే శంకర దిగ్విజయం. గురువులకు గురువుగా.. సమస్త జగత్తుకూ మహాగురువుగా.. సిసలైన జగద్గురువుగా భావితరాలకు జ్ఞానమార్గం చూపిన దార్శనికుడు ఆదిశంకరాచార్యులు.
పీత్వాపీత్వా పునః పీత్వా యావత్సతతి భూతలే
పునరుత్థాయ వై పీత్వాపునర్జన్మ నవిద్యతే

‘మద్యం తాగండి, ఇంకా తాగండి, నేలమీద పడిపోయేంత వరకు తాగండి, స్పృహ వచ్చాక లేచి మళ్లీ తాగి పూజ చేయండి. దీంతో మీకు పునర్జన్మ అనేదే ఉండదు…’ ఆదిశంకరులు జన్మించేనాటికి సమాజం పరిస్థితి ఇది. వేదాలకు విపరీత అర్థాలు తీసేవారు కొందరు. వేదాన్ని పట్టించుకోవద్దనేవారు ఇంకొందరు. విరుద్ధ‌ సంప్రదాయాలను బలవంతంగా రుద్ది, దుష్టాచారాలను ప్రచారం చేసే మతాలు కొన్ని. బౌద్ధులు, జైనులు, కాపాలికులు, సౌత్రాంతికాదులు ఇలా విభిన్న మతాలు సనాతన ధర్మంపై ముప్పేటదాడి చేస్తున్న సందర్భం అది.
వీటన్నిటికీ తన వాదనతో కీలెరిగి వాత పెట్టాడు ఆదిశంకరాచార్యులు. బతికింది 32 ఏండ్లు. ఆసేతు హిమాచలం కాలినడకన తిరిగింది రెండు సార్లు. ఆ కాషాయ శివుడు వేసిన ప్రతి అడుగూ ఒక పీఠమైంది. పలికిన ప్రతి పలుకూ స్తోత్రమైంది. చేసిన ప్రతి ప్రతిపాదనా శాసనమైంది. ‘నువ్వూ, నేనూ అందరమూ, అన్నీ ఒకటే’ అన్న అద్వైత స్ఫూర్తిని రగిలించిన ధీశాలి శంకర భగవత్పాదులు. ఈశ్వర అస్తిత్వంపై జరిగిన దాడిని ఖండించడానికి ఆ ఈశ్వరుడే ఆదిశంకరులుగా జన్మించారన్నది వాదములేని అంశము.
కరిష్యత్యవతారంస్వం శంకరోనీలలోహితః
శ్రౌతస్మార్తప్రతిష్ఠార్థం భక్తానాంహితకామ్యయా
‘మానవ శ్రేయస్సు కోసం శ్రౌత స్మార్త ధర్మాలను స్థాపించడానికి సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యుల రూపంలో అవతరించాడు’ అని కూర్మ పురాణం పేర్కొన్నది.
ఆర్ష సంస్కృతి పరిరక్షణకు ఆయన అహర్నిశలూ కృషి చేశాడు. తను పుట్టేనాటికి సమాజంలో ఉన్న మత వైషమ్యాలను పారద్రోలి, వాటన్నిటినీ సమన్వయం చేసి, భావి తరాలకు జ్ఞానమార్గం ఉపదేశించాడు.

కేరళలోని కాలడి. శివగురువు ఇంటి బయట కంగారుగా ఉన్నాడు. లోపల ఆర్యాంబ ప్రసవ వేదనతో అల్లాడుతున్నది. ఇంతలో పసిపిల్లాడి ఏడుపు. ప్రణవనాదంలా వినిపించింది అక్కడున్న వారికి. శివ వరప్రసాదంగా భావించి ఆ పసివాడికి ‘శంకర’ అని నామకరణం చేశారు. మూడేండ్ల బాలుడుగా ఉన్నప్పుడు శంకరుల తండ్రి కాలం చేశాడు. తల్లి లాలనలో పెరిగాడు. జ్ఞాన స్వరూపం కావడంతో అనతికాలంలోనే వేదాధ్యయనం పూర్తిచేశాడు. ధర్మ సంస్థాపన కోసం జన్మించిన శంకరులు అందుకు తగ్గ భూమికను తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. పూర్ణానదిలో స్నానం చేస్తుండగా మొసలి పట్టుకుందని చెప్పి, సన్యాసం తీసుకుంటే గానీ వదిలేలా లేదని తల్లిని ఒప్పించాడు. అక్కడికక్కడే ఆతుర సన్యాస స్వీకారం చేశాడు. తల్లి అనుమతితో కాలడి నుంచి కాలినడక ప్రారంభించాడు. ఆ నడక దేశగతిని మార్చింది. ఆధ్యాత్మిక చరిత్రను తిరగరాసింది. ఆర్ష సంస్కృతి వైభవాన్ని మళ్లీ నిలబెట్టింది.
కాలడి నుంచి బయల్దేరిన శంకరులు నర్మదా నదీ తీరంలో శ్రీగోవింద భగవత్పాదులను దర్శించుకొని సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాడు. తర్వాత వారణాసికి వెళ్లాడు. అక్కడే ప్రస్థానత్రయానికి భాష్యం రాశాడు. సమస్త అవైదిక మతాలను ఖండించి వేద సమ్మతమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వారణాసిలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమై శంకరుల సిద్ధాంతానికి తన ఆమోదం తెలపడమే కాకుండా, అద్వైతం సర్వజనామోదం అవుతుందని అనుగ్రహించాడు. ఆ క్షణం నుంచి మొదలైంది శంకర విజయ యాత్ర.
వైదిక ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన శంకరుల వెంట వేదాలూ నడిచాయి. జగద్గురువుకు శిష్యులుగా అవతరించాయి. వారణాసిలో పద్మపాదుడు శంకరుల శిష్యుడిగా చేరాడు. బ్రహ్మావతార స్వరూపంగా భావించే మండనమిశ్రుడు శంకరులతో జరిగిన వాదనలో ఓడి సన్యాసం తీసుకున్నాడు. సురేశ్వరాచార్యులుగా ఆదిశంకరులకు శిష్యుడయ్యాడు. హస్తామలకాచార్యుడు, తోటకాచార్యుడు ఆదిశంకరుల శిష్యులయ్యారు. ‘చతుర్భిస్సహ శ్యిస్తు శంకరోవతరిష్యతి’ అని రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదాలు హస్తామలక, సురేశ్వర, పద్మపాద, తోటకాచార్యుల రూపంలో అవతరించాయని భవిష్యోత్తర పురాణం పేర్కొన్నది.


పీఠం దిక్కు వేదం మహావాక్యం దేవత ఆచార్యులు
పూరి తూర్పు రుగ్వేదం ప్రజ్ణానం బ్రహ్మ జగన్నాధుడు శ్రీహస్తామలకాచార్యులు
శృంగేరి దక్షిణం యజుర్వేదం అహం బ్రహ్మాస్మి శారదాదేవి శ్రీసురేశ్వరాచార్యులు
ద్వారక పశ్చిమ సామవేదం తత్వమసి సిద్ధేశ్వరుడు శ్రీ‌పద్మపాదాచార్యులు
బదరి ఉత్తరం అధర్వణ వేదం అయమాత్మా బ్రహ్మ నారాయణుడు శ్రీ‌తోటకాచార్యులు
జగద్గురువు శంకరులకు ముందు ఎవరి మతం వారిదే. ఎవరి అభిమతం వారిదే. శైవ, వైష్ణవ, శాక్త, కాపాలిక, గాణాపత్య, సౌరమతాదులు ఒకరి పంథాకు మరొకరితో పొంతన కుదిరేది కాదు. దీంతో ఆధిపత్య పోరాటాలు, అనాచారాలు ప్రబలాయి. ఈ అస్తవ్యస్త విధానాలను చక్కదిద్దారు ఆదిశంకరులు. అన్ని మతాలనూ సమన్వయం చేస్తూ అద్వైత ధర్మాన్ని స్థాపించారు.
కలౌ రుద్రో మహాదేవః శంకరో నీలలోహితః
ప్రకాశతే ప్రతిష్ఠార్థం ధర్మశ్చావికృతాకృతిః

కర్మకాండను, జ్ఞానకాండను సమన్వయపరచి వేదవిహితమైన సన్మార్గాన్ని ఉపదేశించాడు. అదే అద్వైతం. అద్వితీయమైన ధర్మాన్ని స్థాపించి పిపీలికాది బ్రహ్మపర్యంత ఏకరూపమైన జగత్తుకు ధర్మసందేశం చేసిన మహాదేవ అవతార స్వరూపుడైన శంకరులే నిస్సందేహంగా జగద్గురువు. 32 వసంతాలు అవనిపై సశరీరంగా సంచరించిన ఈ జ్ఞానమూర్తి.. ఆర్ష ధర్మం ఉన్నన్ని రోజులూ అద్వైత జ్యోతిగా ప్రకాశిస్తూనే ఉంటాడు. జగద్గురువుగా నమస్సులు అందుకుంటూనే ఉంటాడు.


శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం

తాను స్థాపించిన వైదిక మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి నాలుగు పీఠాలను స్థాపించాడు జగద్గురువు. తూర్పున పూరి, దక్షిణంలో శృంగగిరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరంలో బదరి క్షేత్రంలో పీఠాలను నెలకొల్పాడు. తన ప్రధాన శిష్యులను ఈ పీఠాలకు అధిపతులుగా నియమించాడు. ఈ నాలుగు పీఠాలు సనాతన ధర్మానికి నాలుగు దిక్కుల రక్షణ కవచాలై నిలబడ్డాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, అయమాత్మా బ్రహ్మ ఈ నాలుగు వాక్యాలతో ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతమే మానవుడికి పరమార్థం. అదే పరమ పురుషార్థమైన మోక్షం అని భక్తుల నమ్మకం. (వ్యాస ర‌చ‌యిత ఫార్మాసిస్టు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...