ఓర్పు – నేర్పు ఆయన ఆభరణాలు: వెంకయ్యనాయుడు

0
123

వల్లీశ్వర్ కు గోరా శాస్త్రి అవార్డు ప్రదానం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి
(కూచిమంచి వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

అవార్డులు ఎవరికి ఇవ్వాలి? అందుకు అర్హతలేమిటి? ప్రమాణాలు ఏమిటి? అవార్డు ఇచ్చిన వ్యక్తి అందుకు తగినవాడేనా? ఇలాంటి ప్రశ్నలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సరైన సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా అందుకు తగిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని విశ్లేషించారు. గోవిందు రామశాస్త్రి (గోరా శాస్త్రి) గారి పేరిట ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని జి. వల్లీశ్వర్ కు అందించిన సభలో వెంకయ్య నాయుడు ప్రసంగం అవార్డులు ఇచ్చేవారికీ, తీసుకునే వారికీ ఒక మేలు కొలుపు. గోరా శాస్త్రి గారితో వల్లీశ్వర్ ను పోలుస్తూ ఆయన చేసిన ఉపన్యాసం అవార్డులు ఇచ్చేవారికి హితవు లాంటిది.

“గోరాశాస్త్రి ఒకేసారి తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఎడిటోరియల్స్ రాసేవారు. ఎడిటోరియల్ రాసే సమయంలో ఆయన పరీక్ష రాసే విద్యార్థిలా దీక్షతో ఉండేవారు. తాను రాసిన సంపాదకీయం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో ఆయనకు తెలుసు. అందుకే అంత దీక్షను కనబరిచేవాడు. స్థిరమైన రైల్వే ఉద్యోగాన్ని వదులుకుని ఖాసా సుబ్బారావు గారి ప్రేరణతో గోరా శాస్త్రి గారు జర్నలిజం లోకి వచ్చారు. ఎక్కడా ఆయన రాజీ పడలేదు. ఒకసారి, ఒక రాజకీయ నాయకుడిపై ఒక వార్త ప్రచురించారు. ఆ నాయకుడు కార్యాలయానికి వచ్చి నానా యాగీ చేశారు. గోరా శాస్త్రి గారు, ఇదంతా ఎందుకు, మీ ఖండన రాసివ్వండి. ప్రచురిస్తామని చెప్పి పంపారు. ఆ నాయకుడు ఇచ్చిన ఖండనను నాలుగు వాక్యాలు చేసి ఆరో పేజీలో ప్రచురించారు. మళ్ళీ వచ్చి ఇదేంటి ఆరో పేజీలో వేసారేమిటి అని అడిగితే, అవునండి.. మాకు ఏడో పేజీ లేదు మరి అందుకే, ఆరో పేజీలో వేశామని మృదువుగా చెప్పడంతో ఆ నాయకుడు మారు మాట్లాడకుండా నిష్క్రమించారు. ఓర్పు, నేర్పు గోరా శాస్త్రి గారి ఆయుధాలు. వాటిని ఆయన చక్కగా ప్రయోగించేవారు. ఇక వల్లీశ్వర్ విషయానికి వస్తే ఈ రెండు లక్షణాలు కనిపిస్తాయి. వృత్తి ధర్మ నిర్వహణలో అలుపెరగని వారు. ఎక్కడా ప్రలోభాలకు లొంగలేదు. ఓర్పు, నేర్పు ఈయన సొంతం. ఇంగ్లీష్, తెలుగు భాషలలో రాస్తున్నారు. ఈనాడులో పనిచేసి, ఇంగ్లీష్ పత్రిక న్యూస్ టైం లో బ్యూరో ఇంఛార్జిగా పనిచేశారు. ” అంటూ వెంకయ్య నాయుడు వివరించారు.


గోరా శాస్త్రి గారిపై పరిశోధనాత్మక గ్రంథం రాసిన గోవిందరాజుల చక్రధర్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు కె.వి. రమణాచారి, ఎమెస్కో అధినేత దూపాటి విజయకుమార్, నవసాహితి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎస్.వి. సూర్యప్రకాశరావు, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ శర్మ, జనరల్ సెక్రటరీ రావికంటి శ్రీనివాస్, గోరా శాస్త్రి గారి అల్లుడు శ్రీనివాస్ వాసుదేవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగదు బహుమతిని గోరా శాస్త్రి గారి కుటుంబం అందజేసింది. ఈ అవార్డు నవ సాహితి సంస్థ ఈ కార్యక్రమ కార్యభారాన్ని భారాన్ని వహించింది.

ఏ ఉద్యోగంలోనైనా సమస్యలు తప్పవని, వాటిని నేర్పుగా అధిగమించాలని అవార్డు స్వీకర్త వల్లీశ్వర్ చెప్పారు. ఈనాడులో ఒక యూనిట్ అధిపతిపైనే తాను తిరుగుబాటు చేశానని, ఒక వార్తలో ఎవరి పేర్లు ఉండాలో ఆయన చెప్పేవారని, అది నచ్చని తాను రామోజీరావుకు లేఖ రాశానని తెలిపారు. అది తెలిసిన సహోద్యోగులు తన ఉద్యోగం పోయినట్లేనని భావించారన్నారు. వారి ఊహకు భిన్నంగా తనను ప్రమోషన్ ఇచ్చి రామోజీ రావు ఢిల్లీ పంపారని వల్లీశ్వర్ చెప్పారు. గోరా శాస్త్రి గారి పురస్కారం రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టుకు సాయంత్రాలు ఆనందంగా గడిపే అవకాశం ఉండదని అంటూ ఒక పిట్ట కథ చెప్పారు.

“రావణాసురుని వధించి రాముడు సీతను అయోధ్యకు తీసుకు వచ్చాడన్నారు. ఒకరోజు సీత అంతఃపురంలోంచి చూస్తుండగా, భార్యాభర్తలు ఎంతోమంది జంటలుగా ఉద్యానవనంలో తిరుగుతుండడం చూసి ఆమె, ఏమయ్యా రామచంద్రా, ఈ భాగ్యం నాకు లేదా అని అడిగిందట. దానికేమి భాగ్యం, మనమూ అలాగే విహరిద్దామని చెప్పాడట. ఆరోజున ఎవరూ ఉద్యానవనంలో ఉండకూడదని ఆదేశించారట. సీత కోరిక మేరకు ఇద్దరూ తిరుగుతుండగా, ఒక పొద చాటునుంచి ఎవరో ఆమెకు కనిపించారట. అదే విషయాన్ని రాముని దృష్టికి తీసుకురాగా, ఆ వ్యక్తిని పిలిపించాడట. ఆయన ఎవరో కాదు నారదుడు. ఏమి నారదా నీకు విషయం తెలీదా, లేక తెలిసి కూడా వచ్చావా అని అడగటంతో, ఆయన రామచంద్రా లోకంలో విషయాలు చెప్పే బాధ్యత నాదే కదయ్యా అనడంతో రాముడికి కోపం వచ్చి నువ్వు భూలోకంలో జర్నలిస్టుగా జన్మించమని శపించాడట.” అని ముగించారు. ఈ కథతో సభ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగాయి.

వల్లీశ్వర్ కుమారుడు కార్తికేయ తన తండ్రి గురించి మాట్లాడారు. ఆయన సూచనలను పాటించానని చెప్పారు. ఎవరయినా ఇద్దరు సమస్యతో తన దగ్గరకి వస్తే, అభిప్రాయాలను తెలుసుకుని, నీ వాదన సమంజసమే కానీ అతని వాదన తప్పు కాదు అని లౌక్యంగా పరిష్కరించేవారని, అదే తానూ పాటించానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here