నర్తనశాలలో ఆ పాట వెనుక నా కృషి

0
687

కొన్నేళ్ల క్రితం వైజయంతి మాటామంతిలో రావి కొండలరావు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వ్యూస్ ప్రత్యేకం
(వైజయంతి పురాణపండ)

ప్రముఖ రచయిత, నటుడు రావి కొండలరావు గారు నర్తనశాల సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ సందర్భంగా ఒక పాట గురించి తన అనుభవాలను వివరించారు. ఆయన అనుభవం ఆయన మాటల్లోనే…
చిత్రం: నర్తనశాల
రచన: సముద్రాల
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి


గానం: డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగళూరు లత
––––––––––––
సలలిత రాగ సుధారస సారం/ సర్వకళామయ నాట్య విలాసం

మంజుల సౌరభ సుమకుంజము/రంజిలు మధుకర మృదు ఝంకారం

కల్పనలో ఊహించిన హోయలు శిల్పమనోహర రూపమునొందిl
పదకరణముల మృదు భంగిమల ముదమార లయమీరు నటనాల సాగె

ఝణన ఝణన ఝణ నూపుర నాదం/భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని ఆనంద లీలా వినోదమే
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
సర్వకళామయ నాట్య విలాసం
‘నర్తనశాల’ సినిమాకి దర్శకత్వ శాఖలో నేను సహాయకుడిగా పనిచేశాను. ఈ చిత్రం కోసం సముద్రాల రచించిన ‘సలలిత రాగ సుధారస సారం’ పాటను చిత్రంలో ఉంచటం వెనుక నా కృషి ఎంతో ఉంది. ఘంటసాల, ఎస్‌. జానకి గార్లను ఈ పాటకు బుక్‌ చేసుకున్నారు. సినిమా షూటింగ్‌ జరుగుతోంది. మధ్యలో కొన్ని రోజులు విరామం రావటంతో, నేను ఊరు వెళ్లాను. కొన్ని రోజులయ్యాక తిరిగి మద్రాసు వస్తూనే సరాసరి ఆఫీసుకి వెళ్లాను. నన్ను చూస్తూనే సుసర్ల గారు, ‘కొండల్రావూ! మనం ముందు అనుకున్న పాట మారిపోయింది. నిర్మాతలు వద్దని పట్టుబట్టారు. దర్శకుడు సరే అనక తప్పలేదు’ అంటూ, కొత్త పాటను వినిపించటానికి హమ్‌ చేశారు. ‘ఈ పాట కంటె, ముందర చేసిన పాటే బాగుంది. ఆ పాట వద్దంటే మీరు ఎందుకు అంగీకరించారు’ అన్నాను. ఎలాగైనా ఆ పాటను ఉంచాలనే పట్టుదల నాలో బయలుదేరింది.

దర్శకుడి ఇంటికి వెళ్లి, ‘సలలిత రాగ సుధారస సారం’ పాట చాలా బాగుంది. ఆ పాటలో నాట్యానికి తగ్గట్టుగా జతులు కూడా బావున్నాయి. పాటను మార్చమంటే మీరెందుకు ఒప్పుకున్నారు. ఉత్తరకు బృహన్నల నాట్యం నేర్పించే సందర్భంలో వస్తుంది ఈ పాట. కొత్తగా చేసిన పాట సీన్‌కి తగ్గట్టుగా లేదు’ అన్నాను. సముద్రాల గారితో ‘పాట మార్చమంటే మీరు ఎలా ఒప్పుకున్నారు. ఈ పాట ఎలాగైనా ఉంచాలి’ అంటూ ఆయన పాదాల మీద పడ్డాను. ‘నేనేం చేయగలను’ అన్నారు సముద్రాల. అవసరమైతే అందరి కాళ్లు పట్టుకుంటాను’ అన్నాను. నిర్మాతలు శ్రీధర్‌రావు, లక్ష్మీరాజ్యం ఇష్టం లేకుండా అంగీకరించారు. నా మీద నమ్మకం ఉంచి ఈ పాట ఆ చిత్రంలో ఉంచినందుకు అందరికీ నమస్కరించాను.
ఘంటసాల గారు ఒక పాట పూర్తయితేనే కానీ, మరో పాట పాడరు. అందువల్ల ఘంటసాల గారికి డేట్లు కుదరలేదు. ఇది సంగీత ప్రధానమైన పాట కనుక మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పాడించాలనుకున్నారు. ఆయనతో పాటు ఎస్‌. జానకి బదులు బెంగళూరు లత గొంతు కలిపారు. ఈ పాట విని బాలమురళీ ‘సినిమాలో ఎప్పుడూ ఇంత మంచి పాట పాడలేదు’ అన్నారు. పాట రికార్డింగు అవుతోంది. బ్రేక్‌ సమయంలో, ‘కొండల్రావూ, నీ పాట రికార్డింగు అవుతోంది’ అంటూ సముద్రాల నన్ను పిలిచి వినిపించారు. ఎన్‌. టి. రామారావుగారికి వినిపించేటప్పుడు, నిర్మాత వెంట నేను కూడా వెళ్లాను. రామారావుగారు ఆ పాట వింటూనే, ‘బ్రహ్మాండంగా ఉంది, నేను శ్రద్ధగా డ్యాన్స్‌ నేర్చుకుంటాను’ అని నాట్యం నేర్చుకుని ఈ పాట మరింత అందంగా వచ్చేందుకు తన వంతు కృషి చేశారు. డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ పాట వింటూ మధ్యలో లేచి నిలబడి తప్పట్లు కొట్టారు. నా మాట ప్రకారం ఈ పాట ఉంచటం, నాకు పెద్ద గర్వం. ఆ పాట వెనకాల కథ ఇది అంటూ వివరించారు రావి కొండలరావుగారు. ఆయనకు వ్యూస్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here