కిడ్నీ మార్పిడిలో నిమ్స్ ఘనత
వైద్య బృందానికి సీఎం అభినందనలు
హైదరాబాద్, మే 22: కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్‌లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.
నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్ నెంబర్ వన్‌గా నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్‌లో గుజరాత్ లోని ఐకేడీఆర్‌సీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్‌లో లూథియానా క్రిస్టియన్ కాలేజీలో ఉండగా.. నిమ్స్ మూడో స్థానంలో ఉంది.
ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ 2,000 మందిలో 1,900 మంది అంటే 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడేళ్ళ నాలుగు నెలల్లోనే.. 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు నెలకొల్పింది.

